Skip to main content

అక్టోబర్ 2020 జాతీయం

భారత నౌకాదళంలో చేరిన యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కవరట్టిని తయారు చేసిన సంస్థ?
Current Affairs ప్రాజెక్ట్-28లో భాగంగా మేకిన్ ఇండియా పిలుపు మేరకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కవరట్టి.. భారత నౌకాదళ అమ్ముల పొదిలో చేరింది. విశాఖలోని నేవల్ డాక్ యార్డులో అక్టోబర్ 22న జరిగిన నౌక కమిషనింగ్ కార్యక్రమం సందర్భంగా ఐఎన్‌ఎస్ కవరట్టిని నావికాదళంలో ప్రవేశపెట్టారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్ చేతుల మీదుగా కవరట్టిని జాతికి అంకితం చేశారు.
గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్...
కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ సంస్థ కవరట్టిని అభివృద్ధి చేసింది. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా రూపొందిన కవరట్టి.. న్యూక్లియర్, బయో, కెమికల్ ఇలా ఏ తరహా యుద్ధ వాతావరణంలోనైనా శత్రుదేశాలపై విరుచుకుపడుతుందని వైస్ అడ్మిరల్ జైన్ చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత నౌకాదళ అమ్ముల పొదిలోకి ఐఎన్‌ఎస్ కవరట్టి యుద్ధ నౌక
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

బ్యాగ్స్ ఆన్ వీల్స్ పథకంను తొలుత ఏ రైల్వే జోన్‌లో ప్రారంభించనున్నారు?
ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందిన భారతీయ రైల్వే శాఖ మరో కొత్త సేవలకు శ్రీకారం చుట్టనుంది. దేశంలో రైల్వే ప్రయాణికులకు ‘బ్యాగ్ ఆన్ వీల్స్’ సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. తొలుత ఘజియాబాద్, ఢిల్లీ, గుర్గావ్ తదితర స్టేషన్లలో బ్యాగ్ ఆన్ వీల్స్ సేవలను ప్రారంభించేందుకు ఉత్తర రైల్వే రంగం సిద్ధం చేసింది.
బ్యాగ్ ఆన్ వీల్స్ ద్వారా...
  • యాప్ ఆధారిత పథకమైన బ్యాగ్ ఆన్ వీల్స్ సదుపాయంతో ప్రయాణికులకు ఇకపై తమ లగేజీని మోసే భారం తప్పతుంది. ఈ పథకం కింద రైల్వే శాఖ డోర్ టు డోర్ సేవలు ప్రారంభించనుంది.
  • రైల్వే శాఖ తీసుకురానున్న బ్యాగ్‌‌స ఆన్ వీల్స్’ (బీవోడబ్ల్యూ) అనే మొబైల్ యాప్‌ను ఉపయోగించి ప్రయాణికులు తమ సామాన్లను రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి రైల్వే స్టేషన్‌కు తరలించే సేవలు పొందవచ్చు. ప్రయాణికుల బ్యాగేజీలను భద్రంగా చేరుస్తారు. ఇందుకోసం నిర్ణీత రుసుం చెల్లిస్తే చాలు.
  • దేశంలో రైల్వే ప్రయాణికులకు ఇలాంటి సదుపాయం అందుబాటులోకి వస్తుండడం ఇదే మొదటిసారి. టికెటేతర ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా రైల్వే శాఖ ఈ పథకానికి శ్రీకారం చుడుతోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్యాగ్ ఆన్ వీల్స్ పథకం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : భారతీయ రైల్వే
ఎక్కడ : ఉత్తర రైల్వే జోన్ పరిధిలో
ఎందుకు : ప్రయాణికుల సామాన్లను రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి రైల్వే స్టేషన్‌కు తరలించేందుకు

ఏ సంవత్సరం నాటికి పార్లమెంటు నూతన భవన నిర్మాణం పూర్తి కానుంది?
పార్లమెంటు నూతన భవన నిర్మాణం 2020, డిసెంబర్‌లో మొదలుపెట్టి 2022 అక్టోబర్ నాటికి పూర్తిచేయనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ అధికారులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు తెలిపారు. పార్లమెంటు భవన నిర్మాణానికి సంబంధించి స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అక్టోబర్ 23న సమీక్ష సమావేశం సందర్భంగా అధికారులు ఈ మేరకు వెల్లడించారు. ఈ సమావేశంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి కూడా పాల్గొన్నారు.
భవన నిర్మాణ పనుల పర్యవేక్షణకు లోక్‌సభ సచివాలయ అధికారులు, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ, సీపీడబ్ల్యూడీ, ఎన్‌డీఎంసీ, అర్కిటెక్ట్‌లు సభ్యులుగా స్పీకర్ ఓం బిర్లా ఒక కమిటీని నియమించారు.

భారతీయుల సగటు ఆయుష్షు 69.4 ఏళ్లు
భారతీయుల సగటు ఆయుర్దాయం 69.4 ఏళ్లు. పుట్టిన సమయంలో ఈ మేరకు జీవితకాలాన్ని ఆశించొచ్చు. పురుషుల కంటే మహిళలు, గ్రామీణుల కంటే పట్టణ ప్రజలు అధికకాలం జీవిస్తున్నారు. జాతీయ స్థాయిలో చూస్తే సగటున పురుషులకు 68.7 ఏళ్లు, మహిళలకు 70.7 ఏళ్ల ఆయుర్దాయం ఉంటోంది. పట్టణ ప్రాంత ప్రజలకు 72.6 ఏళ్లు, గ్రామీణులకు 68 ఏళ్ల సగటు జీవితకాలం ఉంటోంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల సగటు ఆయుష్షు 69.6 ఏళ్లు కాగా, ఇక్కడి మహిళలు 70.8 ఏళ్లు, పురుషులు 68.6 ఏళ్లు జీవిస్తున్నారు. నమూనా రిజిస్ట్రేషన్ విధానం (ఎస్‌ఆర్‌ఎస్) ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా 2014-18కి సంబంధించిన సంక్షిప్త ఆయుష్షు పట్టికలను జనగణన కమిషనర్, డెరైక్టర్ జనరల్ కార్యాలయం తాజాగా ప్రకటించింది. దేశం, రాష్ట్రాలు, లింగాల వారీగా సగటు ఆయుష్షు పట్టిక (లైఫ్ టేబుల్స్)లు ఇందులో ఉన్నాయి. వేర్వేరు వయస్సు గల సమూహాల మనుగడ, మరణాల సంభావ్యతను ఈ నివేదిక అంచనా వేసింది. దేశంలోనే అత్యధికంగా ఢిల్లీ పురుషులు 73.8 ఏళ్లు, కేరళ మహిళలు 77.9 ఏళ్లు బతుకుతున్నారు. అత్యల్పంగా ఛత్తీస్‌గఢ్ పురుషులు 63.7 ఏళ్లు, ఉత్తరప్రదేశ్ మహిళలు 65.8 ఏళ్ల సగటు ఆయుష్షును కలిగి ఉన్నారు. దేశంలో 60 ఏళ్లు దాటిన వయోజనులు మరో 18.2 ఏళ్ల జీవితాన్ని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. పురుషులు మరో 17.4 ఏళ్లు, మహిళలు మరో 18.9 ఏళ్ల ఆయుర్దాయాన్ని ఆశించొచ్చు. పుట్టిన తొలి ఏడాది బతికిబట్టకట్టితే, పురుషులు 69.8 ఏళ్లు, మహిళలు 72.5 ఏళ్ల ఆయుష్షును ఆశించవచ్చు.
గత 4 దశాబ్దాల్లో పెరిగిన ఆయుష్షు..
గత నాలుగు దశాబ్దాల్లో భారతీయుల ఆయుష్షు గణనీయంగా పెరిగింది. సమయం గడిచిన కొద్దీ జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, అధునాతన వైద్య సదుపాయాల అభివృద్ధికి తగ్గట్టు ఆయుష్షు క్రమంగా పెరుగుతోంది. 1970-75 మధ్య కాలంలో 49.7 ఏళ్లు మాత్రమే ఉన్న భారతీయుల సగటు ఆయుర్దాయం... 2014-18 మధ్య కాలం నాటికి 19.7 ఏళ్లు పెరిగి 69.4 ఏళ్లకు చేరింది. 1970-75 మధ్యకాలంలో మహిళల ఆయుష్షు 49 ఏళ్లు, పురుషుల ఆయుష్షు 50.5 ఏళ్లు కాగా, 2014-18 నాటికి వరుసగా 70.7 ఏళ్లు, 68.7 ఏళ్లకు పెరిగింది.
గత నాలుగు దశాబ్దాల్లో పెరుగుదల (ఆయుష్షు ఏళ్లల్లో) ..

