United Nations report: మానవాభివృద్ధి ఐదేళ్లు వెనక్కి
కరోనా మహమ్మారి విసిరిన పంజాతో విలవిలలాడిన ప్రపంచ దేశాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కుదేలైపోయాయి. రెండేళ్ల పాటు విజృంభించిన ఈ వైరస్‌తో మానవాభివృద్ధి అయిదేళ్లు వెనక్కి వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. ప్రజల సగటు ఆయుర్దాయం, విద్యా స్థాయి, జీవన ప్రమాణాల ఆధారంగా తయారు చేసే మానవాభివృద్ధి సూచిలో.. ప్రపంచదేశాలు వరసగా రెండేళ్లు 2020, 2021లో వెనక్కి పయనిస్తున్నట్టుగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్ డీపీ) వెల్లడించింది. 2021 సంవత్సరానికి గాను మానవాభివృద్ధి సూచిలో మొత్తం 191 దేశాలకుగాను భారత్ 132వ స్థానంలో నిలిచింది. భారత మానవాభివృద్ధి విలువ 0.633గా ఉంది. అంటే.. మన దేశంలో మానవాభివృద్ధి మధ్యస్తంగా ఉందని చెప్పొచ్చు. 2020 సంవత్సరంలో 0.645గా ఉన్న విలువ ఏడాదిలో కాస్త తగ్గింది. 2020లో 189 దేశాలకు గాను ఇండియా ర్యాంక్ 131గా ఉంది. భారత్‌లో సగటు ఆయుర్దాయం 69.7ఏళ్ల నుంచి 67.2ఏళ్లకి తగ్గింది. 2019తో పోల్చి చూస్తే భారత దేశ మానవాభివృద్ధిలో అసమానతలు తగ్గుముఖం పట్టాయని,అదొక శుభపరిణామమని యూఎన్ డీపీ పేర్కొంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చి చూస్తే పురుషుల, మహిళల అభివృద్ధిలో ఉన్న తేడా చాలా వేగంగా తొలగిపోతోందని తెలిపింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP