Vice Presidential Candidates 2022: ఉపరాష్ట్రపతిగా అభ్యర్థులుగా జగదీప్, మార్గరెట్ ఆల్వా
అధికార ఎన్డీఏ, విపక్ష పార్టీల కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్డీఏ తమ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్, జాట్ నాయకుడు జగదీప్ ధన్ ఖడ్ (71)ను బరిలో దింపగా... విపక్షాలు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరెట్ అల్వా (80) ను పోటీలో నిలిపాయి.
Also read: Food Security Rankings: ‘ఆహార భద్రత’ అమలులో ఒడిశా నంబర్‌వన్
అనూహ్యంగా... ధన్ ఖడ్
ఎన్డీయే అభ్యర్థిగా అనూహ్యంగా జగదీప్ ధన్‌ఖడ్ పేరును బీజేపీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. హరియాణా, రాజస్తాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కీలక సామజికవర్గమైన జాట్ల మద్దతు కూడగట్టడానికి ఆయనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వ్యవసాయదారులైన జాట్లు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు.
Also read: Gotabaya Rajapaksa : శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్స రాజీనామా.. కారణం ఇదే..?
అంచలంచెలుగా ఎదుగుతూ...
జగదీప్ ధన్‌ఖడ్ 1951 మే 18న రాజస్తాన్‌లోని ఝున్‌ఝున్ జిల్లాలో మారుమూల కిథానా గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చీత్తోర్‌గఢ్ సైనిక్ స్కూల్‌లో పాఠశాల విద్య అభ్యసించారు. జైపూర్‌లోని మహారాజా కాలేజీలో ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ రాజస్తాన్ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. రాజస్తాన్‌లో ప్రముఖ లాయర్‌గా గుర్తింపు పొందారు. రాజస్తాన్ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులోనూ లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. తర్వాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో ఝున్‌ఝున్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 1990లో చంద్రశేఖర్ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1993లో రాజస్తాన్‌లో అజీ్మర్ జిల్లాలోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 జూలైలో పశి్చమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో అనేక విషయాల్లో ధన్‌ఖఢ్ విభేదించినట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు భార్య సుదేశ్ ధన్‌ఖడ్, ఓ కుమార్తె ఉన్నారు.
Also read: U.K. Leadership: బ్రిటన్ ప్రధాని రేసులో ముందున్న రిషి
మార్గరెట్ అల్వా.. సుదీర్ఘ రాజకీయ జీవితం
జూలై 17న ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ నివాసంలో జరిగిన 17 పార్టీల భేటీలో విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వాను బరిలో దించాలని నిర్ణయించారు. భేటీకి రాని తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జేఎంఎం కూడా అల్వాకే మద్దతిస్తుందని వివరించారు. మల్లికార్జున ఖర్గే, జైరాం రమేశ్ (కాంగ్రెస్), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), సంజయ్ రౌత్ (శివసేన), కె.కేశవరావు (టీఆర్‌ఎస్), టీఆర్ బాలు (డీఎంకే), రాంగోపాల్ యాదవ్ (ఎస్పీ), వైగో (ఎండీఎంకే), ఏడీ సింగ్ (ఆర్జేడీ), మహ్మద్‌బార్ (ఐఎంయూఎల్), జోస్ కె.మణి (కేరళ కాంగ్రెస్–ఎం) భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలైన శివసేన, జేఎంఎం రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకు మద్దతు ప్రకటించడం తెలిసిందే.
Also read: Weekly Current Affairs (Economy) Bitbank: భారతదేశపు మొట్టమొదటి దంత ఆరోగ్య బీమా పథకాన్ని ఏ బీమా కంపెనీ ప్రారంభించింది?
సుదీర్ఘ రాజకీయ జీవితం
విపక్షాల నిర్ణయాన్ని సవినయంగా అంగీకరిస్తున్నట్టు అల్వా ట్వీట్ చేశారు. తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలన్నారు. అల్వా 1942 ఏప్రిల్ 14న కర్ణాటకలోని మంగళూరులో పుట్టారు. విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించారు. కేంద్రంలో పలు మంత్రి పదవులు నిర్వహించడంతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా చేశారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికలో తలపడుతున్న ధన్‌ఖడ్, అల్వా మధ్య ఎన్నో పోలికలున్నాయి. ఇద్దరూ కేంద్ర మంత్రులుగా, గవర్నర్లుగా పని చేశారు. ఇద్దరికీ కాంగ్రెస్ నేపథ్యముంది. ఇద్దరూ లా పట్టభద్రులే. ఒక్కసారి మాత్రమే లోక్‌సభకు ఎన్నికయ్యారు. ధన్‌ఖడ్ బీజేపీలో చేరకముందు జనతాదళ్, కాంగ్రెస్‌ల్లో పని చేశారు.
Also read: GST: ఐదేళ్లుగా దేశమంతా ఒకే మార్కెట్
ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇలా..
కొత్త ఉప రాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభలో ఎన్నికైన, నామినేటెడ్ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఉప రాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి ఎన్నిక విషయానికొస్తే నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో రాష్ట్రాలకు ఎలాంటి పాత్ర ఉండదు. పార్లమెంట్ ఉభయ సభల్లోని సభ్యులంతా కలిసి ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఒక్కో ఎంపీ ఓటు విలువ ఒకటి. అందరి ఓటు విలువ సమానమే. ప్రస్తుతం పార్లమెంట్‌లో మొత్తం ఎంపీల సంఖ్య 780. బీజేపీకి సొంతంగానే 394 మంది ఎంపీలున్నారు. మెజారిటీ (390) కంటే అధికంగా ఉన్నారు. ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ విజయం నల్లేరు మీద నడకేనని చెప్పొచ్చు. నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 19 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 6వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తారు.
Also read: World population Day: 2022 నవంబర్ 15 నాటికి 800 కోట్లకి ప్రపంచ జనాభా