Pervez Musharraf: కార్గిల్ యుద్ధం సృష్టికర్త ముషారఫ్ కన్నుమూత
చాలా రోజులుగా అమిలాయిడోసిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆయన దుబాయ్‌లోని అమెరికన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 5వ తేదీ తుదిశ్వాస విడిచారు. ముషారఫ్ భౌతికకాయాన్ని పాకిస్తాన్‌కు తరలించి, అంత్యక్రియలు కరాచీలో నిర్వహించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. స్వదేశంలో పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముషారఫ్ 2016 మార్చి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ప్రవాస జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. భారత్–పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధానికి ప్రధాన సూత్రధారిగా, సైనిక నియంతగా ముషారఫ్ అపకీర్తిని మూటగట్టుకున్నారు. ముషారఫ్ మరణం పట్ల పాక్ ప్రధానమంత్రి షెషబాజ్ షరీఫ్ సంతాపం వ్యక్తం చేశారు. త్రివిధ దళాల అధిపతులు సైతం సంతాపం తెలిపారు. ముషారఫ్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు మానసిక స్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది.
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత.. ఆయన జీవిత ప్రస్థానం ఇలా..
ఏమిటీ అమిలాయిడోసిస్?
చికిత్సతో నయం కాని ఇదొక అరుదైన వ్యాధి. శరీరంలోని అవయవాలు, కణజాలంలో అమిలాయడ్ అనే ప్రొటీన్ అసాధారణంగా పెరిగిపోవడాన్ని అమిలాయిడోసిస్‌గా పరిగణిస్తారు. ఈ వ్యాధి వల్ల ఆవయవాలు పనిచేయడం క్రమంగా ఆగిపోతుంది. ముషారఫ్‌కు ఈ వ్యాధి సోకినట్లు తొలిసారిగా 2018లో బయటపడింది. ఆయన సొంత పార్టీ ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఏపీఎంఎల్) ఈ విషయాన్ని ప్రకటించింది. ఆయన గత ఏడాది జూన్‌లో దుబాయ్‌లో ఆసుపత్రిలో చేరారు. 3 వారాల పాటు అసుపత్రిలోనే ఉన్నారు. అప్పట్లోనే ఆయన చనిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.