Skip to main content

2023 Incidents: ఈ ఏడాదిలో జరిగిన ఘటనలు.. సమావేశాలు

ఈ ఏడాది 2023 లో ఎన్నో సంఘటనలు సమావేశాలు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల తుఫాన్లు, రోడ్డు ప్రమాదాలు, దేశాల మధ్య యుద్ధాలు వంటివి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. అందులో ఉన్న ఘటనలే ఈ పది అనూహ్య ఘటనలు..
Incidents and Gatherings in 2023

టర్కీ-సిరియా భూకంపం: 
ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో భూకంపాలు సంభవించాయి. 7.8 తీవ్రతతో సంభవించిన మొదటి ప్రకంపన తరువాత అనేక బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భారీ భూకంపం కారణంగా టర్కీలో 59 వేల మంది, సిరియాలో ఎనిమిది వేల మంది మరణించారు.

ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి: 
అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై అనూహ్య దాడికి దిగి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్‌లో 1,200 మంది మరణించారు. హమాస్ దాదాపు 240 మందిని బందీలుగా పట్టుకుంది. ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించింది. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 18 వేల మందికి పైగా జనం మరణించారు.

అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ : 
2023లో చైనాను దాటి.. భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుంది. భారతదేశ జనాభా అంచనా 1.43 బిలియన్లు (ఒక బిలియన్‌ అంటే వంద కోట్లు). రాబోయే దశాబ్దాల్లో భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశంగా కొనసాగే అవకాశాలున్నాయి.

ఫ్రెడ్డీ తుపాను: 
చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన ఉష్ణమండల తుపాను ఫ్రెడ్డీ 2023లో సంభవించింది. ఇది మలావి, మొజాంబిక్, నైరుతి ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో 14 వందలమందికిపైగా ‍ప్రజలను బలిగొంది. 

జీ 20కి ఆతిథ్యం: 
సెప్టెంబర్ 9-10 తేదీలలో భారతదేశం జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సహా 43 మంది వివిధ దేశాల అధినేతలు హాజరయ్యారు.

కాప్‌-28 సమ్మిట్:
వాతావరణ మార్పులపై కాప్‌-28 సమ్మిట్ దుబాయ్‌లో నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు జరిగింది. ఈ ఏడాది ప్రపంచ ఉష్ణోగ్రత అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటి వరకూ నమోదైన అత్యంత వేడి సంవత్సరంగా 2023 నిలిచింది. ప్రపంచ నేతలంతా ఈ సదస్సులో కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలపై చర్చించారు.

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య: 
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్.. జూన్ 18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో హత్యకు గురయ్యాడు. ఈ నేపధ్యంలో చోటుచేసుకున్న పలు పరిణామాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.

అమెరికాలో ఎగిరిన చైనా బెలూన్లు:  
జనవరి 28 నుండి ఫిబ్రవరి 4 వరకు, చైనా బెలూన్లు అమెరికా ఆకాశంలో ఎగురుతూ కనిపించాయి. ఈ బెలూన్ల సాయంతో చైనా గూఢచర్యం చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా యుద్ధ విమానాలను పంపి బెలూన్‌లను ధ్వంసం చేసింది. ఈ ఘటన చైనా-అమెరికా సంబంధాలలో ఉద్రిక్తతలకు దారితీసింది.

ఎక్స్‌గా మారిన ట్విట్టర్: 
బిలియనీర్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ గత సంవత్సరం ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం ఆయన ట్విట్టర్‌  పేరును ‘ఎక్స్‌’ గా మార్చారు. ట్విట్టర్ లోగోను కూడా మార్చారు.

ఆఫ్ఘనిస్తాన్ భూకంపం: 
అక్టోబర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో నాలుగు వేల మందికి పైగా ప్రజలు మరణించారు. 9 వేల మందికి పైగా జనం గాయపడ్డారు. 13 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి.

Published date : 18 Dec 2023 01:50PM

Photo Stories