NATO: స్పెయిన్ లో నాటో వార్షిక సదస్సు - ఉక్రెయిన్ కు సాయంపై తీర్మానం
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గజేషన్ (నాటో) సభ్య దేశాల వార్షిక సదస్సు జూన్ 29న జరిగింది. అనంతరం 30 దేశాల నాటో కూటమి ఒక ప్రకటన విడుదల చేసింది. నాటో సభ్య దేశాల శాంతిభద్రతలకు రష్యా నేరుగా ముప్పుగా పరిణమించిందని అమెరికా సహా పలు దేశాలు ఆందోళన వెలిబుచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద భద్రతా ముప్పుని ఎదుర్కొంటున్నామన్నాయి. యూరప్‌లో ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత కుదుర్చుకున్న భద్రతాపరమైన ఒప్పందాలను రష్యా తుంగలోకి తొక్కి ఉక్రెయిన్‌పై దండెత్తిందని ధ్వజమెత్తాయి. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు రాజకీయంగా, ఆచరణీయంగా మద్దతిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యూరప్‌లో శాంతిని విచ్ఛిన్నం చేశారని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోటెన్‌బెర్గ్ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాటో సభ్య దేశాలకు భద్రతాపరంగా పెను సవాళ్లు విసురుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Also read: Flipkart తో తెలంగాణ సెర్ప్ ఒప్పందం
పోలండ్‌లో శాశ్వత సైనిక కేంద్రం
యూరప్‌కు మరిన్ని అమెరికా బలగాలను తరలిస్తామని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ప్రాంతీయ భద్రత కోసం పోలండ్‌లో తొలి శాశ్వత మిలటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అమెరికాకు చెందిన లక్ష బలగాలు నిరంతరం యూరప్‌లో ఉండేలా చూస్తామన్నారు.
Also read: GK Sports Quiz: 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రంలో జరగనున్నాయి?
పుతిన్ మహిళ అయ్యుంటే... యుద్ధం వచ్చేది కాదు: జాన్సన్
రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మహిళ అయి ఉంటే ఉక్రెయిన్ యుద్ధం వచ్చి ఉండేది కాదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. జర్మనీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో పుతిన్ పురుషాహంకారం కనిపిస్తోంది. ఆయన మహిళ అయ్యుంటే పురుషాహంభావంతో ఇలాంటి పిచ్చి యుద్ధానికి దిగేవారు కాదు’’ అన్నారు. ప్రపంచంలో శాంతి స్థాపన జరగాలంటే అత్యధిక దేశాల్లో మహిళలు అధికారంలోకి రావాలని అభిప్రాయపడ్డారు.