Skip to main content

సెప్టెంబర్ 2018 అంతర్జాతీయం

జర్మనీలో పారంభమైన మ్యూనిక్ అక్టోబర్ ఫెస్ట్
Current Affairs అది జర్మనీలోని మ్యూనిక్ నగరం. ఏటా సెప్టెంబర్ వచ్చిందంటే చాలు అక్కడి జనాలకు, ప్రపంచ దేశాల్లోని ఔత్సాహిక పర్యాటకులకు పండగే పండగ. ఎందుకంటే అక్కడో పెద్ద పండగ జరుగుతుంది. దానిపేరే మ్యూనిక్ అక్టోబర్ ఫెస్ట్. 16 రోజుల పాటు జరిగే ఈ పండగను అక్కడి జనం ‘వీసన్’అని పిలుచుకుంటారు. ఏటా సెప్టెంబర్ మూడో శనివారం ప్రారంభమై అక్టోబర్ మొదటి ఆదివారంతో ముగుస్తుంది. ఈ ఉత్సవాలకు హాజరయ్యేందుకు గతేడాది నుంచి భారతీయులు భారీగా వెళుతున్నారని హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లిన పి.రాజగోపాలరాజు చెప్పారు.
సెప్టెంబర్ మూడో శనివారం అంటే నిన్నటితో (సెప్టెంబర్ 22) ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. అక్కడి జనం ఈ అక్టోబర్ ఫెస్టివల్‌లో అంబరాన్ని తాకేలా సంబరాలు చేసుకుంటారు. ప్రపంచంలో అత్యంత అద్భుతంగా వినోద పర్యాటకంగా నిర్వహించే అతిపెద్ద ఆటవిడుపు ఇది. తెలుగు వారికి చెందిన శ్రీ బాలాజీ ఇండియన్ మార్కెట్ దుకాణానికి అతి దగ్గరగా ఈ ఉత్సవం జరిగే ప్రదేశం ఉంది. గతేడాది ఈ ఉత్సవాలకు దాదాపు 65 లక్షల మంది ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చారు. అక్కడ జరిగిన అమ్మకాల విలువ బిలియన్ యూరోలు ఉంటుందని అంచనా.
ఫెస్టివల్ ప్రారంభానికి ముందు మ్యూనిక్ నగరం మధ్య నుంచి ఈ ఉత్సవం జరిగే ప్రదేశం వరకు ఈ గుర్రాల ఊరేగింపు ప్రారంభ సూచకంగా నిర్వహిస్తారు. ఈ ప్రారంభ వేడుకల్లో పాల్గొనడాన్ని స్థానిక బవేరియన్లు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో వ్యవసాయ ప్రధానమైన జానపద కళారూపాలను ప్రదర్శిస్తారు. రెండు ప్రపంచ యుద్ధాలు జరిగిన సమయాల్లో ఈ ఉత్సవాలను ఆపేశారు. ఆ తర్వాత 1950 నుంచి అక్టోబర్ ఫెస్టివల్ జరుగుతూ వస్తోంది. ఈ వేడుకలను అక్కడి మేయర్‌తో ప్రారంభింపజేయడం ఆనవాయితీ. పెద్ద పెద్ద గుడారాలను నిర్మించి ప్రముఖ మద్యం కంపెనీలు మద్యాన్ని సరఫరా చేస్తాయి. అయితే ఈ మద్యం మాత్రమే కాకుండా సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని నిర్వాహకుల తాపత్రయం. ఇక్కడ మాత్రమే దొరికే బీర్ అంటూ ప్రత్యేకంగా కుళాయి ద్వారా పెద్ద పెద్ద గ్లాసుల్లో నింపుకుని తాగడం ఇక్కడి ప్రత్యేకత. ఈ బీరు పేరు గోల్డెన్ అంటారు. ఇవి మాత్రమే కాదు, రకరకాల సంప్రదాయక వంటకాలతో అక్కడికి వచ్చిన వారి నోరూరిస్తారు.
ఈ ఫెస్టివల్‌కు కొన్ని శతాబ్దాల చరిత్రే ఉంది. 1810 అక్టోబర్ 12న ఇక్కడి బవేరియా రాజకుమారుడు లుడ్విగ్ సమీప రాకుమారి థెరిసెతో పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఖరీదైన విందు వినోదాలు మళ్లీ జరపాలనే ఆలోచన నుంచి ఆవిర్భవించిందే ఈ అక్టోబర్ ఫెస్టివల్. ఈ పెళ్లి మొదటి వార్షికోత్సవం సందర్భంగా జరిగిన గుర్రాల పరుగు పందేలు చాలా కాలం వరకు జరిగాయి. ఇప్పటికీ ఫెస్టివల్ ప్రారంభంలో జరిగే బ్రెవరీ కంపెనీల ఊరేగింపుల్లో గుర్రాలు ముందు నడుస్తూ కనువిందు చేస్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటీ : మ్యూనిక్ అక్టోబర్ ఫెస్ట్
ఎప్పుడు : సెప్టెంబర్ మూడో శనివారం ప్రారంభమై అక్టోబర్ మొదటి ఆదివారం వరకు
ఎవరు : జపాన్ ప్రజలు
ఎక్కడ : జర్మనీలోని మ్యూనిక్ నగరం

