ఏప్రిల్ 2019 జాతీయం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) కుట్ర వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏప్రిల్ 25న సుప్రీంకోర్టు నియమించింది. సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్‌తోపాటు, న్యాయమూర్తులపై భారీ కుట్ర జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏకసభ్య కమిటీకి సీజేఐ అనుచిత ప్రవర్తన ఆరోపణలతో ఎటువంటి సంబంధం లేదని కోర్టు స్పష్టం చేసింది. సీజేఐతో రాజీనామా చేయించేందుకు, ఇతర న్యాయమూర్తులను ప్రలోభాలకు గురిచేసి, తీర్పులను ప్రభావితం చేసేందుకు భారీ కుట్ర జరుగుతోందంటూ న్యాయవాది ఉత్సవ్ సింగ్ బైన్స్ అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
త్రిసభ్య కమిటీ నుంచి తప్పకున్న జస్టిస్ రమణ
సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తునకు నియమించిన కమిటీ నుంచి జస్టిస్ ఎన్‌వీ రమణ తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన సీజేఐకు సుదీర్ఘ లేఖ రాశారు. దీంతో ఆయన స్థానంలో జస్టిస్ ఇందూ మల్హోత్రాను నియమిస్తూ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి జస్టిస్ బాబ్డే నేతృత్వం వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీజేఐ కుట్ర వ్యవహారంపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీ
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : సుప్రీంకోర్టు
సీసీఎంబీలో కణ పరిశోధన కేంద్రం ఏర్పాటు
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్‌లో ఏప్రిల్ 25న కణాధారిత మాంసం తయారీ పరిశోధన కేంద్రం ఏర్పాటైంది. కణాధారిత మాంసాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర బయో టెక్నాలజీ విభాగం రూ.4.5 కోట్ల నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. కణాధారిత మాంసం అభివృద్ధిపై జాతీయ మాంసం పరిశోధన సంస్థ, హ్యూమనీ సొసైటీతో కలిసి సీసీఎంబీ పరిశోధనలు చేస్తోందని వివరించారు. ఈ మేరకు సీసీఎంబీ, హ్యూమనీ సొసైటీ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరిందని వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కణాధారిత మాంసం తయారీ పరిశోధన కేంద్రం ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎక్కడ : అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)
బ్యాంకుల వివరాలు ఇవ్వాల్సిందే : సుప్రీంకోర్టు
చట్టపరమైన మినహాయింపులుంటే తప్ప బ్యాంకుల వార్షిక తనిఖీల నివేదికల వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద ఇచ్చి తీరాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్‌కు సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ఇందుకోసం సంబంధిత విధానాలను పునఃసమీక్షించాలని సూచించింది. ఆర్‌టీఐ చట్టానికి అనుగుణంగా నడుచుకునేందుకు ఆఖరు అవకాశం ఇస్తున్నట్లు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు సారథ్యంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఆర్‌బీఐపై ఆర్‌టీఐ కార్యకర్త ఎస్‌సీ అగ్రవాల్ వేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్‌పై విచారణలో భాగంగా న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్యాంకుల వార్షిక తనిఖీల నివేదికల వివరాలను ఆర్‌టీఐ కింద ఇవ్వాలి
