UN Security Council: జీ–4 దేశాల విదేశాంగమంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా న్యూయార్క్‌కు చేరుకున్న జీ–4 దేశాల(భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్) విదేశాంగ మంత్రులు సెప్టెంబర్ 22న సమావేశమయ్యారు. భారత విదేశాంగ మంత్రి జై శంకర్, బ్రెజిల్ విదేశాంగ మంత్రి కార్లోస్ ఆల్బెర్టో ఫ్రాంకో ఫ్రాంకా, జర్మనీ విదేశాంగ మంత్రి హైకో మాస్, జపాన్ విదేశాంగ మంత్రి మొతెగి తొషిమిట్సులు ఈ భేటీలో పాల్గొన్నారు. భేటీ అనంతరం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం జీ–4 దేశాలు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే.
ప్రకటనలోని ముఖ్యాంశాలు...
- ప్రపంచవ్యాప్తంగా శాంతి సామరస్యాలు మరింతగా పరిఢవిల్లాలంటే ఐరాస భద్రతా మండలిలో అందుకనుగుణంగా సంస్కరణలు అనివార్యం. భద్రతా మండలిలో మరి కొన్ని దేశాలకు శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాల హోదా ఇవ్వడం ద్వారా ఇది సుసాధ్యమవుతుంది.
- భద్రతా మండలిలో సంస్కరణల బాధ్యతలు చూసే ఇంటర్–గవర్నమెంటల్ నెగోషియేషన్స్(ఐజీఎన్) విభాగంతో లిఖితపూర్వక చర్చలకు సిద్ధం.
- ఐరాస మూడు కీలక విభాగాలైన భద్రతా మండలి, సర్వ ప్రతినిధి సభ, ఆర్థిక, సామాజిక మండలిలో సంస్కరణలు తప్పనిసరి అని ‘అవర్ కామన్ అజెండా’ నివేదికలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ వ్యాఖ్యానించారని ఆయా దేశాలు గుర్తుచేశాయి.
చదవండి: కొత్తగా ఏర్పాటైన ‘ఆకస్’ కూటమిలోని సభ్య దేశాల సంఖ్య?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీ–4 దేశాల(భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్) విదేశాంగ మంత్రుల సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : భారత విదేశాంగ మంత్రి జై శంకర్, బ్రెజిల్ విదేశాంగ మంత్రి కార్లోస్ ఆల్బెర్టో ఫ్రాంకో ఫ్రాంకా, జర్మనీ విదేశాంగ మంత్రి హైకో మాస్, జపాన్ విదేశాంగ మంత్రి మొతెగి తొషిమిట్సు
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
ఎందుకు : ఐరాస భద్రతా మండలిలో రి కొన్ని దేశాలకు శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాల హోదా ఇవ్వడంపై చర్చించేందుకు...