Skip to main content

RBI Monetary Policy Highlights: ప్రస్తుతం ఆర్‌బీఐ రివర్స్‌ రెపో ఎంత శాతంగా ఉంది?

Shatikanta das

కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్‌ రెపో రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఆధ్వర్యంలో ముంబైలో ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు వరుసగా మూడు రోజులు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ–ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వృద్ధే లక్ష్యంగా సరళతర వడ్డీరేట్ల విధానాన్ని అనుసరించింది. దీంతో ఆర్‌బీఐ రెపో రేటు 4.00 శాతం, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి.

ముఖ్యాంశాలు..

  • దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021–22లో 9.2 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గుతుందని ఆర్‌బీఐ అంచనా.
  • పాలసీ నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన రిటైల్‌ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా అంచనా వేయగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని అంచనా.
  • ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్‌ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో కొనసాగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
  • వృద్ధి రికవరీ, పటిష్టత లక్ష్యంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఐదుగురు సభ్యులు అభిప్రాయపడ్డారు. ‘సరళతర’  వైఖరిని ‘తటస్థం’కు మార్చాలన్న ప్రతిపాదనను ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు వ్యతిరేకించగా, ఒక్కరు మాత్రమే అనుకూలంగా ఓటు చేశారు.
  • దేశానికి వచ్చీ–పోయే విదేశీ మారకపు ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాన్ని తెలియజేసే కరెంట్‌ అకౌంట్‌– ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2 శాతం (జీడీపీ విలువలో) లోటును నమోదుచేస్తుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.
  • వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లో తొలి ద్వైమాసిక పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతుంది.

మరికొన్ని కీలక నిర్ణయాలు..

  • కోవిడ్‌–19 సంక్షోభం నేపథ్యంలో అత్యవసర ఆరోగ్య సేవల రంగానికి గత ఏడాది మేలో ప్రకటించిన రూ.50,000 కోట్ల ఆన్‌–ట్యాప్‌ లిక్విడిటీ రుణ సౌలభ్యతను మరో 3 నెలలు అంటే 2022 జూన్‌ 30  వరకు పొడిగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.
  • ప్రస్తుత అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొనడానికి బ్యాంకులు, బ్యాంకింగ్‌ యేతర ఫైనాన్షియల్‌ కంపెనీలు మూలధన పెంపు ప్రక్రియపై నిరంతరం దృష్టి సారించాలని సూచించింది.

10 సమావేశాల నుంచి యథాతథం

రెపో రేటును ఆర్‌బీఐ ఎంపీసీ వరుసగా పది ద్వైమాసిక సమావేశాల నుంచి యథాతథంగా కొనసాగిస్తోంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో 2019 ప్రారంభం నుంచి 135 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు 1  శాతం) రుణ రేటును తగ్గించిన ఆర్‌బీఐ, కరోనా కష్టకాలం నేపథ్యంలో 2020 మార్చి తరువాత 115 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దీనితో 2020 ఆగస్టునాటికి రెపో రేటు రికార్డు కనిష్టం 4 శాతానికి దిగివచ్చింది. ఇక అప్పటి నుంచి  (2020 ఆగస్టు ద్వైమాసిక సమావేశం) రెపో రేటును యథాతథంగా కొనసాగించడానికే ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. 2019 ప్రారంభంతో పోల్చితే ఇప్పుడు రెపో రేటు 2.5 శాతం తక్కువగా ఉంది.

రెపో, రివర్స్‌ రెపో రేటు అంటే ఏమిటీ?

ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్‌ రెపో రేటుగా వ్యవహరిస్తారు.

చ‌ద‌వండి: పర్యావరణ అనుకూల విధానంతో ఉన్న కంపెనీల శాతం?

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
ఆర్‌బీఐ రెపో రేటు(4.00 శాతం), రివర్స్‌ రెపో రేటు(3.35 శాతం)ను యథాతథంగా కొనసాగింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ–ఎంపీసీ)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు వీలుగా సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగించాలని..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 11 Feb 2022 02:40PM

Photo Stories