Skip to main content

జూన్ 2017 అంతర్జాతీయం

ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా డే
Current Affairs
ప్రపంచ వ్యాప్తంగా మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. లక్నోలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న కార్యక్రమంలో 51 వేల మంది యోగాలో పాల్గొన్నారు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్‌లో యోగా గురు రాందేవ్ బాబా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్యర్యంలో 54 వేల మందికి పైగా పాల్గొని గిన్నీస్ రికార్డు సృష్టించారు. లండన్ ఐ, ఐఫిల్ టవర్‌ల వద్ద కూడా భారీగా జనం ఆసనాలు వేశారు. న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి యోగాపై ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది.
ఐక్యరాజ్య సమితి 2014 డిసెంబర్ 11న ఏటా జూన్ 21న యోగా దినోత్సవం నిర్వహించాలని తీర్మానించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఎప్పుడు : జూన్ 21
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎవరు: యోగా ప్రత్యేక స్టాంప్ విడుదల చేసిన ఐరాస

సౌదీ యువరాజుగా బిన్ సల్మాన్
సౌదీ అరేబియా రాజు మహమ్మద్ సల్మాన్ తన కొడుకు, డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్ అయిన మహ్మద్ బిన్ సల్మాన్(31)ను యువరాజు(క్రౌన్ ప్రిన్స్)గా నియమించారు. దీంతో తన తరువాత సింహాసనాన్ని చేపట్టే అవకాశాన్ని కొడుకుకు కల్పించినట్లయింది. ఇప్పటిదాకా యువరాజు స్థానంలో ఉన్న సోదరుడి కుమారుడు మహ్మద్ బిన్ నయేఫ్(51)ను తప్పించడంతో పాటు ఆయన్ని డిప్యూటీ ప్రధాని, అంతర్గత భద్రత మంత్రిగా కూడా తొలగించారు. యువరాజుగా ఎంపికై న మహ్మద్ బిన్ సల్మాన్ ఇప్పటికే రక్షణ శాఖ మంత్రిగా, ఆర్థిక మండలి అధిపతిగా వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సౌదీకి కొత్త యువరాజు
ఎప్పుడు : జూన్ 21
ఎవరు: బిన్ సల్మాన్
ఎక్కడ : సౌదీ అరేబియా
ఎందుకు : మహ్మద్ బిన్ నయేఫ్ స్థానంలో

అమెరికాలో టాప్ ఎంప్లాయర్‌గా టీసీఎస్
దేశీ దిగ్గజ ఐటీ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్) అమెరికాలో టాప్ ఎంప్లాయర్‌గా అవతరించింది. ఈ మేరకు కేంబ్రిడ్‌‌జ గ్రూప్ వెలువరించిన నివేదికలో ఐటీ సర్వీసెస్ రంగానికి సంబంధించి ఉపాధి కల్పనలో అగ్రస్థానాన్ని టీసీఎస్ కైవసం చేసుకుంది.
టీసీఎస్ గత ఐదేళ్లలో (2012-2016) 12,500 మందికి పైగా అమెరికన్లకు ఉపాధి కల్పించింది. ఇదే సమయంలో అమెరికా ఉద్యోగి వృద్ధిలో 57 శాతం వాటాతో టాప్‌లో దూసుకెళ్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికాలో టాప్ ఎంప్లాయర్
ఎప్పుడు : జూన్ 23
ఎవరు: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
ఎందుకు : ఐటీ సర్వీసెస్ రంగానికి సంబంధించిన ఉపాధి కల్పనలో

అమెరికా ‘ట్రావెల్ బ్యాన్’కు అనుమతి
ఆరు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి పౌరుల రాకపై అమెరికా ప్రభుత్వం విధించిన పాక్షిక నిషేధాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఈ నిషేధ ఉత్తర్వుల్ని కింది కోర్టులు నిలుపుదల చేయగా.. అమెరికా సుప్రీంకోర్టు జూన్ 26న పునరుద్ధరించింది. ఈ సందర్భంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు ఎవరు అర్హులన్న విషయంలో కొన్ని మార్గదర్శకాల్ని నిర్దేశించింది. అమెరికాలో నివసిస్తున్న వ్యక్తులు లేదా సంస్థలతో చట్టబద్దమైన సంబంధాలుంటే వారు దేశంలో ప్రవేశించేందుకు అర్హులని స్పష్టం చేసింది. అలాగే చెల్లుబాటయ్యే వీసా ఉన్న వారిని కూడా అనుమతించాల్సిందేనని పేర్కొంది. అక్టోబర్‌లో కేసు పూర్తి స్థాయి విచారణ వరకూ ఈ ఉత్తర్వులు కొనసాగుతాయి.
సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాల నుంచి అమెరికాకు వచ్చే పౌరుల్ని 90 రోజుల పాటు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే 120 రోజుల పాటు శరణార్థులు అమెరికాలో ప్రవేశించడానికి వీలుండదు. సిరియన్ శరణార్థులపై నిరవధికంగా నిషేధం కొనసాగుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా ట్రావెల్ బ్యాన్‌కు అనుమతి
ఎప్పుడు : జూన్ 26
ఎవరు: అమెరికా సుప్రీంకోర్టు
ఎందుకు : ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాల నుంచి అమెరికాకు వచ్చే పౌరుల్ని అడ్డుకునేందుకు

