Aadhaar Update: ఆధార్ కార్డులో చిరునామా మార్పు ఇక చాలా సులువు
ఇంటి పెద్ద(హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ) అంగీకారంతో ఆధార్ పోర్టల్‌లో (ఆన్‌లైన్‌లో) చిరునామా సులువుగా మార్చుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ కొత్త విధానంలో ఇంటి పెద్దతో సంబంధాన్ని ధ్రువీకరించే ఏదైనా పత్రం సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, మార్కుల షీట్, మ్యారేజ్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు తదితర ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించవచ్చు. కానీ, ఇందులో ఇంటిపెద్ద పేరు, దరఖాస్తుదారుడి పేరు, వారిద్దరి మధ్య సంబంధం గురించి తప్పనిసరిగా ఉండాలి. ఆన్‌లైన్‌లో ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ ద్వారా అడ్రస్ మారుతుంది. ఇంటిపెద్ద ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రిలేషన్‌షిప్‌ను నిర్ధారించే డాక్యుమెంట్ లేకపోతే ఇంటిపెద్ద సెల్ఫ్–డిక్లరేషన్ సమర్పించవచ్చు. ఇది యూఐడీఏఐ నిర్దేశించిన ఫార్మాట్‌లో ఉండాలి. ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవడానికి తగిన ధ్రువపత్రాలు లేని వారికి ఈ కొత్త విధానంతో ఏంతో ప్రయోజనం చేకూరుతుందని యూఐడీఏఐ తెలియజేసింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినవారికి సైతం ఉపయోగకరమని వివరించింది.