Skip to main content

Andhra Pradesh: రాష్ట్రంలో కొత్తగా ఎన్ని జిల్లాలు ఏర్పాటయ్యాయి?

CM Jagan

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నవశకం ఆవిష్కృతమయ్యింది. పాలన వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా 13 కొత్త జిల్లాలు అవతరించాయి. దీంతో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ సాక్షాత్కారమయ్యింది. కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్‌ 4న తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ప్రారంభించారు. తొలుత పార్వతీపురం మన్యం జిల్లాతో ఆరంభించి వరుసగా మిగతా జిల్లాలను సీఎం ప్రారంభించారు. అనంతరం 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులనుద్దేశించి మాట్లాడుతూ.. నూతన జిల్లాల ద్వారా కార్యాలయాల ఏర్పాటుతో పాటు వ్యాపార, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయన్నారు. కొత్త జిల్లాలతో ప్రజలకు మరింత మెరుగైన పాలన, శాంతి భద్రతలు, పథకాలు పారదర్శకంగా అందాలని ఆకాంక్షించారు.

AP New Districts List: ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త జిల్లాల స‌మ‌గ్ర‌ స్వరూపం ఇదే.. అతి పెద్ద జిల్లాగా..

సీఎం ప్రసంగం–ముఖ్యాంశాలు

  • ఇవాళ్టి నుంచి 26 జిల్లాలతో మన రాష్ట్రం రూపు మారుతోంది. కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.

పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి... ఇవీ కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు.

New Districts in Andhra Pradesh
  • పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరంతో పాటు స్వాతంత్య్ర సమరయోధులు, గిరిజన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల సెంటిమెంట్, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వాగ్గేయకారులను దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల పేర్లను నిర్ణయించాం.
  • గతంలో ఉన్న జిల్లాల పేర్లు అలాగే ఉన్నాయి. భీమవరం, రాజమహేంద్రవరం గత జిల్లాలకు ముఖ్య పట్టణాలుగా మారాయి.
  • గతంలో ఉన్న జిల్లా కేంద్రాలను యథాతథంగా కొనసాగిస్తూ పార్లమెంట్‌ నియోజకవర్గానికి కనీసం ఒకటి చొప్పున మొత్తం 26 జిల్లాలు ఈరోజు నుంచి కొలువుదీరుతున్నాయి.
  • 1970 మార్చిలో ప్రకాశం జిల్లా ఆవిర్భవిస్తే చివరిగా 1979 జూన్‌లో విజయనగరం జిల్లా ఏర్పాటైంది.
  • తరువాత కొత్త జిల్లాలు ఏర్పాటు కాకపోవడంతో పరిపాలన సంస్కరణలు, వికేంద్రీకరణ విషయంలో బాగా వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయాం. జిల్లాల సంఖ్య, రెవెన్యూ డివిజన్లు పెరగడం వల్ల ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై పర్యవేక్షణ పెరిగి సమర్థంగా అమలవుతాయి.
  • దేశంలో 727 జిల్లాలు ఉండగా యూపీలో అత్యధికంగా 75, అతి తక్కువగా గోవాలో రెండు జిల్లాలే ఉన్నాయి. దేశంలో ఏడో అతిపెద్ద రాష్ట్రమైన ఏపీలో మాత్రం నిన్నటివరకు 13 జిల్లాలే ఉన్నాయి.
  • దేశంలో ఏ రాష్ట్రంలోనూ జిల్లాకు సగటున ఇంత జనాభా లేదు. మహారాష్ట్రలో ఒక్కో జిల్లాలో సగటున 31 లక్షలు, తెలంగాణాలో 10.06 లక్షల మంది చొప్పున నివసిస్తున్నారు. కాగా మిజోరాంలో లక్ష మందికి, అరుణాచల్‌ప్రదేశ్‌లో కేవలం 53 వేల మందికి ఒక జిల్లా చొప్పున ఏర్పాటయ్యాయి.
  • గతంలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రధానంగా రెవెన్యూ మాత్రమే ఉండేది. ఇప్పుడు శాంతి భద్రతలు, రెవెన్యూ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, ట్రెజరీ, సోషల్‌ వెల్ఫేర్, వ్యవసాయం, పశుపాలన, ప్రా«థమిక విద్య, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్, సివిల్‌ సఫ్లైస్, కార్మిక చట్టాలు, విపత్తు నిర్వహణ, పంపిణీ విభాగం, ఎన్నికల నిర్వహణ కూడా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఉన్నాయి.
  • కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు, మిగిలినవి అన్నీ ఒకేచోటకి వస్తాయి. కనీసం 15 ఎకరాల విస్తీర్ణంలో అన్నీ ఒకేచోట ఏర్పాటు కాబోతున్నాయి. వీటిని ఇంటిగ్రేటెడ్‌గా ఏర్పాటు చేస్తే అన్ని కార్యాలయాలు ఒకే చోట కనిపిస్తాయి.

Andhra Pradesh: వైఎస్సార్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవల ప్రధాన ఉద్దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్‌ 4
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎందుకు : పాలన వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 05 Apr 2022 05:10PM

Photo Stories