Skip to main content

నవంబర్ 2019 జాతీయం

బాల్య వివాహాల నిర్మూలనకు అరుంధతి స్వర్ణ పథకం
Current Affairs
బాల్య వివాహాలను నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా అస్సాం ప్రభుత్వం ‘అరుంధతి స్వర్ణ యోజన’ పేరుతో నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. 2020, జనవరి 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ పథకం ప్రకారం అస్సాంలో జరిగే పెళ్లిళ్లలో పెళ్లికూతురికి తులం(10 గ్రాముల) బంగారానికి సమానమైన సొమ్మును ఇస్తారు. అయితే వధూవరులు కనీసం పదోతరగతి వరకు చదివి ఉండాలని, వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల లోపే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం షరతులు పెట్టింది. అంటే వధువుకు కచ్చితంగా చట్టపరమైన వివాహ వయస్సు వచ్చి ఉండాలి. అసోంలో ఏటా 3 లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నా, కేవలం 60 వేలలోపు పెళ్లిళ్లే రిజిస్టర్ అవుతున్నాయని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి బిశ్వ శర్మ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అరుంధతి స్వర్ణ యోజన పేరుతో నూతన పథకం అమలు
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : అస్సాం ప్రభుత్వం
ఎక్కడ : అస్సాం
ఎందుకు : బాల్య వివాహాలను నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా

ప్రధాని మోదీ విదేశీ ప్రయాణ ఖర్చు రూ. 255 కోట్లు
2016-19 సంవత్సరాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ ప్రయాణాలకు ప్రత్యేక విమానాల కోసం రూ.255 కోట్లు వెచ్చించినట్లు ప్రభుత్వం తెలిపింది. నవంబర్ 21న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ రాజ్యసభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. వీటితోపాటు 2016-18 సంవత్సరాల మధ్య ప్రధాని విదేశీ నేతలతో హాట్‌లైన్ సంభాషణలకైన ఖర్చు సుమారు రూ.3 కోట్లని తెలిపారు. ప్రభుత్వ విధానం ప్రకారం.. దేశం లోపల వైమానిక దళ విమానాలు, హెలికాప్టర్లలో ప్రధాని అధికారికంగా పర్యటిస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవని, అవన్నీ ఉచితమన్నారు.

డీఆర్‌డీవో సినర్జీ సమ్మిట్‌లో రాజ్‌నాథ్
పరిశ్రమ వర్గాలతో మరింత సమన్వయం కోసం నవంబర్ 22న హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో ‘‘డీఆర్‌డీవో ఇండస్ట్రీ సినర్జీ సమ్మిట్ 2019’ జరిగింది. ఈ సమ్మిట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. డీఆర్‌డీవో, రక్షణ పరిశ్రమ వర్గాలు సమష్టిగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కోసం 1,800 పరిశ్రమలకుపైగా కలసి పనిచేస్తున్నాయని, ఇందులో డీఆర్‌డీవో పాత్ర ప్రశంసనీయం అన్నారు.
డీఆర్‌డీవో ఇండస్ట్రీ సినర్జీ సమ్మిట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చైర్మన్ డాక్టర్ జి.సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. రక్షణ రంగంలో దేశం స్వావలంబన సాధించేందుకు, పూర్తిస్థాయిలో స్వదేశీ టెక్నాలజీలను ఉపయోగించేందుకు ప్రైవేట్ రంగం కలసి రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తుల భాగస్వామ్యం సుమారు 45 - 50 శాతం మాత్రమే ఉండగా.. రానున్న ఐదేళ్లలో దీన్ని 70 శాతానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డీర్‌డీవో ఇండస్ట్రీ సినర్జీ సమ్మిట్ 2019
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : పరిశ్రమ వర్గాలతో మరింత సమన్వయం కోసం

డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విలీనం
కేంద్ర పాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలను ఒకే కేంద్ర పాలిత ప్రాంతం కిందకు మార్చేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో నవంబర్ 23న తెలిపారు. పాలనను మరింత సులభతరం చేసేందుకే వీటిని కలపనున్నట్లు చెప్పారు.
కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలకు వేర్వేరు సచివాలయాలు, బడ్జెట్ ఉన్నాయి. రెండు ప్రాంతాలను ఏకం చేసిన తర్వాత ఏర్పడే కేంద్రపాలిత ప్రాంతానికి ‘దాద్రా, నాగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ’ అనే పేరు పెట్టే అవకాశం ఉంది. దీంతో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8కి తగ్గనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : త్వరలో డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విలీనం
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : పాలనను మరింత సులభతరం చేసేందుకు

ధ్రువ లిపికి లాంగ్వేజ్ రైటింగ్ గుర్తింపు
ఆంధ్ర వర్సిటీ ఆంగ్లవిభాగం ఆచార్యురాలు ప్రసన్నశ్రీ రూపొందించిన ధ్రువ లిపిని బ్రిటన్ కేంద్రంగా ఉన్న ‘వరల్డ్ లాంగ్వేజ్ రైటింగ్ సిస్టమ్స్’ సంస్థ గుర్తించింది. ఛత్తీస్‌గఢ్‌లో ధ్రువ జాతి గిరిజనుల భాషకు లిపి లేకపోవడంతో ఆచార్య ప్రసన్నశ్రీ 15 అచ్చులు, 27 హల్లులతో మొత్తం 42 అక్షరాలను రూపొందించారు. ధ్రువజాతి గిరిజనుల భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తయారుచేసిన ఈ లిపికి తాజా గుర్తింపుతో అంతర్జాతీయ ప్రాముఖ్యం వచ్చినట్లయింది. గతంలో ప్రసన్నశ్రీ 18 గిరిజన భాషలకు లిపి రూపొందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ధ్రువ లిపికి వరల్డ్ లాంగ్వేజ్ రైటింగ్ సిస్టమ్స్ గుర్తింపు
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ఆచార్య ప్రసన్నశ్రీ

గుజరాత్‌లో ఇనుపయుగపు ఆనవాళ్లు
గుజరాత్‌లో దాదాపు మూడువేల ఏళ్లనాటి ఇనుపయుగపు ఆనవాళ్లను ఐఐటీ-ఖరగ్‌పుర్ పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుతం కచ్‌ప్రాంతంలో ఉన్న ఉప్పునేలలకు సమీపంలోని కరీంషాహి, విగకోట్ ప్రాంతాల్లో ఇనుపయుగం పరిఢవిల్లినట్లు వారు పేర్కొన్నారు. థార్‌ఎడారి సమీపంలో పాకిస్తాన్ సరిహద్దు సమీప ప్రాంతంలో సుమారు 3000-2500 ఏళ్ల క్రితం జనావాసాలున్నట్లు సాక్ష్యాలు లభించాయన్నారు. దాదాపు మూడేళ్ల పాటు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపినట్లు తెలిపారు. ఈ పరిశోధన వివరాలను ఆర్కియలాజికల్ రిసెర్చి ఇన్ ఏషియా జర్నల్ ప్రచురించింది.
ప్రకృతి విపత్తుల కారణంగా సింధూనాగరికత అంతరించిపోయిన తర్వాత ఇనుప యుగం మొదలైంది. గుజరాత్‌లో సంభవించిన ఈ పరిణామాన్ని పురాతత్వశాస్త్రవేత్తలు ‘చీకటియుగం’గా అభివర్ణించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇనుపయుగపు ఆనవాళ్లు గుర్తింపు
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : ఐఐటీ-ఖరగ్‌పుర్ పరిశోధకులు
ఎక్కడ : కరీంషాహి, విగకోట్ ప్రాంతాలు, గుజరాత్ .

ఆధార్ చట్ట బద్ధతపై సుప్రీంకోర్టు విచారణ
ఆధార్ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలు తెరవడానికి, మొబైల్ కనెక్షన్లు పొందడానికి వినియోగదారులు స్వచ్ఛందంగా తమ గుర్తింపు పత్రం కింద ఆధార్ నంబర్‌ను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం ఎంతవరకు సరైందన్న అంశాలనూ సుప్రీం విచారించనుంది. ఈ మేరకు ఆధార్ సవరణ చట్టం పౌరుల వ్యక్తిగత భద్రత, గోప్యతకు భంగం వాటిల్లేలా ఉందని, ఇది ప్రాథమిక హక్కుల్ని కాలరాయడమేనని దాఖలైన ప్రజా ప్రయోజనా వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు నవంబర్ 22న విచారణకు స్వీకరించింది. దీనిపై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ కేంద్రానికి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)లకు నోటీసులు జారీ చేసింది.
జూలైలో ఆధార్ సవరణ చట్టం
కొన్ని మినహాయింపులతో ఆధార్ చట్టం రాజ్యాంగబద్ధమేనని 2018, సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో కేంద్రప్రభుత్వం ఆధార్, ఇతర చట్టాలకు సవరణలు తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన బిల్లును జూలై 8న పార్లమెంటు ఆమోదించింది. తాజాగా ఆర్మీ మాజీ అధికారి ఎస్‌జీ వోంబట్కెరె, సామాజిక కార్యకర్త విల్సన్ ఈ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ పిల్ దాఖలు వేశారు. దీనిపై కేంద్రానికి, యూఐడీఐఏకు సుప్రీం నోటీసులు పంపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆధార్ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : ఆధార్ సవరణ చట్టంపై పిల్ దాఖలు కావడంతో

50వ గవర్నర్ల వార్షిక సమావేశం ప్రారంభం
దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నవంబర్ 23న 50వ గవర్నర్ల వార్షిక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రపతి మాట్లాడుతూ... గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల పాత్ర కేవలం రాజ్యాంగ పరిరక్షణకు మాత్రమే పరిమితం కారాదని, ప్రజా జీవితంలో వీరికున్న అపార అనుభవం ప్రజలకు పూర్తిగా ఉపయోగపడాలని ఆకాంక్షించారు. గవర్నర్లు ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని, సమాజంలో వెనుకబడ్డ తరగతులు, మైనార్టీల అభ్యున్నతికి కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 50వ గవర్నర్ల వార్షిక సమావేశం ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ

విద్యాలయాలకు ఫిట్ ఇండియా గ్రేడింగ్
దేశవ్యాప్తంగా విద్యాలయాలకు ‘ఫిట్ ఇండియా స్కూల్’గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నవంబర్ 24న ఆయన ‘మన్ కీ బాత్’లో మాట్లాడుతూ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ‘ఫిట్ ఇండియా స్కూల్’ ర్యాంకుల్లో మూడు రకాలుగా విభజించినట్లు చెప్పారు. ఫిట్ ఇండియా స్కూల్, ఫిట్ ఇండియా స్కూల్(త్రీ స్టార్), ఫిట్ ఇండియా స్కూల్(ఫైవ్ స్టార్) ఉంటాయన్నారు. ప్రతి స్కూల్ తన విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం అమలు చేస్తున్న ఫిట్నెస్ కార్యక్రమాలు, కల్పిస్తున్న సౌకర్యాల ఆధారంగా వీటిని ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
అయోధ్య తీర్పు అనంతర పరిస్థితులపై ప్రధాని మాట్లాడుతూ.. ‘జాతి ప్రయోజనాలకే పెద్దపీట అని 130 కోట్ల మంది దేశ ప్రజలు మరోసారి నిరూపించారు. ఆ తీర్పును విశాల హృదయంతో ఆహ్వానించారు. సహనం, సంయమనం, పరిణతి చూపిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. పర్యావరణం, సుముద్ర జీవుల పరిరక్షణ కోసం విశాఖకు చెందిన ‘ప్లాటిపస్ ఎస్కేప్’ సంస్థ స్కూబా డైవర్లు చేస్తున్న కృషిపై ప్రధాని ప్రశంసలు కురిపించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విద్యాలయాలకు ఫిట్ ఇండియా గ్రేడింగ్
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ

