India Top in wealth inequality: సంపద అసమానతలు ఉన్న దేశాల్లో భారత్ టాప్
2015–16 నుంచి 2019–21 మధ్య దేశంలో తీవ్ర పేదరికంలో మగ్గుతున్న వారు 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గారు. ఈ మేరకు ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్ డీపీ) తాజాగా ఒక నివేదికను వెలువరించింది. ఇందులో దీర్ఘకాల వృద్ధిని ప్రస్తావించింది. అసమానతలు, అభివృద్ధి అంశంలో తలెత్తబోయే ఇబ్బందికర పరిణామాలనూ ఏకరువు పెట్టింది. మానవాభివృద్ధికి ఊతమివ్వడానికి కొత్తగా మార్గదర్శకాలు అవసరమని పేర్కొంది.
నివేదికలోని ముఖ్యాంశాలు
• 2000 నుంచి 2022 మధ్యలో భారత్‌లో తలసరి ఆదాయం 442 డాలర్ల నుంచి 2,389 డాలర్లకు పెరిగింది. 2004 నుంచి 2019 మధ్య పేదరిక రేటు 40 శాతం నుంచి 10 శాతానికి తగ్గింది.
• పేదల ఆకాంక్షలు నెరవేరకపోవడం వల్ల అభద్రత పెరిగిపోయింది. భవిష్యత్‌లో గందరగోళ పరిస్థితి నెలకొనవచ్చు. తక్షణం మార్పు దిశగా ప్రయత్నాలు అవసరం.
• జనాభాలో పేదలు 15 శాతానికి తగ్గినప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో సమస్య తీవ్రంగా ఉంది. దేశ జనాభాలో ఆ రాష్ట్రాల వాటా 45 శాతం. దేశంలోని పేదల్లో మాత్రం 62 శాతం మంది అక్కడే ఉంటున్నారు.
• ఇంకా అనేక మందికి పేదరికం ముప్పు పొంచి ఉంది. వారు దారిద్య్ర రేఖకు కొంతమేర ఎగువన ఉంటున్నారు. వారు మళ్లీ పేదరిక కోరల్లో చిక్కుకోవచ్చు. వారిలో మహిళలు, అసంఘటిత రంగ కార్మికులు, అంతర్ రాష్ట్ర వలస కూలీలు ఉన్నారు.