China and Taiwan Conflict : తైవాన్ అధికారులపై చైనా ఆంక్షలు.. ఎందుకంటే..?
తైవాన్ చుట్టూ భారీగా సైనిక విన్యాసాలను కొనసాగించడంతోపాటు తాజాగా తైవాన్‌కు చెందిన ఏడుగురు అధికారులు, నేతలపై ఆంక్షలు విధించింది. వీరిలో అమెరికాలో తైవాన్ ప్రతినిధి కూడా ఉన్నారు. ‘వీరంతా చైనా నుంచి విడిపోయేందుకు స్వాతంత్య్ర వాదనను ముందుకు తెచ్చారు. వీరు, వీరి కుటుంబసభ్యులు చైనాలో అడుగు పెట్టరాదు. వీరి తరఫు వారు కూడా చైనా ప్రధాన భూభాగంలో లాభాపేక్షతో కూడిన ఎలాంటి వ్యాపారాలు చేయరాదు. వీరి జీవితకాలం ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇలాంటి వారిపై మరికొన్ని చర్యలను త్వరలో ప్రకటిస్తాం’అని ఓ అధికారి తెలిపినట్లు జిన్హువా వార్తా సంస్థ ఆగస్టు 16వ తేదీన (మంగళవారం) పేర్కొంది. ఏడుగురిలో ఆరుగురు తైవాన్ స్వతంత్ర దేశంగా అవతరించాలని వాదించే డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పారీ్ట(డీపీపీ)కి చెందిన వారు కాగా ఒకరు న్యూ పవర్ పార్టీ సభ్యుడని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. చైనా గత ఏడాది డిసెంబర్‌లో తైవాన్ ప్రధాని, అధికార పార్టీ లెజిస్లేచర్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రులపై పలు ఆంక్షలు ప్రకటించింది. ఆగస్టు 2న అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ, ఆదివారం మరో ప్రతినిధి బృందం తైవాన్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. వీరితోపాటు గత వారం ఈయూ సభ్య దేశం లిథువేనియా మంత్రి ఒకరు తైవాన్‌లో పర్యటించారు.