Skip to main content

సెప్టెంబర్ 2020 ఎకానమీ

రిలయన్స్ రిటైల్‌లో జనరల్ అట్లాంటిక్ పెట్టుబడులు
Current Affairs
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్‌ఆర్‌వీఎల్)లో అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ (జీఏ) 0.84 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 3,675 కోట్లు వెచ్చించనుంది. దీని ప్రకారం చూస్తే ఆర్‌ఆర్‌వీఎల్ విలువ సుమారు రూ. 4.285 లక్షల కోట్ల మేర ఉంటుందని అంచనా. ఇందులో ఇన్వెస్ట్ చేసిన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీల్లో జీఏ మూడోది. ఇప్పటిదాకా అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ రూ. 7,500 కోట్లు (1.75 శాతం వాటా), మరో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ సుమారు రూ. 5,500 కోట్లు (1.28 శాతం వాటా) ఇన్వెస్ట్ చేశాయి. ఆర్‌ఆర్‌వీఎల్‌లో జీఏ పెట్టుబడులు పెట్టనుందని సెప్టెంంబర్ 30న రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో 0.84 శాతం వాటా కొనుగోలు
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ (జీఏ)

కరెంట్ అకౌంట్ అంటే ఏమిటి? దేశ కరెంట్ అకౌంట్ మిగులు ఎంత?
కరెంట్ అకౌంట్ లావాదేవీల విషయంలో 2020 వరుసగా రెండవ త్రైమాసికం ఏప్రిల్-జూన్‌లోనూ భారత్ మిగులను నమోదు చేసుకుంది. ఈ మొత్తం 19.8 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెప్టెంబర్ 30న తెలిపింది. సంబంధిత త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 3.9 శాతంగా ఉంది.
కరెంట్ అకౌంట్ అంటే ఏమిటి?
ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని కరెంట్ అకౌంట్ ప్రతిబింబిస్తుంది. వస్తువులు, సేవలకు సంబంధించి ఒక దేశం ఎగుమతులు-దిగుమతుల లావాదావీల వ్యయాలు, విదేశీ ఇన్వెస్టర్లకు చేసిన చెల్లింపులు, వారి నుంచి వచ్చిన నిధులు, ఆయా పరిమాణాల వ్యత్యాసాలు అన్నీ కరెంట్ అకౌంట్‌లోకి వస్తాయి.
సాధారణంగా...
సహజంగా భారత్ కరెంట్ అకౌంట్‌లోటు (క్యాడ్)ను కలిగి ఉంటుంది. అయితే కోవిడ్-19 నేపథ్యంలో దిగుమతులు భారీగా పడిపోవడంతో కరెంట్ అకౌంట్ మిగులు నమోదవుతోంది. 2019-20లో కరెంట్ అకౌంట్ లోటు 24.6 బిలియన్ డాలర్లు. జీడీపీలో ఇది 0.9 శాతం. 2020-2021లో 30 బిలియన్ డాలర్ల కరెంట్ అకౌంట్ ‘మిగులు’ ఉంటుందని ఇక్రా అంచనా.
ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఎన్ని లక్షల కోట్ల రుణ సమీకరణ లక్ష్యానికి కేంద్రం కట్టుబడి ఉంది?
2020-21 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో (అక్టోబర్-మార్చి) మధ్య రూ.4.34 లక్షల కోట్ల రుణ సమీకరణలు జరపనున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ సెప్టెంబర్ 30న వెల్లడించింది. కరోనా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడం, దీనితో ప్రభుత్వ ఆదాయాల అంచనాలకు గండి పడ్డం వంటి అంశాలు దీనికి నేపథ్యం. ఆర్థిక శాఖ తెలిపిన వివరాల ప్రకారం... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) మొత్తంలో రూ.12 లక్షల కోట్ల రుణ సమీకరణ లక్ష్యానికి కేంద్రం కట్టుబడి ఉంది. 2020, సెప్టెంబర్ వరకూ రూ.7.66 లక్షల కోట్ల రుణ సమీకరణలు జరిగాయి.
వాస్తవానికి 7.80 లక్షల కోట్లే...
నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.80 లక్షల కోట్ల నికర మార్కెట్ రుణ సమీకరణలు జరపాలని 2020-21 బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్దేశించారు. అయితే కరోనా ప్రభావంతో ఈ మొత్తాన్ని రూ.12 లక్షల కోట్లకు పెంచాలని కేంద్రం మే నెలలో నిర్ణయించింది. 2019-20లో కేంద్ర రుణ సమీకరణల మొత్తం రూ.7.1 లక్షల కోట్లు.