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : సుప్రీంకోర్టు
తీవ్ర తుపానుగా ఫొని
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫొని తుపాను ఏప్రిల్ 29 తీవ్ర తుపానుగా మారింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఉత్తర కోస్తాంధ్ర తీరం సమీపం నుంచి ఒడిశా వైపు ఈ తుపాను దూసుకెళ్తోంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 770, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మే ఒకటో తేదీ వరకు వాయవ్య దిశగా పయనిస్తూ పెను తుపాను (సూపర్ సైక్లోన్)గా బలపడనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తీవ్ర తుపానుగా ఫొని
ఎప్పుడు : ఏప్రిల్ 29
ఎక్కడ : ఆగ్నేయ బంగాళాఖాతం
సైనిక వ్యయంలో భారత్ నాలుగోస్థానం
సైనిక వ్యయంలో భారత్ ప్రపంచంలో నాలుగోస్థానంలో ఉందని స్టాకహోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌ఐపీఆర్‌ఐ) తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 30న ఒక నివేదికను విడుదల చేసింది. అమెరికా, చైనా, సౌదీ అరేబియాల తరువాతి స్థానాలలో భారత్ ఉందని ఎస్‌ఐపీఆర్‌ఐ పేర్కొంది. 2018 నాటికి మొత్తం ప్రపంచ సైనిక వ్యయం 1,822 డాలర్లకు చేరుకోగా, 2017తో పోల్చుకుంటే 2.6 శాతం పెరిగిందని తెలిపింది. 2018లో అమెరికా సైనిక వ్యయం 649 బిలియన్ డాలర్లకు పెరిగిందని వివరించింది. అదేవిధంగా భారత్ వ్యయం 3.1 శాతం పెరిగి 66.5 బిలియన్‌లకు (4.63 లక్షల కోట్లు) చేరుకోగా, పాకిస్తాన్ వ్యయం 11 శాతం పెరిగి 11.4 బిలియన్‌లకు చేరుకుందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సైనిక వ్యయంలో భారత్ నాలుగోస్థానం
ఎప్పుడు : ఏప్రిల్ 30
ఎవరు : స్టాకహోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌ఐపీఆర్‌ఐ)
ఎక్కడ : ప్రపంచంలో
వాయుసేన వ్యూహాత్మక ప్రణాళిక ఆమోదం
భారతదేశ తూర్పుతీరంలో ఆంధ్రప్రదేశ్‌ను వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దేందకు రూపొందించిన వ్యూహాత్మక ప్రణాళికను భారత వాయుసేన ఉన్నతస్థాయి కమిటీ మే 1న ఆమోదించింది. ఈ ప్రణాళిక ప్రకారం విపత్తు నిర్వహణ, నిఘా, రక్షణ అవసరాల కోసం ఏపీలోని విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో యుద్ధవిమానాల బేస్‌క్యాంప్‌లు ఏర్పాటుచేస్తారు. ప్రస్తుతం దేశ తూర్పు తీరంలో చెన్నై సమీపంలోని అరక్కోణంలో వైమానిక దళ స్థావరం ఉంది. ఇప్పటికే విశాఖపట్నంలో భారత నావికాదళ వ్యూహాత్మక కేంద్రం ‘ఐఎన్‌ఎస్ డేగా’ ఉంది.
మరోవైపు యుద్ధవిమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా విజయవాడ- రాజమండ్రి మధ్య ఉన్న జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలని రెండేళ్ల క్రితమే వాయుసేన నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆగ్రా-లక్నో జాతీయరహదారిని అదే విధంగా యుద్ధ విమానాలు అత్యవసర ల్యాండింగ్‌కు వీలుగా అభివృద్ధి చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వాయుసేన వ్యూహాత్మక ప్రణాళిక ఆమోదం
ఎప్పుడు : మే 1
ఎవరు : భారత వాయుసేన ఉన్నతస్థాయి కమిటీ
