Skip to main content

Sanjiv Khanna: 51వ సీజేఐగా బాధ్యతలు స్వీక‌రించ‌నున్న సంజీవ్‌ ఖన్నా.. హైకోర్టు సీజే కాకుండానే..

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్‌ ఖన్నా బాధ్యతలు స్వీక‌రించ‌నున్నారు.
CJI DY Chandrachud Recommends Justice Sanjiv Khanna As next CJI of Supreme Court

అక్టోబ‌ర్ 16వ తేదీ మొదలైన సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియలో డీవై చంద్రచూడ్ ఇందుకు శ్రీకారం చుట్టారు. తన వారసునిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేరును సిఫార్సు చేస్తూ కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాశారు. కేంద్రం లాంఛనంగా ఆమోదం తెలిపిన అనంతరం జస్టిస్‌ ఖన్నా సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి అవుతారు.
 
నవంబర్ 10వ తేదీ జస్టిస్‌ చంద్రచూడ్‌ రిటైరవనున్నారు. అనంతరం 11న జస్టిస్‌ ఖన్నా సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆరు నెలలకు పైగా సేవలందించి 2025 మే 13వ తేదీ రిటైరవుతారు. జస్టిస్‌ చంద్రచూడ్‌ తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి ఖన్నాయే. సుప్రీంకోర్టులో సీనియర్‌ మోస్ట్‌ న్యాయమూర్తిగా ఉన్నవారే తదుపరి సీజేఐ కావడం పరిపాటి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్‌ వయసు 65 ఏళ్లు. 

చరిత్రాత్మక తీర్పులు.. 
జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా న్యాయ కోవిదునిగా పేరొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. ఈవీఎంలు సురక్షితమైనవని, బూత్‌ల ఆక్రమణ, బోగస్‌ ఓటింగ్‌లకు చెక్‌ పెడతాయని స్పష్టం చేయడమే గాక ఎన్నికల్లో వాడకాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చారు. వీవీప్యాట్ల ద్వారా ఈవీఎం ఓట్లను నూరు శాతం వెరిఫై చేయాలంటూ దాఖలైన కేసును కొట్టేసిన ఆ ధర్మాసనానికి ఆయనే సారథి. 

ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమైనదంటూ తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ ఖన్నా సభ్యులు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా ఆయన ఉన్నారు.

DY Chandrachud: ముగియనున్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌ పదవీ కాలం

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేశారు. ప్రస్తుతం నేషనల్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ (ఎన్‌ఏఎల్‌ఎస్‌ఏ) ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కూడా సేవలందిస్తున్నారు.

హైకోర్టు సీజే కాకుండానే.. 
జస్టిస్‌ ఖన్నా 1960 మే 14వ తేదీ జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌ లా సెంటర్‌లో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1983లో ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌ సభ్యునిగా నమోదు చేసుకున్నారు. తీస్‌హజారీ జిల్లా కోర్టుల్లో న్యాయవాదిగా కెరీర్‌ మొదలు పెట్టారు. అనంతరం ఢిల్లీ హైకోర్టుతోపాటు పలు ట్రిబ్యునళ్లలో న్యాయవాదిగా పలు ప్రతిష్టాత్మక కేసులను వాదించి సమర్థునిగా పేరు తెచ్చుకున్నారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, ఏడాది అనంతరం శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 జనవరి 18వ తేదీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 

ఏ హైకోర్టుకూ ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకుండానే నేరుగా ఈ ఘనత సాధించిన అతి కొద్దిమందిలో ఒకరిగా నిలిచారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నాకు ఆయన మేనల్లుడు. 1973లో కేశవానంద భారతి కేసులో మౌలిక నిర్మాణ సిద్ధాంతానికి సంబంధించి చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నా సభ్యుడు.

Interest Rates: వరుసగా 10వ సారి.. రెపో రేటు యథాతథంగా కొనసాగింపు..!

ఎమర్జెన్సీ వేళ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు వంటి ప్రాథమిక హక్కులను కూడా సస్పెండ్‌ చేయవచ్చంటూ 1976లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పుతో విభేదించిన ఏకైక సభ్యునిగా ఆయన సుప్రసిద్ధులు. ఈ కారణంగా తనను కాదని జూనియర్‌ను సీజేఐగా నియమించడంతో న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు.

Published date : 18 Oct 2024 04:37PM

Photo Stories