Shigeru Ishiba: జపాన్ పీఎంగా బాధ్యతలు చేపట్టనున్న ఇషిబా
ఫుమియో కిషిదా వారసుడిగా ఆయన ఎన్నికయ్యారు. రక్షణ శాఖ మాజీ మంత్రి అయిన ఇషిబాను జపాన్ అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్‌డీపీ) సెప్టెంబర్ 27వ తేదీ తమ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిదాపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
పార్లమెంట్‌లో మెజార్టీ ఉన్న పార్టీ అధ్యక్షుడే ప్రధానమంత్రి కావడం ఆనవాయితీ. కిషిదా తప్పుకోవడంతో నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం ఓటింగ్ నిర్వహించారు. ఎల్‌డీపీ పార్లమెంట్ సభ్యులతోపాటు దాదాపు 10 లక్షల మంది పార్టీ ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.
జపాన్ ప్రధాని కిషిదా, ఆయన కేబినెట్ మంత్రులు అక్టోబర్ 1న రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు పార్లమెంటరీ ఓటింగ్‌లో ఇషిబాను ప్రధానిగా లాంఛనంగా ఎన్నుకుంటారు. తర్వాత అదే రోజు ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు.
Sri Lanka New PM: శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య.. ఈమె డిగ్రీ చదివింది ఢిల్లీలోనే..
ఎవరీ ఇషిబా?
షిగెరు ఇషిబా న్యాయ విద్య అభ్యసించారు. బ్యాంకింగ్ రంగంలో సేవలందించారు. తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1986లో 29 ఏళ్ల వయసులో ఎల్‌డీపీ టికెట్‌పై తొలిసారిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 38 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు చేపట్టారు. ఎల్‌డీపీ సెక్రెటరీ జనరల్‌గా వ్యవహరించారు. వ్యవసాయం, రక్షణ శాఖల మంత్రిగా పనిచేశారు. ప్రధానమంత్రి పదవిపై ఎప్పుటినుంచో కన్నేశారు. గతంలో నాలుగుసార్లు గట్టిగా ప్రయత్నించి భంగపడ్డారు. ఎట్టకేలకు ఐదో ప్రయత్నంలో విజయం సాధించారు.
ఇషిబా తండ్రి సైతం రాజకీయ నాయకుడే. ఆయన కేబినెట్ మంత్రిగా పనిచేశారు. కిషిదాకు, ఇషిబాకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఎల్‌డీపీలో ఇషిబాకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారన్న విమర్శలున్నాయి. ఎల్‌డీపీలో ఇషిబా పలు సందర్భాల్లో అసమ్మతి గళం వినిపించారు.
Sri Lankan President: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసింది ఈయనే..