అభివృద్ధి నిబద్ధత సూచీలో స్వీడన్ కు అగ్రస్థానం
Current Affairs విదేశాలకు ఆర్థిక సాయం, పర్యావరణ విధానాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన అభివృద్ధి నిబద్ధత సూచీ (కమిట్‌మెంట్ టు డెవలప్‌మెంట్ ఇండెక్స్)లో స్వీడన్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ (సీజీడీ) సెప్టెంబర్ 18న అభివృద్ధి నిబద్ధత సూచీని విడుదల చేసింది. మొత్తం 27 ధనిక దేశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు.
ఈ జాబితాలో డెన్మార్క్ రెండో స్థానంలో నిలవగా జర్మనీ, ఫిన్‌లాండ్‌లు మూడో ర్యాంకు సొంతం చేసుకున్నాయి. అలాగే అమెరికా 23వ స్థానంలో ఉండగా చివరి నాలుగు స్థానాల్లో పోలండ్, గ్రీస్, దక్షిణ కొరియా, జపాన్ ఉన్నాయి. ఈ సూచీలో ఐరోపా దేశాలు తొలి 12 స్థానాలను దక్కించుకొన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అభివృద్ధి నిబద్ధత సూచీలో స్వీడన్ కు అగ్రస్థానం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ (సీజీడీ)

మూవ్’ను ప్రారంభించిన మోదీ
ప్రపంచ తొలి గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్ (ప్రపంచ రవాణా సదస్సు) ‘మూవ్’ను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో సెప్టెంబర్ 7న ప్రారంభించారు. ఈ సదస్సులో ప్రసంగించిన మోదీ మెరుగైన రవాణాతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి పెరుగుతుందని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, బ్యాటరీలు, స్మార్ట్ చార్జింగ్ సదుపాయాలు సహా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి అన్ని విభాగాల్లో (చైన్) పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. భారత్‌లో భవిష్యత్తు రవాణాపై తన విజన్... సాధారణ, అనుసంధాన, సౌకర్యవంతమైన, రద్దీ రహిత, శుద్ధ ఇంధన తదితర ఏడు ‘సీ’ల (కామన్, కనెక్టెడ్, కన్వీనియెంట్, కంజెషన్ ఫ్రీ, చార్జ్‌డ్, క్లీన్, కటింగ్ ఎడ్‌‌జ) ఆధారంగా ఉంటుందని మోదీ చెప్పారు.
నీతి ఆయోగ్ రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ సదస్సులో ప్రపంచ ఆటోమొబైల్ సంస్థల సీఈవోలు, పలు దేశాల ప్రభుత్వ నేతలు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ తొలి గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్ (మూవ్) ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఢిల్లీ

