Skip to main content

UNGA 76th Session: ఐరాస 76వ సెషన్‌ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం

PM Modi at UNO

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్‌ 25న ప్రసంగించారు. అఫ్గాన్, కరోనా, ఇండోపసిఫిక్, అంతర్జాతీయ సవాళ్లు.. వంటి అనేక అంశాలను ప్రధాని తన సందేశంలో ప్రస్తావించారు. 2021, సెప్టెంబర్‌ 21న ప్రారంభమైన 76వ సెషన్‌ ఐరాస సర్వసభ్య సమావేశాలు సెప్టెంబర్‌ 27వ తేదీ వరకు జరగనున్నాయి. మాల్దీవులకు చెందిన అబ్దుల్లా షాహిద్‌ ఐరాస 76వ సెషన్స్‌కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. షాహిద్‌ ఐరాస జనరల్‌ అసెంబ్లీ ప్రెసిడెంట్‌గా 2021, సెప్టెంబర్‌ 14న బాధ్యతలు చేపట్టారు. కరోనా వైరస్‌ కారణంగా గత ఏడాది(2020) సమావేశాలను వర్చువల్‌ విధానంలో నిర్వహించారు.

మోదీ ప్రసంగం–ముఖ్యాంశాలు

  • ఉగ్రవాదాన్ని రాజకీయ పనిముట్టుగా వాడే దేశాలు చివరకు అది తమను కూడా కబళిస్తుందని గ్రహించాలి.
  • విస్తరణ, బహిష్కరణ పోటీల నుంచి సముద్రాలను కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది.(ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా చర్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ...)
  • అఫ్గాన్‌లో సున్నితమైన పరిస్థితులను ఏ దేశం కూడా తమకు అనుకూలంగా మలుచుకోకుండా చూడాలి.
  • ఒక టీ అమ్ముకునే వ్యక్తి స్థాయి నుంచి ఐరాసలో భారత ప్రధానిగా ప్రసంగించేవరకు సాగిన నా జీవితం భారతీయ ప్రజాస్వామిక బలానికి నిదర్శనం. ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లివంటిది. 2021, ఏడాది ఆగస్టు 15న ఇండియా 75వ స్వాతంత్య్రోత్సవాలు జరుపుకుంది.
  • ఐరాస... తన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి. కరోనా పుట్టుక, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాకింగులు, అంతర్జాతీయ సంస్థల పనితీరు వంటివి అనేక సంవత్సరాల ఐరాస కృషిని, ఐరాసపై నమ్మకాన్ని దెబ్బతీశాయి.
  • ప్రపంచానికి తొలి డీఎన్‌ఏ ఆధారిత కరోనా టీకాను భారత్‌ అందించింది. కరోనా నాసల్‌ టీకా అభివృద్ధిలో భారతీయ సైంటిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
  • భారత్‌ వృద్ధి బాటలో పయనిస్తే ప్రపంచం కూడా అదే బాటలో పయనిస్తుంది.

ఐక్యరాజ్య సమితి (ఐరాస)

స్థాపన : అక్టోబర్‌ 24, 1945 
ప్రధాన కార్యాలయం : న్యూయార్క్‌ (అమెరికా) 
సభ్య దేశాల సంఖ్య : 193   
భద్రతా మండలి సభ్యుల సంఖ్య : 15 
భద్రతా మండలి శాశ్వత సభ్యుల సంఖ్య (వీటో అధికారం కలిగిన సభ్యులు) : 5 (చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యూఎస్‌)  
అంతర్జాతీయ న్యాయ స్థానం ప్రధాన కార్యాలయం : ది హేగ్‌ (నెదర్లాండ్స్‌)  
ఐరాసలో భారత్‌ చేరిన సంవత్సరం : 1945  
ఐరాస చిహ్నం : ఆలీవ్‌ కొమ్మ 
ఐరాస పతాకంలో రంగులు : తెలుపు, లేత నీలం

 

చ‌ద‌వండి: కరోనా అసత్య సమాచార వ్యాప్తిలో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం?

 

Published date : 27 Sep 2021 12:31PM

Photo Stories