Skip to main content

డిసెంబరు 2018 అంతర్జాతీయం

ఇండోనేషియాలో భారీ సునామీ Current Affairs
ఇండోనేషియాలో సుమత్రా, జావా ద్వీపాల మధ్యనున్న సుండా జలసంధిలోని చిన్న దీవిలో ఉన్న ఆనక్ క్రకటోవా అనే అగ్ని పర్వతం పేలడంతో డిసెంబర్ 22న భారీ సునామీ సంభవించింది. ఈ సునామీ కారణంగా 222 మంది(డిసెంబర్ 22న అందిన సమాచారం మేరకు) మృతి చెందారు. మరో 843 మంది గాయాలపాలు కాగా 28 మంది గల్లంతయ్యారు. సాధారణంగా అగ్నిపర్వతాల కారణంగా వచ్చే సునామీలు చాలా అకస్మాత్తుగా, ఉన్నట్టుండి తీరాలను ముంచెత్తుతాయి. దీంతో ప్రజలను సురక్షిత తరలించేంత తరలించేంత సమయం ఉండదు.
2004 డిసెంబర్ 26న రిక్టర్ స్కేల్‌పై 9.3 తీవ్రతతో సముద్రంలో వచ్చిన భూకంపం కారణంగా సునామీ సంభవించి వివిధ దేశాల్లో మొత్తంగా 2.2 లక్షల మంది చనిపోగా, వారిలో ఇండోనేషియా ప్రజలే 1.68 లక్షలు ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇండోనేషియాలో భారీ సునామీ
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎందుకు : ఆనక్ క్రకటోవా అనే అగ్ని పర్వతం పేలడంతో

ఐరాస మంత్రుల సదస్సులో ఏకే మెహతా
పోలెండ్‌లోని కటోవైస్ నగరంలో జరుగుతున్న వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి మంత్రుల సదస్సులో డిసెంబర్ 13న భారత్ తరఫున కేంద్ర పర్యావరణశాఖ అదనపు కార్యదర్శి ఏకే మెహతా పాల్గొన్నారు. ఈ సదస్సులో మెహతా మాట్లాడుతూ... పారిస్ వాతవరణ ఒప్పందం-2016లో ఎలాంటి మార్పులుచేర్పులకు అవకాశం లేదని చెప్పారు. పారిస్ ఒప్పందం ప్రకారం నిర్దేశించిన లక్ష్యాలను అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలన్నీ అందుకోవాలనీ, బాధ్యతలను నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ఖతార్ రాజధాని దోహాలో వాతావరణ సదస్సు సందర్భంగా కుదిరిన ఒప్పందం వీలైనంత త్వరగా అమల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐక్యరాజ్యసమితి మంత్రుల సదస్సు
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : కేంద్ర పర్యావరణశాఖ అదనపు కార్యదర్శి ఏకే మెహతా
ఎక్కడ : కటోవైస్, పోలెండ్

శ్రీలంక పార్లమెంట్ రద్దు చెల్లదు : సుప్రీంకోర్టు
శ్రీలంక పార్లమెంట్‌ను రద్దు చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ శ్రీలంక సుప్రీంకోర్టు డిసెంబర్ 13న తీర్పునిచ్చింది. ఐదేళ్ల పదవీ కాలంలో కనీసం నాలుగున్నరేళ్లయినా పూర్తి చేయకుండా అధ్యక్షుడు పార్లమెంట్‌ను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది.
శ్రీలంక ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘేను అక్టోబర్ 26న తొలగించిన అధ్యక్షుడు, ఆయన స్థానంలో మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సను నియమించాడు. దీంతోపాటు 20 నెలల ముందుగానే పార్లమెంట్‌ను రద్దు చేసి, జనవరిలో ఎన్నికలు జరిపేందుకు ఉత్తర్వులు జారీ చేశాడు. దీంతో అధ్యక్షుడి చర్యలు ప్రజాస్వామ్య వ్యతిరేకమంటూ ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీలంక పార్లమెంట్‌ను రద్దు నిర్ణయం చెల్లదు
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : శ్రీలంక సుప్రీంకోర్టు
ఎక్కడ : శ్రీలంక

