US bomb cyclone: అమెరికాను ముంచేసిన మంచు
పశ్చిమ న్యూయార్క్‌లో కొన్ని ప్రాంతాలు 8 అడుగుల మేర మంచులో కూరుకుపోయాయి. ఏకధాటిగా మంచు కురుస్తూ ఉండడంతో ప్రజలు రోడ్లపైకి రావడం అసాధ్యంగా మారిందని న్యూయార్క్ గవర్నర్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 2 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో చికాగో, డెన్వర్, డెట్రాయిట్, న్యూయార్క్, అట్లాంటా విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు. కొలరాడో, కన్సాస్, కెంటకీ, మిస్సోరీ, ఓహియోలో ప్రాణనష్టం అధికంగా ఉంది. అమెరికాలో తూర్పు రాష్ట్రాలన్నీ డీప్ ఫ్రిజ్‌లో పెట్టినట్టుగా ఉన్నాయని అమెరికా నేషనల్ వెదర్ సర్వీసెస్ (ఎన్‌డబ్ల్యూఎస్) తెలిపింది.
US Bomb Cyclone: మంచు గుప్పెట్లో అమెరికా.. మైనస్ 30కి ఉష్ణోగ్రతలు
ఈ రాష్ట్రాల జనాభాలో 2 లక్షలకు మందికి పైగా విద్యుత్ సదుపాయం లేక విలవిలలాడిపోతున్నారు. ప్రజలు ఇల్లు కదిలి బయటకు రావద్దని ఎన్‌డబ్ల్యూఎస్ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలోని 48 రాష్ట్రాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచు తుఫాన్ హెచ్చరికలు జారీ అయిన ప్రాంతాల్లో కోటి మంది వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్‌లోని బఫెల్లో ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కార్లలో ప్రయాణిస్తున్న వారిపై విపరీతంగా మంచుకురవడం వల్ల ఆ వాహనంలో మంచులో కూరుకుపోయి మృతి చెందిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకి రావడంపై ఆ ప్రాంతంలో నిషేధం విధించారు. విద్యుత్ సబ్ స్టేషన్లు 18 అడుగుల మంచులో కూరుకుపోవడంతో ఎప్పటికి కరెంట్ వస్తుందో తెలీని పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్కిటిక్ బ్లాస్ట్‌తో అమెరికా ఈ శీతాకాలంలో గడ్డకట్టుకుపోయింది.