సాల్‌కాంప్‌కు నోకియా ప్లాంటు : కేంద్ర ఐటీ శాఖ
ఒకప్పటి మొబైల్స్ దిగ్గజం నోకియాకు చెందిన చెన్నై ప్లాంటును మొబైల్ చార్జర్ల తయారీ సంస్థ సాల్‌కాంప్ కొనుగోలు చేయనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఒప్పందం కుదిరినట్లు నవంబర్ 25న తెలిపారు. దాదాపు పదేళ్లుగా మూతబడి ఉన్న ఈ ఫ్యాక్టరీని సాల్‌కాంప్ పునరుద్ధరించనున్నట్లు, 2020 మార్చి నుంచి ఈ ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి చెప్పారు. మొబైల్ చార్జర్ల తయారీలో సాల్‌కాంప్ ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ. ఐఫోన్‌లకు అవసరమైన చార్జర్లను టెక్ దిగ్గజం యాపిల్‌కు సరఫరా చేస్తోంది.
ఐఫోన్ ఎక్స్‌ఆర్..
యాపిల్ తాజాగా ఐఫోన్ ఎక్స్‌ఆర్ మొబైల్స్‌ను భారత్‌లోనే తయారు చేయడం ప్రారంభించినట్లు మంత్రి రవి శంకర్ తెలిపారు. మేకిన్ ఇండియా కార్యక్రమానికి ఇది మరింత ఊతమివ్వనున్నట్లు వివరించారు. తైవాన్ కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ సంస్థ విస్ట్రన్ ద్వారా యాపిల్ ప్రస్తుతం ఐఫోన్ 6ఎస్, 7లను భారత్‌లో తయారు చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సాల్‌కాంప్‌కు నోకియా చెన్నై ప్లాంటు
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆక్షేపణ
లక్షల మంది పౌరుల ఆయుష్షును తగ్గించేస్తున్న వాయు కాలుష్యంపై రాష్ట్రాలు నిర్లిప్తంగా వ్యవహరించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పంట వ్యర్థాలను పొలాల్లో తగలబెడుతూ ఢిల్లీ- ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం పెరిగేందుకు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రైతులూ కారణమవు తున్నారని ఆక్షేపించింది. ‘ప్రజలు ఇలా గ్యాస్ ఛాంబర్లలో ఎందుకు ఉంటున్నారు? బదులు పేలుడు పదార్థాలు పెట్టి వాళ్లందరినీ చంపేయండి’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది.
వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం, వ్యర్థాల నిర్వహణపై తమకు నివేదికలు సమర్పించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాల సుప్రీంకోర్టు బెంచ్ రాష్ట్రాలకు నవంబర్ 26న ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు స్మాగ్ టవర్ల నిర్మాణం చేపట్టే అంశంపై కేంద్రప్రభుత్వం 10 రోజుల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. తాము నిషేధం విధించినా ఈ ఏడాది దహనాలు మరింత పెరగడంపై పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను తప్పుపట్టింది.

గ్రామాల్లో ఇంటర్నెట్ పరిజ్ఞానం తక్కువ: ఎన్‌ఎస్‌వో
పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువగా ఉందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌వో) వెల్లడించింది. కంప్యూటర్, ఇంటర్నెట్ వినియోగంలో గ్రామీణ, పట్టణ భారతాల మధ్య పెద్ద ఎత్తున అంతరం ఉందని పేర్కొంది. ఈ మేరకు ‘హౌస్‌హోల్డ్ సోషల్ కన్జంప్షన్: ఎడ్యుకేషన్’పేరుతో 75వ రౌండ్ సర్వేను ఎన్‌ఎస్‌వో విడుదల చేసింది. 2017 జూలై నుంచి 2018 జూన్ వరకు 4 దశల్లో నిర్వహించిన ఈ సర్వేలో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలో ఎన్‌ఎస్‌వో అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా 1,13,757 కుటుంబాలను పలకరించి సమాచారం సేకరించింది.
ఎన్‌ఎస్‌వో సర్వేలోని అంశాలు
  • దేశంలో ఉన్న ప్రతి 100 గ్రామీణ కుటుంబాల్లో కేవలం నాలుగు కుటుంబాలు మాత్రమే ఇంట్లో కంప్యూటర్‌ను కలిగి ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో అయితే అది 23.4 శాతమని తేలింది.
  • గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను వినియోగించే వారి శాతం 14.9గా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో 42 శాతంగా ఉంది.
  • ఐదేళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న వారిలో కేవలం 9.9 శాతం మంది మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్నారు. అదే సమయంలో 13 శాతం ఇంటర్నెట్ సౌకర్యం వినియోగించే వెసులుబాటును కలిగి ఉన్నారు. గత 30 రోజుల్లో ఇంటర్నెట్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించిన వారి శాతం 10.8గా నమోదైంది.
  • పట్టణ ప్రాంతాల్లో 32.4 శాతం మందికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉంది. 37.1 శాతం మంది ఇంటర్నెట్ సౌకర్యం కలిగి ఉండగా, అందులో 33.8 శాతం మంది గత 30 రోజుల్లో క్రమం తప్పకుండా ఇంటర్నెట్‌ను వినియోగించారు.
  • అక్షరాస్యతా శాతం: గ్రామీణ ప్రాంతాల్లో 73.5, పట్టణ ప్రాంతాల్లో 87.7.

ఎన్‌ఐడీల సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఏపీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) సహా దేశవ్యాప్తంగా ఉన్న 4 ఎన్‌ఐడీలను జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థలుగా గుర్తించేందుకు ఉద్దేశించిన ‘ఎన్‌ఐడీల సవరణ బిల్లు-2019’కు లోక్‌సభ నవంబర్ 26న ఆమోదం తెలిపింది. ఈ నాలుగు సంస్థలను అహ్మదాబాద్ ఎన్‌ఐడీతో సమానంగా తీర్చిదిద్దుతామని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, హరియాణాల్లో ఉన్న ఎన్‌ఐడీలను జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థలుగా గుర్తించే ఈ బిల్లుకు రాజ్యసభ 2019, జూలైలోనే ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే విద్యార్థులకు డిగ్రీలు, డిప్లొమాలు మంజూరు చేసే అధికారం ఆయా సంస్థలకు లభించనుంది.
మరోవైపు ట్రాన్స్ జెండర్ల హక్కుల పరిరక్షణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. ‘ట్రాన్స్ జెండర్స్ బిల్లు-2019’ను ఆగస్టులో లోక్‌సభ ఆమోదించగా.. తాజాగా నవంబర్ 26న రాజ్యసభ ఆమోదించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌ఐడీల సవరణ బిల్లు-2019కు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, హరియాణాల్లో ఉన్న ఎన్‌ఐడీలను జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థలుగా గుర్తించేందుకు

పార్లమెంటులో 70వ రాజ్యాంగ దినోత్సవం
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 70ఏళ్ల అవుతున్న సందర్భంగా నవంబర్ 26న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ‘భారత 70వ రాజ్యాంగ దినోత్సవం(సంవిధాన్ దివస్)’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోకసభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ.. రాజ్యాంగం ఏర్పరచిన మూడు (న్యాయ, శాసన, కార్యనిర్వాహక) వ్యవస్థలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు, పౌర సమాజ సభ్యులు, పౌరులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలన్నారు. పౌరుల ప్రాథమిక బాధ్యతల వివరాలను పాఠ్యాంశాల్లో చేర్చడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించి పౌరులకు అవగాహన కల్పించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. హక్కుల కోసం కాకుండా.. విధులు, బాధ్యతలపై ప్రజలు దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ వైఖరికి నిరసనగా ప్రతిపక్షాలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి.

రూ.250 స్మారక నాణెం విడుదల
రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ 250వ సమావేశాలను పురస్కరించుకుని రూ.250 నాణేన్ని, రూ.5 విలువైన పోస్టల్ స్టాంపును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విడుదల చేశారు. 40 గ్రాముల ఈ నాణేన్ని పూర్తిగా వెండితో తయారుచేశారు. అదే సమయంలో ‘భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజ్యసభ పాత్ర’అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి తొలి ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు.
రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగ సభ ఆమోదించింది. ఆ తరువాత రెండు నెలల అనంతరం 1950 జనవరి 26న ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పార్లమెంటులో 70వ రాజ్యాంగ దినోత్సవం
ఎప్పుడు : నవంబర్ 26
ఎందుకు : భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 70ఏళ్ల అవుతున్న సందర్భంగా

లోక్‌పాల్ నినాదం, లోగో ఎంపిక
పార్లమెంట్ సభ్యులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులపై వచ్చే అవినీతి కేసులను దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన లోక్‌పాల్‌కు లోగోను, నినాదాన్ని ఖరారు చేశారు. లోక్‌పాల్ లోగో డిజైన్, నినాదం కోసం ఇటీవల పోటీ నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 6వేల మందికి పైగా ఈ పోటీలో పాల్గొని లోగో డిజైన్లు, నినాదాలు పంపించారు. ఇందులో నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన ప్రశాంత్ మిశ్రా రూపొందించిన డిజైన్‌ను లోక్‌పాల్ లోగోగా ఎంపికచేశారు.
లోక్‌పాల్ లోగో
‘లోక్‌పాల్ ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తుంది.. ఎలా న్యాయం చేస్తుంది’ అనేది ప్రతిబింబించేలా లోక్‌పాల్ లోగోను ప్రశాంత్ రూపొందించారు. ప్రజలను సూచించేలా ముగ్గురు వ్యక్తులు, అశోక చక్రం, న్యాయవ్యవస్థను సూచించేలా కాషాయ రంగులో పుస్తకం, ఆ పుస్తకాన్ని రెండు చేతుల్లో పట్టుకున్నట్లుగా లోగోను తయారుచేశారు. మువ్వన్నెల రంగుల్లో ఈ లోగో ఎంతో ఆకట్టుకుంటోంది. మొత్తం 2,236 మంది లోగో డిజైన్లు పంపగా... ప్రశాంత్‌ను విజేతగా ప్రకటించారు. లోగో విజేతకు రూ.25వేల నగదు బహుమతి ప్రకటించారు.
లోక్‌పాల్ నినాదం
4,705 మంది నినాదాలు పంపగా.. వీటిలో ఏ ఒక్కటి సంతృప్తికరంగా లేకపోవడంతో ఎవరిని ఎంపిక చేయలేదని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించింది. నినాదం విషయమై లోక్‌పాల్ కమిటీ చర్చించి సొంతంగా ఉపనిషత్తు నుంచి ఒక శ్లోకాన్ని ఎంపిక చేసింది. ‘పరుల సొమ్ము ఆశించరాదు’అనేది ఈ నినాదం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోక్‌పాల్ నినాదం, లోగో ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ

15వ ఆర్థిక సంఘం పదవీ కాలం పొడిగింపు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీపై సిఫార్సులు చేయడానికి ఉద్దేశించిన 15వ ఆర్థిక సంఘం(ఫైనాన్స్ కమిషన్) పదవీ కాలాన్ని కేంద్ర కేబినెట్ పొడిగించింది. కమిషన్ పదవీ కాలాన్ని 2020 అక్టోబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు నవంబర్ 27న ప్రకటించింది. 2019 అక్టోబర్ వరకు ఉన్న కమిషన్ పదవీ కాలాన్ని తొలుత 2019 నవంబర్ 30 వరకు పొడిగించారు. అనంతరం దీనిని మరోమారు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నులు, ఇతర వనరుల విభజనపై ఫైనాన్స్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి నివేదికను అందించేందుకు విధించిన గడువును 2020 అక్టోబర్ 30 వరకు కేబినెట్ పొడిగించింది. ఇక 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అంశాలను సైతం తుది నివేదికలో పొందుపరచాలని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 15వ ఆర్థిక సంఘం పదవీ కాలం పొడిగింపు
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : కేంద్ర కేబినెట్

విస్తృత ధర్మాసనానికి శబరిమల’
Current Affairs
కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు, అమ్మాయిల ప్రవేశం అంశాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం ఏడుగురు సభ్యుల విసృ్తతస్థాయి ధర్మాసనానికి అప్పగించింది. దశాబ్దాలుగా అయ్యప్ప ఆలయంలోకి రుతుక్రమ వయసు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పునిచ్చింది. ఈ తీర్పుని పునః పరిశీలించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సమీక్షించిన కోర్టు ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల విసృ్తతస్థాయి ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ సందర్భంగా శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తే అది ఒక్క హిందూ మహిళలకే పరిమితంకాదని, ముస్లిం, పార్శీ మహిళలపై ఆయా మతాల్లో జరుగుతున్న వివక్షనూ పరిశీలిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ముస్లిం మహిళలను మసీదు, దర్గాలోకి అనుమతించకపోవడం, పార్శీ మహిళలు.. పార్శీయేతర పురుషులను పెళ్లాడటంపై నిషేధం, బొహ్రా వర్గాల్లో జరుగుతున్న జనన అవయవాల కత్తిరింపుల్లాంటి అంశాలను విసృ్తతధర్మాసనం చర్చిస్తుందని కోర్టు పేర్కొంది. సంపూర్ణ న్యాయం అందించేందుకు కోర్టు ఈ అంశాలపై న్యాయవిధానాలను రూపొందించాల్సిన సమయం ఇదేనని తన తొమ్మిదిపేజీల తీర్పుని వెలువరిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గత తీర్పుపై స్టే ఇవ్వాలన్న అంశంపై స్పందిస్తూ విసృ్తత ధర్మాసనానికి ఈ అంశాన్ని బదిలీ చేయడం అంటే సమస్య ఇంకా పరిష్కారం కాలేదని అర్థమని సీజేఐ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ నారీమన్, జస్టిస్ ఖన్వీల్కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాల ధర్మాసనం శబరిమల వివాదాన్ని పునఃపరిశీలించే అంశాన్ని 3:2 మెజార్టీ తీర్పుతో విసృ్తత ధర్మాసనానికి బదిలీ చేసింది. అయితే 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పు అమలుకాకుండా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విసృ్తత ధర్మాసనానికి బదిలీ చేసే అంశాన్ని ఐదుగురు సభ్యుల బెంచ్ ఆమోదించినా, అన్ని వయస్సుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పుని సమీక్షించాలని కోరడాన్ని జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు విభేదించారు. సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్ తీర్పు అనంతరం దాఖలైన 65 పిటిషన్లు, 56 రివ్యూ పిటిషన్లు, కొత్తగా దాఖలైన నాలుగు రిట్ పిటిషన్లు, ఐదు అప్పీళ్ళను డిస్‌మిస్ చేయడాన్ని ఈ ఇద్దరు న్యాయమూర్తులు వ్యతిరేకించారు.
2018 సెప్టెంబర్ తీర్పు ఏం చెప్పింది?
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ 2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ధర్మాసనం 4x1 సభ్యుల ఆమోదంతో తీర్పునిచ్చింది. రుతుక్రమం వయస్సులో ఉండే మహిళలు, అమ్మాయి లను శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని సమానత్వ భావనకు భిన్నమైనదని వ్యాఖ్యానించింది. ఈ యేడాది ఫిబ్రవరిలో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ శబరిమల తీర్పుని రిజర్వ్‌లో ఉంచడం తెల్సిందే.

రాఫెల్‌పై మోదీ సర్కారుకు సుప్రీం క్లీన్‌చిట్
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో మోదీ ప్రభుత్వానికి మరోసారి ఊరట లభించింది. గతంలో ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రివ్యూ పిటిషన్లలో ఎలాంటి పస లేదని సుప్రీం స్పష్టంచేసింది. గతంలో కేంద్రానికిచ్చిన క్లీన్ చిట్‌కే కట్టుబడి ఉన్నట్టుగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం నవంబర్ 14 తీర్పు ఇచ్చింది. ఫ్రాన్స్ కు చెందిన దసో ఏవియేషన్‌తో కుదుర్చుకున్న 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం, దానికి అనుసరించిన విధానంలో ప్రభుత్వం తరఫున ఎలాంటి అవకతవకలు జరగలేదని 2018, డిసెంబర్ 14నే సుప్రీం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని పునఃసమీక్షించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, లాయర్ ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లు సహేతుకంగా లేవని సుప్రీం స్పష్టంచేసింది. 58 వేల కోట్ల విలువైన ఒప్పందం చుట్టూ నెలకొన్న వివాదంపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలన్న అభ్యర్థనల్ని కూడా తిరస్కరించింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిన అంశాలేవీ అందులో లేవని న్యాయమూర్తులంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా జస్టిస్ కౌల్ తీర్పు చదివి వినిపించారు. తీర్పుపై తాను ఏకీభవిస్తానని చెబుతూనే... కొన్ని అంశాల్లో తనకు వేరే అభిప్రాయాలు ఉన్నాయంటూ జస్టిస్ జోసెఫ్ విడిగా తీర్పు ఇచ్చారు. అందుకు గల కారణాలను వెల్లడించారు. మే 10న రివ్యూ పిటిషన్లపై తీర్పుని రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు... ఫ్రాన్స్ తో కుదుర్చుకున్న అంతర్ ప్రభుత్వ ఒప్పందంలో (ఐజీఏ) సాంకేతిక సహకారం బదిలీని ఎందుకు చేర్చలేదని, ఒప్పందానికి సంబంధించి సార్వభౌమ పూచీకత్తుని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా విచారణ సంస్థలు కేసుల్ని నమోదు చేయలేవని కోర్టుకు విన్నవించారు. ఇక టెక్నాలజీ బదిలీ వంటి అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని చెప్పారు.
కాంగ్రెస్ సంధించిన ప్రశ్నలు ఇవే..
  1. జాతీయ భద్రతా ముసుగులో యుద్ధ విమానాల ధరను వెల్లడించకపోవడం ఎంతవరకు సరైనది ? ధర తడిసిమోపెడవడానికి కారణాలేంటి ?
  2. రిలయెన్స్ ను ఆఫ్‌సెట్ భాగస్వామిగా ఎంచుకోవాల్సిన అవసరం ఏమిటి ?
  3. దేశీయ విమానాల తయారీ సంస్థ హాల్‌ను ఎందుకు పక్కన పెట్టారు ?
  4. ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో పరిణామాలు ఎలా జరిగాయి ?

ప్రతి 4 నిమిషాలకో..నిండు ప్రాణం: కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ
రహదారులపై మృత్యు ఘంటికలు మోగుతున్నాయి! రోడ్డు ప్రమాదాల కారణంగా దేశంలో సగటున ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతుండగా ఐదుగురు తీవ్రంగా గాయపడుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదిక వెల్లడించింది. క్షతగాత్రుల్లో 30 శాతం మంది శాశ్వత వైకల్యానికి గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 30 వేల నుంచి 40 వేల మంది రోడ్డు ప్రమాదాల కారణంగా వైకల్యం బారినపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఏటా 5 లక్షల మంది వైకల్య బాధితుల జాబితాలో చేరుతున్నట్టు నివేదిక వెల్లడించింది.
3వ స్థానంలో ఉమ్మడి ఏపీ :
కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో (2011 లెక్కల ప్రకారం) ఉంది. ఒక్క ఏడాదిలో 30 వేలకు పైగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 8,200 మందికి పైగా మృతి చెందారు. ఇది దేశవ్యాప్తంగా ప్రమాదాల సగటులో 7.52 శాతం. ఏపీలో బోధనాసుపత్రులకు ఏటా సగటున 14 వేల మంది ప్రమాద బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క ఏడాదిలో 24,914 మంది ప్రమాద బాధితులు వచ్చినట్టు నమోదైంది.
నివేదికలో మరికొన్ని అంశాలివీ..
  • ప్రతి పదేళ్లకు 50 లక్షల మంది అంటే ఏటా 5 లక్షల మంది రకరకాల ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల శాశ్వత వైకల్యం బారిన పడుతున్నారు.
  • బాధితుల్లో 10-19 ఏళ్ల లోపువారే ఎక్కువగా 46.16 లక్షలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
  • 20-29 ఏళ్ల లోపు వారు 41.89 లక్షల మంది, 30-39 ఏళ్ల లోపు వారు 36.35 లక్షల మంది, 40-49 ఏళ్ల లోపు వారు 31.15 లక్షల మంది వైకల్య బాధితుల జాబితాలో ఉన్నారు.
  • ప్రమాదం జరిగిన తొలి గంట లోపే వైద్యచికిత్స అందిస్తే వైకల్యం బారి నుంచి కాపాడవచ్చు. ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రమాదల తీవ్రతను తగ్గించవచ్చు.
ప్రధాన రాష్ట్రాల్లో వైకల్య బాధితులు..

ఉత్తరప్రదేశ్

41,57,514

మహారాష్ట్ర

29,63,392

బిహార్

23,31,009

ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి)

22,66,607

పశ్చిమ బెంగాల్

20,17,406

రాజస్థాన్

15,63,694

మధ్యప్రదేశ్

15,51,931

కర్నాటక

13,24,205

ఒడిశా

12,44,402

తమిళనాడు

11,79,963

గుజరాత్

10,92,302

కేరళ

7,61,743

క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రతి 4 నిమిషాలకో నిండు ప్రాణం బలి
ఎందుకు: రోడ్డు ప్రమాదాల కారణంగా
ఎక్కడ: భారతదేశం