కాల వ్యవధి

పురుషులు

మహిళలు

సగటు ఆయుష్షు

1970-75

50.5

49

49.7

1976-80

52.5

52.1

52.3

1981-85

55.4

55.7

55.4

1986-90

57.7

57.7

58.1

1991-95

59.7

60.9

60.3

1996-2000

61.2

62.7

61.9

2001-05

63.1

65.6

64.3

2006-10

64.6

67.7

66.1

2013-17

67.8

70.4

69

2014-18

68.2

70.7

69.4

తగ్గుతున్న పట్టణ- గ్రామీణ వ్యత్యాసం..
దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రజల ఆయుర్దాయం మధ్య 1970-75 కాలంలో 10 ఏళ్ల వ్యత్యాసం ఉండగా, 2014-18 నాటికి ఇది 4.6 ఏళ్లకు తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలు, వైద్య సదుపాయాలు వృద్ధి చెందడంతో పిన్న వయసులో మరణాలు తగ్గాయి. అయినా కేరళ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఇంకా పట్టణ ప్రజలతో పోల్చితే గ్రామీణుల ఆయుష్షు కొంత వరకు తక్కువగానే ఉంది.

ఏ వయస్సు వారు ఇంకెంత కాలం..?

జాతీయస్థాయిలో 70 ఏళ్ల వయస్సువారు మరో 11.6 ఏళ్ల జీవితకాలాన్ని ఆశించవచ్చని ఈ అధ్యయనం పేర్కొంది. తెలంగాణలో అయితే మరో 11 ఏళ్ల ఆయుష్షును ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.
ఏ వయస్సుల వారు మరెంత ఆయుష్షును ఆశించవచ్చో ఈ కింది పట్టికలో చూడవచ్చు.

వయస్సు

ఆయుష్షు (ఏళ్లల్లో)

 

భారతదేశం

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్

0

69.4

69.6

70

1

71.1

70.9

71.1

5

67.5

67.1

67.4

10

62.7

62.5

62.2

20

53.1

52.6

52.8

30

43.7

43.2

43.4

40

34.6

34.1

34.3

50

25.8

25.6

25.9

60

18.2

17.7

18.4

70

11.6

11

12

2014-18 సర్వే ప్రకారం రాష్ట్రాల వారీగా ఆయుష్షు (ఏళ్లల్లో)..

రాష్ట్రం

సగటు

పురుషులు

మహిళలు

ఏపీ

70.0

68.7

71.4

అస్సాం

66.9

66.1

67.9

బిహార్

69.1

69.4

68.7

ఛత్తీస్‌గఢ్

65.2

63.7

66.6

ఢిల్లీ

75.3

73.8

77.0

గుజరాత్

69.9

67.8

72.3

హరియాణా

69.8

67.7

72.3

హిమాచల్ ప్రదేశ్

72.9

69.6

76.8

జమ్మూకశ్మీర్

74.0

72.2

76.2

జార్ఖండ్

69.1

69.9

68.5

కర్ణాటక

69.4

67.9

70.9

కేరళ

75.3

72.5

77.9

మధ్యప్రదేశ్

66.5

64.8

68.5

మహారాష్ట్ర

72.5

71.3

73.8

ఒడిశా

69.3

68.0

70.8

పంజాబ్

72.7

71.0

74.8

రాజస్తాన్

68.7

66.5

71.6

తమిళనాడు

72.1

70.2

74.2

తెలంగాణ

69.6

68.6

70.8

ఉత్తరప్రదేశ్

65.3

64.8

65.8

ఉత్తరాఖండ్

70.9

67.9

74.3

పశ్చిమబెంగాల్

71.6

70.7

72.6


పీఎం స్వనిధి పథకాన్ని ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన ప్రత్యేక సూక్ష్మ రుణ పథకం ‘ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి(PM SVANIDHI-పీఎంస్వనిధి)’ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 27న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ... వీధి వ్యాపారుల నిజాయితీ, కష్టపడేతత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించి, వారికి రుణసాయం అందజేస్తోందని అన్నారు.ఈ సందర్భంగా ప్రధాని ఆగ్రా, వారణాసి, లక్నోలకు చెందిన ప్రీతి, అర్వింద్‌మౌర్య, విజయ్‌బహదూర్‌అనే ముగ్గురు లబ్ధిదారులతో మాట్లాడి, రుణసాయం వారికి ఏ విధంగా ఉపయోగపడనుందో అడిగి తెలుసుకున్నారు.
విజిలెన్స్ అవేర్‌నెస్‌వీక్...
కొన్ని రాష్ట్రాల్లో వేళ్లూనుకుపోయిన వంశపారంపర్య అవినీతి అక్కడి రాజకీయ సంస్కతిలో భాగంగా మారిపోయిందని మోదీ వ్యాఖ్యానించారు. సీబీఐ నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ సదస్సును ఆయన అక్టోబర్ 27న ప్రారంభించి ప్రసంగించారు. సమాజంలో క్రమంగా అవినీతి కూడా ఒక భాగంగా మారుతుందని పేర్కొన్నారు. 2020, అక్టోబర్ 27వ తేదీ నుంచి నవంబర్2 వరకు జరుగుతున్న ‘విజిలెన్స్ అవేర్‌నెస్‌వీక్’ను పురస్కరించుకుని సీబీఐ ఈ సదస్సు ఏర్పాటు చేసింది. అవినీతి వ్యతిరేక చట్టంలో చేపట్టాల్సిన సవరణలపై ఈ సదస్సులో చర్చిస్తారు.
క్విక్ రివ్వూ:
ఏమిటి : ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి(PM SVANIDHI-పీఎంస్వనిధి) పథకం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : ఉత్తరప్రదేశ్
ఎందుకు :కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారుల కోసం

హాథ్రస్‌కేసుపై సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతను ఏ హైకోర్డుకు అప్పగించారు?
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ‘హాథ్రస్’ఘటనపై సుప్రీంకోర్టు అక్టోబర్ 27న పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతను అలహాబాద్ హైకోర్టుకు అప్పగించింది. బాధిత కుటుంబం, సాక్షుల భద్రతను అలహాబాద్ హైకోర్టే చూసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను ఉత్తరప్రదేశ్ వెలుపల చేపట్టాలన్న వినతిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్‌వి. రామసుబ్రమణియన్ ల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వినతి మేరకు హాథ్రస్ బాధితురాలి పేరును ఇప్పటికే ఇచ్చిన తీర్పు నుంచి తొలగించాలని అలహాబాద్ హైకోర్టుకు సూచించింది. బాధిత కుటుంబం, సాక్షుల భద్రత బాధ్యతను వారం రోజుల్లో సీఆర్‌పీఎఫ్‌కు అప్పగించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

జమ్మూకశ్మీర్‌లో భూముల కొనుగొలుకు అనుమతి
కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూకశ్మీర్, లద్దాఖ్లో ఇకపై ఎవరైనా భూములను కొనొచ్చని కేంద్ర హోం శాఖ తెలిపింది. ఈ మేరకు అక్టోబర్ 27న గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. జమ్మూకశ్మీర్ కి సంబంధించిన పలు చట్టాలకు చేసిన సవరణల్లో ఈ మార్పులను తీసుకొచ్చారు. ఆర్టికల్370 రద్దుకు ముందు కేవలం ఆ రాష్ట్రంలోని శాశ్వత నివాసితులు మాత్రమే భూములు కొనే హక్కును కలిగి ఉండేవారు. సెక్షన్ 17లోని ఆ హక్కును కేంద్రం తొలగించడంతో, ఇప్పుడు ఎవరైనా జమ్మూకశ్మీర్, లద్ధాఖ్లో భూములను కొనొచ్చు. అయితే వ్యవసాయ భూములను, వ్యవసాయేతరులకు అమ్మేందుకు ఈ సవరణ అంగీకరించలేదని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెప్పారు. అయితే వ్యవసాయ భూములను విద్య, వైద్యానికి సంబంధించిన లక్ష్యాలకు వినియోగించుకోవచ్చు.

ఆసియాలోనే అతిపెద్ద సొరంగ మార్గం నిర్మాణ పనులు ప్రారంభం
Current Affairs
జమ్మూ, కశ్మీర్‌లోని శ్రీనగర్, లేహ్‌ల మధ్య ప్రయాణ కాలాన్ని మూడున్నర గంటల నుంచి 15 నిమిషాలకు తగ్గించే జోజిలా పాస్ సొరంగ మార్గం(జోజిలా టన్నెల్) నిర్మాణ పనులు అక్టోబర్ 15న ప్రారంభమయ్యాయి. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వీటిని లాంఛనంగా ప్రారంభించారు. 14.2 కి.మీ పొడవుండే ఈ సొరంగం అందుబాటులోకి వస్తే శ్రీనగర్, కార్గిల్, లేహ్ మధ్య అనుసంధానత సాధ్యమవుతుంది.
జోజిలా టన్నెల్ విశేషాలు...

