Skip to main content

Quad summit 2021: క్వాడ్‌ దేశాల శిఖరాగ్ర సమావేశం ఏ దేశ రాజధానిలో జరగనుంది?

Quad summit 2021

అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్‌లో సెప్టెంబర్‌ 24న క్వాడ్‌ (Quadrilateral Security Dialogue-Quad) శిఖరాగ్ర సదస్సు–2021 జరగనుంది. నాలుగు దేశాల కూటమైన (అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా) క్వాడ్‌ సదస్సులో... ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లైన అఫ్గాన్‌ సంక్షోభం, కోవిడ్‌ మహమ్మారి, స్వేచ్ఛాయుత ఇండో ఫసిఫిక్‌ విధానంపై చర్చించనున్నారు. 2021, మార్చిలో కరోనా విజృంభణ కారణంగా నాలుగు దేశాల అధినేతలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. తాజా సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మోరిసన్, జపాన్‌ ప్రధాని యోషిహిడే సుగా తొలిసారిగా ప్రత్యక్షంగా సమావేశమవుతున్నారు. ఇప్పటివరకు క్వాడ్‌ సమావేశాలు విదేశాంగ మంత్రులు, దౌత్య ప్రతినిధుల మధ్య మాత్రమే జరిగాయి.

సదస్సులో చర్చకు వచ్చే అంశాలు..

  • ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా పట్టు పెరిగిపోతున్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత వాణిజ్యం నెలకొల్పడం
  • దక్షిణ కొరియా, న్యూజిలాండ్, వియత్నాం దేశాలను కూడా కలుపుకొని క్వాడ్‌ ప్లస్‌ కూటమి ఏర్పాటు
  • 2021, మార్చిలో ప్రకటించిన క్వాడ్‌ వ్యాక్సిన్‌పై సమీక్ష
  • పర్యావరణ మార్పుల్ని ఎదుర్కోవడం
  • సైబర్‌ స్పేస్, జీ5 టెక్నాలజీలో పరస్పర సహకారం

క్వాడ్‌ లక్ష్యాలేంటి?

క్వాడిలేటరలర్‌ సెక్యూరిటీ డైలాగ్‌(క్వాడ్‌)... అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలు ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో తమ ప్రయోజనాలు కాపాడుకుంటూ భద్రతలో ఒకరికొకరు సహకరించుకోవడం దీని లక్ష్యం. 2004లో సునామీ అల్లకల్లోలం తర్వాత విపత్తుల సమయంలో సహకరించుకోవడానికి ఏర్పడిన ఈ కూటమి.. 2007లో అప్పటి జపాన్‌ ప్రధాని షింజో అబె చొరవతో ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి భద్రతల స్థాపనే లక్ష్యంగా రూపాంతరం చెందింది.

చ‌ద‌వండి: 21వ ఎస్‌సీవో సదస్సు ఎవరి అధ్యక్షతన జరగనుంది?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 2021, సెప్టెంబర్‌ 24న క్వాడ్‌ (Quadrilateral Security Dialogue-Quad) సదస్సు నిర్వహణ
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 24
ఎవరు    : అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా
ఎక్కడ    : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : అఫ్గాన్‌ సంక్షోభం, కోవిడ్‌ మహమ్మారి, స్వేచ్ఛాయుత ఇండో ఫసిఫిక్‌ విధానంపై చర్చలు జరిపేందుకు...

 

Published date : 25 Sep 2021 05:08PM

Photo Stories