రాజ్యసభ 250వ సమావేశాలు ప్రారంభం
రాజ్యసభ 250వ సమావేశాలు నవంబర్ 18న ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజ్యసభలో జరిగిన ప్రత్యేక చర్చలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యుడు మన్మోహన్ సింగ్ మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు తగినట్టుగా రాజ్యసభ పనితీరు లేదని వెంకయ్య అన్నారు. రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చడం, రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం వంటి అంశాల్లో రాజ్యసభకు విశేష అధికారాల్ని కట్టబెట్టాలని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.
అద్వితీయ సభ
భారత సమాఖ్య వ్యవస్థకు పెద్దల సభ ఆత్మవంటిదని, అదే ఎప్పటికీ శాశ్వతమని మోదీ అన్నారు. రాజ్యసభ సభ పేరుకే ద్వితీయ సభే కావొచ్చు. కానీ అదొక అద్వితీయ సభ అని వాజ్‌పేయి అన్న వ్యాఖ్యల్ని ఆయన ప్రస్తావించారు. ‘ఎన్సీపీ, బీజేడీ పార్టీల సభ్యులు ఎప్పుడూ వెల్‌లోకి దూసుకువెళ్లలేదు. వారు చెప్పదలచుకున్నదేదో అద్భుతంగా, సమర్థవంతంగా చెబుతారు. వారి నుంచి అన్ని పార్టీలు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది’ అని ఎన్సీపీ, బీజేడీ పార్టీలపై మోదీ ప్రశంసలు కురిపించారు.
మార్షల్స్ డ్రెస్ మారింది
రాజ్యసభ చారిత్రక 250వ సెషన్లను పురస్కరించుకొని సభలో చైర్మన్‌కు ఇరువైపులా నిలబడే మార్షల్స్ యూనిఫామ్‌ను మార్చారు. ఎప్పుడూ తెల్లటి సంప్రదాయ దుస్తులు, తలపాగాతో కనిపించే మార్షల్స్ ఈ సమావేశాల సందర్భంగా మిలటరీ దుస్తుల్ని తలపించే యూనిఫామ్ వేసుకున్నారు. ఈ దుస్తుల్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థ డిజైన్ చేసింది. వేసవి కాలం సమావేశాల్లో తెల్ల రంగు యూనిఫామ్‌లోనే మార్షల్స్ కనిపిస్తారు.
పెద్దల సభ ప్రయాణం ఎలా సాగిందంటే...
  • 1952లో ఏర్పాటైన రాజ్యసభ 250 సెషన్లతో చరిత్ర సృష్టించింది.
  • ఇప్పటివరకు మొత్తం సభ్యుల సంఖ్య - 2,282
  • అత్యధిక కాలం కొనసాగిన సభ్యులు: జేడీ (యూ) సభ్యుడు మహేంద్ర ప్రసాద్ (ఏడోసారి), కాంగ్రెస్ సభ్యుడు మన్మోహన్ సింగ్ (ఆరోసారి)
  • 249 సెషన్లలో సభ జరిగిన రోజులు - 5,466
  • రాజ్యసభ ఆమోదించిన బిల్లులు - 3,817
  • పెండింగ్‌లో ఉన్న బిల్లులు - 38
  • రాజ్యసభలో వెనక్కి తీసుకున్న బిల్లులు - 104
  • రాజ్యసభ ఆమోదించినా, లోక్‌సభలో వీగిన బిల్లులు - 60
  • లోక్‌సభ ఆమోదించిన బిల్లులకు రాజ్యసభ సవరణ చేసిన బిల్లులు - 120
మహిళా సభ్యుల ప్రాతినిధ్యం
1952లో 15 మంది మహిళా సభ్యులుంటే (6.94%) 2014 నాటికి వారి సంఖ్య 31కి (12.76%) చేరుకుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 250 మంది సభ్యులకు గాను 26 మంది మహిళలు (10.83%)
చారిత్రక ఘట్టాలు
  • రాజ్యసభ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒకే ఒక్కసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1991 ఆగస్టు 5న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డినెన్స్ ను రద్దు చేయాలంటూ విపక్షాలు పెట్టిన తీర్మానం 39-39 ఓట్లతో టై అయింది. అప్పుడు ప్రిసైడింగ్ అధికారి ఓటు వేయడంతో ప్రతిపక్షాలు విజయం సాధించాయి.
  • రాష్ట్రపతి పాలన గడువు పెంచిన చరిత్ర కూడా పెద్దల సభకుంది. 1977లో తమిళనాడు, నాగాలాండ్, 1991లో హరియాణాలో రాజ్యసభ రాష్ట్రపతి పాలనను పొడిగించింది. అప్పట్లో లోక్‌సభ మనుగడలో లేదు.
  • రాజ్యసభ ఇప్పటికి ముగ్గురు సభ్యులను బహిష్కరించింది. 1976లో సభా మర్యాదకు భంగం కలిగిస్తున్నారంటూ సుబ్రమణ్య స్వామిని. 2005లోప్రశ్నలకు ముడుపులు కేసులో ఛత్రపాల్ సింగ్‌ను, ఎంపీలాడ్‌‌సలో అవకతవకలకు 2006లో సాక్షి మహరాజ్‌ను సభ నుంచి బహిష్కరించింది.

గేట్స్ ఫౌండేషన్‌తో పిరమల్ ఫౌండేషన్ ఒప్పందం
దేశంలోని వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లోని ప్రజల్లో ఆరోగ్య, పోషక విలువల మెరుగునకు పిరమల్ ఫౌండేషన్ ‘ట్రైబల్ హెల్త్ కొలాబరేటివ్ ఫర్ ఇండియా’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం కోసం బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో పిరమల్ ఫౌండేషన్ తాజాగా భాగస్వామ్యం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల పరిధిలో 15 కోట్ల మందికి ట్రైబల్ హెల్త్ కొలాబరేటివ్ ఫర్ ఇండియా కార్యక్రమం ద్వారా సేవలందించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : పిరమల్ ఫౌండేషన్
ఎందుకు : ట్రైబల్ హెల్త్ కొలాబరేటివ్ ఫర్ ఇండియా కార్యక్రమం కోసం

ప్రపంచ లగ్జరీ మార్కెట్లో ఢిల్లీకి 9వ స్థానం
ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస మార్కెట్లో భారత్ నుంచి మూడు నగరాలు చోటు దక్కించుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ 9వ స్థానంలో నిలవగా.. బెంగళూరు 20, ముంబై 28వ స్థానంలో నిలిచాయి. గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ నవంబర్ 19న విడుదల చేసిన ‘ప్రైమ్ గ్లోబల్ సిటీ ఇండెక్స్’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
గ్లోబల్ సిటీ ఇండెక్స్-ముఖ్యాంశాలు
  • 2019 ఏడాది మూడో త్రైమాసికానికి రూపొందించిన ఈ నివేదిక ప్రకారం లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్లో మొదటి స్థానంలో రష్యా రాజధాని మాస్కో నిలిచింది.
  • గత ఏడాది కాలంలో మాస్కోలో గృహాల ధరలు 11.1 శాతం వృద్ధి చెందాయి.
  • ఫ్రాంక్‌ఫర్ట్ రెండో స్థానంలో (ధరల్లో వృద్ధి 10.3 శాతం) నిలవగా.. తైపీ (8.9 శాతం) మూడో ర్యాంకు పొందింది.
  • సియోల్‌కు జాబితాలో ఆఖరి ర్యాంకు లభించింది. ఈ నగరంలో ఖరీదైన గృహాల ధరలు 12.9 శాతం పడిపోయాయి.
  • రెండో త్రైమాసికంతో పోలిస్తే దిల్లీ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 9వ స్థానానికి ఎగబాకింది.ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గృహాల ధరలు మూడో త్రైమాసికంలో సగటున 4.4 శాతం మేర పెరిగాయి.
  • బెంగళూరు ర్యాంకు 15 నుంచి 5 స్థానాలు తగ్గి 20కి దిగివచ్చింది.
  • ముంబయి 30వ స్థానం నుంచి రెండు స్థానాలు పెంచుకొని 28వ స్థానంలో నిలిచింది.
  • స్థానిక మార్కెట్లో రియల్టీ ధరల ఆధారంగా గ్లోబల్ సిటీ ఇండెక్స్‌లో ర్యాంక్‌లను కేటాయిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ లగ్జరీ మార్కెట్లో ఢిల్లీకి 9వ స్థానం
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : నైట్ ఫ్రాంక్-ప్రైమ్ గ్లోబల్ సిటీ ఇండెక్స్ 2019

బీపీసీఎల్‌లో వాటాల విక్రయానికి కేబినెట్ ఆమోదం
చమురు దిగ్గజం బీపీసీఎల్, షిప్పింగ్ సంస్థ ఎస్‌సీఐ, కార్గో సేవల సంస్థ కాన్‌కర్‌లో వాటాల విక్రయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను 51 శాతం లోపునకు తగ్గించుకునే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో నవంబర్ 20న జరిగిన సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 1.05 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది.
కేబినెట్ నిర్ణయాల్లో ముఖ్యాంశాలు
  • దేశీయంగా రెండో అతి పెద్ద రిఫైనర్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)లో కేంద్రం తనకున్న మొత్తం 53.29 శాతం వాటాలను విక్రయించడంతో పాటు యాజమాన్య అధికారాలను కూడా బదలాయించనుంది. ఇందులో నుమాలిగఢ్ రిఫైనరీని మినహాయిస్తారు.
  • కార్పొరేట్ ట్యాక్స్‌ను 22 శాతానికి తగ్గిస్తూ ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన ప్రత్యేక బిల్లుకు ఆమోదం.
  • షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్‌సీఐ)లో మొత్తం 63.75 శాతం వాటాలను.. అలాగే కంటెయినర్ కార్పొరేషన్(కాన్‌కర్)లో 30.9 శాతం వాటాలు ప్రభుత్వం విక్రయించనుంది. ప్రస్తుతం కాన్‌కర్‌లో కేంద్రానికి 54.80 శాతం వాటాలు ఉన్నాయి.
  • టీహెచ్‌డీసీ ఇండియా, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (నీప్‌కో)లో మొత్తం వాటాలను ఎన్‌టీపీసీకి కేంద్రం విక్రయించనుంది.
  • నియంత్రణ అధికారాలు తనకే ఉండే విధంగా.. ఇండియన్ ఆయిల్(ఐవోసీ)లో వాటాలను 51 శాతం లోపునకు కేంద్రం తగ్గించుకోనుంది.

శబరిమల ఆలయ నిర్వహణకు ప్రత్యేక చట్టం
ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు నవంబర్ 20న కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ చట్టంలో భక్తుల సంక్షేమానికి తీసుకోనున్న చర్యలనూ పొందుపర్చాలంది. 2020, జనవరి 3వ వారంలోగా ఆ చట్టాన్ని తమ ముందు పెట్టాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. శబరిమల సహా ప్రస్తుతం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో నడుస్తున్న దేవాలయాల నిర్వహణ నిమిత్తం రూపొందించిన బిల్లులో ఇప్పటికే కొన్ని సవరణలు చేశామని కేరళ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శబరిమల ఆలయ నిర్వహణకు ప్రత్యేక చట్టం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : సుప్రీంకోర్టు

ది చిట్‌ఫండ్స్ బిల్‌కు లోక్‌సభ ఆమోదం
చట్టబద్ధ చిట్‌ఫండ్స్ కంపెనీలకు సంబంధించిన ‘ది చిట్‌ఫండ్‌‌స (అమెండ్‌మెంట్)బిల్, 2019’కు నవంబర్ 20న లోక్‌సభ ఆమోదం తెలిపింది. చిట్స్ నిర్వహిస్తున్న వ్యక్తి తీసుకునే కమీషన్‌ను ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 7 శాతానికి పెంచుతూ ఈ బిల్లులో ప్రతిపాదన ఉంది. అలాగే చిట్ మొత్తాన్ని మూడు రెట్లు పెంచుకునే అవకాశం కూడా కల్పించారు. చిట్ అమౌంట్‌ను ఇకపై గ్రాస్ చిట్ అమౌంట్ అని, డివిడెండ్‌ను షేర్ ఆఫ్ డిస్కౌంట్ అని, ప్రైజ్ అమౌంట్‌ను నెట్ చిట్‌ఫండ్ అని పేర్కొనాలని బిల్లులో స్పష్టం చేశారు.
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ మాట్లాడుతూ.. చిట్‌ఫండ్స్ ను అనధికార, అనియంత్రిత డిపాజిట్ పథకాలు, లేదా పోంజీ స్కీమ్స్‌తో పోల్చకూడదని పేర్కొన్నారు. కనీస మొత్తం (బేస్ అమౌంట్) రూ. 100 అని పేర్కొన్న నిబంధనను తొలగిస్తూ ఆ కనీస మొత్తాన్ని నిర్ధారించే అవకాశాన్ని రాష్ట్రాలకు కల్పించినట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చిట్‌ఫండ్స్ (అమెండ్‌మెంట్)బిల్, 2019కు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : లోక్‌సభ

