Skip to main content

RBI Monetary Policy Highlights: ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు ఎంత శాతంగా ఉంది?

Shaktikanta Das

కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్‌ రెపో రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆధ్వర్యంలో ముంబైలో డిసెంబర్‌ 6 నుంచి 8 వరకు వరుసగా మూడు రోజులు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ–ఎంపీసీ) ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. వృద్ధే లక్ష్యంగా సరళతర వడ్డీరేట్ల విధానాన్ని అనుసరించింది. దీంతో ఆర్‌బీఐ రెపో రేటు 4.00 శాతం, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి.

ముఖ్యాంశాలు..

  • 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 9.5 శాతంగా నమోదవుతుందని అంచనా.
  • 2021–22 ఆర్థిక ఏడాదిలో సగటున రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా కొనసాగుతుందని అంచనా.
  • ఆర్‌బీఐ ముందస్తు అనుమతి లేకుండా విదేశీ శాఖలలో మూలధనం పెంపునకు, అలాగే లాభాలను స్వదేశానికి తరలించడానికి బ్యాంకింగ్‌  నిబంధనల సరళతరం.
  • 2022 ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ తదుపరి ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం.

9 సమావేశాల నుంచి యథాతథం

రెపో రేటును ఆర్‌బీఐ ఎంపీసీ వరుసగా తొమ్మిది ద్వైమాసిక సమావేశాల నుంచి యథాతథంగా కొనసాగిస్తోంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో 2019 ప్రారంభం నుంచి 135 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు 1  శాతం) రుణ రేటును తగ్గించిన ఆర్‌బీఐ, కరోనా కష్టకాలం నేపథ్యంలో 2020 మార్చి తరువాత 115 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దీనితో 2020 ఆగస్టునాటికి రెపో రేటు రికార్డు కనిష్టం 4 శాతానికి దిగివచ్చింది.

ఫీచర్‌ ఫోన్లపైనా యూపీఐ చెల్లింపులు..

కోట్లాది మంది ఫీచర్‌ ఫోన్‌ హోల్డర్లు కూడా ఇకపై యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) పేమెంట్లు జరిపేలా చర్యలకు కూడా శ్రీకారం చుడుతున్నట్లు గవర్నర్‌ శక్తికాంతదాస్‌ సూచించారు. సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ మోసాలు సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) వ్యవస్థలో ఎదుర్కొనే ప్రధాన సవాళ్లుగా ఉంటాయన్నారు. 2022 ఏడాది కొంత మేర పైలెట్‌ ప్రాతిపదికన డిజిటల్‌ కరెన్సీ వ్యవస్థ ప్రారంభానికి ఆర్‌బీఐ కసరత్తు జరుపుతున్న సంగతి తెలిసిందే.

రెపో, రివర్స్‌ రెపో రేటు అంటే ఏమిటీ?

ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్‌ రెపో రేటుగా వ్యవహరిస్తారు.
చ‌ద‌వండి: జన్‌ ధన్‌ ఖాతాల్లో మహిళా ఖాతాదారుల సంఖ్య ఎంత శాతం?

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
ఆర్‌బీఐ రెపో రేటు(4.00 శాతం), రివర్స్‌ రెపో రేటు(3.35 శాతం)ను యథాతథంగా కొనసాగింపు
ఎప్పుడు : డిసెంబర్‌ 8
ఎవరు : ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ–ఎంపీసీ)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు వీలుగా సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగించాలని..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 09 Dec 2021 05:10PM

Photo Stories