ఏ రెండు దేశాల మధ్య ఇండ్‌సోమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటైంది?
భారత్, సోమాలియా మధ్య వ్యాపార సంబంధాలు, వాణిజ్యం పెంపుదల లక్ష్యంగా ఇండ్‌సోమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెప్టెంబర్ 30న ప్రారంభమైంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చాంబర్ ఫౌండర్ వై.కిరణ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. లాభాపేక్షలేని, ప్రభుత్వేతర సంస్థ అయిన ఇండ్‌సోమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగుమతులు, దిగుమతులు, సాంకేతిక బదిలీ, సంయుక్త భాగస్వామ్య కంపెనీల ఏర్పాటుకు వేదికగా నిలవనుంది. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటున్న సోమాలియాలో ఆధునిక సేవలకు అపార అవకాశాలు ఉన్నాయని వై.కిరణ్ పేర్కొన్నారు.
రూ. 4,500 కోట్లకు...
ఇటీవలి కాలంలో భారత్, సోమాలియా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రూ. 4,500 కోట్లకు చేరుకుంది. పెట్రోలియం, ఫిషరీస్ రంగాల్లో సహజ వనరులను సద్వినియోగం చేసుకోవాలని సోమాలియా భావిస్తోంది.
టెలిశాట్‌తో నెల్కో జట్టు
టాటా గ్రూప్ కంపెనీ నెల్కో, అంతర్జాతీయ శాటిలైట్ ఆపరేటర్ టెలిశాట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో టెలిశాట్ ఎల్‌ఈఓ శాటిలైట్ కనెక్టివిటీని అందించడం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని నెల్కో తెలిపింది. దీంతో మారుమూల ప్రాంతాల్లో కూడా డిజిటల్ సేవలందుతాయని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండ్‌సోమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : వ్యాపారవేత్త వై.కిరణ్
ఎందుకు : భారత్, సోమాలియా మధ్య వ్యాపార సంబంధాలు, వాణిజ్యం పెంపుదల లక్ష్యంగా

రక్షణ రంగంలో ఎంత శాతం వరకు ఎఫ్‌డీఐలను కేంద్రం అనుమతించింది?
Current Affairs
రక్షణ రంగ అవసరాలను స్థానికంగానే తీర్చుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం... ఈ రంగంలోకి 74 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆటోమేటిక్ మార్గంలో (అనుమతి అవసరం లేని) వచ్చేందుకు అనుమతించింది. అయితే, జాతీయ భద్రత దృష్ట్యా రక్షణ రంగంలోకి వచ్చే ఏ విదేశీ పెట్టుబడిని అయినా సమీక్షించే విసృ్తత అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని పెట్టబడుల ఉపసంహరణ, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) తెలిపింది.
నూరు శాతం అనుమతి ఉంది.. కానీ..
ప్రస్తుతానికి రక్షణ రంగ కంపెనీలు, ప్రాజెక్టుల్లో నూరు శాతం ఎఫ్‌డీఐకి అనుమతి ఉంది. అయితే ఆటోమేటిక్ మార్గంలో ఈ పరిమితి 49 శాతంగానే ఉంది. ఇంతకుమించితే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తాజా మార్పుతో ఇకపై 74 శాతం వరకు పెట్టుబడులను ప్రభుత్వ అనుమతి లేకుండానే చేసుకోవచ్చు. అయితే ఇలా చేసే పెట్టుబడితో కంపెనీ ప్రమోటర్‌లో మార్పులు చోటుచేసుకుంటుంటే అందుకు కేంద్రం అనుమతి కోరాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రక్షణ రంగంలోకి 74 శాతం వరకు ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ మార్గంలో (అనుమతి అవసరం లేని) వచ్చేందుకు అనుమతి
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : రక్షణ రంగ అవసరాలను స్థానికంగానే తీర్చుకునే లక్ష్యంతో...

2020 సంవత్సరానికీ అత్యంత విలువైన భారత బ్రాండు?
2020 సంవత్సరానికీ అత్యంత విలువైన భారత బ్రాండుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బ్రాండ్ నిలిచింది. ఈ విషయాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకటనల కంపెనీ అయిన డబ్ల్యూపీపీ తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బ్రాండ్ విలువ 11 శాతం తగ్గి 20.26 బిలియన్ డాలర్లకు పడిపోయినప్పటికీ.. 2020 ఏడాదికి అత్యంత విలువైన భారత బ్రాండుగా తన స్థానాన్ని నిలబెట్టుకుందని పేర్కొంది.
డబ్ల్యూపీపీ వివరాల ప్రకారం...
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తర్వాత ఎల్‌ఐసీ 18.29 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. ఎల్‌ఐసీ బ్రాండ్ విలువ సైతం 9 శాతం వరకు తగ్గింది.
  • ఎయిర్‌టెల్ బ్రాండ్ విలువ 36 శాతం పెరిగి 13.94 బిలియన్ డాలర్లకు చేరింది. జాబితాలో ఈ బ్రాండ్‌కు నాలుగో స్థానం లభించింది.
  • జియో బ్రాండ్‌కు ఏడో స్థానం లభించింది. బ్రాండ్ విలువ 26 శాతం పెరిగి 6.87 బిలియన్ డాలర్లకు చేరింది.