కర్ణాటకలో మహిళలకు నైట్‌షిఫ్ట్ అవకాశం
మహిళలు నైట్‌షిఫ్ట్‌లో (రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు) పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం నవంబర్ 20న ప్రకటన విడుదల చేసింది. పరిశ్రమల చట్టం కింద నమోదైన పరిశ్రమల్లో మహిళలు రాత్రిపూట పనిచేయవచ్చని తెలిపింది. అయితే దీనికి పలు నిబంధనలు పాటించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇష్టపూర్వకంగా పనిచేస్తున్నామని మహిళల నుంచి లేఖలు తీసుకోవాలని చెప్పింది. కనీసం 10 మంది మహిళా ఉద్యోగులు ఉండాలని, మహిళలు పనిచేసే చోట పూర్తి వెలుతురుతో పాటు సీసీకెమెరాల పర్యవేక్షణ ఉండాలని తెలిపింది. ఇప్పటివరకూ ఐటీ పరిశ్రమ, ఐటీ అనుబంధ విభాగాల్లో మాత్రమే మహిళల నైట్ షిఫ్ట్‌లకు అనుమతి ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పరిశ్రమల చట్టం కింద నమోదైన పరిశ్రమల్లో మహిళలు నైట్‌షిఫ్ట్‌లో పనిచేసేందుకు అవకాశం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : కర్ణాటక ప్రభుత్వం
ఎక్కడ : కర్ణాటక

దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ : హోం మంత్రి అమిత్ షా
దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నవంబర్ 20న రాజ్యసభలో ప్రకటించారు. ఈ జాబితా రూపకల్పనలో మతపరమైన వివక్షలు ఉండవన్నారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా అమిత్ షా మాట్లాడారు. ‘అస్సాం తరహాలో జాతీయ పౌర రిజిస్టర్‌ను దేశవ్యాప్తంగా తీసుకువస్తాం. ఏ మతం వారూ భయపడాల్సిన పని లేదు. ఎన్‌ఆర్‌సీ గొడుగు కిందకి అందరినీ తీసుకురావడమే దీని ఉద్దేశం. సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ సాగుతుంది’ అని అమిత్ షా అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) ప్రక్రియను ప్రారంభిస్తాం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : కేంద్ర హోం మంత్రి అమిత్ షా

అస్సాం ఎన్‌ఆర్‌సీపై యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ ఆందోళన
అస్సాంలో రూపొందించిన జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) ప్రక్రియపై అమెరికాకు చెందిన కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియతో భారత్‌లో ఏళ్ల తరబడి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న 19 లక్షల మంది పౌరసత్వాన్ని కోల్పోనున్నారని పేర్కొంది. సరైన నియంత్రణ , పారదర్శకత లేకుండా ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను చేపట్టడం వల్ల అసలు సిసలు భారతీయులకే దేశంలో చోటు లేకుండా ప్రమాదం ముంచుకొస్తోందని తన నివేదికలో పేర్కొంది. అస్సాంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని, వారిని రాష్ట్రం నుంచి పంపించేయడానికే ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను నిర్వహించారని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ కమిషనర్ అనురిమ భార్గవ ఆరోపించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అస్సాం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) ప్రక్రియపై ఆందోళన
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : అమెరికాకు చెందిన కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్)

జస్టిస్ ర్యాంకింగ్స్‌లో మహారాష్ట్రకు అగ్రస్థానం
Current Affairs
వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో టాటా ట్రస్ట్ రూపొందించిన ‘ఇండియా జస్టిస్’ ర్యాంకింగ్‌‌సలో 18 పెద్ద రాష్ట్రాల కేటగిరీలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణకు 11, ఆంధ్రప్రదేశ్ 13వ ర్యాంకులు దక్కగా... ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు అట్టడుగున నిలిచాయి. పౌరులకు న్యాయ సేవలు అందుతున్న తీరుకు అద్దం పట్టే ఈ నివేదికను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ నవంబర్ 7న ఆవిష్కరించారు.
నాలుగు కేటగిరీలుగా..
పోలీస్, ప్రిజన్స్, జ్యుడీషియరీ, లీగల్ ఎయిడ్ అనే నాలుగు కేటగిరీలకు వచ్చిన స్కోర్ల ఆధారంగా ఈ ర్యాంకు కేటాయించారు. బడ్జెట్, భిన్నత్వం, మానవ వనరులు, మౌలిక వసతులు, పని భారం తదితర అంశాల్లో మెరుగైన పనితీరుకు స్కోరు అందించారు. నాలుగు కేటగిరీల్లో వచ్చిన స్కోరు ఆధారంగా ర్యాంకు కేటాయించారు. ఇందుకోసం 2015-16, 2016-17, 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించిన డేటాను ఉపయోగించారు.
ఇండియా జస్టిస్ ర్యాంకింగ్స్

Current Affairs


క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘ఇండియా జస్టిస్’ ర్యాంకింగ్‌‌సలో అగ్రస్థానం
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : మహారాష్ట్ర
ఎక్కడ : దేశంలో

ధర్మశాలలో పెట్టుబడుల సదస్సు ప్రారంభం
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణకు ధర్మశాలలో ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 7 ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... పారదర్శకమైన, సులభతర వ్యాపార నిర్వహణకు అనుగుణంగా నిబంధనలు ఉండాలేకానీ, ఉచిత విద్యుత్తు, చౌకగా భూమి, పన్ను రాయితీలు కాదన్నారు. 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల (రూ.350 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్యంలో అన్ని రాష్ట్రాలు, జిల్లాల పాత్ర ఉంటుందన్నారు. పర్యాటకం, ఫార్మా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు హిమాచల్‌ప్రదేశ్‌కు ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ధర్మశాల పెట్టుబడుల సదస్సు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్
ఎందుకు : హిమాచల్ ప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణకు

2015-17 మాతా మరణాల నివేదిక విడుదల
2015-17 మధ్య భారతదేశంలో సంభవించిన మాతా మరణాల నివేదికను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం జాతీయ స్థాయిలో అత్యంత తక్కువగా కేరళలో ప్రతీ లక్ష మందిలో 42 మంది, మహారాష్ట్రలో 55, తమిళనాడులో 63, ఆంధ్రప్రదేశ్‌లో 74, తెలంగాణ, జార్ఖండ్‌లలో 76 మంది చొప్పున బాలింతలు మరణిస్తున్నారు. జాతీయ స్థాయిలో మాతా మరణాల రేటు 122 ఉండగా, దేశంలో అత్యధికంగా అస్సాంలో 229గా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో మరణాల రేటు 216గా ఉంది.
నివేదికలోని ముఖ్యాంశాలు

  • 2014-16 మధ్య తెలంగాణలో ప్రతీ లక్ష మందిలో 81 మంది బాలింతలు మరణించేవారు. ఆ సంఖ్య ఇప్పుడు 76కు తగ్గింది.
  • దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో మాత్రమే అత్యధికంగా 97 మరణాలు సంభవిస్తున్నాయి.
  • జార్ఖండ్‌లోనైతే 2014-16 మధ్య మాతా మరణాల రేటు 165 ఉంటే, ఈసారి ఏకంగా 76కు తగ్గడం విశేషం.
  • మధ్యప్రదేశ్‌లో గతంలో మాతృత్వపు మరణాల రేటు 173 ఉంటే, ఈసారి 188కు పెరిగింది.
  • ఉత్తరప్రదేశ్‌లో గతంలో మరణాల రేటు 201 ఉంటే, ఈసారి 216కు పెరిగింది.
ప్రతీ లక్ష మందిలో...
మాతా మరణాలను ప్రతీ లక్ష మందిలో ఎంతమంది బాలింతలు చనిపోయారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తారు. మాతా మరణాలను మూడు దశల్లో లెక్కిస్తారు. 15 నుంచి 49 ఏళ్లలోపు గర్భిణులను లెక్కలోకి తీసుకుంటారు. గర్భిణీగా ఉన్నప్పుడు సరైన ఆరోగ్య రక్షణ లేకపోవడం వల్ల సంభవించే మరణాలు, ప్రసవ సమయంలో సంభవించే మరణాలు, ఆ తర్వాత నెల లోపు జరిగే మరణాలను మాతా మరణాలుగా పరిగణిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2015-17 మాతా మరణాల నివేదిక విడుదల
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : కేంద్రప్రభుత్వం

అయోధ్య భూ వివాదంపై తుది తీర్పు
రాజకీయంగా అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సుప్రీంకోర్టు నవంబర్ 9న తుది తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించింది. వివాదాస్పద స్థలాన్ని అలహాబాద్ హైకోర్టు మూడు భాగాలుగా విభజించడం ఆమోదయోగ్యం కాదంది. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రంప్రభత్వం ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని ట్రస్ట్ ఆధీనంలో ఉంచాలని సూచింది. ఆలయ నిర్మాణం, ట్రస్ట్ విధి విధానాలపై 3 నెలల్లోగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
మసీదుకు ప్రత్యామ్నాయ స్థలం
మసీదు నిర్మాణానికి ముస్లింలకు అయోధ్యలోనే ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇందుకోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు 5ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించింది. 5 ఎకరాల స్థలం కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాలని ఆదేశించింది.
షియా బోర్డు పిటిషన్‌ను కొట్టివేత
వివాదాస్పద స్ధలం తమదేనంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం తోసిపుచ్చింది. నిర్మోహి అఖారాకు వారసత్వ హక్కులు క్లెయిమ్ చేసే హక్కు లేదని తేల్చిచెప్పింది.
ఏకగ్రీవ తీర్పు
జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం భిన్నాభిప్రాయాలకు తావు లేకుండా ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది. అయిదుగురూ న్యాయమూర్తులు ఈ తీర్పుకు ఆమోదం తెలిపారు. చరిత్ర, మతపరమైన, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించినట్టు జస్టిస్ గొగోయ్ స్పష్టం చేశారు.
జస్టిస్ గొగోయ్ తీర్పు వెలువరిస్తూ... ‘‘ప్రాథమిక విలువలు, మతసామరస్యాన్ని ప్రార్థనా మందిరాల చట్టం పరిరక్షిస్తుంది. ఇది వ్యక్తిగత హక్కుల కోసం దాఖలు చేసిన వ్యాజ్యం కాదు. మసీదు ఎవరు కట్టారో ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని హైకోర్టు చెప్పింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందింది. పురావస్తుశాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నాం. ప్రస్తుత కట్టడంలోని నిర్మాణం ఇస్లామిక్ శైలిలో లేదని పురావస్తు శాఖ తెలిపింది. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉంది. అయితే మందిరాన్ని కూల్చివేశారన్న ఆధారాలు మాత్రం లేవని పురావస్తు శాఖ నివేదిక పేర్కొంది. యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయసూత్రాల ప్రకారం నిర్ణయిస్తాం.’ అని వ్యాఖ్యానించారు.
రామజన్మభూమిగా అయోధ్య
‘‘అయోధ్యను హిందువులు రామజన్మభూమిగా భావిస్తారు. రాముడు అయోధ్యలోనే జన్మించాడన్నది నిర్వివాదాంశం. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారు. రెండు మతాల ప్రజలు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు చేసేవారు. రాముడు అయోధ్యలోనే జన్మించారని ముస్లిం వర్గాలు కూడా అంగీకరిస్తాయి. మొఘలుల సమయం నుంచే హక్కు ఉన్నట్లు వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోయింది. ప్రార్థనలు చేసినట్లు మాత్రమే ఆధారాలు సమర్పించింది.’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.
సుదీర్ఘంగా విచారణ
అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని రామ్‌లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడాలకు సమానంగా పంచుతూ 2010లో తీర్పును ప్రకటించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల 2019, ఆగస్టు 6 నుంచి రోజువారీ విచారణ మొదలుపెట్టింది. ఏకబిగిన 40 రోజుల పాటు విచారణ జరిపి, అక్టోబర్ 16న తీర్పును వాయిదా వేసింది. భారతదేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిన కేశవానంద భారతి కేసు విచారణ (68 రోజులు) తర్వాత అత్యంత సుదీర్ఘంగా విచారణ జరిగిన వ్యాజ్యంగా అయోధ్య కేసు రికార్డులకెక్కింది.

