Telecom Sector: టెలికం రంగంలో ఎంత శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంది?
టెలికం రంగంలో భారీ సంస్కరణలకు తెర తీస్తూ టెల్కోలకు ఉపశమన ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 15న ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసింది. వ్యవస్థాగతంగా తొమ్మిది సంస్కరణలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. టెల్కోల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడేందుకు ఈ ప్యాకేజీ తోడ్పడగలదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ప్యాకేజీలో ఉన్న అంశాలు..:
- ప్రభుత్వానికి టెల్కోలు చెల్లించాల్సిన బకాయిలపై నాలుగేళ్ల దాకా మారటోరియం(వార్షిక చెల్లింపులను వాయిదా వేసుకునే వీలు) విధింపు. ఈ వ్యవధిలో స్వల్పంగా వడ్డీ కట్టాల్సి ఉంటుంది.
- సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) నిర్వచన పరిధి నుంచి టెలికంయేతర ఆదాయాలకు మినహాయింపు.
- టెలికం రంగంలో ఆటోమేటిక్ విధానం ద్వారా 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి. ఇప్పటిదాకా ఇది 49 శాతంగానే ఉంది.
- ఇతర సుంకాలను, లైసెన్సు ఫీజుకు సంబంధించి చూపాల్సిన బ్యాంక్ గ్యారంటీల తగ్గింపు.
- స్పెక్ట్రం కాలపరిమితిని 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పొడిగింపు. 10 సంవత్సరాల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయవచ్చు.
- స్పెక్ట్రం యూజర్ చార్జీలను (ఎస్‌యూసీ) క్రమబద్ధీకరణ, సెల్ఫ్ అప్రూవల్ ప్రాతిపదికన టవర్ల ఏర్పాటు ప్రక్రియను సరళతరం చేయడం. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థలు కేంద్రానికి రూ. 92,000 కోట్లు లైసెన్సు ఫీజు, రూ. 41,000 కోట్లు స్పెక్ట్రం యూసేజీ చార్జీలు బాకీ పడ్డాయి.
ప్రక్రియపరమైన సంస్కరణలు
టెలికం రంగంలో ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియపరమైన సంస్కరణలు చూస్తే.. స్పెక్ట్రం వేలం నిర్వహణకు నిర్దిష్ట క్యాలెండర్ రూపకల్పన, వైర్‌లెస్ పరికరాల కోసం క్లిష్టతరమైన లైసెన్సు ప్రక్రియ తొలగింపు, యాప్ ఆధారిత సెల్ఫ్–కేవైసీ, పేపర్ రూపంలో ఉండే కస్టమర్ అక్విజిషన్ ఫారమ్‌ల (సీఏఎఫ్) స్థానంలో డేటాను డిజిటల్‌గా భద్రపర్చడం వంటివి ఉన్నాయి. అలాగే ఈ–కేవైసీ రేటును రూ.1కి సవరించింది.
చదవండి: గ్రీన్‌పీల్డ్ పెట్టుబడులు అంటే?
క్విక్ రివ్యూ :
ఏమిటి : టెల్కోలకు ఉపశమన ప్యాకేజీ ప్రకటన
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : టెల్కోల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడేందుకు