Skip to main content

5.4 శాతానికి RBI Repo Rate

గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత భారమయ్యేలా రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కీలక పాలసీ రేట్లను మరోసారి పెంచింది.
RBI hikes repo rate
RBI hikes repo rate

ధరల కట్టడే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు.. రెపోను మరో 50 బేసిస్‌ పాయింట్లు లేదా 0.5 శాతం (100 బేసిస్‌ పాయింట్లు 1%) పెంచాలని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీంతో రెపో 5.4 శాతానికి చేరింది.  మే నెల నుంచి రెపో రేటు 1.4 శాతం పెరిగినట్లయ్యింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని తగ్గించి తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నది ఈ ఇన్‌స్ట్రుమెంట్‌ ఉద్దేశం. ఈ ప్రభావంతో బ్యాంకులు కూడా వడ్డీరేట్లను ఇంకాస్త పెంచనుండటంతో రుణాలపై నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు)  ఎగబాకనున్నాయి. కాగా, రిటైల్‌ ద్రవ్యోల్బణం 2022–23లో  6.7%గా ఉంటుందన్న అంచనాలను యథాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ పాలసీ పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు విషయంలోనూ అంచనాను యథాతథంగా 7.2 శాతం వద్ద కొనసాగించింది.  

Also read: Quiz of The Day (August 05, 2022): ప్రపంచంలో తొలి ఆటోమేటెడ్, డ్రైవర్‌లెస్ రైలును ప్రారంభించిన దేశం?

కోవిడ్‌–19 కన్నా పావుశాతం అధికం 
తాజా పెంపుతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా పావుశాతం అధికం కావడం గమనార్హం.  వృద్ధి మందగమనాన్ని నిరోధించడానికి 2019 ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ 2020 మే 22 వరకూ మొత్తం 250 బేసిస్‌ పాయింట్ల రెపో రేటును తగ్గించింది.ఇందులో మహమ్మారి ప్రారంభమైన తర్వాత (2020 మార్చి నుంచి 2020 మే మధ్య) తగ్గింపే 115 బేసిస్‌ పాయింట్లు. అంటే మహమ్మారికి ముందు వరకూ రెపో రేటు 5.15 శాతంగా ఉంది.  2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 %కి) తగ్గించిన నాటి నుంచి 4% వద్ద రెపో రేటు (వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ నిర్ణయం) కొనసాగింది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంటుందన్న భరోసాను ఇస్తూ, వృద్ధే లక్ష్యంగా సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్‌బీఐ కొనసాగిస్తూ వచ్చింది.  నాలుగేళ్ల తర్వాత (2018 ఆగస్టు అనంతరం) మొదటిసారి ఆర్‌బీఐ మే 4వ తేదీన ఆకస్మికంగా రెపో రేటును 0.40 శాతం పెంచింది. జూన్‌ 8వ తేదీన మరో 50 బేసిస్‌ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనితో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెంపును షురూ చేశాయి.  

Also read: Weekly Current Affairs (National) Bitbank: ఏ రాష్ట్ర ప్రభుత్వం 'ఫ్రూట్స్' సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించింది?

పాలసీ ముఖ్యాంశాలు... 

  • 2022–23లో జీడీపీ 7.2 శాతంగా అంచనా. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో 16.2 శాతం, 6.2 శాతం, 4.1 శాతం, 4 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని పాలసీ భావిస్తోంది. 
  • రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.7 శాతం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతంగా అంచనా వేయగా, వరుసగా 2,3,4 (2022 జూలై–మార్చి 2023) త్రైమాసికాల్లో 7.1%, 6.4%, 5.8 శాతాలుగా నమోదవుతాయి. 2023–24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) 5%కి ఇది దిగివస్తుంది.  
  • భారత్‌ వద్ద ప్రస్తుతం 550 బిలియన్‌ డాలర్లకుపైగా ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోగలిగిన స్థాయిలో ఉన్నాయి. అధిక ఫారెక్స్‌ నిల్వలు ఉన్న దేశాల్లో భారత్‌ నాల్గవ స్థానంలో ఉంది.  
  • వృద్ధి ధోరణి కొనసాగేలా తగిన చర్యలు తీసుకుంటూనే ద్రవ్యోల్బణం నియంత్రణే లక్ష్యంగా సరళ పాలసీ విధానాన్ని ఉపసంహరించుకోవడంపై ద్రవ్య విధాన కమిటీ దృష్టి సారిస్తుంది.  

    Also read: Polity Bit Bank For All Competitive Exams: సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
     
  • ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 4వ తేదీ వరకూ డాలర్‌ మారకంలో రూపాయి మారకపు విలువ 4.7 శాతం పతనమైంది. భారత ఆర్థిక వ్యవస్థ  స్థూల ఆర్థిక మూలాధారాల బలహీనత కంటే,  అమెరికా డాలర్‌ విలువ పెరగడం వల్ల రూపాయి విలువ మరింతగా క్షీణించింది. అయినా డాలర్‌ మారకంలో మిగిలిన దేశాలతో పోల్చితే భారత్‌ కరెన్సీ పటిష్టంగానే ఉంది.  
  • భారత్‌లోని తమ కుటుంబాల తరపున యుటిలిటీ, విద్య చెల్లింపుల కోసం ఎన్‌ఆర్‌ఐలు భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (బీబీపీఎస్‌)ను వినియోగించుకునేలా తగిన యంత్రాంగాన్ని రూపొందించనుంది.  
  • 2021 ఏప్రిల్‌–జూన్‌ మధ్య దేశానికి వచ్చిన ఎఫ్‌డీఐల పరిమాణం 11.6 బిలియన్‌ డాలర్లు అయితే, 2022 ఇదే కాలంలో ఈ పరిమాణం 13.6 బిలియన్‌ డాలర్లకు చేరింది.  
  • తదుపరి ద్వైమాసిక సమావేశం సెప్టెంబర్ 28 నుంచి 30వ తేదీ మధ్య జరగనుంది.

    Download Current Affairs PDFs Here

    Download Sakshi Education Mobile APP
     

    Sakshi Education Mobile App
Published date : 06 Aug 2022 05:54PM

Photo Stories