Naval Exercise: 2022 మిలాన్ విన్యాసాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి?
నౌకాదళ విభాగంలో ప్రతిష్టాత్మకమైన మిలాన్ (బహుపాక్షిక నావికా విన్యాసాలు)కు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికైంది. విశాఖలోని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ (ఈఎన్‌సీ) ప్రధాన స్థావరంలో మిలాన్–2022 విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 27న వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీసమేతంగా హాజరై, ప్రసగించారు. ఈ సందర్భంగా ఐఎన్‌ఎస్ విశాఖను ఆయన జాతికి అంకితం చేయడంతో, కొత్తగా నావికాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ వేలా జలాంతర్గామిని సందర్శించారు. అనంతరం ప్రసంగించారు. సీ ఫేజ్(ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు), హార్బర్ ఫేజ్(మార్చి 1 నుంచి 4 వరకు) అనే రెండు ఫేజ్‌లలో మిలాన్ విన్యాసాలు నిర్వహిస్తున్నారు.
మిలాన్–202 థీమ్: స్నేహం – సమన్వయం – సహకారం(Camaraderie – Cohesion – Collaboration)
సీఎం ప్రసంగం–ముఖ్యాంశాలు..
- మొట్టమొదటిసారిగా విశాఖ సాగర తీరంలో మిలాన్–2022 నిర్వహణ చరిత్రలో మైలు రాయిగా నిలిచిపోతుంది. తూర్పు నావికాదళంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్ విశాఖ చేరడం మనకు గర్వకారణం.
- వైజాగ్.. సిటీ ఆఫ్ డెస్టినీ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం. విశాఖ చరిత్రలో ఇది మైలురాయి. ఇది అరుదైన యుద్ధ నౌకల విన్యాసాల పండగ. ఈ మిలాన్‌లో 39 దేశాలు పాల్గొనడం గర్వకారణం.
- పూర్తి స్వదేశీయంగా యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్ విశాఖ’ను రూపొందించడం ఎంతో సంతోషం. ఐఎన్‌ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక కొద్ది నెలల క్రితం నావికాదళంలో చేరింది. ఇది విశాఖ ప్రజలకు గర్వకారణం. పీ 15 బీ క్లాసెస్ గైడెడ్ మిసైల్ స్టెల్త్ డిస్ట్రాయర్ సాంకేతికతో పనిచేసే ఈ యుద్ధ నౌక తూర్పు నావికాదళంలోకి చేరడం ఎంతో గర్వకారణం.
- ఐఎన్‌ఎస్ విశాఖపట్నం పై భాగంలో మన విశాఖపట్నంలో ప్రకృతి ప్రసాదంగా ఏర్పడిన డాల్ఫిన్ నోస్‌ని.. రాష్ట్ర మృగం కృష్ణ జింకని ప్రత్యేకంగా ముద్రించారు.
- స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్ వేలా జలాంతర్గామి కూడా తూర్పు నావికాదళంలో చేరడంతో ఈ ప్రాంత రక్షణలో మరో అధ్యాయం ప్రారంభమైంది.
- మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్ నేవీ సంయుక్త నిర్వహణలో మిలాన్ వేడుకలకు విశాఖ కేంద్రం కావడం ఆనందంగా ఉంది.
- భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా, ఈ వేడుకల్లో పాల్గొన్న అంబాసిడర్లు, అధికారులు, ఇతర దేశాల ప్రతినిధులకు ధన్యవాదాలు.
కోవిడ్ కారణంగా..
వాస్తవానికి 2020 మార్చి 19 నుంచి 27 వరకూ విశాఖ కేంద్రంగా మిలాన్ విన్యాసాలు జరగాల్సి ఉంది. కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. 2021 మార్చిలో నిర్వహించాలని భావించినా కరోనా పరిస్థితులు అనుకూలించకపోవడంతో మరోమారు వాయిదా వేశారు.
సమావేశం అని అర్థం..
వివిధ దేశాల మధ్య సహద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాల్ని మెరుగు పరుచుకోవడంతో పాటు శత్రుసైన్యానికి బలం, బలగం గురించి తెలియజేసేందుకు మిలాన్ విన్యాసాలు నిర్వహిస్తుంటారు. మిలాన్ అంటే.. హిందీలో సమావేశం అని అర్థం.
1995లో తొలిసారి..
- 1995లో తొలిసారి జరిగిన మిలాన్ విన్యాసాల్లో భారత్‌తో పాటు ఇండోనేసియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలు మాత్రమే పాల్గొన్నాయి.
- సాధారణంగా రెండేళ్లకోసారి నిర్వహించే మిలాన్‌లో 2010 వరకు 8 దేశాలు మాత్రమే పాల్గొనగా.. 2012లో 16 దేశాలు పాల్గొన్నాయి.
- 2014లో 17 దేశాలు పాల్గొని అతి పెద్ద మిలాన్‌గా చరిత్రకెక్కింది. 2018లో అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన విన్యాసాల్లోనూ 17 దేశాలు పాల్గొన్నాయి. తాజా 2022 ఏడాది విన్యాసాల్లో 39 దేశాలు పాల్గొంటున్నాయి.
- 2005లో సునామీ రావడం వల్ల మిలాన్ విన్యాసాలు రద్దు చేయగా, 2001, 2016 సంవత్సరాల్లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)లు నిర్వహించడం వల్ల మిలాన్ విన్యాసాలు జరగలేదు.
- మొత్తంగా ఇప్పటి వరకూ 10 సార్లు మిలాన్ విన్యాసాలు జరిగాయి.
చదవండి: రాష్ట్రంలో అంతర్జాతీయ విత్తన పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : మిలాన్–2022 విన్యాసాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : భారత నౌకాదళం
ఎక్కడ : ఈస్ట్రన్ నేవల్ కమాండ్ (ఈఎన్‌సీ) ప్రధాన స్థావరం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : వివిధ దేశాల మధ్య సహృద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాల్ని మెరుగు పరుచుకోవడంతో పాటు శత్రుసైన్యానికి బలం, బలగం గురించి తెలియజేసేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్