నేషనల్ డిజిటల్ హెల్త్ బ్లూప్రింట్ విడుదల
దేశవ్యాప్తంగా డిజిటల్ వైద్య సేవలను అందుబాటులోకి తేవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు వ్యవస్థను రూపొందించాలని భావిస్తుంది. తద్వారా ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారం ఒకే క్లిక్‌తో లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేస్తుంది. దీనివల్ల దేశంలోని ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారం ఒకేచోట నిక్షిప్తం చేసే అవకాశముంది. అందుకోసం నవంబర్ 10న ‘నేషనల్ డిజిటల్ హెల్త్ బ్లూప్రింట్’ను విడుదల చేసింది. ఈ బ్లూప్రింట్ నివేదికను ప్రజల అవగాహన కోసం అందుబాటులోకి తెచ్చింది.
జాతీయ ఆరోగ్య విధానం-2017 ప్రకారం అందరికీ ఆరోగ్యం అందించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడమే ఈ డిజిటల్ హెల్త్ ఉద్దేశమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. దీనివల్ల ఎవరైనా ఆస్పత్రికి వెళితే ఆన్‌లైన్‌లో వారు అంతకు ముందు పొందిన వైద్య చికిత్సలు, పరీక్షలు అన్నీ ప్రత్యక్షమవుతాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులు తమ వద్దకు వచ్చే రోగుల వివరాలను నేషనల్ డిజిటల్ హెల్త్ వ్యవస్థలో పొందుపరచాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేషనల్ డిజిటల్ హెల్త్ బ్లూప్రింట్ విడుదల
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ
ఎందుకు : దేశవ్యాప్తంగా డిజిటల్ వైద్య సేవలను అందుబాటులోకి తేవాలని

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం రోజులు గడిచినా.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడకపోవడంతో కేంద్రం నవంబర్ 12న రాష్ట్రపతి పాలన విధించింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదంటూ గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసింది. కేబినెట్ ప్రతిపాదనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు.
రంగంలోకి రాష్ట్రపతి ఎప్పుడొస్తారంటే...
రాజ్యాంగ బద్ధంగా రాష్ట్రంలో పరిపాలన సాగనప్పుడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి, నేరుగా ఆ రాష్ట్రాన్ని కేంద్రమే పరిపాలిస్తుంది. ఆ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం పాలనా యంత్రాంగాన్ని చేతుల్లోకి తీసుకుంటుంది. కేంద్రం నియమించిన గవర్నర్ నేతృత్వంలో పాలన సాగుతుంది. పాలనా విషయాల్లో తనకు సాయపడేందుకు అధికారులను సైతం నియమించుకునే హక్కు గవర్నర్‌కి ఉంటుంది. 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను రద్దుచేసి, రాష్ట్రపతి పాలన విధించారు. 1954లో ఉత్తరప్రదేశ్‌లో తొలిసారి ఆర్టికల్ 356ని ప్రయోగించారు. రాష్ట్రపతి పాలన విధించని రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మాత్రమే.
ఏఏ సందర్భాల్లో అవకాశముందంటే...
  • ఒక రాష్ట్ర శాసన సభ ఆ రాష్ట్ర గవర్నర్ నిర్దేశించిన సమయంలో సీఎంను ఎన్నుకోలేనప్పుడు.
  • సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి ముఖ్యమంత్రికి మైనారిటీ సభ్యుల మద్దతు మాత్రమే మిగిలినప్పుడు, గవర్నర్ ఇచ్చిన సమయంలో తిరిగి ప్రభుత్వ ఏర్పాటులో వైఫల్యం చెందినప్పుడు.
  • సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంలో మెజారిటీ సభ్యుల మద్దతు కోల్పోయినా రాష్ట్రపతి పాలనకు అవకాశం.
  • రాష్ట్రంలో యుద్ధపరిస్థితులు తలెత్తినప్పుడు, లేదా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎన్నికలు వాయిదా వేయాల్సిన సందర్భాల్లో కూడా అవకాశం ఉంది.
  • రాజ్యాంగ బద్దంగా రాష్ట్రంలో పాలన సాగడం లేదని గవర్నర్ రిపోర్టు ఇచ్చినప్పుడు కూడా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది.
ఎంతకాలం ఉండొచ్చు:
పార్లమెంటులోని రెండు సభలు ఆమోదిస్తే రాష్ట్రపతి పాలన ఆరునెలల పాటు కొనసాగించవచ్చు. ఆ తరువాత ఎన్నికల కమిషన్ తదుపరి ఎన్నికలను ఖరారు చేయొచ్చు. రాష్ట్రపతి పాలనను గరిష్టంగా మూడళ్ల వరకు కొనసాగించవచ్చు. అయితే ఈ కాలంలో ఆరు నెలలకోసారి పార్లమెంటు ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది.
ఎప్పుడు ఎత్తివేయొచ్చు :
పార్లమెంటు ఆమోదంతో పనిలేకుండా ఏ క్షణంలోనైనా రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే హక్కు రాష్ట్రపతికి ఉంటుంది.
సర్కారియా కమిషన్ ఏం చెప్పింది ?
రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలనను కొనసాగించడంలో అన్ని అవకాశాలూ మూసుకుపోయినప్పుడు, రాష్ట్రప్రభుత్వ పాలన కొనసాగింపునకు అన్ని ప్రత్యామ్నాయాలూ అంతరించి పోయినప్పుడు, తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే చిట్టచివరి ప్రయత్నంగా రాష్ట్రపతి పాలన విధించాలని 1983లో సర్కారియా కమిషన్ స్పష్టం చేసింది. డాక్టర్ అంబేద్కర్ సైతం రాష్ట్రపతి పాలనను ‘‘డెడ్ లెటర్’’అని (అతి తక్కువగా ఉపయోగించాలని) అభివర్ణించారు.
ముచ్చటగా మూడోసారి...
మహారాష్ట్రలో ఇప్పటిదాకా రెండుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. 1980, ఫిబ్రవరి 17న మొదటిసారి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. 1980లో శరద్‌పవార్‌కి మెజారిటీ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి, రాష్ట్రపతి పాలన విధించారు. ఫిబ్రవరి 17, 1980 నుంచి, 1980 జూన్ 8 వరకు అంటే 112 రోజుల పాటు అది కొనసాగింది. 2014లో సైతం మరోమారు మహారాష్ట్ర రాష్ట్రపతి పాలనను చవిచూడాల్సి వచ్చింది. సెప్టెంబర్ 28, 2014 నుంచి అక్టోబర్ 31, 2014 వరకు రాష్ట్రపతి పాలన విధించారు. అప్పుడు మొత్తం 33 రోజుల పాటు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: మహారాష్ట్రలో రాష్ట్రపతి’ పాలన విధించారు.
ఎప్పుడు: నవంబర్ 12, 2019
ఎవరు: రాష్ట్రపతి
ఎందుకు: ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం రోజులు గడిచినా.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడకపోవడంతో
ఎక్కడ: మహారాష్ట్ర

కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీం సంచలన తీర్పు
కర్ణాటక చెందిన 17మంది ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్‌కుమార్ విధించిన అనర్హత వేటును సమర్థిస్తూ సుప్రీంకోర్టు నవంబర్ 12న సంచలన తీర్పు వెలువరించింది. కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సుప్రీంకోర్టు సమర్థించినప్పటికీ.. వారిపై స్పీకర్ విధించిన అనర్హతకాలాన్ని కొట్టివేసింది. ప్రస్తుత అసెంబ్లీ కాలం 2023 సంవత్సరం ముగిసేవరకు అనర్హత ఎమ్మెల్యేలు పోటీ చేయరాదని స్పీకర్ నిబంధన విధించగా.. ఈ నిబంధనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో అనర్హతకు గురైన 17మంది ఎమ్మెల్యేలు రానున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.
ఆర్టికల్ 193ని చర్చించిన అనంతరం అనర్హత అంశంలో మేం ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. అనర్హత అనేది.. చర్య జరిగిన కాలానికి మాత్రమే వర్తిస్తుంది. ఒక వ్యక్తి కొంతకాలంపాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ ఆదేశాలు ఇచ్చే అధికారం స్పీకర్‌కు లేదు’ అని న్యాయస్థానం అభిప్రాయపడింది. స్పీకర్ విధించిన అనర్హత వేటును మేం సమర్థిస్తున్నాం. అయితే, అనర్హత కాలాన్ని మాత్రం కొట్టివేస్తున్నాం’ అని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఈ వ్యవహారంలో స్పీకర్ క్వాసీ జ్యుడీషియల్ ఆథారిటీగా వ్యవహరించారని, అయితే ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామా చేశారా, లేదా? అన్నది మాత్రమే స్పీకర్ పరిధిలోకి వస్తుందని, ఈ విషయంలో స్పీకర్ అధికార పరిధి పరిమితమని ధర్మాసనం అభిప్రాయపడింది.
గత జూలై నెలలో అప్పటి కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్ష సందర్భంగా కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలతోపాటు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం 17మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీనిపై సదరు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ కష్ణమురారీతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి.. అక్టోబర్ 25న తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కర్ణాటక చెందిన 17మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సమర్థిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ఎప్పుడు: నవంబర్ 12, 2019
ఎవరు: కర్ణాటక చెందిన 17మంది ఎమ్మెల్యేలు
ఎక్కడ: కర్ణాటక