గూగుల్‌కు ఈయూ 2.4 బిలియన్ యూరోల జరిమానా
ఆన్‌లైన్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌కు యూరోపియన్ యూనియన్ (ఈయూ) 2.4 బిలియన్ యూరో (దాదాపు రూ.17 వేల కోట్లు)ల భారీ జరిమానా విధించింది. వ్యాపార చట్టాలను ఉల్లంఘించినందుకు గాను ఈ మొత్తం చెల్లించాల్సిందిగా ఈయూ కాంపిటీషన్ చీఫ్ వెస్టగర్ జూన్ 27న ఆదేశించారు.
గూగుల్ తమ సొంత ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇతర కంపెనీల ఉత్పత్తులను తన సెర్చ్ ఇంజన్‌లో తక్కువగా చూపించిందని.. వినియోగదారునికి పోటీ కంపెనీల వస్తువులను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వలేదని ఈయూ పేర్కొంది. ఇది ఈయూ వ్యాపార విధానాలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది. గూగుల్ తమ సంస్థల ఉత్పత్తులను సరిగా ప్రచారం చేయడంలేదని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన స్టార్‌బర్క్స్, ఆపిల్, అమెజాన్, మెక్‌డొనాల్డ్ తదితర సంస్థలు 2010లో ఈయూను ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన ఈయూ తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గూగుల్‌కు 2.4 బిలియన్ యూరోల జరిమానా
ఎప్పుడు : జూన్ 27
ఎవరు: యూరోపియన్ యూనియన్
ఎందుకు : ఈయూ వ్యాపార చట్టాలను ఉల్లంఘించినందుకు గాను

ఉగ్రవాదంపై ఐటీ, సోషల్ మీడియా సంస్థల ఉమ్మడిపోరు
ఇంటర్నెట్‌లో ఉగ్రవాద సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రముఖ టెక్నాలజీ, సోషల్ మీడియా సంస్థలు చేతులు కలిపాయి. ఆ మేరకు ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, ట్విటర్, యూట్యూబ్‌లు ‘గ్లోబల్ ఇంటర్నెట్ ఫోరం టు కౌంటర్ టైజం’ పేరిట ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాయి. ఉగ్ర సమాచారంపై పోరులో ప్రస్తుతం, భవిష్యత్తులో సహకరించుకోవాల్సిన విభాగాల్ని గుర్తించడంతో పాటు, చిన్న టెక్నాలజీ కంపెనీలు, పౌర సంఘాల విభాగాలు, విద్యావేత్తలు, ప్రభుత్వాలు, ఈయూ, ఐరాస వంటి అంతర్జాతీయ విభాగాలతో కలిసి సాగేందుకు ఈ విభాగం కృషిచేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్లోబల్ ఇంటర్నెట్ ఫోరం టు కౌంటర్ టైజం ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 27
ఎవరు: ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, ట్విటర్, యూట్యూబ్
ఎందుకు : ఇంటర్నెట్‌లో ఉగ్రవాద సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు

2100 నాటికి 200 కోట్ల శరణార్థులు
వాతావరణ మార్పుల కారణంగా సముద్రమట్టాల పెరిగి 2100 నాటికి ప్రపంచ జనాభాలో 5వ వంతు అంటే దాదాపు 200 కోట్ల మంది వారి ఆవాసాలు కోల్పోనున్నారు. దీంతో వీరంతా శరణార్థులుగా మారనున్నారని ‘ల్యాండ్ యూజ్ పాలసీ’జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. సముద్ర మట్టాలు పెరిగితే తీర ప్రాంతాలు నీట మునుగుతాయని, దీంతో అక్కడ నివసిస్తున్న వారంతా ఎత్తైన ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చార్లెస్ గీస్లర్ హెచ్చరించారు.
2100 నాటికి 1100 కోట్ల జనాభా
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు 900 కోట్లకు చేరనుంది. అదే 2100 నాటికి దాదాపు 1100 కోట్లకు చేరుకోనుంది. అయితే అంత జనాభాకు ఆహారం అందించాలంటే సారవంతమైన భూమి అవసరం. సముద్రమట్టాలు పెరిగి సారవంతమైన తీరప్రాంత భూములు, నదీ డెల్టా ప్రాంత భూములు మునిగిపోనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2100 నాటికి 200 కోట్ల శరణార్థులు
ఎప్పుడు : జూన్ 27
ఎవరు: ల్యాండ్ యూజ్ పాలసీ జర్నల్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : వాతావరణ మార్పులతో సముద్రమట్టాలు పెరగడం వల్ల

ప్రపంచంలోనే తొలి ఏటీఎంకు బంగారు సొబగులు
ప్రపంచంలోనే తొలి ఏటీఎంగా గుర్తింపు పొందిన ఉత్తర లండన్‌లోని బార్క్‌లే బ్యాంక్ వద్దగల ఏటీఎం.. ప్రపంచ తొలి బంగారు ఏటీఎంగా రూపాంతరం చెంది మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏటీఎం మిషన్ ఆవిర్భవించి అయిదు దశాబ్దాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ప్రపంచంలో తొలి బంగారు ఏటీఎంగా దీన్ని మార్చివేశారు. దీంతోపాటు ఓ స్మారక ఫలకాన్ని జోడించి, వినియోగదారులకోసం రెడ్ కార్పెట్‌ను కూడా పరిచారు.
1967, జూన్ 27న షెపెర్డ్-బారన్ మొదటి ఎటిఎమ్ (ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్) రూపొందించారు. అనంతరం ఉత్తర లండన్‌లోని బార్క్‌లే బ్యాంక్ తన మొదటి ఏటీఏం కేంద్రాన్ని ప్రారంభించింది. బ్యాంకు ఆరంభించిన ఆరింటిలో ఇది మొదటిది. బ్రిటిష్ టీవీ కామెడీ షో ‘ఆన్ ది బసెస్’లో నటించిన హాలీవుడ్ నటి రెగ్ వార్నీ ఈ ఏటీఎం నుంచి తొలిసారిగా నగదును ఉపసంహరించుకున్న వ్యక్తిగా నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బంగారు ఏటీఎంగా ప్రపంచంలోనే తొలి ఏటీఎం
ఎప్పుడు : జూన్ 27
ఎక్కడ : లండన్
ఎవరు: బార్క్‌లే బ్యాంకు
ఎందుకు : ఏటీఎం మిషన్ ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా

యెమెన్‌లో కలరాతో 1300 మంది మృతి
యెమెన్‌లో కలరా అనుమానిత కేసులు రెండు లక్షలు దాటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ జూన్ 24న ప్రకటించాయి. కలరా వల్ల ఇప్పటికే 1300 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నాలుగో వంతు మంది పిల్లలే కావడం గమనార్హం.

9.8 బిలియన్లకు చేరనున్న ప్రపంచ జనాభా
2050 నాటికి ప్రపంచ జనాభా 9.8 బిలియన్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి జూన్ 21న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 7.6 బిలియన్లు. వచ్చే ఏడేళ్లలో చైనా జనాభాను భారత్ అధిగమిస్తుందని నివేదిక తెలిపింది.

చైనాలో అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలు
దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలు‘ఫక్సింగ్’ను చైనా జూన్ 26న ప్రారంభించింది. ఈ అత్యాధునిక రైలు గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది బీజింగ్-షాంఘై మార్గంలో నడుస్తుంది.

ఎండ్ ఆఫ్ చైల్డ్‌హుడ్ రిపోర్ట్ - 2017
Current Affairs
వయసుకు తగ్గ ఎదుగుదల లేని చిన్నారుల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి చిన్నారుల సంఖ్య 4.82 కోట్లు. అలాగే దేశంలో 3.1 కోట్ల మంది చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. ఇది కూడా ప్రపంచంలోనే అతి ఎక్కువ సంఖ్య. సేవ్ ద చిల్డ్రన్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఎండ్ ఆఫ్ చైల్డ్‌హుడ్ రిపోర్ట్ - 2017 పేరుతో జూన్ 1న విడుదల చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు, పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపే పోషకాహార లోపం, విద్య అందకపోవడం, బాల కార్మికులు, బాల్య వివాహాలు, నెలలు నిండకుండానే జననాలు, శిశు భ్రూణహత్యలు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది చిన్నారులు వివిధ కారణాల వల్ల ముందుగానే తమ బాల్యాన్ని కోల్పోతున్నారు. సరైన ఎదుగుదల లేని పిల్లలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు విద్య, ఉద్యోగ అవకాశాలను కోల్పోయి త్వరగా అనారోగ్యం, వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది.
దేశంలో ప్రాథమిక, మాధ్యమిక స్థాయి చిన్నారులు 18.6%, అప్పర్ సెకండరీ వయసు కలిగిన 4.7 కోట్ల మంది పాఠశాలకు వెళ్లడం లేదు. 4-14 ఏళ్ల వయసు పిల్లల్లో 11.8 శాతం మంది (3.1 కోట్లు) బాల కార్మికులుగా మారి చదువు, విశ్రాంతి, ఆటలు, వినోదాన్ని కోల్పోతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎండ్ ఆఫ్ చైల్డ్‌హుడ్ రిపోర్ట్ - 2017
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : సేవ్ ది చిల్డ్రన్ సంస్థ (భారత్)
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

యూఎన్‌సీసీటీ ఏర్పాటుకు ఐరాస ఆమోదం
సభ్య దేశాల్లో తీవ్రవాద అణచివేత చర్యలకు చేయూత అందించేందుకు ఉద్దేశించిన యూఎన్ తీవ్రవాద వ్యతిరేక కేంద్రం (UNCCT) ఏర్పాటుకు ఐరాస సాధారణ అసెంబ్లీ జూన్ 16న ఆమోదం తెలిపింది. ఈ సంస్థ ఏర్పాటుతో ఇప్పటి వరకు యూఎన్ డీపార్ట్‌మెంట్ ఆఫ్ పొలిటకల్ అఫైర్స్(డీపీఏ) ఆధ్వర్యంలో నడుస్తోన్న ఈ కార్యకలాపాలు యూఎన్‌సీసీటికి బదలీ అవుతాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎన్‌సీసీటీ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : ఐరాస
ఎందుకు : సభ్య దేశాల్లో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల సహాయానికి

ఏఐఐబీలో అర్జెంటీనా, మడగాస్కర్, టోంగాకు చోటు
చైనా నేతృత్వంలోని ఆసియాన్ మౌలిక పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబీ)లో అర్జెంటీనా, మడగాస్కర్, టోంగా దేశాలకు సభ్యత్వం లభించింది. దక్షిణ కొరియాలోని జిజులో జరిగిన ఏఐఐబీ 2వ వార్షిక సమావేశంలో ఈ మూడు దేశాలకు సభ్యత్వం కల్పిస్తూ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తీర్మానం చేశారు.
ఏఐఐబీ మొదటి వార్షిక సమావేశం 2016లో చైనాలోని బీజింగ్‌లో జరిగింది. 2016 జనవరి 11న భారత్‌కు ఏఐఐబీలో సభ్యత్వం లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏఐఐబీలో కొత్తగా 3 దేశాలకు సభ్యత్వం
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : అర్జెంటీనా, మడగాస్కర్, టోంగా

