Family Doctor: ఏపీలో ‘ఫ్యామిలీ డాక్టర్’ ప్రారంభం.. ఫ్యామిలీ డాక్టర్ విధానం లక్ష్యమిదే..
ఇందుకోసం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం పూర్తి స్థాయిలో అమలు కార్యక్రమాన్ని ఏప్రిల్ 6వ తేదీ ప్రారంభించారు. అక్టోబర్ 21, 2022 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ట్రయల్ రన్ విజయవంతమైంది.
ఏమిటీ విధానం?
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న కుటుంబాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా తమ కుటుంబ వైద్యుడిని సంప్రదిస్తున్నారు. వారి ఆరోగ్యం పట్ల సంబంధిత వైద్యుడు నిరంతరం ఫాలోఅప్‌లో ఉంటారు. ఆయా కుటుంబాల్లోని వ్యక్తుల ఆరోగ్యంపై డాక్టర్‌కు సమగ్ర అవగాహన ఉంటుంది. ఒక అనుబంధం ఏర్పడి ఆ కుటుంబానికి మెరుగైన వైద్య సంరక్షణ అందుతుంది. ఇదే తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ ఉచితంగా అందించాలన్నది ఫ్యామిలీ డాక్టర్ విధానం లక్ష్యం.
R-5 zone: అమరావతిలో ఆర్-5 జోన్.. అసలు ఆర్-5 జోన్లు అంటే ఏమిటి?
ఇలా నిర్వహిస్తున్నారు..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది కలిపి 14 మంది ఉండేలా చర్యలు తీసుకుంది. పీహెచ్‌సీలోని ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని గ్రామ సచివాలయాలను కేటాయించారు. వైద్యులు వాటిని నెలలో రెండు సార్లు సందర్శించాల్సి ఉంటుంది.
104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు గ్రామానికి వెళ్లి రోజంతా అక్కడే గడిపి ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ 104 ఎంఎంయూ వద్ద ఓపీ సేవలు అందిస్తారు. మంచానికి పరిమితమైన వృద్ధులు, దివ్యాంగులు, ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన రోగుల గృహాలను మధ్యాహ్నం నుంచి సందర్శించి ఇంటి వద్దే సేవలు అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు.
14 రకాల పరీక్షలు.. 105 రకాల మందులు
గ్రామీణ స్థాయిలో వైద్య వసతులను బలోపేతం చేస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతి 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసింది. బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో), ఏఎన్‌ఎం, నలుగురు నుంచి ఆరుగురు ఆశా వర్కర్లు వీటిల్లో ఉంటారు.
ప్రతి క్లినిక్‌లో 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి. టెలిమెడిసన్ కన్సల్టేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులో విలేజ్ క్లినిక్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రామాలకు వెళ్లిన వైద్యులు వీటిలో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు.
ఎవరైనా రోగికైనా మెరుగైన వైద్యం అవసరం అని భావిస్తే ఫ్యామిలీ డాక్టర్ అక్కడి నుంచే పెద్దాస్ప్రత్రులకు రిఫర్ చేస్తారు. రోగిని దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రికి తరలించడం, వైద్యం అందేలా చూడటం లాంటి కార్యకలాపాలను సీహెచ్‌వో, ఏఎన్‌ఎం పర్యవేక్షిస్తారు. వీరు విలేజ్ ఆరోగ్యమిత్రగా వ్యవహరిస్తారు.
Jagananna Gorumudda: జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం
కొత్తగా 260 ఎంఎంయూ వాహనాలు
పీహెచ్‌సీ వైద్యులు తమకు కేటాయించిన గ్రామాలకు షెడ్యూల్ ప్రకారం 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)లో వెళతారు. రాష్ట్ర ప్రభుత్వం 2020లో మండలానికి ఒక 104 ఎంఎంయూను సమకూర్చి సేవలను బలోపేతం చేసింది. అయితే ప్రతి గ్రామాన్ని నెలలో రెండు సార్లు సందర్శించాల్సి ఉన్నందున ఇప్పటికే ఉన్న 676 ఎంఎంయూ వాహనాలకు అదనంగా కొత్తగా 260 వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.
నాలుగేళ్లలో 48,639 వైద్య పోస్టుల భర్తీ
ఫ్యామిలీ డాక్టర్ విధానం సమర్థంగా అమలయ్యేందుకు ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులతోపాటు మండలానికి రెండు పీహెచ్‌సీలు లేదా ఒక పీహెచ్‌సీ, సీహెచ్‌సీ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 1,142 పీహెచ్‌సీలకు అదనంగా 151 పీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తున్నారు.
ఎవరైనా వైద్యుడు సెలవుపై వెళితే ఫ్యామిలీ డాక్టర్ సేవలకు అంతరాయం కలగకుండా అదనపు డాక్టర్లను అందుబాటులో ఉంచారు. ఏడు పీహెచ్‌సీలకు ఒకరు, జిల్లాకు నలుగురు చొప్పున 285 మంది అదనపు వైద్యులను సమకూర్చారు. ఇలా ఫ్యామిలీ డాక్టర్ పథకం కోసం కొత్తగా వైద్య పోస్టులు సృష్టించడంతోపాటు అప్పటికే ఉన్న ఖాళీలను భర్తీ చేసి మొత్తంగా 2,875 మంది డాక్టర్లను అందుబాటులో ఉంచారు.
వైద్య శాఖలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా మిగలకుండా గత నాలుగేళ్లలో 48,639 మంది వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది.
Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం
వైద్యులకు ఫోన్లు..
వైద్యులు గ్రామాలను సందర్శించని రోజుల్లో ప్రజలకు ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైతే ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా పీహెచ్‌సీ వైద్యుడికి మొబైల్ ఫోన్‌ను సమకూర్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1,142 పీహెచ్‌సీల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు సుమారు రూ.3 కోట్లతో ఫోన్లను అందజేశారు. వైద్యుడు మారినా ఫోన్ నంబర్ మారకుండా శాశ్వత నంబర్ కేటాయించారు.
గ్రామాల్లోనే 14 రకాల వైద్య పరీక్షలు
– గర్భ నిర్ధారణకు యూరిన్ టెస్ట్
– హిమోగ్లోబిన్ టెస్ట్
– ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్ (షుగర్)
– మలేరియా టెస్ట్
– హెచ్‌ఐవీ నిర్ధారణ
– డెంగ్యూ టెస్ట్
– మల్టీపారా యూరిన్ స్ట్రిప్స్ (డిప్ స్టిక్)
– అయోడిన్ టెస్ట్
– వాటర్ టెస్టింగ్
– హెపటైటిస్ బి నిర్ధారణ
– ఫైలేరియాసిస్ టెస్ట్
– సిఫిలిస్ ర్యాపిడ్ టెస్ట్
– విజువల్ ఇన్‌స్పెక్షన్
– స్పుటమ్ (ఏఎఫ్‌బీ)
ట్రయల్ రన్‌లో 69 లక్షల మందికి వైద్య సేవలు
– ఓపీ సేవలు – 25,80,599
– యాంటెనేటల్(గర్భిణులకు వైద్య సేవలు) – 4,03,500
– పోస్ట్‌నేటల్(బాలింతలకు వైద్య సేవలు) – 2,20,835
– మధుమేహం బాధితులు – 15,79,962
– రక్తపోటు బాధితులు – 20,98,028
– క్యాన్సర్ రోగులు – 33,635