6 శాతం తగ్గిపోయి...
దేశంలోని అగ్రస్థాయి 75 బ్రాండ్ల విలువ 2020లో ఇప్పటి వరకు 6 శాతం తగ్గిపోయి 216 బిలియన్ డాలర్లుగా ఉందని డబ్ల్యూపీపీ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధి పథంలోకి రానంత వరకు పరిస్థితులు అంత సజావుగా ఉండవని డబ్ల్యూపీపీ గ్రూపులో భాగమైన డేటా, కన్సల్టింగ్ కంపెనీ కాంటర్ ఇన్‌సైట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రీతిరెడ్డి తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020 సంవత్సరానికీ అత్యంత విలువైన భారత బ్రాండుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : డబ్ల్యూపీపీ గ్రూపులో భాగమైన డేటా, కన్సల్టింగ్ కంపెనీ కాంటర్ ఇన్‌సైట్స్

గూగుల్ పేతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ?
డిజిటల్ వాలెట్ ప్లాట్‌ఫాం, ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్ అయిన గూగుల్ పే, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వీసా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా అత్యంత భద్రతతో డిజిటల్ టోకెన్‌తో కూడిన డెబిట్, క్రెడిట్ కార్డు ఆధారిత చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ప్రత్యక్షంగా క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు ఇచ్చే అవసరం లేకుండానే గూగుల్ పే ఆన్‌డ్రాయిడ్ యూజర్లు ఈ డిజిటల్ టోకెన్‌తో చెల్లింపులు జరపవచ్చని సెప్టెంబర్ 21న ఆ సంస్థలు వెల్లడించాయి.
హెచ్‌సీఎల్ చేతికి ఆస్ట్రేలియా ఐటీ...
ఆస్ట్రేలియాకు చెందిన ఐటీ సొల్యూషన్స్ కంపెనీ డీడబ్ల్యూఎస్ లిమిటెడ్‌ను హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొనుగోలు చేయనుంది. డీడబ్ల్యూఎస్ కొనుగోలుతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మార్కెట్ల మరింత పటిష్టమవుతామని హెచ్‌సీఎల్ తెలిపింది. ఈ కంపెనీలో మొత్తం వాటాను రూ.850 కోట్లకు(15.8 కోట్ల ఆస్ట్రేలియన్ డాలర్లు)తమ అనుబంధ సంస్థ, హెచ్‌సీఎల్ ఆస్ట్రేలియా సర్వీసెస్ సర్వీసెస్ కొనుగోలు చేయనున్నదని వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వీసాతో భాగస్వామ్యం
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : డిజిటల్ వాలెట్ ప్లాట్‌ఫాం, ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్ అయిన గూగుల్ పే
ఎందుకు : అత్యంత భద్రతతో కూడిన డెబిట్, క్రెడిట్ కార్డు ఆధారిత చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు

రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో పెట్టుబడులు పెట్టనున్న ప్రైవేటు ఈక్విటీ సంస్థ?
రిలయన్స్ రిటైల్‌ను ప్రమోట్ చేస్తున్న రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీఎల్)లో 1.28 శాతం వాటాను ప్రైవేటు ఈక్విటీ సంస్థ కేకేఆర్ కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి ఆర్‌ఆర్‌వీఎల్‌లో కేకేఆర్ రూ.5,550 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ సెప్టెంబర్ 23న తెలిపింది. దీని ప్రకారం రిలయన్స్ రిటైల్ మార్కెట్ విలువ రూ.4.21 లక్షల కోట్లుగా ఉంది. ఆసియా ప్రైవేటు ఈక్విటీ ఫండ్‌‌స ద్వారా కేకేఆర్ రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడులు పెట్టనుంది. ఆర్‌ఆర్‌వీఎల్‌లో రూ.7,500 కోట్లతో 1.75 శాతం వాటా కొనుగోలుకు సిల్వర్ లేక్ ఇటీవలే ఒప్పంద చేసుకున్న విషయం విదితమే. ఆర్‌ఆర్‌వీఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీఎల్)లో 1.28 శాతం వాటా కొనుగోలు
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : ప్రైవేటు ఈక్విటీ సంస్థ కేకేఆర్

ఆర్థిక స్వేచ్ఛా సూచీ-2020లో భారత్ ర్యాంకు?
Current Affairs అంతర్జాతీయ ఆర్థిక స్వేచ్ఛా సూచీ-2020లో భారత్‌కు 105వ స్థానం దక్కింది. కెనడాకు చెందిన ఫ్రేసర్ ఇనిస్టిట్యూట్ సెప్టెంబర్ 10న ఎకనమిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్:2020 పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఆర్థిక స్వేచ్ఛ విషయంలో భారత్ 26 స్థానాలు కిందకు జారిపోయినట్టు నివేదిక పేర్కొంది. తదుపరి దశ సంస్కరణల అమలు, అంతర్జాతీయ వాణిజ్యానికి తలుపులు తెరవడంపైనే భారత్‌లో ఆర్థిక స్వేచ్ఛ పెరిగే అవకాశాలు ఆధారపడి ఉన్నాయని తెలిపింది.
10 పాయింట్ల స్థాయిలో ఉంటే...
భారత ప్రభుత్వం విషయంలో 8.22 నుంచి 7.16కు, న్యాయ వ్యవస్థ, ఆస్తి హక్కుల విషయంలో 5.17 నుంచి 5.06కు, అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన స్వేచ్ఛ విషయంలో 6.08 నుంచి 5.71కు, రుణ నియంత్రణ, కార్మిక, వ్యాపారాల విషయంలో 6.63 నుంచి 6.53కు భారత్ పరిమాణం తగ్గింది. 10 పాయింట్ల స్థాయిలో ఉంటే దాన్ని అధిక ఆర్థిక స్వేచ్ఛగా పరిగణిస్తారు. ఈ ఆర్థిక స్వేచ్ఛా సూచీలో హాంగ్‌కాంగ్, సింగపూర్ అగ్ర స్థానాల్లో నిలిచాయి. న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, యూఎస్, ఆస్ట్రేలియా, మారిషస్, జార్జియా, కెనడా, ఐర్లాండ్ మొదటి పది స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ ఆర్థిక స్వేచ్ఛా సూచీ-2020లో భారత్‌కు 105వ స్థానం
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : ఎకనమిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్:2020