ఆర్‌టీఐ పరిధిలోకి సీజేఐ’ కార్యాలయం: సుప్రీంకోర్టు
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం కూడా సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం పరిధిలోకి వస్తుందంటూ చరిత్రాత్మక ఆదేశాలు ఇచ్చింది. సీజేఐ కార్యాలయం కూడా ప్రభుత్వ సంస్థేనని, అది కూడా పారదర్శకత చట్టమైన ఆర్టీఐ కిందకు రావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించింది. అయితే, పారదర్శకత పేరిట న్యాయవ్యవస్థ స్వతంత్రను తక్కువ చేయలేరని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
సీజేఐ కార్యాలయం కూడా ఆర్‌టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, కోర్టుకు చెందిన కేంద్ర ప్రజా సమాచార అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపి...ఈ ఏడాది ఏప్రిల్ 4న తన తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా సభ్యులుగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం పరిధిలోకి ‘సీజేఐ’ కార్యాలయం
ఎప్పుడు: నవంబర్ 12, 2019
ఎందుకు: సీజేఐ కార్యాలయం కూడా ప్రభుత్వ సంస్థేనని, అది కూడా పారదర్శకత చట్టమైన ఆర్టీఐ కిందకు రావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో ఢిల్లీ ఫస్ట్ : సీపీసీబీ
వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో కోల్‌కతా ఉన్నట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) వెల్లడించింది. అత్యంత ఎక్కువగా వాయుకాలుష్యం ఉన్న నగరాలు/పట్టణాలను రెడ్ జోన్‌లో, సాధారణ స్థాయిలో వాయు కాలుష్యం ఉన్న నగరాలు/పట్టణాలను గ్రీన్ జోన్ పరిధిలో చేర్చి సీపీసీబీ ఓ జాబితా విడుదల చేసింది. వీటిలో మన భాగ్యనగరం హైదరాబాద్ గ్రీన్ జోన్ లో ఉంది.
ఎలా విస్తరిస్తోంది?
జాతీయ వాయు ప్రమాణాల సూచి ప్రకారం.. 2.5 మైక్రాన్ల పరిమాణంలో 40 మైక్రోగ్రాముల (గాలిలో క్యూబిక్ మీటర్ పరిధిలో ఉన్న దుమ్ముధూళిని మైక్రోగ్రామ్స్‌లో కొలుస్తారు) దుమ్ముకణాలు ఉండాలి. అయితే, హైదరాబాద్‌లో అది 50 మైక్రోగ్రాములుగా ఉన్నట్లు తేలింది. పది మైక్రాన్ల పరిణామంలో 60 మైక్రోగాములు ఉండాల్సి ఉండగా.. అది హైదరాబాద్‌లో 100 మైక్రోగ్రాములుగా ఉన్నట్టు వెల్లడైంది. అదే ఢిల్లీలో అయితే అది అత్యంత ప్రమాదకరంగా 700 నుంచి 994 మైక్రోగ్రాములు ఉన్నట్టు గుర్తించారు. ఇక హైదరాబాద్‌లో నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ సాధారణ స్థాయి కంటే 4 పాయింట్లు మాత్రమే అధికంగా ఉన్నట్టు తేలింది.
దక్షిణాది నగరాలన్నీ సేఫ్‌జోన్‌లోనే...
హైదరాబాద్ సహా దక్షిణాది నగరాలైన చెన్నై, ముంబై, బెంగళూరు నగరాలు ‘సేఫ్ జోన్’లో ఉన్నాయి. జాతీయ వాయు నాణ్యతా ప్రమాణాల కంటే కొంచెం అధికంగా మన రాష్ట్రంలో కాలుష్యం ఉన్నట్లు తేలడంతో ప్రభుత్వం ‘స్పెషల్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ’ని ఏర్పాటుచేసింది.
హైదరాబాద్ ఎందుకు సురక్షితం?
హిమాలయాలు సమీపంలో ఉండడం, విపరీతమైన చలిగాలులు పెరగడం, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు, కోతల తర్వాత వాటిని తగలబెట్టడం వంటి అంశాలే ఢిల్లీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణాలని గుర్తించారు. ఎత్తైన ప్రాంతంలోని హిమాలయాల నుంచి ధూళి, దుమ్ముకణాలు గాలిలో ఎక్కువ ఎత్తుకు వెళ్లకుండా విపరీతమైన చలి కారణంగా మార్గం మధ్యలోనే నిలిచిపోతాయి. వాటికి పరిశ్రమలు, వాహన కాలుష్యం తోడు కావడంతో విష వాయువులుగా మారుతున్నాయి. హైదరాబాద్‌లో దీనికి భిన్నమైన భౌగోళిక పరిస్థితులు ఉండటంతో ఢిల్లీ స్థాయిలో ఇక్కడ కాలుష్యం విస్తరించే అవకాశం లేదని చెబుతున్నారు. అయితే ట్రాఫిక్ పెరుగుదల, పరిశ్రమల కాలుష్య ఉద్గారాలు, రోడ్డుపై ధూళి, దుమ్ము విస్తరించడం, తదితర కారణాలతో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలంగాణ కాలుష్యనియంత్రణ మండలి ఉన్నతాధికారి ఒకరు సాక్షికి వెల్లడించారు.
సీపీసీబీ గణాంకాల ప్రకారం ఏ నగరాలు ఏ జోన్‌లో ఉన్నాయంటే...
రెడ్‌జోన్‌లో... ఘజియాబాద్, నోయిడా, ఢిల్లీ, ఫరీదాబాద్, భివాని, హిసార్, ఫతేహబాద్, గురుగ్రామ్, లక్నో, బహదుర్‌ఘర్, భటిండా, భీవాండి, హాపూర్, బులంద్‌షహర్, అంబాలా, అమృత్‌సర్, రోహతక్, పటౌడి, కాన్పూర్‌తోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు నగరాలు.
గ్రీన్‌జోన్‌లో... హైదరాబాద్, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, చెన్నై, బెంగళూరు, మైసూరు, కొచ్చి తదితర దక్షిణాది రాష్ట్రాల్లోని నగరాలు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానం
ఎందుకు: దేశంలో అత్యంత ఎక్కువగా వాయుకాలుష్యం ఉన్న నగరాలు
ఎక్కడ: ఢిల్లీ

అరేబియా సముద్రంలో మహా తుపాను
Current Affairs అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపానుకు ‘మహా’గా పేరు పెట్టారు. ఈ తుపాను లక్షదీవులకు ఉత్తర ఈశాన్య దిశగా 130 కి.మీ, కోజికోడ్‌కి పశ్చిమ వాయువ్య దిశగా 340 కి.మీ దూరంలో కొనసాగుతూ గంటకు 18 కి.మీ వేగంతో కదులుతోందని భారత వాతవరణ శాఖ(ఐఎండీ) అక్టోబర్ 31న వెల్లడించింది. తీవ్రరూపం దాల్చుతున్న మహా ప్రభావంతో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు, లక్షదీవులను వర్షాలు ముంచెత్తనున్నాయి.
మరోవైపు పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న క్యార్ తుపాను క్రమంగా బలహీనపడనుందని ఐఎండీ తెలిపింది. అరేబియా సముద్రంలో ఒకేసారి రెండు తుపాన్లు ఏర్పడటం అరుదు. 1965వ సంవత్సరం తర్వాత ఇప్పుడు మళ్లీ ఇలా ఒకేసారి రెండు తుపాన్లు ఏర్పడ్డాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అరేబియా సముద్రంలో మహా తుపాను
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : భారత వాతవరణ శాఖ(ఐఎండీ)
ఎక్కడ : లక్షదీవులకు ఉత్తర ఈశాన్య దిశగా 130 కి.మీ, కోజికోడ్‌కి పశ్చిమ వాయువ్య దిశగా 340 కి.మీ దూరంలో

వాట్సాప్ లో వ్యక్తిగత సమాచారం తస్కరణ
వాట్సాప్‌లో భారత్‌కు చెందిన జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని ‘పెగాసస్’అనే స్పైవేర్ సాయంతో గుర్తు తెలియని సంస్థలు దొంగిలించాయని వాట్సాప్ సంస్థ అక్టోబర్ 31న ప్రకటించింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 1,400 మందిని లక్ష్యంగా చేసుకుని సమాచార చోరీ జరిగిందని వెల్లడించింది. ఈ అంశానికి సంబంధించి ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో అనే నిఘా సంస్థపై అమెరికాలోని కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. భారత్‌లో బాధితుల వివరాలు తెలిపేందుకు వాట్సాప్ నిరాకరించింది.
తాజా వ్యవహారంతోపాటు, భారతీయ యూజర్ల వ్యక్తిగత సమాచార గోప్యతకు తీసుకుంటున్న చర్యలపై 2019, నవంబర్ 4లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని వాట్సాప్‌ను భారత ప్రభుత్వం ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల వాట్సాప్ వినియోగదారుల్లో భారత్‌లో 40 కోట్ల మంది ఉన్నారు. ఎన్‌ఎస్‌వో అనే నిఘా సంస్థ ‘పెగాసస్’ స్పైవేర్‌ను అభివృద్ధి చేసింది.

కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లదాఖ్
జమ్మూకశ్మీర్‌ను రెండుగా విభజించి, కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యస్థీకరణ చట్టం-2019’ భారత తొలి ఉపప్రధాని, తొలి హోం మంత్రి సర్దార్ పటేల్ 144వ జయంతి రోజైన 2019, అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్, పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతంగా లదాఖ్ అవతరించాయి. దీంతో దేశంలోని రాష్ట్రాల సంఖ్య 29 నుంచి 28కి తగ్గింది. అదే సమయంలో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 7 నుంచి 9కి పెరిగింది.
జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో పాటు ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ 2019, ఆగస్టు 5వ తేదీన కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ల ప్రమాణం
నూతనంగా అవతరించిన కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌కు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్‌జీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి గిరీశ్ చందర్ ముర్ము, లదాఖ్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి రాధాకృష్ణ మాథుర్ అక్టోబర్ 31న ప్రమాణం స్వీకారం చేశారు. లదాఖ్ రాజధాని లెహ్‌లో జరిగిన కార్యక్రమంలో రాధాకృష్ణ మాథుర్(ఆర్‌కే మాథుర్)తో జమ్మూకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్ ప్రమాణ స్వీకారం చేయించారు. నంతరం జస్టిస్ గీతా మిట్టల్ శ్రీనగర్ వెళ్లారు. అక్కడ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గిరీశ్ చందర్ ముర్ము(జీసీ ముర్ము)తో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు.
  • లదాఖ్ రాజధాని : లెహ్‌
  • జమ్మూకశ్మీర్ రాజధాని : శ్రీ నగర్‌(వేసవి), జమ్మూ (శీతాకాలం)
జమ్మూకశ్మీర్ అంశానికి సంబంధించిన మరిన్ని కథనాల కోసం ఇక్కడి లింక్‌లపై క్లిక్ చేయండి.
ఆర్టికల్ 370 రద్దుపై ప్రకటన
370వ అధికరణ రద్దుకు రాజ్యసభ ఆమోదం
ఆర్టికల్ 370 రద్దుకు పార్లమెంటు ఆమోదం
ఆర్టికల్ 370 రద్దుపై రాష్ట్రపతి ఉత్తర్వులు
ఆర్టికల్ 370 రద్దుపై ప్రధాని మోదీ ప్రసంగం
జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ బిల్లుకు ఆమోదం
దేశంలో అతిపెద్ద యూటీగా జమ్మూ కశ్మీర్
ఆర్టికల్ 370 పూర్వాపరాలు
జమ్మూకశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా గిరీశ్

చెన్నైలో ఎన్‌ఐఓటీ రజతోత్సవాలు ప్రారంభం

తమిళనాడు రాజధాని చెన్నైలోని జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధన సంస్థ (ఎన్‌ఐఓటీ) రజతోత్సవాలు నవంబర్ 3న ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఎన్‌ఐఓటీ రజతోత్సవ స్మారక స్టాంపును విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ... దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు ఎప్పటికప్పుడు మరింత సౌలభ్యాన్ని అందించేలా శాస్త్ర, సాంకేతిక పరిశోధనలపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టాలని సూచించారు. ఈ ఉత్సవాల్లో తమిళనాడు గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధన సంస్థ (ఎన్‌ఐఓటీ) రజతోత్సవాలు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
ఎక్కడ : చెన్నై, తమిళనాడు

