Tulasidas Balaram: ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత
87 ఏళ్ల బలరాం సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తమిళ కుటుంబానికి చెందిన బలరాం 1936లో సికింద్రాబాద్‌లోని అమ్ముగూడలో జన్మించారు. ఇక్కడే ఫుట్‌బాల్‌లో ఓనమాలు నేర్చుకున్న ఆయన సంతోష్ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తరఫున ఆడారు.
సెంటర్ ఫార్వర్డ్‌గా సత్తా చాటిన బలరాం అంతర్జాతీయ కెరీర్ 1955–1963 మధ్య ఏడేళ్ల పాటు గొప్పగా సాగింది. అదే సమయంలోనే 1956 మెల్‌బోర్న్, 1960 రోమ్ ఒలింపిక్స్‌లలో ఆయన భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఒలింపిక్స్‌కు ఆడిన సమయంలో బలరాం హైదరాబాద్ ఆటగాడిగానే ఉన్నారు. 36 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 10 గోల్స్ సాధించిన ఆయన 1962 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించారు.
ఒక దశలో ‘హోలీ ట్రినిటీ’ అంటూ కితాబులందుకున్న చుని గోస్వామి, పీకే బెనర్జీ, బలరాం త్రయం భారత ఫుట్‌బాల్‌కు అద్భుత విజయాలు అందించింది. ట్యుబర్ క్యులోసిస్ కారణంగా 27 ఏళ్ల వయసుకే దురదృష్టవశాత్తూ ఆయన కెరీర్ ముగిసింది. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత చాలా ఏళ్ల క్రితమే బలరాం కోల్‌కతాకు వెళ్లిపోయి స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. అక్కడే కోచ్‌గా కూడా తన సేవలందించారు.