Employment: విద్యుత్, ఇంధన రంగాల్లో ఉపాధి అవకాశాలు.. ఈ రాష్ట్రంలోనే ఎక్కువ..
ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య) ఈ రంగాల్లో నియామకాలు, క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 9 శాతం పెరుగుతాయని టీమ్‌లీజ్ సర్వీసెస్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్’ నివేదిక తెలిపింది.
2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాల (నెట్ జీరో) లక్ష్యం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉపాధి అవకాశాలకు మద్దతుగా నిలుస్తాయని ఈ నివేదిక పేర్కొంది. దేశ లక్ష్యాలకు అనుగుణంగా ఇంధన రంగం గణనీయమైన మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపింది. 23 రంగాలకు చెందిన 1,417 కంపెనీల ప్రతినిధులను అడిగి టీమ్‌లీజ్ ఈ నివేదికను రూపొందించింది.
ఢిల్లీలో అధికం..
ఇంధన, విద్యుత్ రంగాల్లో ప్రస్తుత ఉపాధి అవకాశాల పరంగా ఢిల్లీ 56 శాతంతో అగ్రస్థానంలో ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. బెంగళూరు 53 శాతం, ముంబై 52 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాల పరంగా జైపూర్ 14 శాతంతో ముందుంది. బెంగళూరు, చెన్నై, వదోదర 13 శాతంతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మెట్రోల్లో వృద్ధి అవకాశాలను గుర్తు చేస్తూనే, ద్వితీయ శ్రేణి పట్టణాలు కొత్త అవకాశాలు వేదికగా నిలుస్తున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక పేర్కొంది. మౌలిక వసతుల అభివృద్ధి, విధానపరమైన ప్రోత్సాహకాలు, పునరుత్పాదక ఇంధన వనరుల విస్తరణ ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది.
Foreign Investments: గడిచిన ఐదేళ్లలో ఏపీలోకి రూ.7,371 కోట్ల విదేశీ పెట్టుబడులు
ఆర్థిక వృద్ధికి మద్దతు..
‘విద్యుత్, ఇంధన రంగాల్లో 9 శాతం మేర ఉపాధి అవకాశాల విస్తరణ అన్నది పర్యావరణ అనుకూల భవిష్యత్ దిశగా స్పష్టమైన మార్గాన్ని సూచిస్తోంది. 62 శాతం పరిశ్రమ ప్రతినిధులు తమ సిబ్బందిని పెంచుకుంటున్నట్టు చెప్పారు. ఇండస్ట్రీ 4.0, క్రమానుగతంగా కర్బన రహితంగా మారాలన్న లక్ష్యాలు విద్యుత్, ఇంధన రంగాల్లో ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయి. తద్వారా ఆర్థిక వృద్ధికి మద్దుతుగా నిలుస్తున్నాయి’ అని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పి.సుబ్బురాతినమ్ తెలిపారు.
విద్యుత్, ఇంధన రంగాల్లో ఇంజనీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. టీమ్‌లీజ్ సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం వృద్ధి అవకాశాల గుర్తించి ప్రస్తావించారు. ఆ తర్వాత సేల్స్ (అమ్మకాలు) విభాగంలో ఎక్కువ డిమాండ్ ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహన మౌలిక వసతులు, ప్రీమియమైజేషన్ (ఖరీదైన ఉత్పత్తుల వినియోగం) ధోరణితో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయని ఈ నివేదిక తెలిపింది.
Mega Industrial Hub: కర్నూల్‌లో 23 కంపెనీల ఏర్పాటుకు దరఖాస్తు