Union Budget Speech: బడ్జెట్ - సందేహాలు
ఆర్థిక మంత్రి ఇచ్చే బడ్జెట్ ప్రసంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
లోక్‌సభలో ఆర్థికమంత్రి బడ్జెట్‌ను ప్రసంగిస్తారు. ఆ ఉపన్యాసం రెండు భాగాలుగా ఉంటుంది. ఇతర ప్రతినిధులు ఎవరూ అంతరాయం కలిగించకపోతే ఆర్థిక మంత్రి చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పి ప్రసంగాన్ని ముగిస్తారు. అదెలాగూ సాధ్యం కాదు కాబట్టి ప్రసంగాన్ని రెండు భాగాలుగా విడగొట్టి అర్థం చేసుకోవడం అవసరం.
మొదటి భాగం
- అన్ని రంగాల్లో ఉన్న ఆదాయ వ్యయాలను గురించి సంక్షిప్తంగా వివరిస్తారు.
- కొత్త పథకాలు, ప్రాధాన్యాలు, అభివృద్ధి చేయాల్సిన రంగాలు, అమలు చేయాల్సిన పనుల గురించి చెబుతారు.
- వీటిని వివరించే ముందు అవసరమైన చోట గతేడాది బడ్జెట్ లెక్కలను కూడా ప్రస్తావిస్తారు
రెండవ భాగం
- ఇందులో అన్నీ పన్నులకు సంబంధించిన అంశాలే ఉంటాయి.
- కొత్త పన్నులు, పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం, పన్ను తగ్గింపు, పెంపుల అమలు వంటి వివరాలన్నీ ఉంటాయి.
- ప్రతి అంశాన్నీ చదివేముందు దానికి మద్దతిచ్చే చట్టాన్ని పేర్కొంటారు. అలాగే దానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలనూ ప్రస్తావిస్తారు.
ఆర్థిక రంగం, స్టాక్ మార్కెట్లపై బడ్జెట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
బడ్జెట్, ఆర్థికరంగం, స్టాక్ మార్కెట్లు.. వీటన్నింటికీ ధనమే మూలం. బడ్జెట్ పూర్తిగా ద్రవ్యానికి సంబంధించిన విషయం. కాబట్టి దీని ప్రభావం మిగతా వాటిపై కచ్చితంగా ఉంటుంది. ఆ ప్రభావం ఎలాంటిదనే విషయం మాత్రం ఆర్థికమంత్రి మీద ఆధారపడి ఉంటుంది. వివిధ రంగాలకు కేటాయించిన మొత్తం ఆధారంగా ఈ ప్రభావాన్ని నిర్ణయించవచ్చు. అభివృద్ధికి పెద్దపీట వేస్తే ఆర్థికాభివృద్ధి, స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయి. అలా కాకుండా ఆకాశమంత అప్పుల చిట్టాను చూపిస్తే రెండూ ఢమాల్‌న కుప్పకూలిపోతాయి.