  • ఇన్‌ఫ్రా దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) పోటీ సంస్థల కన్నా అత్యంత తక్కువగా కోట్ చేసి ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. ఎంఈఐఎల్ రూ. 4,509.5 కోట్లకు బిడ్ వేసింది.
  • సుమారు 14.15 కి.మీ. పొడవుండే ఈ టన్నెల్‌ను షెడ్యూల్ ప్రకారం ఆరేళ్లలో పూర్తి చేయాలి.
  • ఈ టన్నెల్ పూర్తయితే ఆసియాలోనే అత్యంత పొడవైన టన్నెల్గా నిలుస్తుంది. శ్రీనగర్-లేహ్ మధ్య ప్రయాణ సమయం 3 గం.ల నుంచి 15 నిమిషాలకు తగ్గిపోతుంది.
  • శ్రీనగర్-కార్గిల్-లేహ్ జాతీయ రహదారిపై 11,578 అడుగుల ఎత్తున ఉండటంతో ఇది వ్యూహాత్మక ప్రాజెక్టుగా మారింది.
  • సాధారణంగా శీతాకాలంలో భారీ హిమపాతం కారణంగా శ్రీనగర్-లేహ్ మధ్య మార్గాన్ని మూసేయాల్సి ఉంటోంది. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడాది పొడవునా ప్రయాణాలకు వీలవుతుంది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : జోజిలా పాస్ సొరంగ మార్గం(జోజిలా టన్నెల్) నిర్మాణ పనులు ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
ఎక్కడ : జోజిలా, లద్దాఖ్
ఎందుకు : శ్రీనగర్, లేహ్‌ను అనుసంధానించేందుకు

గృహ హింసపై సుప్రీంకోర్టు తీర్పు
గృహ హింస ఎదుర్కొంటున్న మహిళలకు ఊరటనిచ్చే తీర్పును అక్టోబర్ 15న సుప్రీంకోర్టు వెలువరించింది. బాధిత మహిళలకు భర్త తరఫు ఇంట్లో ఉండే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. గృహ హింస(డొమెస్టిక్ వయోలెన్స్- డీవీ) చట్టంలో బాధిత మహిళకు భర్త తరఫు ఉమ్మడి ఇంటికి సంబంధించిన హక్కు విషయంలో గతంలో ఇచ్చిన తీర్పును తాజాగా సవరించింది. డీవీ చట్టం కింద ఆ ఇంటిపై ఆ మహిళకు కూడా హక్కు కల్పిస్తూ క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును సంబంధిత సివిల్ దావాలోనూ పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పు సరైనది కాదని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం తోసిపుచ్చింది. ఢిల్లీకి చెందిన 76 ఏళ్ల సతీశ్ చందర్ అహూజా వేసిన కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు ప్రకటించింది.

పంట వ్యర్థాల దహనంపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు
ఢిల్లీ-దేశ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్)లో వాయు నాణ్యత కనిష్ట స్థాయిలకు పడిపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మదన్ లోకూర్‌తో ఏకసభ్య కమిటీని అక్టోబర్ 16న ఏర్పాటు చేసింది. గాలి కాలుష్యానికి కారణమైన పంట వ్యర్థాల దహనాన్ని నివారించేందుకు పంజాబ్, హరియాణా, యూపీ తీసుకుంటున్న చర్యలను ఈ కమిటీ పరిశీలించనుంది. కమిటీకి సాయంగా నేషనల్ కాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ), నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్‌ఎస్‌ఎస్), భారత్ స్కౌట్స్ కార్యకర్తల సేవలను ఉపయోగించుకోవాలని చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే ఆదేశాలు జారీ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మదన్ లోకూర్‌తో ఏకసభ్య కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : గాలి కాలుష్యానికి కారణమైన పంట వ్యర్థాల దహనాన్ని నివారించేందుకు పంజాబ్, హరియాణా, యూపీ తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు

ఐరాసకి చెందిన ఏ సంస్థ 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ రూ.75 నాణేన్ని ఆవిష్కరించారు?
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని అంతర్జాతీయ సంస్థ ‘‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఏవో)’ ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 16న న్యూఢిల్లీలో భారత ప్రధానమంత్రి రూ.75 ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. ఈ నాణేంపై సహి పోషణ్.. దేశ్ రోషణ్ అని హిందీలో రాశారు. 1945, అక్టోబర్ 16న ఏర్పాటైన ఎఫ్‌ఏవో ప్రధాన కార్యాలయం ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఉంది. ప్రతి ఏడాది అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా ‘వరల్డ్ ఫుడ్ డే’గా జరుపుకుంటారు.
ప్రపంచ ఆహార దినోత్సవం 2020 థీమ్: ‘అందరం కలిసి ఆహార పదార్థాలను పెంచుదాం. భవిష్యత్తుకు భరోసానిద్దాం’(Grow, Nourish, Sustain. Together)
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ.75 ప్రత్యేక నాణేం విడుదల
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఏవో)’ ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా

ఏ ఏడాదిని ఇయర్ ఆఫ్ మిల్లెట్స్‌గా ఎఫ్‌ఏవో ప్రకటించింది?
అంతర్జాతీయ సంస్థ ‘‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఏవో)’ ఏర్పాటై 75 ఏళ్లు అయిన సందర్భంగా అక్టోబర్ 16న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ రూ.75 ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... ‘భారతదేశ వినతితో 2016 ఏడాదిని అంతర్జాతీయ పప్పుధాన్యాల సంవత్సరంగా, 2023 ఏడాదిని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్‌గా ఎఫ్‌ఏఓ ప్రకటించింది’ అని పేర్కొన్నారు.
17 బయో ఫోర్టిఫైడ్ వంగడాలు విడుదల
పోషకాహార లోపాలను అధిగమించేందుకు భారత ప్రభుత్వం సిద్ధం చేసిన 17 బయో ఫోర్టిఫైడ్ వంగడాలను ప్రధాని మోదీ విడుదల చేశారు. స్థానిక వంగడాలు, రైతులు అభివృద్ధి చేసిన వంగడాల సాయంతో ఈ కొత్త వెరైటీలను సిద్ధం చేశారు. జాతికి అంకితం చేసిన వాటిల్లో గోధుమ వంగడాలు ఐదు ఉండగా.. మొక్కజొన్న వంగడాలు మూడు, రాగులు, వేరుశనగ రెండు చొప్పున ..వరి, సామలు, ఆవాలు, కంద వంగడాలు ఒక్కొక్కటి ఉన్నాయి. ఇంకో వంగడం వివరాలు తెలియాల్సి ఉంది.

ఓలిక్ ఆసిడ్‌ను ఏ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు?
నూతన వంగడాల్లో రెండింటిని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) అభివృద్ధి చేసింది. గిర్నార్ -4, గిర్నార్ -5 అని పిలుస్తున్న ఈ రెండు వేరుశనగ వంగడాల్లో ఓలిక్ ఆసిడ్ మోతాదు ఎక్కువ. సబ్బులు, ఫార్మా, వస్త్ర పరిశ్రమల్లో ఓలిక్ ఆసిడ్‌ను ఉపయోగిస్తారు.
భారత్‌లో రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి
కరోనా నివారణకు రష్యా అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్-వీ’ వ్యాక్సిన్ రెండు/మూడో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ను భారత్‌లో నిర్వహించేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్‌కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి లభించింది. ఈ విషయాన్ని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ అక్టోబర్ 17న తెలిపింది. రష్యన్ డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్)తో కలిసి తాము ఈ ట్రయల్స్ నిర్వహిస్తామంది.
భారత్‌లో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు, వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్ 2020, సెప్టెంబర్ నెలలో జట్టు కట్టాయి. ఒప్పందంలో భాగంగా ఆర్‌డీఐఎఫ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు 10 కోట్ల్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందజేయనుంది.

