Professor Mrinalini: కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్‌గా మృణాళిని
ఢిల్లీలోని రవీంద్రభవన్‌లో జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఎన్నిక ప్రక్రియ జరిగింది. తెలుగు భాష ఔన్నత్యానికి మృణాళిని చాలాకాలంగా సేవలందిస్తున్నారు. కథకురాలిగా, వ్యాసకర్తగా, పరిశోధకురాలిగా, పాత్రికేయురాలిగా ఆమె పలు కోణాల్లో భాష ఉన్నతి కోసం కృషి చేస్తూ వస్తున్నారు. మృణాళినితోపాటు రచయిత మందలపర్తి కిషోర్ ఆంధ్రప్రదేశ్ పక్షాన, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఎస్వీ సత్యనారాయణ, కవి, పాత్రికేయుడు ప్రసేన్ తెలంగాణ పక్షాన తెలుగు విభాగం కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు. కన్వీనర్ పదవి కోసం మృణాళిని, ఎస్వీ సత్యనారాయణ పోటీ పడ్డారు.
మృణాళినికి 33 ఓట్లు, సత్యనారాయణకు 28 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆమె ఐదు ఓట్ల తేడాతో గెలిచారు. కన్వీనర్‌గా ఎన్నికైన మృణాళినిని, మిగతా ముగ్గురు మండలి సభ్యులను అకాడమీ కార్యదర్శి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తదితరులు అభినందించారు. గతంలో ఓ పర్యాయం మృణాళిని తెలుగు విభాగం కౌన్సిల్ సభ్యురాలిగా ఐదేళ్లపాటు పనిచేశారు. తెలుగు విభాగంలో ఆమె తొలి మహిళా కన్వీనర్. ఈ పదవిలో ఆమె ఐదేళ్లపాటు కొనసాగనున్నారు.