Bilateral Trade: భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా
2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం–గత ఆర్థిక సంవత్సరంలో భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య విలువ 119.42 బిలియన్ డాలర్లు(రూ.9.27 లక్షల కోట్లు)గా నమోదైంది. ఇది అంతకుముందు 2020– 21లో 80.51 బిలియన్ డాలర్లు(రూ.6.25 లక్షల కోట్లు) ఉంది. దీంతో ఇప్పటివరకు భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న చైనాను అమెరికా అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి అమెరికాకు 76.11 బిలియన్ డాలర్ల(రూ. 5.91 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులు నమోదయ్యాయి. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 51.62 బిలియన్ డాలర్ల(రూ.4.01 లక్షల కోట్ల) కంటే 47 శాతం అధికం. అదే సమయంలో దిగుమతుల విలువ 29 బిలియన్ డాలర్లు(రూ.2.25 లక్షల కోట్ల) నుంచి 43.31 బిలియన్ డాలర్ల (రూ.3.36 లక్షల కోట్ల)కు పెరిగింది. అలాగే, 2021–22 ఆర్థిక సంవత్సరంలో చైనాతో భారత ద్వైపాక్షిక వాణిజ్య విలువ 115.42 బిలియన్ డాలర్లు(రూ.8.96 లక్షల కోట్లు)గా ఉంది. 2020–21లో ఇది 86.4 బిలియన్ డాలర్లు(రూ.6.71 లక్షల కోట్లు)గా ఉంది. మన దేశం నుంచి చైనాకు చేసే ఎగుమతుల విలువ 21.25 బిలియన్ డాలర్లు(రూ.1.65 లక్షల కోట్లు) కాగా, దిగుమతులు 94.16 బిలియన్ డాలర్లు (రూ.7.31 లక్షల కోట్లు) గా ఉంది. గత దశాబ్దంలో 2013–14 నుంచి 2017–18 వరకు భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా కొనసాగింది. ఆ తర్వాత రెండు ఆర్థిక సంవత్సరాల్లో యూఏఈ ఉండగా.. మళ్లీ చైనా అగ్రస్థానంలో నిలిచింది. ఇక, 2021–22లో యూఏఈ మూడో స్థానానికి చేరగా.. ఆ తర్వాత స్థానాల్లో సౌదీ అరేబియా, ఇరాక్, సింగపూర్‌లు ఉన్నాయి.
Indo Pacific Economic Framework: 12 దేశాల భాగస్వామ్యంతో ఐపీఈఎఫ్