అక్టోబర్ 31న పటేల్ విగ్రహావిష్కరణ
స్వదేశీ సంస్థాలను దేశంలో విలీనం చేసిన ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్మారకంగా నర్మదా నది ఒడ్డున 182 మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేస్తున్న ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ (ఐక్యతా విగ్రహం)ను అక్టోబర్ 31న ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించనున్నారు. అక్టోబర్ 31న పటేల్ 143 జయంతి సందర్భంగా ప్రదాని మోదీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సెప్టెంబర్ 9న వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : నర్మదా నది ఒడ్డున, గుజరాత్

సెక్షన్ 377 కేసులు యూపీలో అత్యధికం
దేశంలో స్వలింగ సంపర్కులకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 377 కింద అత్యధిక కేసులు ఉత్తరప్రదేశ్‌లో నమోదయ్యాయి. ఈ మేరకు జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్బీ) నివేదిక ప్రకారం 2016లో యూపీలో 999 కేసులు నమోదుకాగా, కేరళ (207), ఢిల్లీ(183), మహారాష్ట్ర(170)లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా 2016లో దేశవ్యాప్తంగా పురుష స్వలింగ సంపర్కులపై 2,195 కేసులు నమోదుకాగా, 2015లో 1,347, 2014లో 1,148 కేసులు నమోదయ్యాయి.
ఇద్దరు వయోజనులైన పురుషులు లేదా స్త్రీల మధ్య పరస్పర సమ్మతితో ప్రైవేటుగా జరిగే లైంగికచర్య నేరం కాదంటూ ఐపీసీ సెక్షన్ 377లోని కొన్ని నిబంధనలను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. అయితే అవతలి వ్యక్తి సమ్మతి లేకుండా లేదా మైనర్లతో లేదా జంతువులతో జరిపే లైంగిక చర్యను నేరంగానే పరిగణించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘సెక్షన్ 377’ కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రం
ఎప్పుడు : 2016
ఎవరు : ఉత్తరప్రదేశ్
ఎక్కడ : దేశవ్యాప్తంగా

రాజ్యసభ ఎన్నికల్లో నోటా’ తొలగింపు
రాజ్యసభ, శాసన మండలి ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లలో నోటా(నన్ ఆఫ్ ది ఎబో- పై వారు ఎవరూ కాదు) గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సెప్టెంబర్ 11 తొలగించింది. రాజ్యసభ ఎన్నికల బ్యాలెట్ ఆప్షన్లకు నోటా వర్తించదని స్పష్టంచేస్తూ ఆగస్టు 21న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. అయితే కోర్టు సూచన మేరకు లోక్‌సభ, శాసనసభ వంటి ప్రత్యక్ష ఎన్నికల్లో నోటాను వినియోగిస్తామని ఈసీ వెల్లడించింది.
రాజ్యసభ ఎన్నికల్లో నోటాకు చోటు కల్పిస్తూ ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌కు సవరణలు సూచిస్తూ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల బెంచ్ తీర్పు చెప్పింది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల కోసం మాత్రమే నోటా అని కోర్టు వ్యాఖ్యానించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్యాలెట్ పేపర్లలో నోటా గుర్తు తొలగింపు
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : భారత ఎన్నికల సంఘం
ఎక్కడ : రాజ్యసభ, శాసనమండలి ఎన్నికల్లో