మహారాష్ట్రలో మావోయిస్టుల దాడి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కుర్ఖేదా ప్రాంతంలోని లెన్ధారీ వద్ద మే 1న పోలీసుల వాహనం లక్ష్యంగా మావోయిస్టులు దాడి చేశారు. ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర పోలీస్ విభాగం క్విక్ రెస్పాన్స్ టీం(క్యూఆర్టీ) యూనిట్‌కు చెందిన 15 మంది కమాండోలతో పాటు ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. కూంబింగ్‌కు బయలుదేరిన పోలీసుల వాహనం లక్ష్యంగా శక్తిమంతమైన ఐఈడీ మందుపాతరను మావోలు పేల్చారు. అనంతరం విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
గడ్చిరోలి జిల్లాలోని దాదర్‌పూర్ గ్రామ సమీపంలో 136వ జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 1న అక్కడికి చేరుకున్న మావోలు రోడ్డు నిర్మాణ పనులకు వాడుతున్న 36 వాహనాలకు నిప్పంటించారు. ఈ సమాచారం అందుకున్న క్యూఆర్టీ కమాండోల బృందం కూంబింగ్‌కు బయలుదేరింది. ఈ సమయంలో మావోలు పోలీసుల వాహనంపై దాడి చేశారు. మే 1నే మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మావోయిస్టుల దాడిలో 15 మంది పోలీసులతో పాటు ఓ డ్రైవర్ మృతి
ఎప్పుడు : మే 1
ఎక్కడ : లెన్ధారీ, కుర్ఖేదా, గడ్చిరోలి, మహారాష్ట్ర
పత్రికా స్వేచ్ఛలో భారత్‌కు 140వ ర్యాంకు
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ - 2019లో భారత్‌కు 140వ ర్యాంకు దక్కింది. పారిస్ కేంద్రంగా పనిచేసే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ 180 దేశాలతో రూపొందించిన ఈ సూచీని ఏప్రిల్ 18న విడుదల చేసింది. భారత్‌లో పాత్రికేయులపై పోలీసులు, మావోయిస్టులు, నేర ముఠాలు, అవినీతి రాజకీయ నాయకులు హింసాత్మక దాడులకు పాల్పడటం, వారిని బెదిరించటం వంటివి చేస్తున్నారని ఆర్‌ఎస్‌ఎఫ్ తెలిపింది. ఇలాంటి దాడుల వల్ల 2018లో ఆరుగురు జర్నలిస్టులు చనిపోయారని పేర్కొంది. పత్రికా స్వేచ్ఛ సూచీలో 2018లో భారత్‌కు 138వ ర్యాంకు దక్కగా తాజాగా 140వ స్థానానికి చేరింది.
ఆర్‌ఎస్‌ఎఫ్ విడుదల చేసిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో నార్వే మూడోసారి తొలి ర్యాంకు సాధించింది. ఆ తర్వాత ఫిన్లాండ్, స్వీడన్, నెదర్లాండ్‌స వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. భారత్‌కు పొరుగు దేశాలైన పాకిస్తాన్ 142వ ర్యాంకు, బంగ్లాదేశ్ 150వ ర్యాంకు ర్యాంకు పొందాయి. ఆఫ్రికా దేశాలైన ఇథియోపియా 110వ ర్యాంకును, గాంబియా 92వ ర్యాంకును పొందాయి. సూచీ చిట్టచివరన తుర్క్‌మెనిస్తాన్ (180వ ర్యాంకు), ఉత్తర కొరియా (179), చైనా (177), వియత్నా (176) ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ - 2019లో భారత్‌కు 140వ ర్యాంకు
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్)
మానసిక రుగ్మతలుంటే మరణశిక్ష వద్దు
మరణశిక్ష పడ్డ నిందితులు దానిని అమలు చేసేలోగా తీవ్రమైన మానసిక రుగ్మతలకు లోనయితే వారిని ఉరి తీయకూడదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 1999లో మహారాష్ట్రలో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేసి, హతమార్చిన వ్యక్తికి ఉరిశిక్ష పడగా, ప్రస్తుతం అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఈమేరకు తీర్పు చెప్పింది. జస్టిస్ ఎన్.వి.రమణ ఆధ్వర్యంలోని జస్టిస్ శంతనగౌండర్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏప్రిల్ 18న ఈ తీర్పును వెలువరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మానసిక రుగ్మతలుంటే మరణశిక్ష వద్దు
