Aparajita Bill: అత్యాచార దోషులకు మరణ శిక్ష.. ‘అపరాజిత’ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
‘అపరాజిత మహిళ, బాలలు(పశ్చిమ బెంగాల్ చట్టాలు, సవరణ) బిల్లు–2024’ను రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి మలోయ్ ఘటక్ సెప్టెంబర్ 3వ తేదీ సెంబ్లీలో ప్రవేశపెట్టారు. అధికార, విపక్ష సభ్యులంతా బిల్లుకు అంగీకారం తెలిపారు. బిల్లుకు సంబంధించి ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రతిపాదించిన కొన్ని సవరణలను సభ తిరస్కరించింది.
మహిళలపై అత్యాచారానికి పాల్పడి వారి మరణానికి లేదా జీవచ్ఛవంగా మారడానికి కారణమైన దోషులకు మరణ శిక్ష లేదా పెరోల్‌కు వీల్లేకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా అపరాజిత బిల్లును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళలపై నేరాల కేసుల్లో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి, సత్వరమే కోర్టు నుంచి తీర్పు వచ్చేలా బిల్లులో నిబంధనలు జోడించారు. మహిళలు, చిన్నారులకు భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా అత్యాచారాలు, లైంగిక నేరాలకు సంబంధించి ఇప్పుడున్న చట్టంలో కొన్ని మార్పులు చేశారు, కొత్త అంశాలు చేర్చారు.
ఈ బిల్లు చరిత్రాత్మకమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉద్ఘాటించారు. అపరాజిత బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే.. ఇది మొత్తం దేశానికి ఒక రోల్‌మోడల్‌గా ఉపయోగపడుతుందని చెప్పారు.
ఏమిటీ అపరాజిత బిల్లు?
భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష సంహితతో పాటు పోక్సో చట్టానికి కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అపరాజిత బిల్లు సవరణలను ప్రతిపాదించింది. ‘అత్యాచారం, అత్యాచారం–హత్య, సామూహిక అత్యాచారం, బాధితుల గుర్తింపు బయటపెట్టడం, యాసిడ్ దాడి వంటి నేరాలకు విధించే శిక్షలకు సంబంధించి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 64, 66, 70(1), 71, 72(1), 73, 124(1), 124(2)ను సవరించాలి. మహిళలు, చిన్నారులపై అత్యాచారం, లైంగిక నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలి’ అని పేర్కొంది.
‘అత్యాచారం కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదైన 21 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలి. తగిన కారణాలుంటే మరో మూడు వారాలు పొడిగించవచ్చు. దోషులకు మరణ శిక్షతో పాటు జరిమానా లేదా ఆజన్మ ఖైదు (మరణించేదాకా) విధించాలి. మహిళలపై నేరాలకు సంబంధించిన కోర్టు కార్యకలాపాలను, కేసు విచారణ వివరాలను అనుమతి లేకుండా ప్రచురిస్తే 3 నుంచి ఐదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించాలి.
దర్యాప్తు కోసం డీఎస్పీ నేతృత్వంలో జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి. దర్యాప్తు వేగంగా పూర్తి చేయడానికి ప్రత్యేక కోర్టును, దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి’ అని అపరాజిత బిల్లు ప్రతిపాదించింది.
Marriages Act: ముస్లిం మ్యారేజెస్ యాక్ట్ రద్దు.. ఇకపై పెళ్లిళ్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి