Skip to main content

Russia-Ukraine War: యూరప్‌లోనే అతి పెద్దదైన అణు విద్యుత్కేంద్రం పేరు?

Zaporizhzhia nuclear power plant

ఉక్రెయిన్‌లో రష్యా అణు చెలగాటమాడుతోంది. వారం కింద చెర్నోబిల్‌ అణు విద్యుత్కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న వైనాన్ని మర్చిపోకముందే మరో అణు ప్లాంట్‌పై దాడికి తెగబడింది. ఆగ్నేయ ప్రాంతంలో ఎనర్‌హోడర్‌ నగరంపై మార్చి 4న రష్యా దళాలు యుద్ధ ట్యాంకులతో భారీ దాడులకు దిగాయి. దాన్ని ఆక్రమించే ప్రయత్నంలో యూరప్‌లోనే అతి పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్కేంద్రం వద్దా బాంబుల వర్షం కురిపించినట్టు సమాచారం. దాంతో వాడుకలో లేని ఒకటో నంబర్‌రియాక్టర్‌కు మంటలంటుకున్నట్టు తెలుస్తోంది. భద్రతా, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి వాటిని ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలకు కాల్పులే కారణమా అన్నది తెలియరాలేదు.

రష్యా దాడుల్లో ప్లాంటులోని శిక్షణ కేంద్రం దెబ్బ తిన్నది తప్పిస్తే అందులోని ఆరు రియాక్టర్లకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) చీఫ్‌ రాఫెల్‌ గ్రోసీ అన్నారు. ఉక్రెయిన్‌ విద్యుత్‌ అవసరాల్లో 25 శాతాన్ని తీరుస్తున్న జపోరిజియా ప్లాంటులోని ఆరు అణు రియాక్టర్లలో ప్రస్తుతం ఒక్కటే 60 శాతం సామర్థ్యంతో పని చేస్తోంది.

జపోరిజియా అణు విద్యుత్కేంద్రం ప్రత్యేకతలు

  • యూరప్‌లోనే అతి పెద్ద అణు విద్యు త్కేంద్రం. ప్రపంచంలో తొమ్మిదోది.
  • ప్లాంట్‌లో 6 వీవీఈఆర్‌–1000 పీడబ్ల్యూఆర్‌ అణు రియాక్టర్లున్నాయి. ఒక్కోదాని విద్యుదుత్పత్తి సామర్థ్యం 950 మెగావాట్లు. 
  • డాన్‌బాస్, కీవ్‌ మధ్య ఎనర్‌హోడార్‌ నగరంలోని కఖ్వోకా రిజర్వాయర్‌ సమీపంలో ఉన్న ఈ ప్లాంటు 40 లక్షల గృహ అవసరాలను తీరుస్తోంది. 
  • ఉక్రెయిన్‌కు అవసరమైన విద్యుత్‌ సరఫరా లో సగం అణు ప్లాంట్ల నుంచే వస్తోంది. జపోరిజియా ప్లాంట్‌ నుంచి దేశ అవసరాల్లో ఐదో వంతు ఉత్పత్తవుతోంది. 
  • 1984–1995 మధ్య దీని నిర్మాణం జరిగింది. దీని డిజైన్‌ చెర్నోబిల్‌ ప్లాంట్‌ కంటే ప్రత్యేకంగా ఉంటుంది. అగ్నిప్రమాదం తలెత్తినా అణుముప్పు సంభవించకుండా భద్రత ఏర్పాట్లున్నాయి.
     

Satellite Company: రష్యా ఉపగ్రహాల ప్రయోగాలు నిలిపివేసిన సంస్థ?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 05 Mar 2022 12:19PM

Photo Stories