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : సుప్రీంకోర్టు
అంతర్జాతీయ ఫ్లీట్‌కు భారత నౌకలు
చైనా తీరంలో 2019, ఏప్రిల్ 21న ప్రారంభంకానున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ కోల్‌కతా, ఐఎన్‌ఎస్ శక్తి నౌకలు పాల్గొననన్నాయి. ఈ మేరకు భారత నౌకలు ఏప్రిల్ 22న జరిగే సెయిలింగ్‌లో పాల్గొంటాయని భారత నావికాదళం వెల్లడించింది. ఏప్రిల్ 23న జరిగే కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పాల్గొననున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొననున్న ఐఎన్‌ఎస్ కోల్‌కతా, ఐఎన్‌ఎస్ శక్తి నౌకలు
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎక్కడ : చైనా
సీజేఐ కార్యాలయంపై కుట్ర : జస్టిస్ గొగోయ్
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) కార్యాలయాన్ని అస్థిరపరిచేందుకు ఓ బలీయమైన శక్తి కుట్ర పన్నుతోందని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ఏప్రిల్ 20న ఆరోపించారు. జస్టిస్ గొగోయ్ తనను లైంగికంగా వేధించారంటూ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్(జేసీఏ)గా పనిచేసిన ఓ మహిళ(35) 22 మంది సుప్రీంకోర్టు జడ్జీలకు లేఖ రాయడంపై ఆయన ఈ మేరకు స్పందించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో తన సారథ్యంలో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటుచేసిన గొగోయ్.. అత్యవసరంగా విచారణను చేపట్టారు. ఈ కేసులో ఉత్తర్వులు ఇచ్చే అధికారాన్ని సీనియర్ జడ్జి జస్టిస్ మిశ్రాకు వదిలిపెడుతున్నానని, ఇందులో నేను భాగం కాబోనని సీజేఐ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీజేఐ కార్యాలయంపై కుట్ర
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్
కరుప్పు స్వామి ఆలయంలో తొక్కిసలాట
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తురయూరు వండితురై కరుప్పు స్వామి ఆలయంలో ఏప్రిల్ 21న తొక్కిసలాట జరిగింది. చిత్ర పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా పిడి కాసుల పంపిణీలో తొక్కిసలాటతో ఏడుగురు మృతిచెందారు. చివరి రోజున పిడి కాసుల్ని(పిడికిలి నిండా చిల్లర)ను ఆలయ పూజారి పంపిణీ చేయడం ఆనవాయితీ. పిడి కాసుల పంపిణీ కార్యక్రమానికి పదిహేను జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా పోటెత్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వండితురై కరుప్పు స్వామి ఆలయంలో తొక్కిసలాట
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎక్కడ : తురయూరు, తిరుచ్చి జిల్లా, తమిళనాడు
బిల్కిస్ బానోకు 50 లక్షల పరిహారం
2002లో గుజరాత్‌లో గోద్రా అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానోకు రూ.50 లక్షల పరిహారం, ఉద్యోగం, వసతి కల్పించాలని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విషయంలో నిర్లక్ష్యం చూపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆ అధికారులకు పెన్షన్ ప్రయోజనాలు నిలిపివేయాలని.. బాంబే హైకోర్టు దోషిగా తేల్చిన ఐపీఎస్ అధికారికి రెండు ర్యాంకులు తగ్గించాలని (డిమోట్) వెల్లడించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 23న ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఆనాడు ఏం జరిగింది?
