Oxfam Report: వామ్మో.. డబ్బు ఉన్నవారు.. లేనివారికి మధ్య ఇంత తేడానా..!
దాంతో ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక విధానాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాజంలో ఉన్నత వర్గాల సంపద, ఆదాయాలు పెరుగుతుంటే, దిగువ శ్రేణివారి పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ప్రపంచంలో అత్యంత సంపన్నులైన తొలి అయిదుగురి నికర సంపద విలువ, కొవిడ్ మహమ్మారి వ్యాపించిన 2020 తర్వాత రెట్టింపునకు పైగా పెరిగినట్లు ఆక్స్‌ఫామ్ తెలిపింది.
అదే సమయంలో 500 కోట్లమంది మాత్రం మరింత పేదరికంలోకి వెళ్లారని నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అసమానతలను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో ఆక్స్‌ఫామ్ ‘ఇనీక్వాలిటీ ఇంక్.’ పేరుతో రిపోర్ట్ విడుదల చేసింది. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
NCMC RuPay Prepaid Card: ఇకపై పేమెంట్స్ అన్నిటికీ ఒకటే కార్డు.. ప్రత్యేకతలు ఇవే..
కంపెనీ లాభాలు పెరిగినా.. ఉద్యోగాల్లో కోత
అతిపెద్ద కంపెనీల్లో డెబ్భై శాతం సంస్థల్లో ఒక బిలియనీర్ సీఈఓ ఉన్నారు. ఈ కంపెనీలు 10.2 లక్షల కోట్ల డాలర్ల విలువైన సంపదను కలిగి ఉన్నాయి. అంటే ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల జీడీపీల కంటే అధిక సంపద వీరి వద్దే ఉంది. గత మూడేళ్లలో 148 పెద్దకంపెనీలు 1.8 లక్షల కోట్ల డాలర్ల లాభాలను నమోదు చేశాయి. ఏటా సగటున 52 శాతం వృద్ధి చెందాయి. మరోవైపు లక్షల మంది ఉద్యోగుల వేతనాలు తగ్గాయి.
500 కోట్ల మంది పేదలు..
ప్రపంచంలోని అగ్రగామి అయిదుగురు ధనవంతులు ఇలాన్ మస్క్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్, లారీ ఎలిసన్, మార్క్ జుకర్‌బర్గ్ సంపద 2020 నుంచి 405 బిలియన్ డాలర్ల (రూ.33.61 లక్షల కోట్ల) నుంచి 464 బిలియన్ డాలర్లు (రూ.38.51 లక్షల కోట్లు) పెరిగి 869 బిలియన్ డాలర్ల (రూ.72.12 లక్షల కోట్ల)కు చేరింది. అంటే గంటకు 14 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.116 కోట్ల) చొప్పున వీరు సంపదను పోగేసుకున్నారు. ప్రపంచంలోని బిలియనీర్లు 2020తో పోలిస్తే 3.3 లక్షల కోట్ల డాలర్ల అదనపు సంపదను పోగేసుకున్నారు. ఇదే సమయంలో 500 కోట్ల మంది సామాన్యులు మాత్రం మరింత పేదలయ్యారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రపంచం వీరిలో నుంచి ట్రిలియనీర్ (లక్ష కోట్ల డాలర్ల సంపద)ను చూడడానికి ఒక దశాబ్దం పడుతుంది. పేదరికం మాత్రం మరో 229 ఏళ్లకు గానీ అంతం కాదు.
భారీగా తగ్గిన కార్పొరేట్ పన్నులు..
ప్రపంచంలోని 96 ప్రధాన కంపెనీలు ఆర్జిస్తున్న ప్రతి 100 డాలర్ల లాభంలో 82 డాలర్లు సంపన్న వాటాదారులకే చెందుతున్నాయి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) సభ్యదేశాల్లో కార్పొరేట్ పన్ను 1980లో 48 శాతం ఉండగా.. తాజాగా అది 23.1 శాతానికి తగ్గింది.
ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేని వేతనాలు..
ప్రపంచ జనాభాలో ఆస్ట్రేలియాతో పాటు ఉత్తరాది దేశాల వాటా 21 శాతమే అయినప్పటికీ.. సంపద మాత్రం 69 శాతం వీటి దగ్గరే ఉంది. ప్రపంచ బిలియనీర్ల సంపదలో 74 శాతం ఈ దేశాలకు చెందినవారిదే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మంది శ్రామికులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే స్థాయి వేతనాన్ని పొందలేకపోతున్నారు.
మహిళల కంటే పురుషుల వద్దే అధికం..
ప్రపంచంలోని ఐదుగురు అత్యంత ధనవంతులు రోజుకు 1 మిలియన్ డాలర్లు(రూ.8.23 కోట్లు) ఖర్చు చేస్తే వారి సంపద పూర్తిగా కరిగిపోవడానికి 496 ఏళ్లు పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల కంటే పురుషుల దగ్గర 105 ట్రిలియన్ డాలర్ల అధిక సంపద ఉంది. ఈ తేడా అమెరికా ఆర్థిక వ్యవస్థ కంటే నాలుగింతలు అధికం.