Skip to main content

UN Conference: జీవ వైవిధ్య పరిరక్షణే లక్ష్యం.. 200 దేశాల ఆమోదముద్ర

ఏళ్ల తరబడి జరిగిన చర్చోపచర్చలు, సంప్రదింపులు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి. భూమిపై జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే దిశగా కీలక ముందడుగు పడింది.
ఒప్పందం ఆమోదముద్ర పొందినట్టు ప్రకటిస్తున్న కాప్‌15 అధ్యక్షుడు (ఇన్‌సెట్‌లో). సభికుల హర్షధ్వానాలు

ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కెనడాలోని మాంట్రియల్‌లో డిసెంబర్‌ 7 నుంచి జరుగుతున్న కాప్‌–15 అంతర్జాతీయ సదస్సులో భారత్‌తో సహా దాదాపు 200 దేశాలు ఈ విషయంలో విభేదాలు వీడి ఒక్కతాటిపైకి వచ్చాయి. కీలకమైన కుమ్నింగ్‌–మాంట్రియల్‌ జీవవైవిధ్య ప్రణాళిక (జీబీఎఫ్‌)కు డిసెంబ‌ర్ 19న‌ అంగీకారం తెలిపాయి. ఈ మేరకు ‘‘కున్మింగ్‌–మాంట్రియల్‌’ ఒప్పందం ఆమోదముద్ర పొందినట్టు సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న చైనా పర్యావరణ మంత్రి హువాంగ్‌ రుంక్యూ సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. పారిస్‌ ఒప్పందం తరహాలోనే పర్యావరణ పరిరక్షణ యత్నాల్లో దీన్నో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా వర్ధమాన దేశాల్లో భూ భాగాలు, సముద్ర జలాలతో పాటు జంతు జాతులను కాలుష్యం, వాతావరణ మార్పుల బారినుంచి పూర్తిస్థాయిలో రక్షించడం ఈ ఒప్పందం లక్ష్యం.

అయితే ఇందుకు సమకూర్చాల్సిన ఆర్థిక ప్యాకేజీపై ఎంతోకాలంగా పడ్డ పీటముడి ఎట్టకేలకు వీడింది. ఆ మొత్తాన్ని ఇతోధికంగా పెంచి 2030 కల్లా ఏటా 200 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని నిర్ణయం జరిగింది. 2020లో అంగీకరించిన మొత్తంతో పోలిస్తే ఇది రెట్టింపు! ఈ కీలక అంగీకారం నేపథ్యంలో ఒప్పందానికి మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా మొత్తం 23 లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వాటిని 2030కల్లా సాధించాలన్నది లక్ష్యం. దీన్ని ప్రపంచ ప్రజల విజయంగా వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ మార్కో లాంబెర్టినీ అభివర్ణించారు. అయితే, లక్ష్యసాధనకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక లేకపోవడం ఈ ఒప్పందంలో కీలక లోపమని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ గ్లోబల్‌ పాలసీ సీనియర్‌ డైరెక్టర్‌ లిన్‌ లీ అన్నారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (11-17 నవంబర్ 2022)