మూడీస్ అంచనాల ప్రకారం 2021-22లో భారత జీడీపీ వృద్ధి రేటు?
భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మైనస్ 11.5 శాతం క్షీణిస్తుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనా వేసింది. ఈ మేరకు క్రితం అంచనా మైనస్ 4 అంచనాలకు మరింత పెంచుతున్నట్లు మూడీస్ తెలిపింది. భారత్ ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన నివేదికను సెప్టెంబర్ 11న విడుదల చేసింది.
మూడీస్ నివేదికలోని అంశాలు...

  • వృద్ధి బలహీనత, అధిక రుణ భారం, బలహీన ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల నేపథ్యంలో భారత్ క్రెడిట్ ప్రొఫైల్ (రుణ సమీకరణ సామర్థ్యం) ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉంది.
  • తక్కువ బేస్ ఎఫెక్ట్ (2020-21లో భారీ క్షీణత కారణంగా) ప్రధాన కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) భారత్ 10.6 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకునే అవకాశం ఉంది.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో 90 శాతానికి భారత్ రుణ భారం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం జీడీపీలో భారత్ రుణ భారం 72 శాతం.
  • ప్రభుత్వ ఆదాయాలు- వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 7.5 శాతానికి చేరే అవకాశం ఉంది.

అందరి అంచనాలూ క్షీణతే..
మొదటి త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో భారత్ ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం క్షీణ రేటును నమోదు చేసుకున్న నేపథ్యంలో... ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్ సంస్థలు 2020-21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు 10శాతం నుంచి 15 శాతం వరకూ ఉంటాయని అంచనా వేశాయి. ఆయా అంచనాలను పరిశీలిస్తే (అంచనాలు శాతాల్లో)...

సంస్థ

తాజా అంచనా

క్రీతం అంచనా

గోల్డ్‌మన్ శాక్స్

14.8

11.8

ఫిచ్

10.5

5.0

ఇండియా రేటింగ్‌‌స - రిసెర్చ్

11.8

5.3

ఎస్‌బీఐ ఎకోర్యాప్

10.9

6.8

కేర్ రేటింగ్‌‌స

8.2

6.4


చెక్ రిపబ్లిక్ సంస్థ గైడ్‌విజన్‌ను కొనుగోలు చేయనున్న భారత సంస్థ?
ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా చెక్ రిపబ్లిక్‌కు చెందిన గైడ్‌విజన్ సంస్థను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ డీల్ విలువ 30 మిలియన్ యూరోల దాకా (సుమారు 260.4 కోట్లు) ఉండవచ్చని పేర్కొంది. తమ అనుబంధ సంస్థ ఇన్ఫీ కన్సల్టింగ్ కంపెనీ ద్వారా ఈ ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు సెప్టెంబర్ 14న తెలిపింది. చెక్ రిపబ్లిక్, హంగరీ, పోలాండ్, జర్మనీ, ఫిన్‌లాండ్ దేశాల్లోని గైడ్‌విజన్ సెంటర్ల తోడ్పాటుతో యూరప్‌లోని క్లయింట్లకు తమ సర్వీస్‌నౌ విభాగం మరింత మెరుగైన సర్వీసులు అందించడానికి వీలవుతుందని వివరించింది. ఇన్ఫోసిస్‌లో భాగమైన సర్వీస్‌నౌ.. వివిధ క్లౌడ్ కంప్యూటింగ్ సర్విసులను అందిస్తోంది. 2014లో చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌లో ఏర్పాటైన గైడ్‌విజన్ 100 పైగా క్లయింట్లకు ఐటీ సొల్యూషన్స్ అందిస్తోంది.
ఒరాకిల్‌కు టిక్‌టాక్ యాప్...
వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ అమెరికా విభాగాన్ని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దక్కించుకోలేకపోయింది. మైక్రోసాఫ్ట్‌కి విక్రయించరాదని చైనాకు చెందిన టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ నిర్ణయించుకుంది. అమెరికాలో తమ కార్యకలాపాల కోసం మరో ఐటీ దిగ్గజం ఒరాకిల్‌ను టెక్నాలజీ భాగస్వామిగా ఎంచుకుంది. మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో ఈ విషయాలు తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చెక్ రిపబ్లిక్ సంస్థ గైడ్‌విజన్‌ను కొనుగోలు చేయనున్న భారత సంస్థ
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్
ఎందుకు : చెక్ రిపబ్లిక్, హంగరీ, పోలాండ్, జర్మనీ, ఫిన్‌లాండ్ దేశాల్లోని తమ క్లయింట్లకు మెరుగైన సేవలు అందించడానికి

భారత ఆర్థిక వ్యవస్థపై ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ విశ్లేషణ
భారత్ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) రికవరీ అవకాశాలు కనిపించడం లేదని ఆసియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ (ఏడీఓ) 2020 అప్‌డేటెడ్ నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఎకానమీ గత (2020, జూన్‌లో వేసిన) క్షీణ అంచనా 4 శాతాన్ని తాజాగా 9 శాతానికి పెంచుతున్నట్లు పేర్కొంది. భారత్ ఎకానమీ మొదటి త్రైమాసికంలో 23.9 శాతం క్షీణత నేపథ్యంలో ఏడీబీ విడుదల చేసిన తాజా నివేదిక వివరాలను బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ యెసుయుకీ సవాడా సెప్టెంబర్ 15న తెలియజేశారు.
ఏడీఓలోని ముఖ్యాంశాలు...

  • 2021-22 ఆర్థిక సంవత్సరం భారత్ 8 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుంది. రవాణా, సరఫరాలు, వ్యాపార కార్యకలాపాల క్రియాశీలతతోపాటు బేస్ ఎఫెక్ట్ (2020-21లో అతి తక్కువ క్షీణ రేటు) దీనికి కారణం.
  • 1951 నుంచీ జీడీపీ గణాంకాలు అందుబాటులో ఉండగా, 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లో క్షీణ రేట్లు నమోదయ్యాయి. 1980లో మైనస్ 5.2 శాతం క్షీణత నమోదుకాగా తాజా నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది.
  • ప్రభుత్వ పరంగా చూసినా, ఇటు ప్రైవేటు పరంగా చూసినా రుణ భారాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆయా పరిస్థితులు సాంకేతిక, మౌలిక పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి.
  • కరోనా వైరస్‌కు మాతృభూమి అయిన చైనా మాత్రం 2020లో 1.8 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశాలున్నాయని ఏడీబీ అంచనా వేసింది.

భారత ఆర్థిక వ్యవస్థపై మరికొన్ని సంస్థల క్షీణ అంచనాలు ఇలా...

సంస్థ

తాజా అంచనా

క్రీతం అంచనా

ఎస్‌అండ్‌పీ

- 9

- 5

గోల్డ్‌మన్ శాక్స్

-14.8

-11.8

ఫిచ్

-10.5

-5.0

మూడీస్

-11.5

-4.0

కేర్

-8.2

-6.4

ఇండియా రేటింగ్‌‌స

-11.8

-5.3

ఎస్‌బీఐ ఎకోర్యాప్

-10.9

-6.8


ఇన్ఫోసిస్ కొనుగోలు చేయనున్న అమెరికా సంస్థ పేరు?
Current Affairs
అమెరికాకు చెందిన ప్రోడక్ట్ డిజైన్, డెవలప్‌మెంట్ సంస్థ కెలీడోస్కోప్ ఇన్నోవేషన్‌ను కొనుగోలు చేయనున్నట్లు దేశీ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ సెప్టెంబర్ 3న వెల్లడించింది. ఈ డీల్ విలువ దాదాపు సుమారు 42 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 308 కోట్లు) దాకా ఉంటుందని పేర్కొంది. తమ అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్ నోవా హోల్డింగ్‌‌స ద్వారా కెలీడోస్కోప్ కొనుగోలు జరుగుతుందని ఇన్ఫోసిస్ తెలిపింది. 2021 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఈ డీల్ పూర్తి కాగలదని వివరించింది. మైక్రోసర్జికల్ సాధనాలు, శస్త్రచికిత్సలో ఉపయోగించే సాధనాలు మొదలైనవి కెలీడోస్కోప్ రూపొందిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కెలీడోస్కోప్ ఇన్నోవేషన్‌ను కొనుగోలు
ఎప్పుడు : సెప్టెంబర్ 3

వీఐ పేరుతో కొత్త బ్రాండ్ ఆవిష్కరించిన టెలికాం సంస్థ?
టెలికం మార్కెట్‌లో వాటా పెంచుకునే లక్ష్యంతో, మరింత మంది చందాదారులను ఆకర్షించడం ద్వారా నెట్‌వర్క్ బలోపేతం లక్ష్యాలతో.. వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) సెప్టెంబర్ 7న ‘వీఐ’ పేరుతో కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించింది. వొడాఫోన్, ఐడియా బ్రాండ్లను ఇకమీదట వీఐగా పిలవనున్నట్టు కంపెనీ ప్రకటించింది. జూన్ చివరికి 28 కోట్ల చందాదారులు వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ పరిధిలో ఉన్నారు. వొడాఫోన్, ఐడియా విలీనంతో వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఏర్పడింది. ఏజీఆర్, ఇతర బకాయిల రూపంలో వొడాఫోన్ ఐడియా టెలికం శాఖకు రూ.58,000 కోట్లను చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికి రూ.7,000 కోట్లకు పైగా చెల్లింపులు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వీఐ పేరుతో కొత్త బ్రాండ్ ఆవిష్కరించిన టెలికాం సంస్థ
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్)
ఎందుకు : టెలికం మార్కెట్‌లో వాటా పెంచుకునే లక్ష్యంతో, మరింత మంది చందాదారులను ఆకర్షించడం ద్వారా నెట్‌వర్క్ బలోపేతం లక్ష్యాలతో

