K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత.. ఆయన జీవిత ప్రస్థానం ఇలా..
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 2వ తేదీ (గురువారం) రాత్రి తుదిశ్వాస విడిచారు.
గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పెద పులివర్రు అనే గ్రామంలో 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని విశ్వనాథ్ జన్మించారు. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో ఎక్కువ రోజులు నివసించలేదు. విశ్వనాథ్ పాఠశాల విద్య అంతా విజయవాడలో చేశారు. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు.
సినీ ప్రస్థానం ఇలా..
చెన్నైలోని ఒక స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టిన కే.విశ్వనాథ్.. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడికోడళ్లు అనే సినిమాకు పనిచేస్తున్నపుడు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరారు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. కె విశ్వనాథ్ 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. శంకరాభరణం, సాగరసంగమం, స్వర్ణకమలం, సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి ఎన్నో క్లాసిక్స్ అందించారు. అలాగే, నటుడిగానూ ఎన్నో గొప్ప పాత్రల్లో కె.విశ్వనాథ్ జీవించారు.
సినిమారంగంలో చేసిన కృషికిగాను.. శంకరాభరణానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. స్వాతిముత్యం సినిమా 1986లో ఆస్కార్ అవార్డుకు అధికారికంగా ప్రవేశం పొందింది. 1992లో రఘుపతి వెంకయ్య, పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నాడు. విశ్వనాథ్‌కు 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది.