UNGA 76th Session: ఏ రెండు దేశాలకు ఐరాస సభలో ప్రసంగించే అవకాశం లేదు?
అఫ్గానిస్తాన్, మయన్మార్ దేశాలకు సర్వప్రతినిధి సభలో ప్రసంగించే అవకాశం ప్రస్తుతానికి లేదని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. 76వ సెషన్‌లో ఆఖరు రోజున ప్రసంగించే దేశాల ప్రతినిధుల జాబితాను ఐరాస విడుదల చేసింది. ఇందులో తాలిబన్లు పాలిస్తున్న అఫ్గానిస్తాన్‌తోపాటు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారం చెలాయిస్తున్న మయన్మార్ పేర్లు లేవు. 2021, సెప్టెంబర్ 21న ప్రారంభమైన 76వ సెషన్ ఐరాస సర్వసభ్య సమావేశాలు సెప్టెంబర్ 27వ తేదీ వరకు జరిగాయి.
భారత్‌లో ఫాసిస్ట్ ప్రభుత్వ పాలన: ఇమ్రాన్
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ భారత్‌లో మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌గా అభివర్ణించారు. ఆర్టికల్ 370 రద్దు, వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ మృతి వంటి అంశాలను ప్రస్తావిస్తూ భారత్‌లో ఇస్లాం వ్యతిరేకులు పరిపాలకులుగా ఉన్నారని, ముస్లింలపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ముందుగా రికార్డు చేసిన ఇమ్రాన్ ప్రసంగం వీడియోను సెప్టెంబర్ 24న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రదర్శించారు.
తక్షణమే ఖాళీ చేయాలి: స్నేహ దుబే
ఐరాస సర్వప్రతినిధి సమావేశంలో భారత యువదౌత్యవేత్త స్నేహ దుబే పాకిస్తాన్ నోరుమూయించారు. ఇమ్రాన్ ప్రసంగానికి ఫస్ట్ సెక్రటరీ స్నేహ గట్టిగా బదులిచ్చారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటాయని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న ప్రాంతాలన్నీ తక్షణమే ఖాళీ చేయాలని ఆమె అల్టిమేటమ్ జారీ చేశారు.
చదవండి: అంతర్జాతీయ న్యాయ స్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?