Skip to main content

RBI Monetary Policy Committee: ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు ఎంత శాతంగా ఉంది?

RBI Governor Shaktikanta Das

కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్‌ రెపో రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆధ్వర్యంలో ముంబైలో అక్టోబర్‌ 6 నుంచి 8 వరకు వరుసగా మూడు రోజులు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ–ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్‌బీఐ రెపో రేటు 4.00 శాతం, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి. వృద్ధే లక్ష్యంగా వరుసగా ఎనిమిది ద్వైమాసికాల నుంచి ఆర్‌బీఐ సరళతర వడ్డీరేట్ల విధానాన్ని అనుసరిస్తోంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం పూర్తి అదుపులోనికి వస్తుందన్న అంచనాలతో రెపో యథాతథం కొనసాగింపునకు కమిటీ ఆమోదముద్ర వేసింది.

ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం–ముఖ్యాంశాలు

  • రిటైల్‌ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక ఏడాదిలో సగటు 5.7 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలను తాజాగా 5.3 శాతానికి కుదించింది.
  • 2021–22 ఏడాదిలో దేశ వృద్ధి రేటు 9.5 శాతం నమోదవుతుందని అంచనా వేసింది. తొలి 10.5 శాతం అంచనాలను జూన్‌ పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ 9.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.
  • కోవిడ్‌ ప్రతికూల ప్రభావాలకు గురయిన రాష్ట్రాలకు ద్రవ్య లభ్యత విషయంలో ఎటువంటి సమస్యలూ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2021–22 ఏడాది ‘వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌ (డబ్ల్యూఎంఏ), ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌలభ్యం ద్వారా పెంచిన రుణ పరిమితులను అన్ని విధాలా కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.
  • ఐఎంపీఎస్‌ (ఇమీడియట్‌ పేమెంట్‌ సర్వీస్‌) ద్వారా ప్రస్తుత లావాదేవీ పరిమితి రూ.2 లక్షలు కాగా, దీనిని రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం జరిగింది. డిజిటల్‌ లావాదేవీల పెంపు ఈ నిర్ణయ ప్రధాన లక్ష్యం. ఐఎంపీఎస్‌ను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) నిర్వహిస్తోంది.

పాలసీలో మరికొన్ని ముఖ్యాంశాలు

  • ఫైనాన్షియల్‌ మోసాల నివారణే లక్ష్యంగా కొత్త విధాన రూపకల్పన జరగనుంది.
  • బ్యాంకుల తరహాలోనే బడా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎప్‌సీ) కస్టమర్ల సమస్యల పరిష్కారానికి అంతర్గత అంబుడ్స్‌మన్‌ యంత్రాంగం ఏర్పాటు కానుంది.
  • దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో గ్లోబల్‌బాండ్‌ ఇండిసీస్‌లో చేరే విషయంలో భారత్‌ ముందడులు వేస్తోంది. ఆర్‌బీఐ, కేంద్రం  ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఇండెక్స్‌ ప్రొవైడర్లతో చర్చిస్తున్నాయి.  
  • తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్‌ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరగనుంది.

రెపో, రివర్స్‌ రెపో రేటు అంటే ఏమిటీ?

ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్‌ రెపో రేటుగా వ్యవహరిస్తారు.
 

చ‌ద‌వండి:  ప్రభుత్వ రంగ ఎయిరిండియాను సొంతం చేసుకున్న సంస్థ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్‌ రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం
ఎప్పుడు  : అక్టోబర్‌ 8
ఎవరు    : ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ–ఎంపీసీ)
ఎక్కడ    : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : రిటైల్‌ ద్రవ్యోల్బణం పూర్తి అదుపులోనికి వస్తుందన్న అంచనాలతో...

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌


డౌన్‌లోడ్‌ వయా ఆపిల్‌ ఐ స్టోర్‌

Published date : 09 Oct 2021 05:12PM

Photo Stories