జమ్మూకశ్మీర్, లదాఖ్‌ల కొత్త మ్యాప్ విడుదల
2019, అక్టోబర్ 31న కేంద్రపాలిత ప్రాంతాలుగా అవతరించిన జమ్మూకశ్మీర్, లదాఖ్‌ల కొత్త మ్యాప్‌ను కేంద్ర హోంశాఖ నవంబర్ 2న విడుదల చేసింది. ఇందులో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) జమ్మూకశ్మీర్‌లో ఉండగా, గిల్గిత్-బల్టిస్తాన్ లదాఖ్‌లో ఉంది. పీఓకేలోని ముజఫరాబాద్ భారత సరిహద్దుగా ఉంది. తాజా మ్యాప్ ప్రకారం లదాఖ్ రెండు జిల్లాలను (కార్గిల్, లేహ్) కలిగి ఉంది. పాత కశ్మీర్ రాష్ట్రంలో 14 జిల్లాలు ఉండగా, అందులోని లదాఖ్, లేహ్‌లను లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో చేర్చారు. ఇందులో కార్గిల్ జిల్లాను కొత్తగా ఏర్పాటు చేశారు. కార్గిల్‌తో కలిపి రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరో 14 జిల్లాలను అదనంగా ఏర్పాటు చేశారు. దీంతో రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 28 జిల్లాలు ఏర్పాటయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూకశ్మీర్, లదాఖ్‌ల కొత్త మ్యాప్ విడుదల
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : కేంద్ర హోంశాఖ
ఎందుకు : నూతన కేంద్రప్రాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లదాఖ్ అవతరించిన నేపథ్యంలో

ఓడల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం
ఇకపై ఓడల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించాలని డెరైక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నవంబర్ 3న నిర్ణయించింది. కేవలం మనదేశానికి చెందిన షిప్పులకు మాత్రమేగాక, ఇతర దేశ ఓడలు భారత జలాలపై తిరుగుతున్నపుడు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. భారత జలాల్లో ప్రవేశించే ముందే తమతో ఉన్న ప్లాస్టిక్ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. 10 లీటర్ల నీటి కంటే తక్కువ పట్టే ప్లాస్టిక్ బాటిళ్లను కూడా నిషేధించనున్నారు. సముద్ర జలాల్లో వీటి అవశేషాలే ఎక్కువగా ఉంటున్నాయని తేలిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఓడల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : డెరైక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్
ఎందుకు : సముద్ర జలాల్లో ప్లాస్టిక్ అవశేషాలు పెరుగుతున్నందున

ఇంటర్నెట్ స్పీడ్‌లో భారత్‌కు 128వ ర్యాంకు
మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో భారత్‌కు 128వ ర్యాంకు దక్కింది. అలాగే ఫిక్సిడ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లో భారత్ 72వ స్థానంలో నిలిచింది. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ విశ్లేషణ సంస్థ ఊక్లా.. 2019, సెప్టెంబర్ నెలకు గాను నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ప్రకారం అంతర్జాతీయంగా సగటు డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌లో దక్షిణ కొరియా అగ్రస్థానంలో ఉంది. భారత్ పొరుగు దేశాలైన శ్రీలంక 81వ ర్యాంకు, పాకిస్తాన్ 112వ స్థానం, నేపాల్ 119వ ర్యాంకుల్లో ఉన్నాయి. ద్వితీయ, తృతీయ త్రైమాసికాల్లో భారత్‌లో 11 పెద్ద నగరాల్లో ఎయిర్‌టెల్ వేగవంతమైన మొబైల్ నెట్ ఆపరేటరుగా అగ్రస్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో భారత్‌కు 128వ ర్యాంకు
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ విశ్లేషణ సంస్థ ఊక్లా
ఎక్కడ : ప్రపంచంలో

సుముద్ర మట్టాల పెరుగుదలతో భారత్‌కు ముప్పు
మావనవాళి మనుగడకు వాతావరణ మార్పులు అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. సుముద్ర మట్టాలు పెరగడం వల్ల జపాన్, చైనా, బంగ్లాదేశ్ సహా భారత్‌కు తీవ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050నాటికి 300మిలియన్ల మంది ప్రజలు వరద ముప్పు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియాన్ సదస్సుకు హాజరైన గుటెరస్ అక్కడి విలేకరులతో మాట్లాడుతూ నవంబర్ 4న ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ‘క్లైమేట్ సెంట్రల్’ అనే సైన్స్ ఆర్గనైజేషన్ తీర ప్రాంతాలపై పరిశోధనలు చేసి ‘నేచర్ కమ్యూనికేషన్స్’ పేరుతో ఇటీవల ఓ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ అధ్యయనం ప్రకారం.. సముద్ర మట్టాలు రోజురోజుకీ పెరుగుతుండటంతో 2050 నాటికి 150 మిలియన్ల ప్రజలు నివసిస్తున్న భూమి ‘హై టైడ్ లైన్’ కిందకు కుంగే ప్రమాదముంది. భారత ఆర్థిక రాజధాని ముంబైలో చాలా భాగం సముద్ర అలల దెబ్బకు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ప్రారంభం
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో నవంబర్ 5న ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్-2019 ప్రారంభమైంది. నవంబర్ 5 నుంచి 8వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘చంద్రయాన్-2’ విజయవంతమైన ప్రాజెక్టేనని, ఆ ప్రయోగం కారణంగా దేశ యువతకు సైన్స్ పట్ల ఆసక్తి పెరిగిందని మోదీ వ్యాఖ్యానించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల పాత్ర లేకుండా ఏ దేశం కూడా పురోగతి సాధించలేదన్నారు. సైన్స్ లో వైఫల్యం అనేది ఉండదని, అలుపెరగకుండా ప్రయోగాలు చేస్తూనే ఉండాలని వ్యాఖ్యానించారు. గతంలో అవసరాలే ఆవిష్కరణలకు దారితీసేవని భావించేవారు... కానీ ఇప్పుడు ఆవిష్కరణలు అవసరాల పరిధి దాటి విస్తరించాయన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్-2019 ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 5
ఎక్కడ : కోల్‌కతా, పశ్చిమబెంగాల్

మహిళల రక్షణపై నేతా యాప్ అధ్యయనం
పాలనలో ప్రజల భాగస్వామ్యానికి సంబంధించిన నేతా యాప్.. ‘భారత్‌లో మహిళల రక్షణ’ అనే అంశంపై అధ్యయనం నిర్వహించింది. లక్ష మంది మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో 42 శాతం మంది తాము సురక్షితంగా లేమనీ, లేదా అత్యంత అభద్రతలో జీవిస్తున్నామనీ తెలిపారు. ప్రధానంగా హరియాణా, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్‌ప్రదేశ్‌లలోని మహిళలు తాము ఎక్కువ అభద్రతకు లోనౌతున్నట్టు వెల్లడించారు. దేశం మొత్తంమీద చూస్తే మెట్రోనగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు కనీస భద్రతలేని ప్రాంతమని సర్వేలో వెల్లడయి్యంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో కేవలం 27 శాతం మంది మాత్రమే తాము సురక్షితంగా ఉన్నట్టు వెల్లడించారు.
నేతా యాప్ సర్వేలో వెల్లడైన అంశాలు మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో సంస్కరణల ఆవశ్యకతను, కఠినతరమైన చట్టాల అవసరాన్నీ నొక్కిచెపుతున్నాయని నేతా యాప్ వ్యవస్థాపకుడు ప్రథమ్ మిట్టల్ వ్యాఖ్యానించారు.
మహిళలు సురక్షితంగా ఉన్నామని భావిస్తోన్న రాష్ట్రాల ర్యాంకింగ్‌లు....

ర్యాంకు

రాష్ట్రం

1

హిమాచల్ ప్రదేశ్

2

త్రిపుర

3

కేరళ

4

ఆంధ్రప్రదేశ్

5

గుజరాత్

6

తమిళనాడు

7

రాజస్తాన్

8

ఉత్తరాఖండ్

9

కర్ణాటక

10

తెలంగాణ

11

ఒడిశా

12

మధ్యప్రదేశ్

13

పంజాబ్

14

అస్సాం

15

బిహార్

16

ఉత్తరప్రదేశ్

17

పశ్చిమబెంగాల్

18

జార్ఖండ్

19

ఢిల్లీ

20

మహారాష్ట్ర

21

ఛత్తీస్‌గఢ్

22

అరుణాచల్ ప్రదేశ్

23

హరియాణా



భూతాపంతో ఏటా 15 లక్షల మంది మృత్యువాత
భూతాపం వల్ల 2100 సంవత్సరం నుంచి భారతదేశంలో ఏటా 15 లక్షల మంది మృత్యువాత పడే అవకాశాలున్నాయని యూనివర్సిటీ ఆఫ్ షికాగోలోని టాటా సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్‌తో(టీసీడీ) కలిసి క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ 15 లక్షల మరణాల్లో 64 శాతం మరణాలు ఆరు రాష్ట్రాల్లోనే సంభవిస్తాయని తేలింది. ఉత్తరప్రదేశ్‌లో 4,02,280, బిహార్‌లో 1,36,372, రాజస్థాన్‌లో 1,21,809, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో(ఏపీ, తెలంగాణ) 1,16,920, మధ్యప్రదేశ్‌లో 1,08,370, మహారాష్ట్రలో 1,06,749 మరణాలు సంభవిస్తాయని బహిర్గతమైంది.
క్లైమేట్ ఇంపాక్ట్ అధ్యయనం-అంశాలు
  • ప్రస్తుతం భారత్‌లో సగటు వార్షిక ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్. 2100 నాటికి అది 28 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతుంది.
  • కొన్ని ప్రాంతాల్లో సగటు వార్షిక ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలు పెరిగి 32 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశాలున్నాయి.
  • 2019 సెప్టెంబర్‌లో గ్లోబల్ కార్బన్ డయాక్సైడ్ స్థాయి 408.55 పార్‌‌ట్స పర్ మిలియన్‌గా(పీపీఎం) నమోదైంది. ఇది 2040 నాటికి 540 పీపీఎంకు, 2100 నాటికి 940 పీపీఎంకు చేరుకోనుంది.
  • 2100 కల్లా ఆంధ్రప్రదేశ్‌లో సగటు వార్షిక ఉష్ణోగ్రతలు 4 శాతం పెరుగుతాయి.
  • సముద్ర తీరం వెంట మట్టి క్షయం తప్పదు. భారీగా తీరం కోతకు గురవుతుంది.
  • తీర ప్రాంతాలు తీవ్రమైన తుఫాన్ల బారినపడే అవకాశాలున్నాయి. సముద్ర నీటి మట్టాలు పెరుగుతాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2100 నుంచి ఏటా 15 లక్షల మంది మృత్యువాత
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : టాటా సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్(టీసీడీ)-క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్
ఎక్కడ : భారత్
ఎందుకు : భూతాపం వల్ల

నవంబర్ 26న పార్లమెంట్ ప్రత్యేక భేటీ
భారత రాజ్యాంగం ఆమోదం పొంది 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2019, నవంబర్ 26న పార్లమెంట్ ప్రత్యేకంగా భేటీ అవనుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఈ సమావేశానికి హాజరై ప్రసంగించనున్నారు. పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో పాటు, మాజీ రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు కూడా పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరవుతారు. పార్లమెంటు 50 సంవత్సరాల సందర్భాన్ని పురస్కరించుకుని 1997లో కూడా ఇటువంటి సభ జరిగింది. రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగ సభ ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019, నవంబర్ 26న పార్లమెంట్ ప్రత్యేక భేటీ
ఎప్పుడు : నవంబర్ 6
ఎక్కడ : పార్లమెంటు సెంట్రల్‌హాల్
ఎందుకు : భారత రాజ్యాంగం ఆమోదం పొంది 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా
Published date : 27 Nov 2019 04:27PM

Photo Stories