50 ఏళ్లలో భారీ విధ్వంసం 
జీవ వైవిధ్యానికి గత 50 ఏళ్లలో కనీవినీ ఎగరని స్థాయిలో ముప్పు వాటిల్లింది. చాలా రకాల జీవ జాతులు 1970 నుంచి ఏకంగా 69 శాతం క్షీణించాయని వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌–లివింగ్‌ ప్లానెట్‌ నివేదిక (ఎల్‌పీఆర్‌) పేర్కొంది. పర్యావరణానికి జరుగుతున్న ఈ అపార నష్టానికి అడ్డుకట్ట వేసి జీవ వైవిధ్యాన్ని పెంపొందించేందుకు తాజాగా ఒప్పందమైతే కుదిరింది. కాకపోతే దాని అమలులో దేశాలు ఏ మేరకు చిత్తశుద్ధి కనబరుస్తాయన్నది కీలకం. ఎందుకంటే ఇందుకోసం ఏటా 200 బిలియన్‌ డాలర్లు వెచ్చించేందుకు ఎట్టకేలకు అంగీకారం కుదిరినా, ఇందులో వర్ధమాన దేశాల అవసరాలు తీర్చేందుకు సంపన్న దేశాలు కేటాయించబోయే వాటా ఎంత వంటి కీలకాంశాలపై మాత్రం ఇంకా స్పష్టత లేదు.  
ఒప్పందం లక్ష్యాలివీ.. 
జీవ వైవిధ్య పరిరక్షణకు 2010లో జపాన్‌లోని నగోయాలో జరిగిన కాప్‌–10 సదస్సులో దేశాలన్నీ పలు లక్ష్యాలు నిర్దేశించుకున్నాయి. అవి చాలావరకు లక్ష్యాలుగానే మిగిలిపోయాయి. దాంతో మరోసారి అంతర్జాతీయ స్థాయి మేధోమథనం కోసం 2020 అక్టోబర్లో చైనాలోని కుమ్నింగ్‌లో తలపెట్టిన కాప్‌–15 సదస్సు కరోనా వల్ల వాయిదా పడింది. అది తాజాగా రెండు దశల్లో జరిగింది. తొలి భాగం వర్చువల్‌ పద్ధతిలో ముగియగా మాంట్రియల్‌లో డిసెంబర్‌ 7 నుంచి 19 దాకా జరిగిన కీలకమైన రెండో భాగంలో చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా మొత్తం 23 లక్ష్యాలను ప్రపంచ దేశాలు నిర్దేశించుకున్నాయి. వాటిలో ముఖ్యాంశాలు..

UNO: పని ప్రదేశాల్లో వేధింపులు ఎక్కువే!

☛ 2030 కల్లా మొత్తం భూభాగం, సాధారణ జలాలు, తీర ప్రాంతాలు, సముద్రాల్లో కనీసం 30 శాతాన్ని పూర్తిస్థాయిలో సంరక్షించి, పరిరక్షించే చర్యలు చేపట్టడం. అపార జీవ వైవిధ్యానికి నిలయమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడం. ప్రస్తుతం 17 శాతం భూభాగం, కేవలం 10 సముద్ర జలాల్లో మాత్రమే పరిరక్షణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 
☛ జీవ వైవిధ్యపరంగా అపార ప్రాధాన్యమున్న ప్రాంతాల్లో పర్యావరణ నష్టాలను అరికట్టడం
☛ ఇందుకోసం పేద దేశాలకు చేసే కేటాయింపులను 2025కల్లా ఏటా 20 బిలియన్‌ డాలర్లకు,  2030 కల్లా 30 బిలియన్‌ డాలర్లకు పెంచడం. 
☛ ప్రపంచ ఆహార వృథాను సగానికి తగ్గించడం. 
☛ వనరుల విచ్చలవిడి వాడకాన్ని, తద్వారా వ్యర్థాల ఉత్పత్తిని వీలైనంత కట్టడి చేయడం. 
☛ సాగులో పురుగు మందులు, ఇతర అత్యంత ప్రమాదకర రసాయనాల వాడకాన్ని కనీసం సగానికి తగ్గించడం. 
☛ జీవ వైవిధ్యానికి అపారమైన హాని కలిగించే సాగు సబ్సిడీలను 2030 నాటికి ఏటా 500 బిలియన్‌ డాలర్ల చొప్పున తగ్గించడం. 
☛ జీవ వైవిధ్య సంరక్షణకు దోహదపడే పథకాలు, చర్యలకు ప్రోత్సాహకాలను పెంచడం.  
☛ భారీ, అంతర్జాతీయ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, తమ కార్యకలాపాల వల్ల పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి కలిగే నష్టాన్ని ఎప్పటికప్పుడు పారదర్శకంగా వెల్లడించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవడం. 
☛ ఆ నష్టాలను అవి కనీస స్థాయికి పరిమితం చేసేలా చర్యలు తీసుకోవడం. 

UNSC: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్ దూరం

Published date : 20 Dec 2022 02:48PM

Photo Stories