గోద్రా అల్లర్ల సమయంలో 2002 మార్చి 3న అహ్మదాబాద్ దగ్గర్లోని రాధికాపూర్‌లో బానోపై గ్యాంగ్‌రేప్ జరిగింది. ఆమె కుటుంబసభ్యులు 14 మందిని అత్యంత పాశవికంగా హతమార్చారు. మృతుల్లో ఆమె తల్లి, రెండేళ్ల కూతురు ఉన్నారు. ఘటన జరిగినపుడు బానో 5నెలల గర్భిణి. అప్పటినుంచి న్యాయం కోసం పోరాడుతోంది. బానోకు పరిహారంగా రూ.5 లక్షలు ఇవ్వాలన్న గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమె తిరస్కరించి, సుప్రీంకోర్టులో కేసువేసింది. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు పోలీసు అధికారులు, ఓ ప్రభుత్వ డాక్టరు సహా 19 మందిపై అభియోగాలు నమోదయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బిల్కిస్ బానోకు 50 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : సుప్రీంకోర్టు
సీజేఐ వివాదం విచారణకు కమిటీ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. ఈ కమిటీకి అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వం వహించనుండగా, జస్టిస్ ఎన్‌వీ రమణ, మహిళా జడ్జి జస్టిస్ ఇందిరా బెనర్జీ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. ఈ విచారణ అంతర్గతంగా చేపడతామని జస్టిస్ బాబ్డే తె లిపారు. ఇందులో వాది, ప్రతివాది తరఫున న్యాయవాదులు ఉండరని, విచారణ ప్రక్రియ ముగింపునకు నిర్ణీత గడువు లేదని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీజేఐ వివాదం విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీ
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీ
జలియన్‌వాలా బాగ్ స్మారక నాణెం విడుదల
జలియన్‌వాలా బాగ్ మారణకాండ జరిగి 2019, ఏప్రిల్ 13నాటికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా రూపొందించిన రూ. 100 స్మారక నాణెం, తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. 1919 ఏప్రిల్ 13న సిక్కుల ముఖ్య పండుగ వైశాఖీ సందర్భంగా అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌కు వేలాదిగా ప్రజలు చేరుకున్నారు. ఈ సందర్భంగా కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ ఆధ్వర్యంలో బ్రిటిష్ ఇండియన్ సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 379 మంది చనిపోగా, 1200 మంది గాయపడ్డారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జలియన్‌వాలా బాగ్ రూ. 100 స్మారక నాణెం విడుదల
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : జలియన్‌వాలా బాగ్, అమృత్‌సర్, పంజాబ్
తీర గస్తీనౌక ఐసీజీఎస్ వీర ప్రారంభం
భారత తీర రక్షక దళానికి చెందిన అధునాతన తీర గస్తీ నౌక ‘ఐసీజీఎస్ వీర’ను భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ విశాఖలోని నావల్ డాక్‌యార్డ్‌లో ఏప్రిల్ 15న ప్రారంభించారు. ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించిన ఈ గస్తీనౌక 98 మీటర్ల పొడవు, 2200 టన్నుల బరువు కలిగి, గంటకు 26 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. ఐసీజీఎస్ వీర కమాండింగ్ అధికారిగా కమాండెంట్ గిరీశ్ దత్ రాతూరి బాధ్యతలు స్వీకరించారు.
ఐసీజీఎస్ వీర ప్రారంభం సందర్భంగా రావత్ మాట్లాడుతూ... ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద తీర భద్రతా దళంగా భారత్ ఆవిర్భవించిందని చెప్పారు. దేశానికి సమర్థవంతమైన తీర భద్రత ఉన్నప్పుడే జాతీయ భద్రత సంపూర్ణంగా ఉన్నట్లని పేర్కొన్నారు. భారత సైన్యం, తీర రక్షక దళాలు సంయుక్తంగా విన్యాసాలు చేయాల్సిన అవసరం ఉందని, ఇరు విభాగాలు సంయుక్తంగా శిక్షణ పొందితే శత్రువులపై ఉమ్మడిగా పోరాడటానికి అవకాశముంటుందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తీర గస్తీనౌక ఐసీజీఎస్ వీర ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్
ఎక్కడ : విశాఖలోని నావల్ డాక్‌యార్డ్, ఆంధ్రప్రదేశ్
కేంద్ర విద్యా సంస్థల్లో కొత్తగా 2 లక్షల సీట్లు
దేశంలోని 158 కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో 2,14,766 సీట్లను కొత్తగా సృష్టించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఏప్రిల్ 15న ఆమోదం తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో మార్పులు చేయకుండానే అగ్రవర్ణాల్లోని పేదలకూ రిజర్వేషన్ కల్పించేలా కేంద్రం ఈ ఏడాది మొదట్లో కొత్త చట్టం తీసుకురావడం తెలిసిందే.
