Russia-Ukraine War: చెర్నోబిల్ అణు ప్రమాదం ఏ సంవత్సరం జరిగింది?
ఉక్రెయిన్‌లో జపోరిజియా అణు విద్యుత్కేంద్రంపై రష్యా క్షిపణి దాడులతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రేడియో ధార్మికత విడుదల కాకుండా ప్లాంట్‌లో పకడ్బందీ భద్రత ఉండడంతో పెను ప్రమాదమే తప్పింది. అలాగాక అణు రియాక్టర్లు పేలి ఉంటే యూరప్ సర్వనాశనమై పోయేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. గతంలో జరిగిన చెర్నోబిల్, ఫుకుషిమా వంటి ఘోర అణు ప్రమాదాలను తలచుకొని యూరప్ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో యూరప్ మాత్రమే గాక యావత్ ప్రపంచమే ప్రమాదంలో పడిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
చెర్నోబిల్‌లో ఏం జరిగింది?
1986 ఏప్రిల్ 26వ తేదీన తెల్లవారుజామున 1:23 గంటల సమయంలో.. చెర్నోబిల్ అణు ప్రమాదం జరిగింది. ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రంలోని నాలుగు అణు రియాక్టర్లలో ఒకటి ప్రమాదవశాత్తూ పేలిపోయింది. అణు విద్యుత్కేంద్రం భద్రతపై పరీక్షలు జరిపిన ఇంజనీర్లు కరెంటు సరఫరా ఆగిపోతే ఏమౌతుందన్న అంచనాలతో చేపట్టిన ప్రయోగం విఫలమై అతి పెద్ద అణు వినాశనానికి దారితీసింది. ఈ ప్రమాదం వల్ల చెలరేగిన మంటలు తొమ్మిది రోజుల పాటు ఎగసిపడుతూనే ఉన్నాయి.
2 లక్షల మంది వరకు..
అణు రియాక్టర్ పేలుడు జరిగినప్పుడు ప్లాంట్‌లో 130 మంది ఉన్నారు. అక్కడికక్కడే ఇద్దరే మరణించినా రేడియేషన్ దుష్ప్రభావాలతో తర్వాత 50 మంది ప్లాంట్ కార్మికులు, అగ్నిమాపక దళ సభ్యులు మరణించారు. మిగతా వారంతా అక్యూట్ రేడియేషన్ సిండ్రోమ్ (ఏఆర్‌ఎస్)తో బాధపడుతూ జీవచ్ఛవాలుగా మిగిలారు. ప్రమాదం జరిగిన వెంటనే 30 వేల మందిని తరలించారు. తర్వాత మరో 3.5 లక్షల మంది తరలివెళ్లారు. వీరిలో 6 వేల మంది రేడియేషన్ కారణంగా థైరాయిడ్, కేన్సర్ బారిన పడినట్టు తేలింది. రేడియేషన్ వల్ల చర్మం, గొంతు కేన్సర్‌తో 2 లక్షల మంది వరకు మరణించినట్టు అంచనా. రేడియేషన్ దుష్ప్రభావాలతో ఎంతమంది మరణించారో ఇప్పటికీ పక్కాగా లెక్కల్లేవు.
అత్యధిక అణుధార్మికత ఉన్న జోన్..
చెర్నోబిల్ అణు ప్రమాదం వల్ల విడుదలైన.. రేడియేషన్ రష్యా నుంచి ఐర్లాండ్ దాకా 13 దేశాలకు వ్యాపించింది. చెర్నోబిల్ చుట్టుపక్కల 2,600 చదరపు కిలోమీటర్లను నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించారు. ప్రపంచంలో అత్యధిక అణుధార్మికత ఉన్న జోన్ ఇదే. రేడియో ధార్మికతని తట్టుకునే ఎలుగుబంట్లు, తోడేళ్లు వంటి జంతుజాలం మాత్రమే అక్కడ జీవిస్తోంది. అక్కడ మళ్లీ మనుషులు జీవించే పరిస్థితులు నెలకొనాలంటే 3,000 ఏళ్లు పడుతుందని అంచనా. చెర్నోబిల్‌ను డార్క్ టూరిజం ప్లేస్‌గా మార్చి సందర్శకులకు అనుమతిస్తున్నారు.
Russia-Ukraine War: యూరప్‌లోనే అతి పెద్దదైన అణు విద్యుత్కేంద్రం పేరు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్