కామత్ ప్యానెల్ సిఫారసులకు ఆర్‌బీఐ ఆమోదం
కరోనా నేపథ్యంలో చెల్లింపులు ఆగిపోయిన రుణాలను పునర్‌వ్యవస్థీకరించే విషయమై కేవీ కామత్ ప్యానెల్ సమర్పించిన సిఫారసులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తెలిపింది. రుణాల పునర్‌వ్యవస్థీకరణ విషయంలో ఐదు రకాల ఫైనాన్షియల్ రేషియోలు, 26 రంగాలకు సంబంధించి పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిమితులను ప్యానెల్ సూచించింది. మాజీ బ్యాంకర్ కేవీ కామత్ అధ్యక్షతన రుణాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించిన సూచనల కోసం 2020, ఆగస్ట్ 7న ఆర్‌బీఐ ప్యానెల్‌ను నియమించగా, సెప్టెంబర్ 4న ప్యానెల్ ఆర్‌బీఐకి తన నివేదికను సమర్పించింది. ఈ సిఫారసులకు పూర్తిగా అంగీకారం తెలిపినట్టు సెప్టెంబర్ 7న ఆర్‌బీఐ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తాం..
కోవిడ్ వ్యాక్సిన్ వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలకు తాము సాయం అందిస్తామని యూనిసెఫ్ ప్రకటించింది. ఇప్పటికే మీజిల్స్, పోలియో వంటి వ్యాధులకు ఏటా 2 బిలియన్ల వ్యాక్సిన్లు కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నామని చెప్పింది. కరోనా టీకా వచ్చాక దాదాపు 100 దేశాలకు సాయం అందిస్తామని చెప్పింది. దీని కోసం అమెరికా వ్యాప్త ఆరోగ్య సంస్థ (పహో)తో కలసి కోవాక్స్ టీకా కోసం ఎందురు చూస్తున్నట్లు చెప్పింది.+
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేవీ కామత్ ప్యానెల్ సమర్పించిన సిఫారసులకు ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎందుకు : కరోనా నేపథ్యంలో చెల్లింపులు ఆగిపోయిన రుణాలను పునర్‌వ్యవస్థీకరించే విషయమై

శ్రీలంకలో గ్లోబల్ సెంటర్‌ను ప్రారంభించిన భారత ఐటీ కంపెనీ?
శ్రీలంకలోని కొలంబో నగరంలో ఐటీ సర్వీసుల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజ్‌పక్సే, భారత రాయబారి గోపాల్ బాగ్లేలు వర్చువల్ కార్యక్రమం ద్వారా సెప్టెంబర్ 8న ఈ సెంటర్‌ను ఆవిష్కరించారు. బ్లూచిప్ కంపెనీకు సేవలను అందించే నెక్ట్స్-జనరేషన్ సెల్యూషన్స్ పై ఈ సెంటర్ దృష్టి సారిస్తుందని కంపెనీ తెలిపింది. ఇక్కడి సేవల కోసం వచ్చే 3-5ఏళ్లలో 3వేలకు పైగా కొత్త సిబ్బందిని నియమించుకుంటామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతానికి ఈ కార్యాలయంలో 650 మందికి పైగా ఉద్యోగులున్నారు. ఇందులో 100 మందికి పైగా స్థానికులున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజ్‌పక్సే, భారత రాయబారి గోపాల్ బాగ్లే
ఎక్కడ : కొలంబో, శ్రీలంక

రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడులు పెట్టనున్న అమెరికా సంస్థ?
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్‌ఆర్‌వీఎల్)లో అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్‌లేక్ పార్ట్‌నర్స్ 1.75 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 7,500 కోట్లు వెచ్చించనుంది. ఆర్‌ఆర్‌వీఎల్ సెప్టెంబర్ 9న ఒక ప్రకటనలో ఈ విషయాలు వెల్లడించింది. ఈ పెట్టుబడుల ప్రకారం ఆర్‌ఆర్‌వీఎల్ విలువ సుమారు రూ. 4.21 లక్షల కోట్లుగా ఉంటుందని తెలిపింది. సిల్వర్‌లేక్ ఇప్పటికే జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.35 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది.

  • రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ప్రస్తుత విలువ రూ. 4.21 లక్షల కోట్లు
  • 2019-20లో మొత్తం ఆదాయం రూ. 1.63లక్షల కోట్లు
  • 2019-20లో స్థూల లాభం రూ.9,654 కోట్లు

క్విక్ రివ్యూ:
ఏమిటి : రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్‌ఆర్‌వీఎల్)లో 1.75 శాతం వాటా కొనుగోలు
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : సిల్వర్‌లేక్ పార్ట్‌నర్స్

ఆర్థిక మంత్రి ప్రారంభించిన పీఎస్‌బీ అలయెన్స్ కార్యక్రమం ఉద్దేశం?
ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌బీ) ఖాతాదారులకు ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు అందించే ‘పీఎస్‌బీ అలయెన్స్-ఇంటింటికీ బ్యాంకింగ్ సేవలు’ కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 9న ప్రారంభించారు. 2018లో ఆర్థిక సేవల విభాగం ప్రవేశపెట్టిన ఈజ్ సంస్కరణలో భాగంగా ఈ సేవలను అందబాటులోకి తెచ్చారు. వినియోగదారులకు, సులభంగా, సౌకర్యవంతంగా సేవలను అందించడమే పీఎస్‌బీ అలయెన్స్ కార్యక్రమ ఉద్దేశమని ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి దేబాశిష్ పాండా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 100 కేంద్రాల వద్ద ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
పీఎంస్వనిధి లబ్ధిదారులతో మోదీ...
మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రధానమంత్రి స్ట్రీట్ వెండార్స్ ఆత్మ నిర్భర్ నిధి(పీఎంస్వనిధి) లబ్ధిదారులను ఉద్దేశించి సెప్టెంబర్ 9న ఆన్‌లైన్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. వినియోగదారుల నుంచి నగదు తీసుకోకుండా, డిజిటల్ పేమెంట్ విధానాన్ని ప్రోత్సహించాలని వారికి సూచించారు. వీధుల్లో తోపుడు బండ్లపై, ఇతర మార్గాల్లో చిరుతిళ్లు, ఇతర ఆహార పదార్థాలను అమ్మే చిన్న, మధ్య తరహా వ్యాపారుల కోసం పెద్ద రెస్టారెంట్ల తరహాలో ఒక ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించే యత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇందుకు సంబంధించిన పథకం ఒకటి రూపకల్పన దశలో ఉందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఎస్‌బీ అలయెన్స్-ఇంటింటికీ బ్యాంకింగ్ సేవలు కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్
ఎందుకు : ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌బీ) ఖాతాదారులకు ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు అందించేందుకు

ఎన్‌ఎండీసీ ఐరన్, స్టీల్ ప్లాంట్ డీమెర్జ్
Current Affairs
మైనింగ్ రంగ దిగ్గజం నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎండీసీ).. ఛత్తీస్‌గఢ్‌లోని నాగర్నార్ వద్ద నిర్మిస్తున్న ఎన్‌ఎండీసీ ఐరన్, స్టీల్ ప్లాంట్‌ను కంపెనీ నుంచి విడగొట్టనున్నట్టు (డీమెర్జ్) ఆగస్టు 28న ప్రకటించింది. డీమెర్జ్ ప్రక్రియ పూర్తి కావడానికి తొమ్మిది నెలల వరకు సమయం పట్టవచ్చని ఎన్‌ఎండీసీ వివరించింది. ఏటా 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్లాంటుకు ఎన్‌ఎండీసీ ఇప్పటి వరకు రూ.17,000 కోట్లు ఖర్చు చేసింది. 2021లో ఈ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభం కానుంది.
విప్రో హైజెనిక్స్ విడుదల...
ఎఫ్‌ఎంజీసీ రంగంలోని విప్రో కన్జూమర్ కేర్ ‘‘హైజెనిక్స్’’ బ్రాండ్ పేరుతో సూక్ష్మజీవుల సంహారక ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఉత్పత్తిలో భాగమైన శానిటైజర్, హ్యాండ్ వాష్, సబ్బు బలమైన ఫార్ములేషన్‌తో పాటు 99.9శాతం క్రిముల నుంచి రక్షణనిస్తుందని నిరూపితమైందని కంపెనీ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌ఎండీసీ ఐరన్, స్టీల్ ప్లాంట్ డీమెర్జ్
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎండీసీ)
ఎక్కడ : నాగర్నార్, ఛత్తీస్‌గఢ్

రిలయన్స్ రిటైల్ చేతికి ఫ్యూచర్ రిటైల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్‌ఆర్‌వీఎల్).... కిషోర్ బియానీ ప్రమోట్ చేస్తున్న ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలతోపాటు, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ విభాగాలను కొనుగోలు చేయనుంది. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌వీఎల్ ఆగస్టు 29న వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ.24,713 కోట్లు అని పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన 1,800లకుపైగా బిగ్‌బజార్, ఎఫ్‌బీబీ, ఈజీడే, సెంట్రల్, ఫుడ్‌హాల్ స్టోర్లు దేశవ్యాప్తంగా 420లకు పైచిలుకు నగరాల్లో విస్తరించాయి.
డీల్‌లో భాగంగా ఫ్యూచర్ గ్రూప్ రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలు ఆర్‌ఆర్‌వీఎల్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్‌కు బదిలీ అవుతాయి. అలాగే లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ విభాగాలు ఆర్‌ఆర్‌వీఎల్‌కు బదిలీ చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలతోపాటు, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ విభాగాల కొనుగోలు
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్‌ఆర్‌వీఎల్)

40 ఏళ్ల తర్వాత మైనస్‌లోకి భారత జీడీపీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పాతాళానికి జారిపోయింది. గత ఏడాది కాలంతో పోలిస్తే, అసలు వృద్ధిలేకపోగా మైనస్ 23.9 శాతం క్షీణించింది. కరోనా నేపథ్యంలో దేశంలో అమలుచేసిన కఠిన లాక్‌డౌన్ దీనికి ప్రధాన కారణం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎస్‌ఎస్‌ఓ), గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఆగస్టు 31న విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఇదే తొలిసారి...

