Skip to main content

CJI Chandrachud: పౌర హక్కులకు మేమే సంరక్షకులం.. జస్టిస్‌ చంద్రచూడ్‌

దేశంలో పౌరుల స్వేచ్ఛ తదితర హక్కులకు న్యాయస్థానాలే శ్రీరామరక్ష అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్ అన్నారు.

ప్రజలు కూడా ఈ విషయంలో న్యాయవ్యవస్థపైనే అపారమైన నమ్మకం పెట్టుకున్నారని స్పష్టం చేశారు. డిసెంబ‌ర్ 17న‌ బాంబే బార్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జస్టిస్‌ అశోక్‌ హెచ్‌.దేశాయ్‌ స్మారకోపన్యాసం చేశారు. దేశంలో స్వేచ్ఛా దీపిక నేటికీ సమున్నతంగా వెలుగుతోందంటే దాని వెనక ఎందరో గొప్ప న్యాయవాదుల జీవితకాల కృషి దాగి ఉందన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన మనోగతాన్ని కుండబద్దలు కొట్టారు.
‘‘ఏ కేసూ చిన్నది కాదు, పెద్దదీ కాదు. నిన్న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన ఒక సామాన్య కేసే ఇందుకు తాజా ఉదాహరణ. విద్యుత్‌ పరికరాల దొంగతనం కేసులో యూపీకి చెందిన ఒక వ్యక్తికి ట్రయల్‌ కోర్టు తొమ్మిది కేసుల్లో రెండేసి సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధించింది. కానీ అది ఏకకాలంలో, అంటే రెండేళ్లలోనే పూర్తి కావాలని స్పష్టమైన ఆదేశాలివ్వడం మర్చిపోయింది. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ తప్పిదాన్ని సరిదిద్దాల్సి వచ్చింది. లేదంటే చిన్న దొంగతనం కేసులో దోషి ఏకంగా 18 ఏళ్ల జైల్లో మగ్గాల్సి వచ్చేది. అందుకే మరోసారి చెప్తున్నా. జిల్లా కోర్టు మొదలుకుని హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా ఏ కోర్టుకైనా చిన్న కేసు, పెద్ద కేసు అని విడిగా ఏమీ ఉండవు. అన్ని కేసులూ ముఖ్యమైనవే’’ అన్నారు. పౌర హక్కుల్ని అంతిమంగా న్యాయవ్యవస్థే పరిరక్షిస్తుందని ఈ కేసుతో మరోసారి తేటతెల్లమైందని అభిప్రాయపడ్డారు. సదరు కేసులో అలహాబాద్‌ హైకోర్టు కూడా ట్రయల్‌ కోర్టు తీర్పునే సమర్థించింది. 

 

Published date : 19 Dec 2022 05:15PM

Photo Stories