2019-20 విద్యా సంవత్సరంలో 1,19,983 సీట్లను, 2020-21లో 95,783 సీట్లను సృష్టించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈడబ్ల్యూఎస్ అమలు కోసం 158 కేంద్రప్రభుత్వ విద్యాసంస్థలకు రూ.4,315 కోట్ల నిధులు వెచ్చించేందుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీట్లను 25 శాతం పెంచనున్నట్లు 2019-20 బడ్జెట్‌లోనూ కేంద్రం వెల్లడించింది. ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉన్నందున ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపేముందే మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈసీ నుంచి అనుమతులు తీసుకుంది.
కేబినెట్ ఇతర నిర్ణయాలు
- రాష్ట్రాల ఆడిట్ పనుల మధ్య సమన్వయం కోసం, అలాగే ఉత్తరప్రత్యుత్తరాల పర్యవేక్షణ కోసం అదనంగా మరో ఉప కాగ్ (కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్) పదవిని సృష్టించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఐదుగురు ఉప కాగ్‌లు ఉన్నారు.
- జీఎస్‌ఎల్వీ నాలుగోదశ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం కింద 2729.13 కోట్ల వ్యయంతో 2021-24 మధ్య ఐదు రాకెట్ ప్రయోగాలు జరగనున్నాయి.
ఏమిటి : కేంద్ర విద్యా సంస్థల్లో కొత్తగా 2,14,766 సీట్లు
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : కేంద్ర మంత్రివర్గం
ఎందుకు : ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్ల అమలు కోసం
మసీదుల్లో మహిళల ప్రవేశంపై విచారణ
మసీదుల్లో ముస్లిం మహిళలకు ప్రవేశం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. శబరిమల ఆలయం కేసులో తీర్పు ఇచ్చినందువల్లే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించామని జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై స్పందించాలని కోరుతూ కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ముస్లిం మహిళలు మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పుణేకు చెందిన యాస్మీన్ జుబేర్ అహ్మద్ పీర్జాదే, జుబేర్ అహ్మద్ నజీర్ అహ్మద్ పీర్జాదే అనే మహిళలు పిటిషన్ దాఖలు చేశారు.
కేరళలోని పవిత్ర అయ్యప్ప ఆలయం శబరిమలలోకి అన్ని వయసు మహిళలకు అనుమతి కల్పిస్తూ 2018, సెప్టెంబరులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మసీదుల్లో మహిళల ప్రవేశంపై విచారణ
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : సుప్రీంకోర్టు
భారత్‌లో యుహో మొబైల్స్ ప్లాంట్
స్మార్ట్‌ఫోన్ల తయారీలో ఉన్న చైనా కంపెనీ యుహో మొబైల్... భారత్‌లో తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఏప్రిల్ 17న తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లేదా హరియాణాలోని గురుగ్రామ్‌లో ఈ యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు పేర్కొంది. ఈ యూనిట్‌కోసం రూ. 100 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ వంటి మార్కెట్లకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తామని వివరించింది. యుహో కంపెనీకి ఇప్పటికే గురుగ్రామ్‌లో అసెంబ్లింగ్ యూనిట్ ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యుహో మొబైల్ ప్లాంట్ ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎక్కడ : భారత్
ఎనిమిదేళ్లలో నిరుద్యోగం రెండింతలు
దేశంలో 2011 నుంచి 2018 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో నిరుద్యోగం రెండింతలు పెరిగినట్లు బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ వెల్లడించింది. ఈ మేరకు ది స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా(ఎస్‌డబ్ల్యూఐ)-2019 పేరిట ఏప్రిల్ 17న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను దేశంలోని ఉద్యోగాల స్థితిగతులను లెక్కించే కన్సూమర్ పిరమిడ్‌స సర్వే ఆఫ్ ది సెంటర్ ఫర్ మోనిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ(సీఎమ్‌ఐఈ-సీపీడీఎక్స్) సంస్థ నుంచి 2016-18 మధ్య గల సమాచారాన్ని సేకరించి రూపొందించారు.