జమ్మూకశ్మీర్‌లో జిల్లా అభివృద్ధి మండళ్లు ఏర్పాటు
కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో ప్రజలే నేరుగా ఎన్నుకునే జిల్లా కౌన్సిళ్లు అభివృద్ధి పనుల పర్యవేక్షణ చేపడతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రస్తుతం శాసనసభా ప్రతినిధులు లేనందున ఈ మేరకు జమ్మూకశ్మీర్ పంచాయతీరాజ్ చట్టం-1989కు సవరణలు చేపట్టినట్లు కేంద్ర హోం శాఖ అక్టోబర్ 18న తెలిపింది.
14 ప్రాదేశిక నియోజకవర్గాలు...
కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం... ఒక్కో జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) పరిధిలో 14 ప్రాదేశిక నియోజకవర్గాలుంటాయి. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో సభ్యుడిని నేరుగా ప్రజలే ఎన్నుకుంటారు. అసెంబ్లీకి ఎన్నికలు జరిగే వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకే ఈ చర్య తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూకశ్మీర్‌లో జిల్లా అభివృద్ధి మండళ్లు ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : జమ్మూకశ్మీర్‌లో ప్రజలే నేరుగా ఎన్నుకునే జిల్లా కౌన్సిళ్లు అభివృద్ధి పనుల పర్యవేక్షణ చేపడతాయని

ఏ విశ్వవిద్యాలయం శతాబ్ది స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు?
మైసూర్ విశ్వవిద్యాలయం శతాబ్ది స్నాతకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 19న వీడియో కాన్ఫరెన్స్ లో ప్రసంగించారు. ప్రస్తుత దశాబ్దాన్ని భారతదేశ దశాబ్దంగా మార్చడం, దేశ పురోభివృద్ధే లక్ష్యంగా అన్ని రంగాల్లో అవసరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ప్రధాని పేర్కొన్నారు. ఉన్నత విద్యకు భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చడానికి, మన యువతలో పోటీతత్వాన్ని పెంచడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
గ్రాండ్ చాలెంజెస్ లక్ష్యం...
ప్రభుత్వ విధాన నిర్ణేతలు, పరిశోధకులను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చి పరిష్కార మార్గాలు కనిపెట్టడమే లక్ష్యంగా అక్టోబర్ 19న జరిగిన ‘గ్రాండ్ చాలెంజెస్’ వార్షిక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆన్‌లైన్ ద్వారా ప్రసంగించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అధికంగా పెట్టుబడులు పెడుతూ నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించే దేశాలే భవిష్యత్తును నిర్దేశిస్తాయని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. దాదాపు 40 దేశాలకు చెందిన 1,600 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశాలు గత 15 సంవత్సరాలుగా జరుగుతున్నాయి.

సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్రం?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలతో పాటు, నూతన విద్యుత్ చట్టాన్ని తిరస్కరిస్తూ, పంజాబ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. పార్లమెంటు ఆమోదించిన వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా, రైతుల రక్షణ కోసం నాలుగు నూతన బిల్లులను రాష్ట్ర అసెంబ్లీ అక్టోబర్ 20న ఆమోదించింది. ప్రతిపక్ష శిరోమణీ అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, లోక్ ఇన్‌సాఫ్ ఎమ్మెల్యేలు ఈ తీర్మానం, బిల్లులకు మద్దతు పలికారు. కేంద్రం తెచ్చిన బిల్లులకు కొత్త క్లాజులు, సవరణలను చేర్చి, రైతుల రక్షణ కోసం ఈ బిల్లులను ఆమోదిస్తున్నట్లు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పేర్కొన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు?
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఇతర రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వ్యయాన్ని 10 శాతం పెంచింది. ఎన్నికల సంఘంతో విసృ్తతంగా చర్చించిన తర్వాత కేంద్ర న్యాయశాఖ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎన్నికల్లో వ్యయ పరిమితిని మరో 10శాతం పెంచుతూ అక్టోబర్ 20న ఉత్తర్వులు జారీచేసింది.
లోక్ సభ ఎన్నికల్లో రూ.77 లక్షలు
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇన్నాళ్లూ రూ.70 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. ఇప్పుడు దానిని రూ.77 లక్షలు చేశారు. అదే చిన్న రాష్ట్రాల లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే వారి ఖర్చుని రూ.54 లక్షల నుంచి రూ. 59 లక్షలకి పెంచారు.
అసెంబ్లీకి రూ.30.8 లక్షలు
అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుని రూ.28 లక్షల నుంచి రూ.30.8 లక్షలకి పెంచారు. చిన్న రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఉన్న రూ.20 లక్షల వ్యయం పరిమితిని రూ.22 లక్షలకి పెంచారు.
ఆర్టికల్ 324ని అనుసరించి...
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, వాల్మీకి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో పోలింగ్ రోజు, అంతకు ముందు రోజు అభ్యర్థులు ఎటువంటి రాజకీయ పరమైన ప్రకటనలు ఇవ్వకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324ని అనుసరించి ఎన్నికల కమిషన్ ఈ ప్రకటనలపై నిషేధం విధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎన్నికల్లో వ్యయ పరిమితి మరో 10 శాతం పెంపు
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎవరు : కేంద్ర న్యాయశాఖ

రక్షణ రంగ స్వావలంబన కోసం నూతన మాన్యువల్
రక్షణ రంగ స్వావలంబన కోసం కేంద్రప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రక్షణ పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేందుకు ‘కొత్త సేకరణ మాన్యువల్(DRDO Procurement Manual-2020)’ ను సిద్దం చేసింది. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ ఈ మాన్యువల్‌ను అక్టోబర్ 20న న్యూఢిల్లీలో విడుదల చేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి, రక్షణ శాఖ ఆర్థిక విభాగం కార్యదర్శి గార్గి కౌలంద్ పాల్గొన్నారు.
ప్రధానాంశాలు...
ప్రాజెక్టుల కోసం దరఖాస్తు చేసే సమయంలో చేసే ‘బిడ్ సెక్యూరిటీ డిక్లరేషన్, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, అడ్వాన్స్ పేమెంట్స్ విషయంలో గరిష్ట మోతాదులో పెరుగుదల, వంటి అంశాల్లో చేసిన మార్పులు రక్షణ రంగ మాన్యువల్‌లో ప్రధానాంశాలు.
మోదీ స్వప్నం...
ప్రధాని మోదీ స్వప్నం ‘ఆత్మ నిర్భర భారత్’ సాధనకు ఈ మాన్యువల్ ఉపయోగపడుతుందని, దేశీ రక్షణ రంగ పరిశ్రమలు వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములు అయ్యే పనిని సులభతరం చేస్తుందని రాజ్‌నాథ్ అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రక్షణ రంగ సేకరణ మాన్యువల్
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎవరు : భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రక్షణ పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేందుకు

దేశప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం
కరోనా వైరస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రజలను అప్రమత్తం చేశారు. లాక్‌డౌన్ ముగిసింది కానీ వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని తెలిపారు. అన్ని కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పండుగలను జరుపుకోవాలని సూచించారు. దేశప్రజలనుద్దేశించి అక్టోబర్ 20న ప్రధాని ప్రసంగించారు. కరోనా ముప్పు మొదలైన తరువాత దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించడం ఇది ఏడోసారి.
ప్రధాని ప్రసంగం...

  • కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే భారతీయులందరికీ దాన్ని అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
  • అమెరికా, బ్రెజిల్, బ్రిటన్ వంటి వనరులు పుష్కలంగా ఉన్న దేశాలతో పోలిస్తే.. కరోనా మరణాలను కట్టడి చేయడంలో భారత్ ఎంతో సమర్ధవంతంగా పనిచేసింది.
  • అమెరికాలో 10 లక్షల జనాభాకు సుమారు 25 వేల కేసులు నమోదయ్యాయి, అదే భారత్‌లో 10 లక్షల జనాభాకు నమోదైన కేసుల సంఖ్య 5,500 మాత్రమే.
  • అలాగే, అమెరికా, బ్రెజిల్, స్పెయిన్, బ్రిటన్ తదితర దేశాల్లో 10 లక్షల జనాభాకు 600కు పైగా కరోనా మరణాలు సంభవించగా.. భారత్‌లో 10 లక్షల జనాభాకు కరోనా మరణాల సంఖ్య 83 మాత్రమే.
  • కోవిడ్-19 పేషెంట్ల కోసం భారత్‌లో 90 లక్షల బెడ్‌‌స, 12 వేల క్వారంటైన్ కేంద్రాలు, 2 వేల ల్యాబ్స్ సిద్ధంగా ఉన్నాయి. త్వరలో భారత్‌లో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటుతుంది.


