NITI Aayog: పంటల వృద్ధి రేటులో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం?
Sakshi Education
పదేళ్లలో వ్యవసాయ పంటల వృద్ధి రేటులో త్రిపుర రాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచింది. 6.87 శాతం వృద్ధి రేటుతో త్రిపుర తొలి స్థానంలో ఉండగా, తెలంగాణ 6.59 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. సిక్కిం కూడా రెండో స్థానంలో ఉంది. అయితే పెద్ద రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణదే మొదటి స్థానమని చెప్పుకోవచ్చు. 2011–20 మధ్య కాలంలో దేశంలో వ్యవసాయ రంగ పురోగతి, వివిధ రాష్ట్రాలు సాధించిన వృద్ధిపై రూపొందించిన విశ్లేషణ పత్రంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ విశ్లేషణ పత్రాన్ని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసింది.
నివేదికలోని ముఖ్యాంశాలు
- కేవలం 11 రాష్ట్రాల్లో మాత్రమే 3 శాతానికి మించి సగటు పంటల వృద్ధి రేటు నమోదైంది.
- పది రాష్ట్రాల్లో మైనస్ 3.63 శాతం నుంచి ఒక శాతం లోపు వృద్ధి రేటు నమోదైంది.
- దేశంలో రైతు ఆదాయంలో పంటల వాటా 2011–12లో 65.4 శాతం ఉండగా, 2018–19 నాటికి అది 55.3 శాతానికి పడిపోయింది.
- సాగుదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వ్యవసాయ పరిమాణం క్షీణిస్తోంది.
- గ్రామీణ మహిళా కార్మికులలో 73 శాతం మంది వ్యవసాయరంగంలో పనిచేస్తున్నారు.
- ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ రైతులకు ప్రభుత్వాల నుంచి చాలా తక్కువ సహకారం లభిస్తోంది.
- ఉద్యానం, పాడి, పశుసంవర్థక తదితర అనుబంధ రంగాల వృద్ధి రేటులో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.
- వ్యవసాయంలో సరైన పద్ధతులు అవలంభించకపోవడం వల్ల ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడేవారు దేశంలో 15 శాతం మంది ఉన్నారు.
Published date : 01 Oct 2021 05:27PM