నివేదికలోని అంశాలు...
- దేశంలో ఉద్యోగావకాశాలు క్షీణించడంతోపాటు గడిచిన రెండేళ్ల(2016-18)లో 50 లక్షల మంది పురుషులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.
- పెద్ద నోట్ల రద్దు జరిగిన నాటి నుంచే దేశంలో ఉద్యోగావకాశాలు తగ్గుతూ వచ్చాయి.
- రూరల్ ఎంప్లారుుమెంట్ గ్యారంటీ స్కీమ్ తరహాలోనే అర్బన్ ఎంప్లారుుమెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ తేవాలని నివేదిక సూచించింది. దీని ద్వారా చిన్న పట్టణాల్లో సుమారు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గడిచిన ఎనిమిదేళ్లలో నిరుద్యోగం రెండింతలు
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ
జెట్ విమాన సేవల తాత్కాలిక నిలిపివేత
రుణభారం, నిధుల కొరతతో నాలుగు నెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్‌వేస్ సంస్థ ఏప్రిల్ 17న విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. కార్యకలాపాలను కొనసాగించేందుకు అత్యవసరంగా కావాల్సిన రూ. 400 కోట్లను సమకూర్చేందుకు బ్యాంకులు నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ తెలిపింది. దీంతో 20 వేల మందికి పైగా ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం కంపెనీలో ఎస్‌బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియంకు 51 శాతం, నరేష్ గోయల్‌కు 24 శాతం, ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు 12 శాతం వాటాలు ఉన్నాయి. 1992లో జెట్ ఎయిర్‌వేస్‌ను ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జెట్ ఎయిర్‌వేస్ విమాన సేవల తాత్కాలిక నిలిపివేత
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎందుకు : ఆర్థిక సంక్షోభం కారణంగా
దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ-మద్రాస్
దేశంలో అత్యున్నత విద్యాసంస్థగా ఐఐటీ-మద్రాస్ నిలిచింది. ఈ మేరకు ఢిల్లీలో ఏప్రిల్ 8న జరిగిన కార్యక్రమంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్)ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్‌ఐటీ, ఇతర సాంకేతిక విద్యాసంస్థల పనితీరు ఆధారంగా ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ను రూపొందించారు. ఈ ర్యాంకింగ్ ప్రక్రియలో 3,127 విద్యా సంస్థలు పాల్గొన్నాయి. ఈ జాబితాలో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) రెండో స్థానంలో నిలవగా, ఐఐటీ-ఢిల్లీ మూడో స్థానం దక్కించుకుంది.
ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లోని అంశాలు...
- విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్సీ-బెంగళూరు తొలిస్థానంలో నిలవగా, జేఎన్‌యూ, బీహెచ్‌యూ ఆతర్వాతి స్థానాల్లో నిలిచాయి.
- కళాశాల విభాగంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని మిరండా కాలేజీ అగ్రస్థానం దక్కిచుకుంది.
- అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలల జాబితాలోనూ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) విద్యాసంస్థలు సత్తా చాటాయి. టాప్-10లో ఏకంగా 8 స్థానాలను కై వసం చేసుకున్నాయి.