కశ్మీర్‌లో పంచాయతీరాజ్ చట్టం అమలుకు కేబినెట్ ఆమోదం
జమ్మూకశ్మీర్‌లో పంచాయతీరాజ్ చట్టం- 1989 అమలు ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ అక్టోబర్ 21న ఆమోదించింది. దీంతో మూడంచెల పంచాయతీరాజ్ విధానం కశ్మీర్లోనూ అమలు కానుంది. కశ్మీర్‌లో నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్) ద్వారా 12 లక్షల టన్నుల యాపిల్‌ను సేకరించే పథకాన్ని 2020-21 సీజన్‌లో కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు నాఫెడ్ వద్ద ప్రభుత్వ హామీగా ఉన్న రూ. 2500 కోట్లను వినియోగించేందుకు అనుమతించింది.
ఉద్యోగులకు రూ. 3,737 కోట్ల బోనస్..
దసరా సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. సుమారు 30.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 3,737 కోట్ల బోనస్‌ను అందజేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019-2020 సంవత్సరానికి గానూ ఉద్యోగులకు ఉత్పాదకత ఆధారిత బోనస్ (ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్- పీఎల్‌బీ), ఉత్పాదకతకు సంబంధం లేని బోనస్ (నాన్ పీఎల్‌బీ లేదా అడ్‌హాక్) ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి జవదేకర్ వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూకశ్మీర్‌లో పంచాయతీరాజ్ చట్టం- 1989 అమలు ప్రతిపాదనను ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : కేంద్ర కేబినెట్

కోవిడ్‌పై పోరుకు కేంద్రం చేపట్టిన ప్రజాచైతన్య కార్యక్రమం పేరు?
Current Affairs రాబోయే రోజుల్లో దసరా, దీపావళి సహా పండుగల సీజన్ కావడంతో జనం పెద్ద ఎత్తున ఒకే చోట చేరడం సహా చలికాలం సమీపిస్తున్న వేళ కరోనా వైరస్ మహమ్మారి మరింతగా విజృంభించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌పై పోరాడేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘జన్ ఆందోళన్’ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌తో ప్రారంభించారు. ప్రజలందరూ మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని దేశ ప్రజలను ప్రధాని మోదీ కోరారు. ‘యునైట్ 2 ఫైట్ కరోనా’హ్యష్‌టాగ్‌తో ఈ వైరస్ నుంచి ప్రజలను రక్షించడానికి మన ప్రయత్నాలను ముమ్మరం చేయాలని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జన్ ఆందోళన్ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : దేశ వ్యాప్తంగా
ఎందుకు : కోవిడ్‌పై పోరాడేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు

ఐఏఎఫ్ 88వ వార్షికోత్సవ వేడుకలను ఎక్కడ నిర్వహించారు?
భారత వైమానిక దళం(ఐఏఎఫ్) 88వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలోని హిండన్ వైమానిక స్థావరంలో అక్టోబర్ 8న ప్రత్యేక కవాతు నిర్వహించారు. ఈ కవాతులో ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియా పాల్గొని ప్రసంగించారు. శత్రువును ఢీకొట్టే నిర్వహణా సామర్థ్యం తనకు ఉందని ఐఏఎఫ్ సుస్పష్టం చేసిందని బదౌరియా అన్నారు. భారత-చైనా సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట ఐఏఎఫ్ వేగంగా మోహరించడం, యుద్ధానికి సన్నద్ధత ప్రకటించడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గ్రామీణ ప్రజలకు ఆస్తి కార్డులను పంపిణీ చేసేందుకు ప్రధాని ప్రారంభించిన పథకం?
గ్రామీణ ప్రజలకు ఆస్తి కార్డులను పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన ‘సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్(స్వామిత్వ)’ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 11న న్యూఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ... ఈ పథకం గ్రామీణ భారతాన్ని మార్చే విప్లవాత్మక కార్యక్రమం అని, ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా కీలక ముందడుగు అని పేర్కొన్నారు.
స్వామిత్వ పథకం-ప్రధానాంశాలు

  • స్వామిత్వ కార్డులను ఉపయోగించి పల్లె ప్రజలు బ్యాంకుల్లో రుణాలు పొందవచ్చ.
  • ఆస్తి కార్డుల ద్వారా బ్యాంక్ ఖాతాలను, విద్యుత్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్, పక్కా ఇల్లు తదితర సౌకర్యాలు పొందవచ్చు.
  • ప్రస్తుతం యూపీ, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 763 గ్రామాల్లో స్వామిత్వ ప్రారంభమైంది.
  • ప్రతీ కార్డుకు ఆధార్ కార్డు తరహాలో ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది.

మోదీ ప్రసంగం-ముఖ్యాంశాలు

  • ఆస్తి కార్డుల ద్వారా గ్రామస్తుల మధ్య భూ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తి తగాదాలు తొలగిపోతాయి.
  • ప్రజలు తమ ఆస్తులపై స్పష్టమైన యాజమాన్య హక్కులు కలిగి ఉండటం అవసరం.
  • గ్రామాల్లోని యువత ఈ ప్రాపర్టీ కార్డులను హామీగా పెట్టి, స్వయం ఉపాధి కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు.
  • దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీతో భూముల మ్యాపింగ్ చేయాలని యోచిస్తున్నాం.
  • ఈ 763 గ్రామాల్లోని ప్రజలు తక్షణం అవసరమనుకుంటే తమ ఫోన్లకు అధికారులు ఎస్‌ఎంఎస్ చేసిన లింక్ ద్వారా ప్రాపర్టీ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆస్తి కార్డుల పంపిణీని త్వరలో ప్రారంభిస్తాయి.
  • రానున్న మూడు, నాలుగేళ్లలో ప్రతీ కుటుంబానికి ప్రాపర్టీ కార్డులను అందజేస్తాం.
  • ప్రపంచవ్యాప్తంగా తమ ఆస్తులకు సంబంధించి చట్టబద్ధమైన రికార్డులు ఉన్నవారు మూడింట ఒక వంతు మాత్రమే.

క్విక్ రివ్యూ:
ఏమిటి : సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్(స్వామిత్వ) పథకం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : యూపీ, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక
ఎందుకు : గ్రామీణ ప్రజలకు ఆస్తి కార్డులను పంపిణీ చేసేందుకు

ఎవరి స్మారకార్థం ముద్రించిన రూ. 100 నాణేంను ప్రధాని ఆవిష్కరించారు?
గ్వాలియర్ రాజమాత విజయరాజే సింధియా శతజయంతి వేడుకల సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ ముద్రించిన వంద రూపాయల నాణేన్ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 12న వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. నాణేనికి ఓ వైపు రాజమాత బొమ్మ మరోవైపు అశోకుడి స్థూపం ఉంటుంది. రాజమాత బొమ్మ ఉన్న వైపు..సింధియా వందవ జయంతి అని హిందీ, ఆంగ్లభాషల్లో రాసి ఉంటుంది.
వంద రూపాయల నాణెం ఆవిష్కరణ అనంతరం ప్రధాని మాట్లాడుతూ... స్వాతంత్ర్య ఉద్యమకాలం నాటినుంచి భారత రాజకీయాల్లో రాజమాత కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకు అధికారం కన్నా ప్రజాసేవే ముఖ్యమనే విషయాన్ని ఆమె నిరూపించారని కొనియాడారు. ఏక్తాయాత్ర సమయంలో సింధియానే తనను గుజరాత్ యువ నాయకుడిగా పరిచయం చేశారన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర ఆర్థికశాఖ ముద్రించిన వంద రూపాయల నాణేం ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : గ్వాలియర్ రాజమాత విజయరాజే సింధియా శతజయంతి వేడుకల సందర్భంగా

నెచిపూ టన్నెల్‌కు రక్షణ మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ టన్నెల్‌ను ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు?
లద్దాఖ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లోని వ్యూహాత్మక ప్రాంతాల్లో బోర్డర్ రోడ్‌‌స ఆర్గనైజేషన్ నిర్మించిన 44 నూతన వంతెనలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 12న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆన్‌లైన్ విధానం ద్వారా ఈ 44 వారధులను ప్రారంభించారు. అనంతరం అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించనున్న 450 మీటర్ల సొరంగ మార్గం ‘నెచిపూ టన్నెల్’ నిర్మాణానికి ఆయన ఆన్‌లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. నూతన బ్రిడ్జీలతో ఆయా వ్యూహాత్మక ప్రాంతాలకు మన సైనికుల రాకపోకలకు మరింత సౌలభ్యం కలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
ఒక వైపు పాక్, మరో వైపు చైనా...
వంతెనల ప్రారంభం అనంతరం రాజ్‌నాథ్ మాట్లాడుతూ... ‘తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా మధ్య గత ఐదు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే ఒక పథకంలో(మిషన్) భాగంగానే పాకిస్తాన్, చైనా సరిహద్దు వివాదాలు సృష్టిస్తున్నాయి’ అని అన్నారు. పాకిస్తాన్, చైనా దేశాలతో భారత్‌కు 7,000 కిలోమీటర్ల సరిహద్దు ఉందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నెచిపూ టన్నెల్ నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ఎక్కడ : అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రం

కేంద్ర కేబినెట్ ఆమోదించిన స్టార్స్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం?
ప్రాథమిక విద్య మొదలుకొని విశ్వవిద్యాలయ విద్య వరకూ అన్ని స్థాయిల్లోనూ విస్తృతమైన సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) కింద ‘స్టార్స్’ ప్రాజెక్టుకి కేంద్ర కేబినెట్ అక్టోబర్ 14న ఆమోదముద్ర వేసింది. ఎన్‌ఈపీ అమలులో భాగంగా ‘స్ట్రెంథెనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ (స్టార్స్)’ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
స్టార్స్ ముఖ్య ఉద్దేశం...
వివిధ రాష్ట్రాల్లో విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడం, ఉపాధ్యాయుల నాణ్యతా ప్రమాణాలను పెంచి పాఠశాలలు మంచి ఫలితాలు రాబట్టేలా చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయం....
ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన మంత్రి మండలి స్టార్స్ ప్రాజెక్టుకి ఆమోద ముద్ర వేసినట్టు కేంద్ర పర్యావరణం, అటవీ, భారీ పరిశ్రమలు, సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...