 

  • 2020-21 జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతం అయితే 2019 ఇదే త్రైమాసికంలో 5.2 శాతంగా ఉంది.
  • గడిచిన 40 ఏళ్లలో దేశ జీడీపీ మళ్లీ మైనస్‌లోకి జారిపోవడం ఇదే తొలిసారి. చరిత్రలో ఇంతటి ఘోర క్షీణత నమోదవడం కూడా మొట్టమొదటిసారి.
  • త్రైమాసిక గణాంకాలు ప్రారంభమైన 1996 నుంచీ ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణ పతనం ఇదే తొలిసారి.
  • తాజా త్రైమాసికంలో వ్యవసాయ రంగం మాత్రమే(3.4 శాతం) వృద్ధి రేటును నమోదుచేసుకుంది.

విలువల్లో చూస్తే...

  • ఎస్‌ఎస్‌ఓ గణాంకాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.35.35 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.26.90 లక్షల కోట్లు. వెరసి మైనస్ -23.9 శాతం క్షీణ రేటు నమోదయి్యంది.
  • కేవలం వస్తు ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలించే స్థూల విలువ జోడింపు (జీవీఏ) ప్రకారం జీడీపీ విలువ రూ.33.08 లక్షల కోట్ల నుంచి రూ.25.53 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇక్కడ విలువ మైనస్ 22.8 శాతం క్షీణించింది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020-21 తొలి త్రైమాసికంలో మైనస్‌లోకి భారత జీడీపీ
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : జాతీయ గణాంకాల కార్యాలయం (ఎస్‌ఎస్‌ఓ)
ఎందుకు : కరోనా నేపథ్యంలో దేశంలో అమలుచేసిన కఠిన లాక్‌డౌన్ కారణంగా

ద్రవ్యలోటు ఎంత శాతం దాటకూడదన్నది ప్రభుత్వ లక్ష్యం?
ప్రభుత్వ ఆదాయం-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి నాలుగు నెలల్లోనే కట్టుతప్పింది.
కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) తాజాగా విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే...

  • 2020 (ఏప్రిల్)-2021 (మార్చి) ఆర్థిక సంవత్సరంలో మొత్తం ద్రవ్యలోటు రూ.7.96 లక్షల కోట్ల ద్రవ్యలోటు ఉండాలన్నది 2020, ఫిబ్రవరిలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ లక్ష్యం.
  • ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలో 3.5 శాతం దాటకూడదన్నది ఈ లక్ష్యం ఉద్దేశం.
  • - అయితే ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలూ గడిచే సరికే- అంటే ఏప్రిల్ నుంచి జూలై మధ్య నాటికే ద్రవ్యలోటు రూ.8,21,349కోట్లకు చేరింది. అంటే వార్షిక లక్ష్యంలో 103.1 శాతానికి చేరిందన్నమాట.
  • ప్రభుత్వ మొత్తం బడ్జెట్ ఆదాయ అంచనాల్లో జూలై నాటికి 10.4 శాతం మాత్రమే (రూ.2,32,860 కోట్లు) ఒనగూరింది. ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయ లక్ష్యం రూ.22.45 లక్షల కోట్లు. ఇక వ్యయాలు దాదాపు యథాతథంగా అంచనాల్లో 34 శాతానికి (రూ.10,54,209 కోట్లు) చేరాయి.

జీడీపీ అంచనాలపై ఎస్‌బీఐ రూపొందించిన నివేదిక పేరు?

2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అనే అంశంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ‘ఎకోర్యాప్’ పేరుతో ఒక పరిశోధనా నివేదికను సెప్టెంబర్ 1న విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది భారత జీడీపీ మెనస్ 10.9 శాతం వరకు క్షీణిస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. భారత జీడీపీ మైనస్ 6.8 శాతంగా ఉండొచ్చని ఎస్‌బీఐ గతంలో అంచానా వేసింది. తాజాగా మైనస్ 10.9 శాతానికి పెంచింది.
ఆరు జట్లకు స్పాన్సర్‌గా బీకేటీ టైర్స్
ఐపీఎల్ 13వ సీజన్లో పాల్గొంటున్న ఆరు జట్లకు స్పాన్సర్ చేయనున్నట్టు టైర్ల తయారీ సంస్థ బీకేటీ టైర్స్ వెల్లడించింది. వీటిలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్‌‌స, ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్‌‌స ఎలెవన్ పంజాబ్, కోల్‌కత నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020-21 ఆర్థిక ఏడాది భారత జీడీపీ మెనస్ 10.9 శాతం వరకు క్షీణిస్తుంది
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : ఎస్‌బీఐ ఎకోర్యాప్ నివేదిక
ఎందుకు : కరోనా నేపథ్యంలో...
Published date : 25 Sep 2020 01:30PM

Photo Stories