క్యూబాతో మైత్రి ఒప్పందాన్ని రద్దు చేసిన అమెరికా
బరాక్ ఒబామా హయాంలో క్యూబాతో కుదిరిన మైత్రి ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ 16న రద్దు చేశారు. ఒబామా క్యూబాతో చేసుకున్న ఒప్పందం ఏకపక్షంగా ఉందని, రౌల్ క్యాో్ట్ర సైనిక ఆధిపత్యానికి బలం చేకూర్చడానికి అమెరికా డాలర్లను సాయంగా అందించము అని ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
కాగా ట్రంప్ నిర్ణయాన్ని క్యూబా విమర్శించింది. ఈ విషయంలో అమెరికాతో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాో్టత్రో కలిసి ఇరు దేశాల సంబంధాలను పునరుద్ధరిస్తున్నట్లు ఒబామా 2014 డిసెంబర్‌లో ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్యూబాతో మైత్రి ఒప్పందం రద్దు
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ఎందుకు : ఒప్పందం ఏకపక్షంగా ఉందంటూ

ఐరాసపై యోగా వెలుగులు
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయ భవంతిని ‘యోగా’ వెలుగులతో నింపేశారు. ఓ మహిళ యోగా చేస్తున్నట్లుగా, ‘యోగా’ ఆంగ్ల అక్షరాలు కనిపించేలా ఐరాస భవంతిపై లైట్లు వేశారు. ఈ కార్యక్రమాన్ని బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ జూన్ 19న ప్రారంభించారు. యోగా దినోత్సవం కోసం ఇలా ప్రత్యేకంగా లైట్లు ఏర్పాటు చేయడం వరసగా ఇది రెండోసారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐరాసపై యోగా వెలుగులు
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : ప్రారంభించిన అనుపమ్ ఖేర్
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
ఎందుకు : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని

టాప్ - 500 కంప్యూటర్లలో చైనా ఫస్ట్
అమెరికా, జర్మనీ సంయుక్తంగా జూన్ 19న విడుదల చేసిన టాప్ 500 కంప్యూటర్లలో మొదటి స్థానాన్ని చైనా కంప్యూటర్లు దక్కించుకున్నాయి. సన్‌వే కంపెనీకి చెందిన థాయులైట్, తియాన్హే-2 కంప్యూటర్లు మొదటి, రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. స్విస్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ సెంటర్‌కు చెందిన పిజ్ డైంట్ కంప్యూటర్ మూడోస్థానంలో, అమెరికాకు చెందిన టైటాన్ నాల్గోస్థానంలో నిలిచాయి. కాగా 24 సంవత్సరాల చరిత్రలో అమెరికా మొదటి మూడుస్థానాల్లో నిలవకపోవడం ఇది రెండోసారి. 1996లో ఒకసారి జపాన్‌కు చెందిన కంప్యూటర్లు మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టాప్ - 500 కంప్యూటర్స్
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : మొదటి స్థానంలో థాయులైట్, తియాన్హే-2 కంప్యూటర్లు
ఎక్కడ : చైనా

ఇరాన్ పార్లమెంటుపై ఐసిస్ దాడి
ఇరాన్ పార్లమెంటు, ఆ దేశ విప్లవనాయకుడు ఆయతుల్లా ఖోమేని స్మారక భవనం వద్ద ఐసీసీ ఉగ్రవాదులు ఆయుధాలు, ఆత్మాహుతి దాడి చేశారు. జూన్ 7న జరిగిన ఈ దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోగా 40 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి.
ఇరాన్ భద్రతా బలగాలు ఐదుగంటల పోరాటం తర్వాత అందరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇరాక్, సిరియాల్లో ఐసిస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న దాడుల్లో ఇరాన్ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా హెచ్చరికలు చేస్తున్న ఐసిస్ తాజాగా విధ్వంసానికి దిగింది.
మరోవైపు దాడి సమయంలోనూ పార్లమెంటు సమావేశాలు యధావిధిగా కొనసాగాయి. ఉగ్రదాడి విషయం తెలిసినా లోపలున్న ఎంపీలు ఏమాత్రం చెదిరిపోలేదు. తమ భద్రత విషయంలో ప్రత్యేక బలగాలపై పూర్తి నమ్మకంతో రోజూవారీ కార్యక్రమాలను కొనసాగించారు. కొందరు నిశ్శబ్దంగా ఉన్న తమ సెల్ఫీలను పోస్టు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఇరాన్ పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి
ఎప్పుడు : జూన్ 6
ఎక్కడ : పార్లమెంట్, ఖోమేని స్మారక భవనం వద్ద
ఎవరు : ఐసీస్

మయన్మార్‌లో విమానం గల్లంతు
100 మందికి పైగా ప్రయాణిస్తున్న మయన్మార్ సైన్యానికి చెందిన వై-8ఎఫ్-200 విమానం జూన్ 7న గల్లంతైంది. ఆ తరువాత అండమాన్ సముద్రంలో దాని శకలాలను గుర్తించినట్లు ఎయిర్స్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు. చైనాలో తయారైన వై-8ఎఫ్-200 అనే సరకు రవాణా విమానం ఈ ప్రమాదానికి గురైంది. మైయెక్ పట్టణం నుంచి యాంగాన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
విమానంలో సైనికులు, వారి కుటుంబీకులు, సిబ్బంది మొత్తం కలిసి 120 దాకా ఉంటారని కమాండర్ ఇన్ చీఫ్ కార్యాలయం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మయన్మార్ విమానం వై-8ఎఫ్-200 గల్లంతు
ఎప్పుడు : జూన్ 6
ఎక్కడ : అండమాన్ సముద్రంలో