  • రూ.5,718 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన స్టార్స్ ప్రాజెక్టుకి ప్రపంచ బ్యాంకు రూ.3,700 కోట్ల ఆర్థిక సాయం అందిస్తోంది.
  • చదువు అంటే బట్టీ పట్టి రాయడం కాకుండా సబ్జెక్టులపై అవగాహన పెంచుకుంటూ నేర్చుకోవడం అన్న ప్రాతిపదికపైన ఈ విధానాన్ని తీర్చి దిద్దారు.
  • విద్యార్థులపై మార్కుల ఒత్తిడి లేకుండా బోధనా పద్ధతుల్లో సమూల మార్పులు తీసుకు రావడం కోసం ఈ స్టార్స్ ప్రాజెక్టుని ప్రారంభించనున్నారు.
  • హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఒడిశాల్లో విద్యా రంగంలో నాణ్యత పెంచడానికి తొలుత కృషి చేయనున్నారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి : స్ట్రెంథెనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ (స్టార్స్) ప్రాజెక్టుకి ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : వివిధ రాష్ట్రాల్లో విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడం, ఉపాధ్యాయుల నాణ్యతా ప్రమాణాలను పెంచి పాఠశాలలు మంచి ఫలితాలు రాబట్టేందుకు

ఏ సంస్థ నుంచి నాగర్నార్ స్టీల్ ప్లాంట్‌ను వేరు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది?
జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లకు రూ.520 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అక్టోబర్ 14న సమావేశమైన మంత్రి మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు కశ్మీర్, లద్దాఖ్ ప్రజలకు లబ్ధి చేకూరేలా చేయడమే కేంద్రం లక్ష్యమని మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు.
నాగర్నార్ స్టీల్‌ప్లాంట్ డీమెర్జర్‌కు ఆమోదం
నిర్మాణంలో ఉన్న నాగర్నార్ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌ఎండీసీ నుంచి వేరు చేయడానికి (డీమెర్జర్) కేబినేట్ ఆమోదం తెలిపింది. డీమెర్జర్ అనంతరం ప్రభుత్వానికి ఉన్న పూర్తి వాటాను వ్యూహాత్మక కొనుగోలుదారుకు విక్రయించనుంది.
చత్తీస్‌గఢ్‌లో..
కేంద్ర ఉక్కు శాఖ పరిధిలో ఉన్న ఎన్‌ఎండీసీ చత్తీస్‌గఢ్‌లోని నాగర్నార్‌లో రూ.23,140 కోట్ల అంచనాతో నాగర్నార్ స్టీల్ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. ఇప్పటి వరకు రూ.17,186 కోట్లను ఇన్వెస్ట్ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌ఎండీసీ డీమెర్జర్‌కు ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : కేంద్ర మంత్రి మండలి
ఎందుకు : నాగర్నార్ స్టీల్ ప్లాంట్‌ను ఎన్‌ఎండీసీ నుంచి వేరు చేసేందుకు

దేశంలో బ్లూఫ్లాగ్ బీచ్‌లుగా ఎంపికైన బీచ్‌లు ఏవీ.. వాటి సంఖ్య ఎంత?
విశాఖ రుషికొండ బీచ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పర్యావరణహిత, ప్రమాదరహిత బీచ్‌లకు అందించే బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్‌ని అక్టోబర్ 11న ఈ బీచ్ దక్కించుకుంది. బ్లూఫ్లాగ్ ఇంటర్నేషనల్ జ్యూరీ బృందం ఆయా బీచ్‌ల్లో నిర్వహించిన పనుల్ని వర్చువల్ ద్వారా పరిశీలించింది. అనంతరం దేశంలో 13 బీచ్‌ల నుంచి ఎనిమిది బీచ్‌లు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్‌కు ఎంపికయ్యాయని వెల్లడించింది.
మూడో స్థానంలో...
తీర ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణకు భారత్ తీసుకుంటున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని, బెస్ట్ ప్రాక్టీసెస్ విభాగంలో ఇండియా మూడో స్థానంలో నిలిచిందని బ్లూఫ్లాగ్ బీచెస్ ఆఫ్ ఇండియా మిషన్ లీడర్ సంజయ్ జల్లా ప్రకటించారు.

బ్లూఫ్లాగ్ గుర్తింపు వల్ల లాభమేంటి? ఆ సర్టిఫికెట్‌ని అందించే సంస్థ ఏది?
ప్రపంచవ్యాప్తంగా బ్లూఫ్లాగ్ బీచ్‌లకు విశేష ఆదరణ ఉంటుంది. విదేశీ పర్యాటకులు ముందుగా బ్లూఫ్లాగ్ బీచ్‌నే ఎంపిక చేసుకుంటారు. ఈ సర్టిఫికెట్‌ని పొందాలంటే బీచ్ పర్యావరణహితంగా ఉండటంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఎలాంటి రసాయనాలు బీచ్ పరిసరాల్లో కలవకుండా చూడాలి. ఈ సర్టిఫికెట్‌ని డెన్మార్క్‌కి చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్‌ఈఈ) సంస్థ అందిస్తోంది. ఇప్పటివరకు 46 దేశాల్లో 4,500 బీచ్‌లు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్‌ని పొందాయి.
దేశంలో బ్లూఫ్లాగ్ బీచ్‌లుగా ఎంపికై నవి ఇవే..

  • రుషికొండ బీచ్ (ఆంధ్రప్రదేశ్)
  • గోల్డెన్ బీచ్ (ఒడిశా)
  • రాధానగర్ బీచ్ (అండమాన్)
  • కప్పడ్ బీచ్ (కేరళ)
  • పదుబిద్రి బీచ్ (కర్ణాటక)
  • కాసర్‌కోడ్ బీచ్ (కర్ణాటక)
  • ఘోగ్లా బీచ్ (డయ్యూ)
  • శివరాజ్‌పూర్ బీచ్ (గుజరాత్)

క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్లూఫ్లాగ్ బీచ్‌లుగా 8 బీచ్‌లు ఎంపిక
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్‌ఈఈ) సంస్థ
ఎక్కడ : దేశ వ్యాప్తంగా

దేశంలోని ఎన్ని చమురు నిల్వ కేంద్రాలు ఉన్నాయి? అవి ఎక్కడ ఉన్నాయి?
కేంద్ర పెట్రోలియం శాఖ రూ. 3,874 కోట్లతో తక్కువ ధరల వద్ద చమురును కొనుగోలు చేసి దేశంలోని మూడు ప్రాంతాల్లో ఉన్న భూగర్భ చమురు కేంద్రాల్లో నిల్వ చేయగా.. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) అక్టోబర్ 14న ఇందుకు ఆమోదం తెలియజేసింది. ఇలా నిల్వ చేసిన చమురుకు సంబంధించి వాణిజ్య లావాదేవీలు నిర్వహించేందుకు అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీని అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.
మూడు ప్రాంతాలు...
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు కనిష్టాలకు చేరిన సమయంలో కొనుగోలు చేసి, నిల్వ చేసుకునేందుకు గాను కేంద్రం మూడు భూగర్భ నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ బోర్టు(ఓఐడీబీ)కి చెందిన ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్‌స్ లిమిటెడ్(ఐఎస్‌పీఆర్‌ఎల్) ఈ కేంద్రాలను నిర్వహిస్తుంది. ఈ మూడు కేంద్రాలే కాకుండా ఒడిశాలోని చాందీకోల్‌లో నాలుగు మిలియన్ టన్నుల సామర్థ్యంతో మరో చమురు నిల్వ కేంద్రాన్ని నిర్మించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది.
మూడు చమురు నిల్వ కేంద్రాలు

