Central Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. రాజకీయ పార్టీలు.. చిన్న పిల్లలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదని ఆదేశించింది. పార్టీ అభ్యర్థికి సంబంధించిన పోస్టర్లు అంటించటం, కరపత్రాలు పంచటం, ఎన్నికల ర్యాలీల్లో నినాదాలు చేయించటం వంటి పనులకు చిన్న పిల్లలను వినియోగించరాదని పేర్కొంది. ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో చిన్న పిల్లలను భాగం చేస్తే సహించబోమని ఈసీ స్పష్టం చేసింది. రాజకీయ నేతలు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రచారంలో చిన్న పిల్లలను ఎత్తుకోవటం, ప్రచార వాహనాలపై పిల్లలను ఎక్కించటం, వారికి పార్టీ జెండాలు ఇచ్చి ప్రచారం చేయించటం వంటి చర్యలకు పాల్పడకూడదని ఆదేశించింది. ఎన్నికల దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు ఈసీ మార్గదర్శకాలను పాటించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌పేర్కొన్నారు.