పన్ను ఎగవేతలపై బహుళపక్ష ఒప్పందం
Current Affairs
చట్టాల్లో లొసుగులు ఉపయోగించుకుని పన్నులు ఎగవేసే సంస్థలకు చెక్ చెప్పే దిశగా భారత్‌తో పాటు 67 దేశాలు చేతులు కలిపాయి. పారిస్‌లో జరిగిన ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) సమావేశంలో ఇందుకు సంబంధించిన బహుళపక్ష ఒప్పందంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జూన్ 8న సంతకం చేశారు. దీంతో వివిధ దేశాలు కుదుర్చుకున్న 1,100 పైగా పన్ను ఒప్పంద నిబంధనల్లో తగు మార్పులు, చేర్పులు జరగనున్నాయి.
ద్వంద్వ పన్నుల నివారణ కోసం భారత్‌కు ప్రస్తుతం సైప్రస్, మారిషస్, సింగపూర్ తదితర దేశాలతో ఒప్పందాలు(డీటీఏఏ) ఉన్నాయి. వీటిని ఊతంగా తీసుకుని పలు బహుళజాతి సంస్థలు పన్నుప్రయోజనాలు అత్యధికంగా ఉండే దేశాలకు ప్రధాన కార్యాలయాలను మళ్లించి, ఇతర దేశాల్లో ఆర్జించే లాభాలపై పన్నులను ఎగవేస్తున్నాయి. ఇది గుర్తించిన భారత్ ఇటీవలే కొన్ని దేశాలతో డీటీఏఏ ఒప్పందాలను సవరించింది. ప్రధాన కార్యాలయమున్న దేశంలో కాకుండా కార్పొరేట్లు ఆదాయం ఆర్జించే దేశాల్లోనే పన్నులు కట్టే విధంగా మార్పులు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
పన్ను ఎగవేతలపై బహుళపక్ష ఒప్పందం
ఎప్పుడు : జూన్ 8
ఎక్కడ : పారిస్‌లో
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ

ఎస్‌సీవోలో భారత్, పాకిస్తాన్‌లకు సభ్యత్వం
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో)లో భారత్, పాకిస్తాన్‌లకు సభ్యత్వం లభించింది. కజకిస్తాన్‌లోని ఆస్తానాలో జూన్ 8-9 వరకు జరిగిన వార్షిక సదస్సులో ఈ మేరకు రెండు దేశాలకు సభ్యత్వం ఇచ్చారు. అలాగే సభ్య దేశాలు ఆస్తానా డిక్లరేషన్‌తో పాటు 10 ఇతర ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరు చేసే అంశం ఇందులో ప్రధానమైంది.
ఎస్‌సీవో సదస్సులో ప్రధాని మోదీ..
ఈ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ .. ఉగ్రవాదంపై పోరులో ఎస్‌సీవో సహకారం చాలా కీలకమని అన్నారు. ఎస్‌సీవోలోని సభ్య దేశాలన్నీ తోటి సభ్య దేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను గౌరవించుకుంటూ అనుసంధానత పెంచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం, ఉగ్ర సంస్థల్లో నియామకాలు, శిక్షణ, నిధుల సమీకరణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని అంతం చేసేందుకు సభ్య దేశాలన్నీ ఏకతాటిపై నడవాలని మోదీ కోరారు.
ఎస్‌సీవో సదస్సుకు ముందు ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరస్పరం ఇరుదేశాలు కీలక సమస్యలను గౌరవిస్తూనే.. ఆ వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని జిన్‌పింగ్‌తో మోదీ తెలిపారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో సమాచారం, పరస్పర సహకారంతో ముందుకెళ్లాలన్నారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులతోపాటు పలు కీలక ద్వైపాక్షిక అంశాలపై వీరిద్దరు చర్చించారు.
ఎస్‌సీవోలో సభ్య దేశాలు (8)
చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఎస్‌సీవో వార్షిక సదస్సు
ఎప్పుడు : జూన్ 8-9
ఎక్కడ : కజకిస్తాన్‌లోని ఆస్తానా
ఎవరు : భారత్, పాకిస్తాన్‌లకు సభ్యత్వం

