Skip to main content

Galwan Valley: పాఠ్య పుస్త‌కాల‌లో చేర‌నున్న గాల్వన్ లోయ ఘ‌ట‌న‌

భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన గాల్వ‌న్ వ‌ద్ద 2020లో ఇండియా-చైనా సైనికుల మ‌ధ్య జ‌రిగిన సంఘ‌ట‌న పాఠ్య పుస్త‌కాల‌లో చేర‌నుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని యూనివ‌ర్సిటీల‌లో సిల‌బ‌స్‌గా ఈ ఘ‌ట‌న‌ను చేర్చ‌నున్నారు. అలాగే వివిధ యుద్ధాల‌లో భార‌త సైనికులు ప్ర‌ద‌ర్శించిన శౌర్యాన్ని తెలుపుతూ, మ‌హాభార‌త కాలం నుంచి జ‌రిగిన చారిత్ర‌క యుద్ధాల‌ను పాఠాలుగా పొంద‌ప‌ర‌చనున్నారు.
Galwan Valley stand-off
Galwan Valley stand-off

కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఇప్ప‌టివ‌ర‌కు బోధిస్తున్న చరిత్ర, సైనిక శాస్త్రాన్ని పునఃసమీక్షించాల్సిన ఆవశ్యకతపై విద్యావేత్తలు, మిలటరీ సైన్స్ నిపుణులు, రాజకీయ ప్రముఖులతో కూడిన క‌మిటీ మేధోమథనం చేసి కొన్ని మార్పుల‌ను సూచించింది. భారత దళాలు విజయం సాధించిన యుద్ధాలను హైలైట్ చేసి, విద్యార్థుల‌కు మ‌న సైనికుల ధైర్య సాహ‌సాల‌ను తెలిపేలా సిలబస్‌ను సవరిస్తున్నట్లు స‌మాచారం. భారత దళాల పరాక్రమం, వ్యూహరచనతో జరిగిన యుద్ధాల గురించి డిఫెన్స్ స్టడీస్ విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.

చ‌ద‌వండి: రేపే అంబేడ్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌... పూర్తి వివ‌రాలు ఇవిగో
విద్యార్థులు తెలుసుకోవాల్సిందే....
గత ఏడాది యూపీలోని విశ్వవిద్యాలయాల్లో సిలబస్ మార్పున‌కు సంబంధించి ఓ క‌మిటీని ప్ర‌భుత్వం వేసింది. ఇందులో స‌భ్యుడైన అలహాబాద్ విశ్వవిద్యాలయం డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ విభాగాధిపతి ప్రొఫెసర్ ప్రశాంత్ అగర్వాల్ మాట్లాడుతూ... ప్ర‌స్తుతం ఉన్న పాఠ్య పుస్త‌కాల‌ను మార్చాల్సిన ఆవ‌శ్య‌కత ఉంద‌న్నారు. మొఘల్, బ్రిటీష్ పాల‌న‌లో అలాగే స్వాతంత్య్రం అనంతర కాలంలో జరిగిన అనేక యుద్ధాలలో భార‌త సైనికులు క‌న‌బ‌ర్చిన శ‌క్తి, సామ‌ర్థ్యాల‌ను తెలియ‌జెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మన సైనికుల పరాక్రమాన్ని ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉందన్నారు.

చ‌ద‌వండి: భారీగా గురుకుల పోస్టుల భర్తీ.. దరఖాస్తు విధానం ఇదే!
ఘ‌ట‌న‌లో...
తూర్పు లద్దాఖ్‌‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా బలగాల మధ్య 2020 ఏప్రిల్‌ నుంచి కొనసాగిన ఉద్రిక్తతలు తీవ్ర హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి. జూన్ రెండో వారంలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక కమాండింగ్‌ అధికారి సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. అలాగే సుమారు 45 మందిదాకా చైనా సైనికులు మ‌ర‌ణించారు. ఈ అంశాన్ని సిల‌బ‌స్‌లో చేర్చాల‌ని క‌మిటీ సిఫార్సు చేసింది.

Published date : 13 Apr 2023 04:27PM

Photo Stories