మరణశిక్ష ఖైదీలకు కుటుంబాన్ని కలుసుకునే హక్కు
మరణ శిక్ష పడిన ఖైదీలకు కూడా వారి కుటుంబాన్ని, న్యాయవాదులను, మానసిక వైద్యుల్ని కలిసే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు డిసెంబర్ 13న వెల్లడించింది. సాధారణ ఖైదీలకు జైళ్లలో కల్పించే హక్కులనే మరణ శిక్ష పడిన ఖైదీలకు కూడా వర్తింపచేయాలని దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ మదన్ బి లాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. మరణ శిక్ష పడిన ఖైదీల హక్కులను ప్రతి దశలోనూ పరిరక్షించాల్సిన అవసరముందని కోర్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా జైళ్ల సంస్కరణలు చేపట్టేందుకు సుప్రీం కోర్టు ద్వారా 2018 సెప్టెంబర్ 25న నియమితమైన రిటైర్డ్ జస్టిస్ అమితవరాయ్ కమిటీ ఈ సమస్యను కూడా పరిశీలించాలని ఆదేశించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: మరణశిక్ష ఖైదీలకు కుటుంబాన్ని కలుసుకునే హక్కు
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : సుప్రీంకోర్టు

భారత కరెన్సీపై నేపాల్‌లో నిషేధం
భారత కరెన్సీలోని పెద్ద నోట్ల వినియోగంపై నేపాల్ ప్రభుత్వం డిసెంబర్ 14న నిషేధం విధించింది. రూ. 2,000, రూ. 500, రూ. 200 విలువైన నోట్లు ఇకపై నేపాల్‌లో చెల్లవని ప్రకటించింది. రూ. 100 కంటే ఎక్కువ విలువైన భారతీయ కరెన్సీని నేపాల్ ప్రభుత్వం చట్టబద్ధం చేయనందున ఈ నోట్లను నిషేధించినట్లు నేపాల్ సమాచార, ప్రసార శాఖ మంత్రి గోకుల్ ప్రసాద్ తెలిపారు. దీంతో భారతదేశంలో పనిచేసే నేపాల్ కూలీలు, నేపాల్‌ను సందర్శించే భారతీయ పర్యాటకులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత కరెన్సీపై నేపాల్‌లో నిషేధం
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : నేపాల్ ప్రభుత్వం

ఐర్లాండ్‌లో అబార్షన్ చట్టబద్ధం
అబార్షన్‌ను చట్టబద్ధం చేస్తూ ఐర్లాండ్ పార్లమెంట్ డిసెంబర్ 14న రాజ్యాంగ సవరణ చేసింది. 2019, జనవరి నుంచి సవరణ చట్టం అమల్లోకి వస్తుందని ఐర్లాండ్ ప్రధాని లియో వారద్కర్ తెలిపారు. దీంతో గర్భం ధరించిన మహిళ ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లుతుందన్న సందర్భంలో 12 వారాల వరకు ఎప్పుడైనా అబార్షన్ చేయించుకోవచ్చు. కడుపులో పిండం ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు డెలివరీకి 28 రోజుల లోపులో కానీ, ఇంకా ముందుగానీ అబార్షన్ చేయించుకోవచ్చు.
ఐర్లాండ్‌లో అబార్షన్ మీద నిషేధం ఎత్తివేయాలంటూ 2018, మేలో ప్రవేశపెట్టిన రిఫరెండానికి 66 శాతం మంది ప్రజలు మద్దతు పలికారు. 1980 నుంచి ఇప్పటివరకు 7.77 లక్షల మంది ఐర్లాండ్ మహిళలు అబార్షన్ కోసం బలవంతంగా బ్రిటన్‌కు వెళ్లి వచ్చారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐర్లాండ్‌లో అబార్షన్ చట్టబద్ధం
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : ఐర్లాండ్ పార్లమెంట్

పారిస్ ఒప్పందం’ ముందడుగు
కర్బన ఉద్గారాల వెల్లువను కట్టడి చేసే దిశగా ప్రపంచ సమాజం ఓ అడుగు ముందుకేసింది. మూడు సంవత్సరాల క్రితం పారిస్‌లో కుదుర్చుకున్న ఒప్పందాన్నే కొనసాగించాలని డిసెంబర్ 16న ఉదయం జరిగిన కాప్-24 తుదిరోజు సదస్సు తీర్మానించింది. 2015లో ఫ్రాన్స్ రాజధానిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న పలు దేశాలు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం తెలిసిందే. గ్లోబల్ వార్మింగ్ ముప్పునుంచి బయటపడాలనే లక్ష్యంతో ఈ సమావేశం జరిగింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: కర్బన ఉద్గారాల వెల్లువను కట్టడి
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎందుకు: పర్యావరణ పరిరక్షణే లక్ష్యగా

శ్రీలంక ప్రధానిగా మళ్లీ విక్రమ సింఘే
శ్రీలంక ప్రధానమంత్రిగా రణిల్ విక్రమ సింఘే(67) తిరిగి బాధ్యతలు చేపట్టారు. దీంతో ద్వీప దేశంలో 51 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి తొలగినట్లయింది. అధ్యక్ష పరిపాలనా భవనంలో డిసెంబర్ 16న జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు సిరిసేన యునెటైడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ)నేత విక్రమ సింఘేతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక ఉత్తర్వులను అందజేశారు. ప్రధానమంత్రిగా విక్రమ సింఘే ఐదోసారి ప్రమాణం చేసి చరిత్ర సృష్టించడంతో ఆయన మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. యూఎన్‌పీ, శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ)లకు చెందిన 30 మందితో డిసెంబర్ 17న కేబినెట్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. సిరిసేన నియమించిన మహింద రాజపక్స డిసెంబర్ 15న ప్రధాని పదవి నుంచి వైదొలిగారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
శ్రీలంక ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే తిరిగి బాధ్యతలు
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు: రణిల్ విక్రమ సింఘే

తాత్కాలికంగా బ్రిటన్ గోల్డెన్ వీసా’ రద్దు
Current Affairs గోల్డెన్ వీసా (టైర్ 1 ఇన్వెస్టర్ వీసా)ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు డిసెంబర్ 6న బ్రిటన్ ప్రకటించింది. గోల్డెన్ వీసా దుర్వినియోగం అయ్యే అవకాశమున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టే విదేశీ కోటీశ్వరులకు శాశ్వత నివాసం, పౌరసత్వం ఇచ్చేందుకు గోల్డెన్ వీసాను జారీ చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తాత్కాలికంగా గోల్డెన్ వీసా (టైర్ 1 ఇన్వెస్టర్ వీసా) రద్దు
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : బ్రిటన్
ఎక్కడ : బ్రిటన్

లక్సంబర్గ్‌లో ఉచిత రవాణా విధానం
ఐరోపా దేశమైన లక్సంబర్గ్‌లో ఉచిత రవాణా విధానంను ప్రవేశపెట్టనున్నారు.
మేరకు 2020 నుంచి దేశంలో ఉచిత ప్రజా రవాణాను ప్రవేశపెట్టనున్నట్టు ఆ దేశ ప్రధాని గ్జేవియర్ బెటెల్ డిసెంబర్ 6న ప్రకటించారు. దీంతో ప్రపంచంలో ఉచిత ప్రజా రవాణాను అమలుచేయనున్న తొలి దేశంగా లక్సంబర్గ్ నిలవనుంది. వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా బెటెల్ చెప్పారు. 2013లో తలిన్, ఎస్తోనియా దేశాలు రాజధాని నగరాల్లో ఉచిత రవాణా విధానాన్ని ప్రవేశపెట్టాయి. ప్రజా రవాణా ఉచితం చేయడం వల్ల ప్రభుత్వం నడిపే రైళ్లు, ట్రామ్‌లు, బస్సుల్లో టికెట్ కొనాల్సిన పని ఉండదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020 నుంచి ఉచిత రవాణా విధానం
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : లక్సంబర్గ్ ప్రధాని గ్జేవియర్ బెటెల్
ఎక్కడ : లక్సంబర్గ్

