Skip to main content

New Job Opportunities : కొత్త ఉద్యోగాలు సృష్టించాలంటే ఇవి తప్పనిసరిగా..

దేశంలో ఏటా నిరుద్యోగం పెరుగుతుంది. దానికితోడు ప్రతిసంవత్సరం గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకుని ఉద్యోగ వేటలో పడుతున్నవారి సంఖ్య అధికమవుతుంది.
raghuram rajan latest news telugu

ఈ నేపథ్యంలో ఉద్యోగకల్పనలో భాగంగా దేశం ఏ మేరకు వృద్ధి సాధించాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ విశ్లేషించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉన్నప్పటికీ, పెరుగుతున్న ఉద్యోగ డిమాండ్‌ను తీర్చడానికి 8 శాతానికి పైగా వృద్ధి చెందాలని ఆయన అన్నారు. 

బీజింగ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రఘురామ్‌రాజన్ మాట్లాడుతూ.. ఇతర దేశాలతో పోలిస్తే ప్రస్తుతం భారతదేశం 6-6.5 శాతం ఆర్థికవృద్ధి నమోదు చేస్తుందన్నారు. అయితే కొత్త ఉద్యోగాలు కల్పించడంలో మాత్రం ఈ మేరకు వృద్ధి చెందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘జనాభా అవసరాలు, కొత్త ఉద్యోగాలు సృష్టించాలంటే భారతదేశం 8-8.5 శాతం ఆర్థికవృద్ధి సాధించాలి. ఉత్పాదకలో చైనా, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడాలి. అందుకు అవసరమయ్యే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. 

ప్రతిష్టాత్మక ఉత్పత్తులను దేశంలోనే..
ఐఫోన్‌ వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులను దేశంలో తయారుచేస్తున్నారు. అందుకు సరిపడే కాంపోనెంట్‌లను ఉత్పత్తి చేయడంలో దేశం పురోగతి చెందింది. అయితే పూర్తి స్థాయి సామర్థ్యాలను సాధించడంలో మాత్రం ఇంకా వృద్ధి చెందాలి’ అని రఘురామ్‌రాజన్‌ అన్నారు.

ఇటీవల ప్రపంచ బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త ధ్రువ్ శర్మ మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే దాదాపు ఏటా 8 శాతం ఆర్థికవృద్ధి నమోదు చేయాలన్నారు. ఉద్యోగుల్లో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పారు.

కేంద్రప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం, ఇతర నియంత్రణ చర్యల వల్ల కొవిడ్‌ తర్వాత దేశం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుంది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తున్నప్పటికీ, ఏటా ఉద్యోగాలు కల్పించడంలో మాత్రం సవాళ్లు ఎదుర్కొంటునట్లు నిపుణులు చెబుతున్నారు. నిరుద్యోగిత రేటు అక్టోబర్‌లో 10.05 శాతానికి చేరుకుందని ముంబైలోని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక తెలిపింది. రాబోయే దశాబ్దంలో దేశంలో ఏడు కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించాలని హెచ్‌ఎస్‌బీసీ సూచిస్తుంది.

Published date : 11 Nov 2023 03:26PM

Photo Stories