బ్రిటన్‌లో హంగ్ పార్లమెంట్
బ్రెగ్జిట్ చర్చల కోసం పార్లమెంట్‌లో బలం పెంచుకునేందుకు బ్రిటన్ ప్రధాని థెరెసా మే 3 ఏళ్ల ముందుగానే నిర్వహించిన ఎన్నికల్లో ఆమె నేతృత్వం వహిస్తోన్న కన్జర్వేటివ్ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కలేదు. ఈ మేరకు జూన్ 9న వెలువడిన ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీ 318 స్థానాలు గెలుపొందింది. లేబర్ పార్టీ 261, స్కాటిష్ నేషనలిస్ట్ పార్టీ 35, లిబరల్ డెమొక్రటిక్ పార్టీ 12, డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ(డీయూపీ)10 స్థానాల్లో గెలుపొందాయి. బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో మొత్తం 650 స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మెజారిటీ 326 స్థానాలు.
డీయూపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు థెరెసా మే ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని జూన్ 9న విజ్ఞప్తి చేశారు.
ఎంపీగా సిక్కు మహిళ రికార్డు
బ్రిటన్ ఎన్నికల్లో తొలిసారిగా ఓ సిక్కు మహిళ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. లేబర్ పార్టీకి చెందిన ప్రీత్‌కౌర్ గ్రిల్ బర్మింగ్‌హామ్ ఎడ్‌‌జబాస్టన్ నుంచి కన్జర్వేటివ్ అభ్యర్థిపై 6,917 ఓట్ల తేడాతో గెలుపొందారు. లేబర్ పార్టీకే చెందిన మరో సిక్కు అభ్యర్థి తన్‌మన్‌జీత్ సింగ్ దేశి కూడా స్లోగ్ సీటు నుంచి గెలిచారు. ఈ ఫలితాలతో బ్రిటన్‌లో భారత సంతతి ఎంపీల సంఖ్య 12కి పెరిగింది.
బ్రెగ్జిట్ భవితవ్యంపై నీలినీడలు
భారీ మెజార్టీ కోసం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన బ్రిటన్ ప్రధాని థె రిసా మే వ్యూహం బెడిసికొట్టింది. ప్రస్తుత మెజార్టీ కూడా కోల్పోవడంతో ఆమె భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికలకు కారణమైన బ్రెగ్జిట్ సంక్షోభంలో పడింది. దీంతో బ్రెగ్జిట్ సంప్రదింపులు అనుకున్నట్టే ఈ నెల 19న మొదలవుతాయా? ఒకవేళ లేబర్ నేత కార్బిన్ ప్రధానైతే ఏం చేస్తారు? అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.
బ్రెగ్జిట్ గుదిబండేనా?
ఈయూ నుంచి బయటపడేందుకు అవసరమైన చర్చలు ఆలస్యమైతే బ్రిటన్ నష్టపోతుంది. బ్రెగ్జిట్‌పై బ్రిటన్ గతేడాది మార్చిలో 50వ అధికరణను అమలులోకి తెచ్చింది. దాని ప్రకారం సకాలంలో చర్చలు జరిపి ఈయూతో ఒప్పందానికి రావాలి. ఒప్పందం చేసుకున్నా లేకున్నా ఆ అధికరణంతో 2019 మార్చి చివరినాటికి ఈయూ నుంచి బ్రిటన్ బయపడాలి. చర్చలు జరిపి ఆలోగా ఒప్పందం చేసుకుంటే బ్రిటన్ కొంతమేర లాభపడుతుంది. లేదంటే ఎలాంటి ప్రయోజనాలు పొందకుండానే ఈయూ నుంచి తప్పుకోవాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
హంగ్ పార్లమెంటు ఏర్పడే సూచనలు
ఎక్కడ : బ్రిటన్
ఎందుకు : కన్జర్వేటివ్ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కనందుకు

బ్రిటన్‌లో కొలువుదీరిన థెరిసా ప్రభుత్వం
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షురాలు థెరిసా మే ప్రధానిగా జూన్ 12న ప్రభుత్వం ఏర్పాటయింది. 650 స్థానాలున్న బ్రిటన్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 318, ప్రతిపక్ష లేబర్ పార్టీ 261 స్థానాలు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 326 స్థానాలు అవసరం కాగా పది స్థానాలు గెలుచుకున్న డెమెక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ (డీయూపీ)తో కలిసి థెరిసా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్‌కు కేబినెట్‌లో చోటు కల్పించిన థెరిసా డమియన్ గ్రీన్‌ను ఉప-ప్రధానిగా నియమించారు. ఐదుగురు సీనియర్ మంత్రులు ఫిలిప్ హమ్మండ్, అంబర్ రుడ్, బోరిస్ జాన్సన్, డేవిడ్ డేవిస్, మైఖేల్ పాలన్‌లను కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి
: బ్రిటన్‌లో ఏర్పాటైన ప్రభుత్వం
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : థెరిసా మే

కొండచరియలు విరిగిపడి బంగ్లాదేశ్‌లో 105 మంది మృతి
బంగ్లాదేశ్‌లో భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో 105 మంది మృతి చెందారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బంగ్లాదేశ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు సంభవించి పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రంగమతి జిల్లాలో అత్యధికంగా 76 మంది మరణించారు. ఇందులో నలుగురు మిలిటరీ సిబ్బంది కూడా ఉన్నారు. మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
బంగ్లాదేశ్‌లో 105 మంది మృతి
ఎప్పుడు : జూన్ 13
ఎందుకు : భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో

జెనీవాలో 106వ అంతర్జాతీయ కార్మిక సమావేశం
స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 106వ సమావేశం జూన్ 5-17 వరకు జరిగింది. ఈ సమావేశాల్లో భారత ప్రతినిధిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల కార్మికుల నిర్మూలనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ కన్వెన్షన్- 138, ప్రమాదకర పరిశ్రమల్లో 14 ఏళ్లలోపు బాలల నిషేధానికి నిర్దేశించిన కన్వెన్షన్-182 చట్టాలను భారత్ ఆమోదించిందని దత్తాత్రేయ తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి సంతకం చేసిన ఉత్తర్వులను ఐఎల్‌వోకు సమర్పించారు. భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం అమలు కోసం ఫిర్యాదుల పరిష్కారానికి ‘పెన్సిల్’ పేరుతో డిజిటల్ వేదికను రూపొందించామని దత్తాత్రేయ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి
: అంతర్జాతీయ కార్మిక సంస్థ 106వ సమావేశం
ఎప్పుడు : జూన్ 5 -17
ఎవరు : ఐఎల్ ఓ
ఎక్కడ : జెనీవా, స్విట్జర్లాండ్