సంఖ్య

నిల్వకేంద్రం, ప్రాంతం

నిల్వ సామర్థ్యం

1

విశాఖపట్నం, ఏపీ

1.3 మిలియన్ టన్నులు

2

మంగళూరు, కర్ణాటక

1.5 మిలియన్ టన్నులు

3

పాడూర్, కర్ణాటక

2.5 మిలియన్ టన్నులు


మోటార్ వాహనాల చట్టంలో కొత్తగా చేర్చిన సెక్షన్? దాని ఉద్దేశం?
Current Affairs
రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం అందించే మానవతావాదులకు భద్రత కల్పించే ఉద్దేశంతో ‘మోటార్ వాహనాల(సవరణ) చట్టం-2019’లో కొత్తగా ‘సెక్షన్ 134ఏ’ ను కేంద్ర ప్రభుత్వం చేర్చింది. దీని ప్రకారం.. రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు సహాయం అందించే వారిని వ్యక్తిగత వివరాలు ఇవ్వాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడానికి వీల్లేదు. సహాయం అందించే వారు పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. విచారణ పేరిట వారిని ఎవరూ వేధించరు.
పంట వ్యర్థాల డీకంపోజ్‌కు కొత్త విధానం
పంట కోత తర్వాత పొలంలో మిగిలిన పంట వ్యర్థాలను పొలాల్లోనే డీకొంపోజ్ చేయడానికి పూసా అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్ నూతన సాంకేతికతని అభివృద్ధిపరిచిందని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఢిల్లీ, దాని ఇరుగుపొరుగు రాష్ట్రాలైన హరియాణా, పంజాబ్, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతో ఆయా రాష్ట్రాలు దట్టమైన కాలుష్యంతో నిండిపోయేవి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మోటార్ వాహనాల(సవరణ) చట్టం-2019లోకి సెక్షన్ 134ఏ
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం అందించే మానవతావాదులకు భద్రత కల్పించే ఉద్దేశంతో

దేశంలో వీవీఐపీల ప్రయాణం కోసం తయారు చేసిన ప్రత్యేక విమానం?
అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం తరహాలోనే మన దేశంలో వీవీఐపీలు ప్రయాణించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ‘ఎయిర్ ఇండియా వన్’ అమెరికా నుంచి భారత్‌కి చేరుకుంది. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ కలిగిన ఈ ‘బోయింగ్-777 విమానం’ అమెరికాలోని టెక్సాస్ నుంచి అక్టోబర్ 1న ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ విమానంలో ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య మాత్రమే ప్రయాణిస్తారు.
విమానంపై అశోక చక్రం...
వీవీఐపీలు ప్రయాణించడానికి వీలుగా డిజైన్ చేసి , క్షిపణి దాడుల్ని తట్టుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసి ఆధునీకరించడం కోసం రెండు విమానాల్ని డల్లాస్(అమెరికా)లో బోయింగ్ సంస్థకి పంపారు. వీటిలో ఒకటి భారత్‌కు వచ్చింది. ఈ విమానంపై భారత్ అనే అక్షరాలు, అశోక చక్రం ఉన్నాయి. 2020, జూలైలోనే ఈ విమానాలు భారత్‌కు చేరుకోవాల్సి ఉండగా కరోనా వైరస్, సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. గడిచిన 25 సంవత్సరాలుగా భారత ప్రధానమంత్రి ఎయిర్‌ఇండియా వన్ కాల్ సైన్‌తో బోయింగ్ 747 విమానాన్ని ఉపయోగిస్తున్నారు.
ఎయిర్ ఇండియా వన్ ప్రత్యేకతలు...

  • ఎయిర్ ఇండియా వన్ విమానంలో భద్రతా వ్యవస్థ అమెరికా అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్‌కి ఏ మాత్రం తీసిపోదు.
  • ఈ విమానానికి క్షిపణి దాడుల్ని ఎదుర్కొనే రక్షణ వ్యవస్థ ఉంది. లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రేర్డ్ కౌంటర్‌మెజర్స్ (ఎల్‌ఏఐఆర్‌సీఎం), సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ (ఎస్‌పీఎస్)ను అమర్చారు.
  • అమెరికా అధ్యక్ష విమానం తర్వాత మన ఎయిర్ ఇండియా వన్‌లోనే ఎస్‌పీఎస్‌ను అమర్చారు. ఈ రక్షణ వ్యవస్థతో శత్రువుల రాడార్ ఫ్రీక్వెన్సీని జామ్ చెయ్యగలదు. క్షిపణుల్ని దారి మళ్లించగలదు.
  • అమెరికా నుంచి భారత్ మధ్య ప్రయాణం ఎక్కడా ఆగకుండా చేయవచ్చు. ఒకసారి ఇంధనం నింపితే ఏకబిగిన 17 గంటలు ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం వాడుతున్న విమానంలో పది గంటల తరువాత మళ్లీ ఇంధనం నింపవలసివస్తుంది.
  • కొత్త విమానం గంటకు 900 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.
  • విమానంలో ప్రధాని కార్యాలయం, సమావేశాల నిర్వహణకు పెద్ద హాలు ఉన్నాయి. ఈ లోహ విహంగం ఫూర్తి స్థాయి ఫ్లయింగ్ కమాండ్ సెంటర్ మాదిరి పనిచేస్తుంది.
  • ఈ రెండు విమానాల తయారీకి రూ.8,400 కోట్లు ఖర్చు అయింది.
  • ఈ విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు నడపరు. భారత వాయుసేనకి చెందిన పైలట్లు నడుపుతారు.
  • ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్)కు ఈ రెండు విమానాల నిర్వహణ బాధ్యతల్ని అప్పగించారు.


వైశ్వక్ భారతీయ వైజ్ఞానిక్(వైభవ్) వర్చువల్ సదస్సు
భారత్‌లోని, విదేశాల్లోని విద్యావేత్తలు, పరిశోధకులు పాల్గొనే ‘వైశ్వక్ భారతీయ వైజ్ఞానిక్(వైభవ్)’ వర్చువల్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 2న ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సదస్సులో సుమారు 55 విదేశాల్లోని 3 వేల మంది భారతీయ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, భారత్ లోని సుమారు 10 వేల మంది సైంటిస్ట్‌లు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ... ‘శాస్త్ర రంగంలో భారత్‌కు ఘనమైన చరిత్ర ఉంది. దురదృష్టవశాత్తూ ఆధునిక కాలానికి ముందంతా చీకటి యుగమని ప్రస్తుత తరానికి అబద్ధాలు నూరిపోశారు’ అనిఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ స్టార్ట్‌అప్‌లకు సహకారం అందించాలని విదేశాల్లోని భారతీయులను కోరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైశ్వక్ భారతీయ వైజ్ఞానిక్(వైభవ్) వర్చువల్ సదస్సు ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : శాస్త్ర సాంకేతిక రంగంపై చర్చలు జరిపేందుకు

భారతీయుల సగటు ఆయుఃప్రమాణం ఎన్ని సంవత్సరాలు?
సెంట్రల్ సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ తాజగా విడుదల చేసిన నివేదిక ప్రకారం... భారతీయుల సగటు ఆయుఃప్రమాణం 69.40 ఏళ్లుగా ఉంది. 2014-2018 సంవత్సరాలకు సంబంధించి నిర్వహించిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్) ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
నివేదికలోని ప్రధాన అంశాలు...

  • భారతీయుల సగటు ఆయుఃప్రమాణం 69.40 ఏళ్లు. మహిళల సగటు ఆయుఃప్రమాణం 70.70 ఏళ్లు కాగా.. పురుషుల ఆయుఃప్రమాణం 68.20 ఏళ్లు.
  • ఆంధ్రప్రదేశ్‌లో పౌరుల సగటు జీవిత కాలం 70 ఏళ్లు. మహిళల్లో సగటు జీవిత కాలం 71.40 ఏళ్లు కాగా.. పురుషుల సగటు జీవిత కాలం 68.70 ఏళ్లు.
  • ప్రజల ఆయుఃప్రమాణంలో దేశంలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీలో పౌరుల సగటు జీవిత కాలం 75.30 ఏళ్లు. కాగా, మహిళల్లో 77 ఏళ్లు, పురుషుల్లో 73.80 ఏళ్లుగా ఉంది.
  • రెండో స్థానంలో కేరళ.. మూడో స్థానంలో జమ్మూ-కశ్మీర్ నిలవగా.. ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో ఉంది.
  • కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పట్టణ ప్రాంత మహిళల కంటే.. గ్రామీణ ప్రాంత మహిళల జీవిత కాలం ఎక్కువ.
  • మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల మహిళల జీవిత కాలం అధికంగా ఉంది.
  • దేశంలో ఆహార భద్రత, వైద్య, ఆరోగ్య సేవలు విస్తరిస్తుండటంతో ప్రజల జీవిత కాలం పెరుగుతూ వస్తోంది.
  • 1970-75లో సగటు భారతీయుని జీవిత కాలం 49.70 ఏళ్లుగా ఉండేది. 2014-18 నాటికి అది 69.40 ఏళ్లకు పెరగడం విశేషం.
  • 1970-90లలో భారతీయుల సగటు జీవిత కాలం దాదాపు మూడేళ్లు పెరిగింది. కాగా 2014-18లో 0.40 ఏళ్లు పెరిగింది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : భారతీయుల సగటు ఆయుఃప్రమాణం 69.40 ఏళ్లు
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : సెంట్రల్ సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్