- ఇంజనీరింగ్ కళాశాలల జాబితాలో ఐఐటీ-మద్రాస్, ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ-ముంబై తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
- మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల జాబితాలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) తొలి 10 స్థానాల్లో ఆరింటిని దక్కించుకున్నాయి. వీటిలో ఐఐఎం-బెంగళూరు అగ్రస్థానంలో నిలవగా, ఐఐఎం-ఢిల్లీ, ఐఐఎం-ముంబై, ఐఐఎం-రూర్కీ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ-మద్రాస్
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్)
అత్తింటి బాధితురాలు ఎక్కడి నుంచైనా ఫిర్యాదు
వివాహ సంబంధ కేసులు, అత్తింట్లో వేధింపులతో బయటకు వచ్చిన/గెంటివేతకు గురైన మహిళలు తాము ఆశ్రయం పొందుతున్న చోట నుంచి అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇటువంటి ఫిర్యాదులను న్యాయస్థానాలు వాస్తవ పరిస్థితలను పరిగణించి ఐపీసీ 498ఏ కింద విచారణ చేపట్టవచ్చునని స్పష్టతనిచ్చింది. బాధితురాలు తన మెట్టినిల్లు ఏ కోర్టు పరిధిలో ఉందో అక్కడే ఫిర్యాదు చేయాలని, చట్టప్రకారం వేరే చోటు నుంచి చేసి ఫిర్యాదుపై దర్యాప్తు జరిపించడం, శిక్షలు విధించడం కుదరదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రుపాలీదేవీ అనే బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్తింటి బాధితురాలు ఎక్కడినుంచైనా ఫిర్యాదు
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : సుప్రీంకోర్టు
మావోయిస్టుల దాడిలో ఎమ్మేల్యే మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా శ్యామలగిరిలోని ‘నకుల్‌నార్’ ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన దాడిలో దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి(40) మృతి చెందారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మాండవికి చెందిన కాన్వాయ్ లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతోపాటు కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో ఎమ్మెల్యే మాండవితో పాటు నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మావోయిస్టుల దాడిలో ఎమ్మేల్యే మృతి
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : భీమా మాండవి(40)
ఎక్కడ : నకుల్‌నార్ ప్రాంతం , శ్యామలగిరి, దంతెవాడ జిల్లా, ఛత్తీస్‌గఢ్
సశస్త్ర సీమాబల్‌కు 15 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు
కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలకు చెందిన మిశ్రు ధాతు నిగమ్(మిధాని) లిమిటెడ్ 15 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను మార్చి 30న సశస్త్ర సీమాబల్‌కు అప్పగించింది. ఈ సందర్భంగా మిధాని సీఎండీ డాక్టర్ దినేశ్ కుమార్ లిఖీ మాట్లాడుతూ... లైట్ వెయిట్ సాయుధ పదార్థంతో తయారు చేసిన ఈ వాహనాలు వినియోగానికి ఎంతో అనువుగా ఉంటాయన్నారు. వీటిని దేశ సరిహద్దుల్లో రక్షణ కోసం వినియోగిస్తారని చెప్పారు. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ కేంద్రంగా మిధాని పనిచేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సశస్త్ర సీమాబల్‌కు 15 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అప్పగింత
ఎప్పుడు : మార్చి
ఎవరు : మిశ్రు ధాతు నిగమ్(మిధాని) లిమిటెడ్
భారత్‌లో లోటు వర్షపాతం : స్కైమెట్
2019 సంవత్సరంలో భారత్‌లో సాధారణం కంటే తక్కువస్థాయి వర్షపాతం నమోదవుతుందని ప్రముఖ ప్రైవేటు వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ తెలిపింది. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో జూన్-సెప్టెంబర్ మధ్యకాలంలో దీర్ఘకాలిక సగటు(ఎల్‌పీఏ)లో 93 శాతం వర్షపాతం మాత్రమే నమోదవుతుందని అంచనా వేసింది. ఎల్‌నినో ఏర్పడొచ్చనీ, ఇది నైరుతీ రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది.
1951 నుంచి 2000 వరకూ కురిసిన వర్షపాతాన్ని ఎల్‌పీఏగా వ్యవహరిస్తారు. ఇది 89 సెం.మీగా ఉంది. భారత్‌లో వ్యవసాయ రంగానికి జీవనాధారమైన నైరుతీ రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019లో భారత్‌లో లోటు వర్షపాతం
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : స్కైమెట్