బ్రిక్స్ దేశాధినేతల భేటీలో మోదీ ప్రసంగం
Current Affairs అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ఏయిర్స్‌లో నవంబర్ 30న ప్రారంభమైన జీ-20 (గ్రూప్ ఆఫ్ 20) సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ దేశాల నాయకులతో అనధికారికంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమేనని అన్నారు. ఆర్థిక నేరగాళ్ల వల్ల ప్రపంచం ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర ముప్పు ఎదురవుతోందనీ, మోసాలు చేసి స్వదేశాల నుంచి పరారైన నేరగాళ్లకు వ్యతిరేకంగా కూడా అన్ని దేశాలూ సహకరించుకోవాలని సూచించారు.
మరోవైపు మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబేల మధ్య తొలి త్రైపాక్షిక భేటీ నవంబర్ 30న జరిగింది. ప్రపంచ, బహుళ ప్రయోజనాలున్న ప్రధానాంశాలపై వారు చర్చలు జరిపారు. జై (జేఏఐ - జపాన్, అమెరికా, ఇండియా) సమావేశం ప్రజాస్వామ్య విలువలకు అంకితం. పలు భారతీయ భాషల్లో జై అంటే విజయం అని అర్థం’ అని ఈ సందర్భంగా మోదీ అన్నారు.
మరోవైపు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమైన మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్, సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌లతోనూ విడివిడిగా భేటీ అయ్యారు. బ్యూనస్ ఎయిర్స్‌లో నిర్వహించిన యోగా ఫర్ పీస్ కార్యక్రమంలోనూ మోదీ పాల్గొన్నారు. శాంతి, ఆరోగ్యం కోసం ప్రపంచానికి భారత్ అందించిన బహుమతి యోగా అని మోదీ అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిక్స్ దేశాధినేతల భేటీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం
ఎప్పుడు : నవంబర్ 30
ఎక్కడ : బ్యూనస్‌ఏయిర్స్, అర్జెంటీనా

జీ-20 సదస్సులో పాల్గొన్న మోదీ
అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్‌లో నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీలలో జరిగిన జీ-20 (గ్రూప్ ఆఫ్ 20) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల కేసుల్లో జీ-20 దేశాల మధ్య బలమైన, చురుకైన సహకారం ఉండాలని కోరారు. ఇందుకోసం ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి సంబంధించి 9 అంశాలతో కూడిన ఎజెండాను సదస్సులో ప్రవేశపెట్టారు.
రష్యా, భారత్, చైనాల మధ్య 12 ఏళ్లలో తొలి, మొత్తంగా రెండో త్రైపాక్షిక సమావేశం నవంబర్ 30న జరిగింది. జీ-20 సదస్సు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో మోదీ భేటీ అయ్యారు. ప్రపంచ ఆర్థిక పరిపాలన, ప్రాంతీయంగా శాంతి పరిరక్షణ వంటి అంశాలపై ముగ్గురు నేతలు చర్చలు జరిపారు.
భారత్‌లో 2022 జీ-20 సదస్సు...
భారత్‌లో 2022 జీ-సదస్సును నిర్వహించనున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం 2021లో భారత్, 2022లో ఇటలీ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే, 2022లో దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోనున్నందున దీంతోపాటు జీ-20 భేటీకి అవకాశం ఇవ్వాల్సిందిగా భారత్ చేసిన విజ్ఞప్తిని ఇటలీ అంగీకరించింది. దీని ప్రకారం 2021లో ఇటలీలో జీ-20 సమావేశం జరగనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీ-20 (గ్రూప్ ఆఫ్ 20) సదస్సు
ఎప్పుడు : నవంబర్ 30, డిసెంబర్ 1
ఎక్కడ : బ్యూనోస్ ఎయిర్స్, అర్జెంటీనా

రాజపక్స అధికారం చెల్లదు : శ్రీలంక కోర్టు
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రధానిగా నియమించిన మహిందా రాజపక్స అధికారం చెల్లదని శ్రీలంక కోర్టు డిసెంబర్ 3న తీర్పునిచ్చింది. ఈ మేరకు రాజపక్స కేబినెట్ మంత్రులు కూడా విధులు నిర్వర్తించరాదని వెల్లడించించింది. రాజపక్స ప్రధాని పదవి చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ పదవీచ్యుత ప్రధాని విక్రమసింఘేకు చెందిన యునెటైడ్ నేషనల్ పార్టీ, జనతా విముక్తి పేరమునా(జేవీపీ), తమిళ్ నేషనల్ అలియన్‌‌జ పార్టీలు నవంబర్‌లో కోర్టును ఆశ్రయించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్స అధికారం చెల్లదు
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : శ్రీలంక కోర్టు
Published date : 15 Dec 2018 11:49AM

Photo Stories