బిమ్స్‌టెక్ సదస్సులో పాల్గొన్న మోదీ
Current Affairs నాలుగో బిమ్స్‌టెక్ (బంగాళాఖాత దేశాల ఆర్థిక సహకార సంస్థ) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 30న పాల్గొన్నారు. నేపాల్ రాజధాని కఠ్మాండులో జరుగుతున్న ఈ సదస్సులో మోదీ ప్రసంగిస్తూ... ఉగ్రవాదంపై పోరు, మాదక ద్రవ్యాల అక్రమరవాణా అడ్డుకట్టకు సభ్య దేశాల మధ్య అనుసంధానం పెరగాలని అన్నారు.
బిమ్స్‌టెక్ దేశాల ఉమ్మడి లబ్ధి కోసం వ్యవసాయ పరిశోధన, స్టార్టప్స్ వంటి అంశాల్లో సదస్సు నిర్వహిస్తామన్నారు. బంగాళాఖాతం ప్రాంతంలోని కళలు, సంస్కృతి, ఇతర అంశాలపై పరిశోధన కోసం నలంద యూనివర్సిటీలో ‘బే ఆఫ్ బెంగాల్ అధ్యయన కేంద్రం’ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే ‘నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్’లో చదివేందుకు బిమ్స్‌టెక్ సభ్యదేశాలకు చెందిన విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణులకు స్కాలర్‌షిప్ అందచేస్తామన్నారు. మరోవైపు సదస్సులో పాల్గొన్న శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మోదీ ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
బిమ్స్‌టెక్‌లో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, భూటాన్, నేపాల్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ప్రపంచ జనాభాలో ఈ దేశాల మొత్తం వాటా 22 శాతం ఉండగా జీడీపీ 2.8 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాలుగో బిమ్స్‌టెక్ సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ
ఎప్పుడు : ఆగస్టు 30
ఎక్కడ : కఠ్మాండు, నేపాల్

ముగిసిన బిమ్స్‌టెక్ సదస్సు
నాలుగో బిమ్స్‌టెక్(బంగాళాఖాత దేశాల ఆర్థిక, సాంకేతిక కూటమి) సదస్సు ఆగస్టు 31న ముగిసింది. ఈ సందర్భంగా బిమ్స్‌టెక్ దేశాలు కఠ్మాండు డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. బిమ్స్‌టెక్ దేశాలు విభిన్న రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న దేశాలను గుర్తించి ఉగ్ర హింసకు వాటినీ బాధ్యుల్ని చేయడం వంటి అంశాలను డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఇంధన రంగంలో సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి బిమ్స్‌టెక్ గ్రిడ్ ఇంటర్‌కనెక్షన్ ఏర్పాటుకు అవగాహనా ఒప్పందం కుదిరింది. ఆగస్టు 30 నుంచి 31 వరకు నేపాల్ రాజధాని కఠ్మాండులో జరిగిన ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేపాల్, థాయ్‌లాండ్, మయన్మార్, భూటాన్ దేశాధినేతలతో సమావేశమైన మోదీ ద్వైపాక్షిక అంశాలపై చ ర్చలు జరిపారు.
ధరమ్‌శాల ను ప్రారంభించిన మోదీ.....
నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయ పరిసరాల్లో నిర్మించిన ‘భారత్ నేపాల్ మైత్రి ధరమ్‌శాల’ను నేపాల్ ప్రధాని ఓలితో కలసి మోదీ ప్రారంభించారు.యాత్రికులు విశ్రాంతి తీసుకునేందుకు భారత ఆర్థిక సాయంతో 400 పడకలతో భాగమతి నదీ ఒడ్డున ధరమ్‌శాలను నిర్మించారు. మరోవైపు రాక్సాల్ (బిహార్)-కఠ్మాండు మధ్య వ్యూహాత్మక రైల్వే లైను నిర్మాణానికి భారత్, నేపాల్‌లు అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కదుర్చుకున్నాయి. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ రచనల్ని నేపాలీ భాషలో ప్రచురించాలని నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మోదీ స్వాగతించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముగిసిన నాలుగవ బిమ్స్‌టెక్ సదస్సు
ఎప్పుడు : ఆగస్టు 31
ఎక్కడ : కఠ్మాండు, నేపాల్
Published date : 20 Sep 2018 03:54PM

Photo Stories