వడ్డీ రేట్లను పావు శాతం పెంచిన ఫెడ్
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావుశాతం పెంచింది. జూన్ 13-14 వరకు జరిగిన ఫెడ్ కమిటీ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఫెడ్ ఫండ్‌‌స రేటు 1-1.25 శాతానికి చేరుతుంది. వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే రేటును ఫెడ్ ఫండ్‌‌స రేటుగా వ్యవహరిస్తారు. కాగా ఈ ఏడాది ఇది రెండో పెంపు. జీరో వడ్డీరేట్ల వ్యవస్థ నుంచి 2015 డిసెంబర్‌లో పెంపు ప్రక్రియను ఫెడ్ మొదలుపెట్టింది. అప్పటినుంచి తాజా పెంపు నాల్గవది.
క్విక్ రివ్యూ:
ఏమిటి
: వడ్డీ రేట్లు పావు శాతం పెంపు
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : అమెరికా ఫెడ్

కాబూల్ ఆత్మాహుతి దాడిలో 90 మంది మృతి
Current Affairs
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో మే 31న జరిగిన ఉగ్రదాడిలో చిన్నారులు, మహిళలు సహా 90 మంది మృతి చెందారు. మరో 400 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. భారీ పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కుతో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. భారత రాయబార కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఈ దాడి జరగటంతో ఎంబసీ భవనం స్వల్పంగా దెబ్బతింది. ఈ దాడిలో బీబీసీ చానల్‌కు చెందిన డ్రైవర్ మృతిచెందగా.. నలుగురు జర్నలిస్టులకు స్వల్ప గాయాలయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఆత్మాహుతి దాడిలో 90 మంది మృతి
ఎప్పుడు : మే 31
ఎక్కడ : కాబూల్, అఫ్గనిస్తాన్

పోలండ్‌లో 2018 వాతావరణ సదస్సు
2018లో వాతావరణ మార్పు సదస్సును (యూఎన్‌సీసీసీ) పోలండ్‌లోని కతావీజ్ నగరంలో నిర్వహిస్తామని ఐక్యరాజ్యసమితి తెలిపింది. కతావీజ్ నగరం బొగ్గును అధికంగా ఉత్పత్తి చేస్తూ.. యూరోప్‌లోనే అత్యంత కలుషిత ప్రాంతంగా పేరుగాంచింది. ఐరాస నిర్ణయం వల్ల ఇక్కడ పునరుత్పాదక ఇంధనాల వాడకం పెరుగుతుందని పర్యావరణ వేత్తలు ఆశాభావం వ్యకం చేశారు. పోలండ్‌లో ఇంతకుముందు 2008లో పోజ్నన్, 2013లో వార్సా నగరాల్లో ఈ సదస్సులు నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
2018 వాతావరణ సదస్సు
ఎక్కడ : పోలాండ్‌లో
ఎవరు : ఐరాస

పారిస్ ఒప్పందం నుంచి వైదొలగిన అమెరికా
గ్లోబల్ వార్మింగ్ ముప్పు నుంచి భూగోళాన్ని రక్షించే ఉద్దేశంతో కుదుర్చుకున్న పారిస్ పర్యావరణ ఒప్పందం 2015 నుంచి వైదొలగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం భారత్, చైనాలకు అనుకూలంగా ఉందని, అమెరికా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆరోపిస్తూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం చైనా.. 13 ఏళ్ల పాటు కర్బన ఉద్గారాల్ని విడుదల చేయవచ్చని.. అమెరికాకు ఆ మినహాయింపు లేదని ఒప్పందాన్ని తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో ఒప్పందాన్ని కొనసాగిస్తామని చైనా ప్రధాని లీ కెకియాంగ్, ఒప్పందానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమెరికాలోని పలు నగరాలు, రాష్ట్రాల ప్రతినిధులు పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉండేందుకు ‘యునెటైడ్ స్టేట్స్ క్లైమేట్ అలయన్స్‌ను ఏర్పాటు చేసి ఐక్యరాజ్యసమితిని సంప్రదించనున్నారు.
పారిస్ ఒప్పందం అంటే?
పెట్రోన్స్‌లు, డీజిల్ వంటి ఇంధనాల అధిక వాడకం, పారిశ్రామికీకరణతో భూగోళం వేడెక్కుతోంది. ఫలితంగా కార్బన్‌డయాకై ్సడ్ వంటి గ్రీన్‌హౌస్ వాయువుల మోతాదు పెరిగి అకాల వర్షాలు, వరదలు, కరువు వంటి అనేక పరిణామాలు కలగనున్నాయి. దీనిని నివారించేందుకు ఈ శతాబ్దం చివరికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న లక్ష్యంతో 2015లో ఏర్పాటు చేసుకున్న ఒప్పందమే పారిస్ ఒప్పందం. దీనిపై 195 దేశాలు సంతకాలు చేశాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం, కర్బన ఉద్గారాల తగ్గింపు వంటి చర్యలతో దీన్ని సాధించాలన్నది ఒప్పంద సంకల్పం.
ఒప్పదంలో భాగంగా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా 2025 నాటికి కర్బన ఉద్గారాలను 26 నుంచి 28 శాతం (200 కోట్ల టన్నులు) తగ్గిస్తామని ప్రకటించారు. ప్రపంచ దేశాలన్నీ భాగస్వాములుగా ఉన్న యునెటైడ్ నేషన్స్‌ గ్రీన్ కై ్లమెట్ ఫండ్‌కు ఏటా రూ. 6.5 లక్షల కోట్లు జమ చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఒబామా అమెరికా తరఫున వంద కోట్ల డాలర్లు అందజేశారు. ఇప్పుడు అమెరికా వైదొలిగితే పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే. దీని వల్ల మిగిలిన దేశాలపై భారం పడనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
పారిస్ ఒప్పందం నుంచి వైదొలగనున్న అమెరికా
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
ఎందుకు : ఒప్పందం అమెరికా ప్రయోజనాలకు ప్రతికూలంగా ఉందని

