తెలంగాణ రాష్ట్రానికి దావోస్‌లో సుమారు రూ.4,200 కోట్ల మేర పెట్టుబడులు
Sakshi Education
యూకే, దావోస్‌లో పది రోజులకుపైగా వరుస సమావేశాలు
45 కంపెనీల ప్రతినిధులతో చర్చలు.. 4 రౌండ్ టేబుల్ మీటింగ్‌లు
- సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రత్యేకతలను వివరించి, రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చేపట్టిన పర్యటన ముగిసింది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా జరిపిన చర్చలు, సంప్రదింపులతో కేటీఆర్ బృందం రాష్ట్రానికి సుమారు రూ.4,200 కోట్ల మేర పెట్టుబడులు రాబట్టగలిగింది. కేటీఆర్ మే 27 (శుక్రవారం) తన బృందంతో కలిసి తిరుగు పయనమయ్యారు. మే 28 (శనివారం) ఉదయం రాష్ట్రానికి చేరుకోనున్నారు.
తొలుత యూకేలో.
- ఈనెల 18న హైదరాబాద్ నుంచి యూకేకు చేరుకున్న కేటీఆర్.. నాలుగు రోజుల పాటు యూకే బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ నెల 22న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు చేరుకున్న కేటీఆర్ 26వ తేదీ వరకు 45 కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. నాలుగు రౌండ్ టేబుల్ సమావేశాలు, మరో నాలుగు చర్చా గోష్టుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేకతలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను కేటీఆర్ వివరించారు.
- Hyundai Group Investment : తెలంగాణ రాష్ట్రంలో హ్యుందాయ్ పెట్టుబడులు
- వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌కు బహుళజాతి కంపెనీల ప్రతినిధుల నుంచి ప్రశంసలు దక్కడంతోపాటు.. పలు అవగాహన ఒప్పందాలు, పెట్టుబడి ప్రకటనలు, చర్చలకు ఈ పెవిలియన్ వేదికగా నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ ప్రధాన సమావేశ మందిరం, ఇండియా పెవిలియన్, సీఐఐ పెవిలియన్‌లో జరిగిన చర్చలు, తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన ఫార్మా లైఫ్ సైన్స్, దేశంలోని ప్రముఖ యూనికార్న్ వ్యవస్థాపకులతో జరిగిన గోష్టుల్లో కేటీఆర్ పాల్గొన్నారు.
- Download Current Affairs PDFs Here
- ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రభుత్వ విధానాలను, పెట్టుబడి అవకాశాలను చాటడంలో ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడిందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పర్యటన విజయవంతానికి కృషి చేసిన ప్రభుత్వ అధికారులు, పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు, ముఖ్యంగా యూకే, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన ప్రవాస భారతీయులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
జెడ్‌ఎఫ్ కంపెనీ ప్రతినిధులతో భేటీ
- దావోస్‌లో చివరిరోజున స్విట్జర్లాండ్‌లోని జ్యురిక్‌లో జెడ్‌ఎఫ్ కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని జెడ్‌ఎఫ్ ప్రతినిధులు చెప్పారు. తమ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని.. హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్న క్యాంపస్ 3 వేల మంది సిబ్బందితో తమ అతిపెద్ద కార్యాలయంగా ఉండబోతుందన్నారు. జూన్ 1న నానక్‌రామ్‌గూడలో జెడ్‌ఎఫ్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నామని వెల్లడించారు. జెడ్‌ఎఫ్ కంపెనీ విస్తరణతో తెలంగాణలో మొబిలిటీ రంగానికి అదనపు బలం చేకూరుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
Published date : 28 May 2022 03:52PM