Pulitzer Prize: మరణానంతరం పులిట్జర్ అవార్డుకు ఎంపికైన ఫొటో జర్నలిస్టు?
Sakshi Education
ప్రముఖ ఫొటో జర్నలిస్టు డానిష్ సిద్ధిఖీ.. ప్రతీష్టాత్మక పులిట్జర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఏడాది కిందట అఫ్గానిస్థాన్ లో తాలిబాన్లు జరిపిన కాల్పుల్లో దుర్మరణం పాలైన భారత ఫొటోగ్రాఫర్ సిద్దీఖీకి మరణానంతరం ఈ పురస్కారం దక్కింది. భారత్‌లో కరోనా మరణాలపై ఆయన తీసిన చిత్రాలకుగానూ పులిట్జర్ అవార్డు వరించింది. 2022 ఏడాదికి గానూ పులిట్జర్ అవార్డు విజేతలను ఇటీవల ప్రకటించగా..ఇందులో ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో రాయిటర్స్ సంస్థకు చెందిన డానిశ్ సిద్దిఖీ, అద్నన్ అబిదీ, సన్నా ఇర్షాద్, అమిత్ దవే విజేతలుగా నిలిచారు. సిద్ధిఖీ పులిట్జర్ పురస్కారం గెలుచుకోవడం ఇది రెండోసారి. 2018లో మయన్మార్‌లోని రోహింగ్యా శరణార్థులపై తీసిన ఫొటోలకు గాను తొలిసారి సిద్ధిఖీ పులిట్జర్ అవార్డు అందుకున్నారు.
Published date : 16 May 2022 07:54PM