కాసినోపై కాల్పుల్లో 37 మంది మృతి
ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలోని ఓ కాసినోపై జరిపిన కాల్పుల్లో 37 మంది మృతి చెందారు. 14 కోట్ల విలువజేసే కాసినో చిప్స్(ఆట కోసం వాడే కాయిన్స్‌) దోపిడీ కోసం గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. కాసినోలో ఏర్పాటు చేసిన పెద్ద టీవీ తెరపై కాల్పులు జరపడంతో అది పేలీ దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో 37 మృతి చెందటంతో పాటు పదుల సంఖ్యలో గాయపడ్డారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
కాసినోపై జరిపిన కాల్పుల్లో 37 మంది మృతి
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : గుర్తు తెలియని వ్యక్తి
ఎందుకు : కాసినో చిప్స్ దోపిడీ కోసం

ఖతర్‌తో సంబంధాలు తెంచుకున్న 5 అరబ్ దేశాలు
ఖతర్ ఉగ్రవాదానికి ఊతమిస్తోందంటూ ఆ దేశంతో సౌదీ అరేబియా సహా ఐదు అరబ్ దేశాలు దౌత్యసంబంధాలను తెగతెంపులు చేసుకున్నాయి. దక్షిణాసియా ద్వీపదేశం మాల్దీవులు కూడా ఖతర్‌ను వెలేసింది. ఈ మేరకు ఖతర్‌తో సంబంధాలను తెంచుకుంటున్నామని లిబియాలోని సమాంతర ప్రభుత్వాల్లో ఒకటైన తూర్పు లిబియాలోని ప్రభుత్వం జూన్ 5న తెలిపింది.
చుట్టుపక్కల ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ఖతర్ పలు ఉగ్రవాద గ్రూపులకు మద్దతిస్తోందని సౌదీ, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), బహ్రెయిన్, యెమన్, ఈజిప్టు జూన్ 5న ఆరోపించాయి. ఖతర్‌తో రవాణా మార్గాలను మూసేస్తున్నామని, తమ దేశంలోని ఖతర్ పౌరులు రెండువారాల్లోగా వెళ్లిపోవాలని ఆదేశించాయి.
తమ పౌరులు ఖతర్‌కు వెళ్లొద్దని, తమ దేశాల్లోని ఖతర్ పౌరులు 14 రోజుల్లోగా వెళ్లిపోవాలని అరబ్ దేశాలు ఆదేశించాయి. ఖతర్‌తో ఉన్న సరిహద్దులను మూసేస్తున్నట్లు సౌదీ తెలిపింది. జూన్ 6 నుంచి ఖతర్‌కు తమ సర్వీసులను నిలిపేస్తున్నట్లు ఎమిరేట్స్, ఇతిహాద్, ఫ్లైదుబాయ్, ఎయిర్ అరేబియా, సౌదీ అరేబియా ప్రకటించాయి. సౌదీకి తమ సర్వీసులను తక్షణం మూసేస్తున్నట్లు ఖతర్ కూడా ప్రకటించింది. ఖతర్‌కు విమాన సర్వీసులను నిలిపేస్తున్నట్లు ఈజిప్టు తెలిపింది. యెమన్‌లో ఇరాన్ మద్దతున్న రెబల్స్‌పై పోరాడుతున్న సౌదీ నేతృత్వంలోని కూటమి తమ గ్రూపు నుంచి ఖతర్‌ను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఇంధన వనరులు పుష్కలంగా ఉన్న ఖతర్‌తో పొరుగు దేశాల తెగతెంపుల నిర్ణయం పశ్చిమాసియాలోనే కాకుండా పాశ్చాత్య దేశాల ప్రయోజనాలపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. ఐసిస్, తదితర ఉగ్ర సంస్థలపై పోరులో కీలకమైన అమెరికా ఎయిర్‌బేస్ ఖతర్‌లో ఉంది. 2022లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్ క్రీడలు ఖతర్‌లోనే జరగనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఖతర్‌తో దౌత్యసంబంధాలు తెంచుకున్న 5 అరబ్ దేశాలు
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, యెమన్, ఈజిప్టు

చైనా, నేపాల్ మధ్య జలవిద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం
నేపాల్, చైనా సరిహద్దులో నిర్మించనున్న బుధిగందకి జలవిద్యుత్ ప్రాజెక్టు కోసం రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు నేపాల్ రాజధాని కాట్మాండులో జూన్ 6న ఒప్పందంపై రెండు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్, ఫైనాన్స్ (ఈపీసీఎఫ్) మోడల్‌లో ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
నేపాల్, చైనా మధ్య ఒప్పందం
ఎప్పుడు : జూన్ 6
ఎక్కడ : కాట్మాండులో
ఎందుకు : బుధిగందకి జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం
Published date : 13 Jun 2017 01:23PM

Photo Stories