Ukrainian President Zelenskyy: యుద్ధంలో లొంగిపోయే ప్రసక్తే లేదు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
అమెరికాకు విచ్చేసిన జెలెన్‌స్కీ అమెరికా పార్లమెంట్‌లో ఉభయసభలనుద్దేశిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా బిలియన్ డాలర్ల సాయంతో ఉక్రెయిన్‌కు అండగా ఇకమీదటా ఉంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్, కాంగ్రెస్ సభ్యులు జెలెన్‌స్కీకి హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో ప్రసంగించిన జెలెన్‌స్కీకి సభ్యులంతా లేచి నిలబడి చప్పట్లతో తమ మద్దతును ప్రకటించారు. ‘ప్రపంచ ప్రజాస్వామ్యానికి ఇది విషమ పరీక్ష. యుద్ధంలో లొంగిపోయే ప్రసక్తే లేదు. ఉక్రెయిన్ భవిష్యత్తుపై యుద్ధ ప్రభావం ఏ రీతిలో ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది’ అని సభలో జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. అంతకుముందు అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌజ్‌లో బైడెన్‌తో జెలెన్‌స్కీ భేటీ అయ్యారు.
Ukraine war: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారీ ప్రాణనష్టం
దశ నిర్దేశకాలు
‘శాంతి నెలకొనేందుకు దోహదపడే ఉక్రెయిన్ 10 సూత్రాల శాంతి ప్రణాళికను బైడెన్‌కు వివరించా. ఇవి కచ్చితంగా అమలైతేనే సంయుక్త రక్షణకు భరోసా కల్పించిన వారమవుతాం. అన్ని విధాలా మమ్మల్ని ఆదుకుంటున్న అమెరికా, అమెరికన్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చాను. అమెరికా సాయం వితరణో, దానమో కాదు. ప్రపంచ ప్రజాస్వామ్య పరిరక్షణ, భద్రతకు పెట్టుబడి. ఈ సాయాన్ని మరింత బాధ్యతాయుత మార్గంలో సద్వినియోగం చేస్తున్నాం’ అని కాంగ్రెస్ సభలో జెలెన్‌స్కీ అన్నారు. బైడెన్‌తో భేటీ సందర్భంగా ఉక్రెయిన్ సైనిక పురస్కారంతో బైడెన్‌ను జెలెన్‌స్కీ సత్కరించారు.