PM Kisan: మూడేళ్లలో 67% తగ్గిన పీఎం కిసాన్ లబ్ధిదారులు!
అంటే, దాదాపు 8 కోట్ల మంది రైతులను ఈ జాబితా నుంచి తొలగించారు. సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఏ) కింద అడిగిన ప్రశ్నకు సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది. లబ్ధిదారుల సంఖ్య 67% తగ్గిపోవడానికి దారితీసిన కారణాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. పీఎం–కిసాన్ పథకం ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.2 లక్షల కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఏడాదికి రూ.6 వేలను రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా ఏడాదిలో రైతులకు అందించేందుకు పీఎం–కిసాన్‌ను కేంద్రం 2019 ఫిబ్రవరిలో లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రకటించింది.
ఈ ఏడాది అక్టోబర్‌లో తాజాగా 12వ విడత ఇన్‌స్టాల్‌మెంట్‌ను చెల్లించింది. మొదటి విడతలో 11.84 కోట్ల రైతులు లబ్ధిదారులుగా ఉండగా, ఆరో విడత వచ్చే సరికి ఈ సంఖ్య 9.87 కోట్లకు తగ్గింది. ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లబ్ధిదారుల సంఖ్య 55.68 లక్షల నుంచి 28.2 లక్షలకు, మహారాష్ట్రలో 1.09 కోట్ల నుంచి 37.51 లక్షలకు, గుజరాత్‌లో 63.13 లక్షల నుంచి 28.41 లక్షలకు రైతు లబ్ధిదారుల సంఖ్య పడిపోయింది. దేశంలోని మూడొంతుల మంది రైతుల్లో రెండొంతుల మందికి కూడా పీఎం–కిసాన్ అందకపోవడం దారుణమని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రెసిడెంట్ అశోక్ ధావలె అంటున్నారు. ఈ పథకాన్ని క్రమేపీ కనుమరుగు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.