లద్దాఖ్‌లో గల్వాన్ వీరుల స్మారకం ప్రారంభం
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాడి మరణించిన 20 మంది అమర వీరుల స్మారకార్థం లద్దాఖ్‌లో భారత ఆర్మీ.. ఓ స్మారకాన్ని నిర్మించిందని ఆర్మీ అధికారులు అక్టోబర్ 3న వెల్లడించారు. లద్దాఖ్‌లోని 120వ పోస్ట్‌లో ఈ స్మారకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ స్మారకంపై 20 మంది సైనికుల పేర్లను లిఖించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ మీద కూడా వీరి పేర్లను లిఖించేందుకు రక్షణ శాఖ సన్నాహాలు చేస్తోంది.
రుణాలపై చక్రవడ్డీ మాఫీ...
వ్యక్తిగత రుణగ్రహీతలు, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలకు భారీ ఊరట లభించింది. కోవిడ్ నేపథ్యంలో ప్రకటించిన వాయిదాల చెల్లింపుపై మారటోరియంలో ఆయా రుణాల వడ్డీపై వడ్డీ(చక్రవడ్డీ)ని మాఫీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. రూ.2 కోట్ల వరకు రుణాలపై మారటోరియం విధించిన ఆరు నెలల కాలానికి ఈ రద్దు వర్తింపజేయనున్నట్లు సుప్రీంకోర్టుకు అక్టోబర్ 3న తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో 2020, మార్చి 1 మొదలు ఆగస్టు 31వరకు చెల్లించాల్సిన రుణ వాయిదాలపై ఆర్‌బీఐ మారటోరియం విధించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గల్వాన్ వీరుల స్మారకం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : లద్దాఖ్
ఎందుకు : గల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాడి మరణించిన 20 మంది అమర వీరుల స్మారకార్థం

ప్రపంచంలో అత్యంత పొడవైన హైవే సొరంగ మార్గాన్ని ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు?
హిమాలయ పర్వత సానువుల్లో నిర్మించిన, ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగ మార్గం ‘అటల్ టన్నెల్’ను ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని రోహ్‌తాంగ్‌లో అక్టోబర్ 3న ప్రారంభించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి, లద్దాఖ్‌లోని లేహ్ మధ్య 46 కి.మీ. దూరాన్ని ఈ సొరంగ మార్గం తగ్గిస్తుంది. 9.02 కి.మీ.ల పొడవైన ఈ టన్నెల్ వల్ల ప్రయాణ సమయం 5 గంటలకు తగ్గిపోతుంది. దేశ రక్షణలో అత్యంత వ్యూహాత్మకమైన ఈ సొరంగ మార్గాన్ని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య, ఎన్నో సవాళ్లనెదుర్కొని నిర్మించింది. సొరంగం ప్రారంభం సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ‘కేవలం సైనిక అవసరాలే కాదు, లేహ్, లద్దాఖ్ ప్రాంత ప్రజల బతుకు అవసరాలు కూడా ఈ సొరంగం తీరుస్తుంది’ అని పేర్కొన్నారు.
అటల్ టన్నెల్‌గా పేరు మార్పు
2000 సంవత్సరం జూన్ 3న వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ సొరంగ మార్గాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. 2002 మే 26న ఈ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆరేళ్లలో దీనిని పూర్తి చెయ్యాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాలతో నిర్మాణం సాగలేదు. మొదట్లో దీనిని రోహ్‌తాంగ్ సొరంగం అని పిలిచేవారు. 2019లో దీనికి అటల్ సొరంగం అని పేరు మార్చారు. సొరంగం పూర్తి చేయడానికి పదేళ్లు పట్టింది.
అటల్ టన్నెల్ విశేషాలు...

  • సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తున పీర్ పంజాల్ పర్వత శ్రేణిలో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగమిది. నిర్మాణ వ్యయం రూ.3,300 కోట్లు.
  • ఒకటే ట్యూబ్‌లో, డబుల్ లేన్‌తో ఈ సొరంగాన్ని నిర్మించారు. రోజూ 3వేల కార్లు , 1500 లారీలు రాకపోకలు సాగిం చేలా నిర్మించారు. దీంట్లో వాహనాల గరిష్టవేగం గంటకు 80 కి.మీ.
  • సరిహద్దుల్లో రక్షణ పరంగా ఇది అత్యంత వ్యూహాత్మకమైనది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా మిలటరీ సామగ్రిని తరలించడానికి ఈ సొరంగం బాగా ఉపయోగపడుతుంది.
  • భారీగా మంచు కురవడం వల్ల ఏడాదిలో ఆరునెలలు లేహ్ ప్రాంతవాసులకి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయి. ఈ సొరంగ మార్గంతో అక్కడ ప్రజలు కూడా ప్రయాణించే అవకాశం వచ్చింది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగ మార్గం ‘అటల్ టన్నెల్’ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : రోహ్‌తాంగ్, హిమాచల్‌ప్రదేశ్
ఎందుకు : హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలి, లద్దాఖ్‌లోని లేహ్ను కలిపేందుకు

విద్యార్థుల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు కేంద్రం చేపట్టిన కార్యక్రమం పేరు?
కోవిడ్ 19 ప్రభావం ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులపై పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థుల్లో మానసిక, శారీరక ఇబ్బందులను తొలగించి మనోస్థైర్యాన్ని నింపేందుకు ‘మనోదర్పణ్’ కార్యక్రమం ద్వారా వయో దశలను అనుసరించి సంరక్షణ చర్యలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి అక్టోబర్ 4న ఏపీ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ కె.వెట్రిసెల్వి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు కొన్ని సూచనలు చేశారు.
వీఎంఆర్‌డీఏ తొలి చైర్మన్ కన్నుమూత
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ (59) అక్టోబర్ 4న విశాఖపట్నంలో కన్నుమూశారు. 1961 ఫిబ్రవరి 1న జన్మించిన ఆయన విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీఎంఆర్‌డీఏ తొలి చైర్మన్‌గా పనిచేసిన ఆయన ఇటీవల కరోనా వైరస్‌ను జయించారు.

రెయిజ్ 2020 సదస్సులో ప్రధానంగా ఏ అంశంపై చర్చించారు?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై చర్చించేందుకు నిర్వహించిన ‘రెయిజ్ 2020’ వర్చువల్ సదస్సునుద్దేశించి అక్టోబర్ 5న ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా వాడుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వ్యవసాయం, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, విపత్తు సహాయ చర్యలు.. తదితర విషయాల్లో ఏఐ కీలక పాత్ర పోషించనుందన్నారు. ‘యువత కోసం బాధ్యతాయత కృత్రిమ మేధ’ కార్యక్రమాన్ని ఏప్రిల్‌లో ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా 11 వేల మంది విద్యార్థులు బేసిక్ కోర్స్‌ను పూర్తి చేశారని, వారిప్పుడు సొంతంగా ఏఐ ప్రాజెక్టులను రూపొందిస్తున్నారని తెలిపారు.
సదస్సు సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మాట్లాడుతూ... ఏఐలో అగ్రగామి దేశంగా ఎదిగేందుకు, దేశ ప్రజలందరికీ ఏఐ ప్రయోజనాలు అందించేందుకు కావల్సిన సాధన సంపత్తి భారత్ దగ్గరుందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘రెయిజ్(RAISE) 2020’ సదస్సునుద్దేశించి ప్రసంగం
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై చర్చించేందుకు

దేశంలో నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల్లో ఎంత శాతం తిరిగి వినియోగంలోకి వస్తోంది?
పర్యావరణ నిర్వహణ సేవల్లో ఉన్న హైదరాబాద్ కంపెనీ రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్ ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అక్టోబర్ 5న ఓ యూనిట్‌ను ప్రారంభించింది. న్యూ ఓఖ్లా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ భాగస్వామ్యంతో కంపెనీ దీనిని ఏర్పాటు చేసింది. అయిదు ఎకరాల్లో అత్యాధునికంగా స్థాపించిన ఈ కేంద్రంలో నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను తిరిగి వినియోగంలోకి తెస్తారు. రోజుకు 300 టన్నుల వ్యర్థాలను రీసైకిల్ చేసే సామర్థ్యం ఉంది. 90 శాతంపైగా వ్యర్థాలను పునర్ వినియోగంలోకి తేవొచ్చని కంపెనీ తెలిపింది. దేశంలో నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల్లో 1 శాతమే తిరిగి వినియోగంలోకి వస్తోందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్(సీఎస్‌ఈ) ఇటీవలి అధ్యయనంలో తేలింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్ యూనిట్ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్
ఎక్కడ : నోయిడా, ఉత్తరప్రదేశ్
ఎందుకు : నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు

Published date : 10 Nov 2020 05:01PM

Photo Stories